ఎలాంటి సినీ నేపథ్యం, గాడ్‌ఫాదర్లు లేకుండా మాస్‌లో హీరోగా మంచి ఇమేజ్ సంపాదించుకున్న నటుల్లో చిరంజీవి తర్వాత మనకి కనిపించేది రవితేజ మాత్రమే. ఏమాత్రం కష్టపడినట్టు కాకుండా అతి సునాయాసంగా, మనకి బాగా అలవాటైన పనిని ఎలా చేసుకుపోతామో అలా ఈజీగా నటించేసే రవితేజ ఇప్పుడు 'డాన్ శీను'గా తెరమీద రూపాంతరం చెందాడు. ఈ ఏడాది మొదట్లో వచ్చిన 'శంభో శివ శంభో' తర్వాత అతను నటిస్తున్న సినిమా ఇదే. ఇదివరకు 'కిక్' వంటి హిట్ సినిమాని నిర్మించిన ఆర్.ఆర్. మూవీ మేకర్స్ బ్యానర్‌లోనే ఈ సినిమాని చేస్తున్నాడు రవి. గోపీచంద్ మలినేని అనే నూతన దర్శకుడు 'డాన్ శీను'ని తీర్చిదిద్దుతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఇంటరెస్టింగ్ పాయింట్ ఏమంటే ఈ సినిమాలో నాయికగా శ్రియ నటిస్తుండటం. ఒక ప్రధాన స్రవంతి తెలుగు సినిమాలో ఆమె నాయికగా నటించి చాలా రోజులే అయ్యింది. ఈమధ్య అడపాదడపా ఐటం సాంగ్స్‌లోనే ఆమె దర్శనమిస్తుండటం మనం చూశాం. రవితేజతో ఆమెకిది రెండో చిత్రం. ఇదివరకు ఆ ఇద్దరూ 'భగీరథ'లో జంటగా నటించారు.
టైటిల్ చూస్తే ఈ సినిమాలో రవితేజ పేరు శీను అనీ, అతను డాన్ అయివుంటాడనీ, అందుకే టైటిల్ 'డాన్ శీను' అయ్యిందనీ అర్థమవుతుంది. అలా అని ఇది సీరియస్ మాఫియా డాన్ సినిమా కాకపోవడమే ఈ సినిమాకి సంబంధించిన విశేషం. రవితేజ సినిమాల్లో సాధారణంగా కనిపించే వినోదాన్ని మేళవించి ఈ సినిమాని దర్శకుడు గోపీచంద్ రూపొందిస్తున్నాడు. ఇక శ్రీహరి మరో డాన్‌గా ఓ కీలక పాత్రని చేస్తుండటం వల్ల ఈ సినిమాకి అదనపు ఆకర్షణ జోడించినట్లయింది.
2001లో పూరి జగన్నాథ్ రూపొందించిన 'ఇట్లు.. శ్రావణి సుబ్రహ్మణ్యం' సినిమాతో సోలో హీరోగా బోణీ కొట్టిన రవితేజకి ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కలుగలేదు. అప్పట్నించీ ఇప్పటిదాకా ప్రతి ఏడాదీ అతనికో హిట్ లభించడం చెప్పుకోదగ్గ విషయం. ఈ కాలంలో మరే మాస్ హీరోకూ ఇలా వరుసగా తొమ్మిదేళ్లూ విజయాలు దక్కలేదు. అతని విజయాల ఖాతాలో 'ఇడియట్', 'ఔను.. వాళ్లిద్దరు ఇష్టపడ్డారు', 'ఖడ్గం' (2002), 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' ('03), 'వెంకీ' ('04), 'భద్ర' ('05), 'విక్రమార్కుడు' ('06), 'దుబాయ్ శీను' ('07), 'కృష్ణ' ('08), 'కిక్' (09) సినిమాలు ఉన్నాయి. హావభావాల కంటే దేహ భాషతోనూ, తనకే ప్రత్యేకమైన వాచకంతోనూ అతను వినోదాన్ని పండిస్తూ అభిమానుల్ని సంపాదించుకున్నాడు. మినిమం గ్యారంటీ హీరోగా ట్రేడ్ వర్గాల్లో నమ్మకాన్ని పొందాడు. తోటి పెద్ద హీరోల మాదిరిగా ఏడాదికో, రెండేళ్లకో ఒక సినిమా కాకుండా ఒక ఏడాది రెండు లేదా మూడు సినిమాలు చేస్తూ సినీ పరిశ్రమకి తనవంతు సహకారం అందిస్తున్నాడు.
'డాన్ శీను' కాకుండా మరో మూడు సినిమాల్లో రవితేజ నటిస్తున్నాడు. వాటిలో ఇప్పటికే 'మిరపకాయ' లాంచనంగా ప్రారంభమైంది. 'లీడర్' ఫేం రిచా గంగోపాధ్యాయ్, 'వేదం' ఫేం దీక్షా సేథ్ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి 'షాక్' ఫేం హరీశ్ శంకర్ దర్శకుడు. 'రైడ్'తో హిట్ కొట్టిన దర్శకుడు రమేశ్‌వర్మతో 'వీర' అనే సినిమా చెయ్యడానికి రవితేజ అంగీకరించాడు. అనుష్క నాయికగా నటించే ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో మొదలు కానున్నది. ఇవికాక 'కత్తిలాంటోడు' అనే సినిమాని చేయబోతున్నాడు రవితేజ. ఇందులో టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ సమంత ('ఏమాయ చేసావె') నాయికగా చేయబోతున్నట్లు సమాచారం. ఇవికాక మరికొన్ని సినిమాలకూ రవితేజ సంతకం చేసినట్లు తెలుస్తోంది. మిగతా హీరోల మాదిరిగా మధ్యమధ్యలో విరామం తీసుకోకుండా వరుసగా సినిమాలు చేస్తున్న నాలుగు పదుల రవితేజ కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది.
No comments:
Post a Comment