ఆర్తీ అగర్వాల్ చెల్లెలు అదితి జ్ఞాపకముంది కదా.. తొలి సినిమాలోనే 'గంగోత్రి'గా ఘన విజయాన్ని అందుకున్న ఆమె కెరీర్ ఏమాత్రం ఎదగకపోవడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించే అంశమే. చాలా కాలం తర్వాత ఆమె మొహానికి రంగేసుకుని 'లోకమే కొత్తగా' అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో శివాజీ హీరో. నేహ మీడియా ప్రై. లిమిటెడ్ అనే సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భరత్ పారేపల్లి దర్శకుడు. ఇటీవలే అతను అదితి అక్క ఆర్తీతో 'నీలవేణి' అనే చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమా ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఇప్పుడు ఆమె చెల్లెలు అదితిని పెట్టి ఈ సినిమా తీస్తున్నాడు.
కన్నడంలో సక్సెస్ అయిన్ 'మొగ్గిన మనసు' అనే సినిమాకి ఇది రీమేక్. ఐదు ఫిలింఫేర్ అవార్డులు పొందిన ఆ సినిమాలో ప్రధానాంశం.. కాలేజీలోకి ప్రవేశించిన యువత మనసులు దారి తప్పుతుంటాయి. ఆ సమయంలో తల్లిదండ్రులు, అధ్యాపకులు వాళ్లని సరైన దారిలో పెట్టేందుకు ప్రయత్నించాలి. ఈ సినిమాలో అదితి కాలేజీ విద్యార్థినిగా కనిపించబోతోంది. నిజానికి 'గంగోత్రి' తర్వాత సరైన సినిమాల్ని ఎంచుకోనుంటే ఆమె సినీ కెరీర్ మెరుగ్గా ఉండేదే. ఆ సినిమా తర్వాత 'విద్యార్థి', 'కొడుకు' సినిమాలను ఆమె చేసింది. 'విద్యార్థి'లో హీరో ఆర్.బి. చౌదరి కొడుకు రమేష్ అయితే, 'కొడుకు'లో హీరో ఎమ్మెస్ నారాయణ కొడుకు విక్రం. అవి ఫెయిలవడంతో ఆమె కెరీర్ దాదాపు ఆగిపోయింది. అందుకే అమెరికా వెళ్లి సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేసుకుంటోంది. ఇప్పడు మళ్లీ 'లోకమే కొత్తగా' అంటూ సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ ఎంట్రీ అయినా ఆమెకి కొత్త లోకాన్ని అందిస్తుందా?
No comments:
Post a Comment