Thursday, July 15, 2010

Tamil Directors Rules Tollywood








తెలుగు తెరపైకి పరభాషా దర్శకుల, ప్రత్యేకించి తమిళ దర్శకుల దండయాత్ర మళ్లీ మొదలైంది. నాలుగైదేళ్ల క్రితం ఇలాగే పరాయి దర్శకుల జోరు కొనసాగింది. తర్వాత వాళ్ల సినిమాలు చెప్పుకోదగ్గ ప్రభావం చూపకపోవడంతో అడపాదడపా మాత్రమే వాళ్లు కనిపిస్తూ వచ్చారు. 'ఏమాయ చేసావె', 'డార్లింగ్' సినిమాల హిట్లతో తమిళ దర్శకులకి మళ్లీ వచ్చింది మంచి డిమాండ్.
కళకి భాషాభేదం లేదనేది సత్యమే. అందరూ దాన్ని అంగీకరిస్తారు. కానీ అది మరొకరి అస్తిత్వానికి దెబ్బ తగిలేలా వుండకూడదు కదా. తెలుగు, తమిళ సినిమాల కారణంగా తమ సినిమాల మనుగడ ప్రశ్నార్థకంగా మారేసరికి కన్నఢిగులు ఏంచేశారు? పరభాషా సినిమాల మీద కావలసినన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు. కర్ణాటకలో తెలుగు లేదా తమిళ లేదా హిందీ సినిమా ఏదైనా 15 ప్రింట్లకు మించి రిలీజ్ కాకూడదనేది వాళ్లు అనుసరిస్తున్న నిబంధన. లేకపోతే తమ కన్నడ సినిమాలు విడుదల చేసుకోడానికే థియేటర్లు దొరకని ప్రమాదాన్ని కొంత కాలం దాకా వారు ఎదుర్కొన్నారు.
ఒక భాషలో విడుదలయిన మంచి సినిమాని మరో భాషవాళ్లు చూడకూడదని ఎవరూ చెప్పరు. హాయిగా చూడొచ్చు. ఇప్పటికే హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సినిమాల డబ్బింగ్ రూపాలు తెలుగులో తామర తంపరగా వస్తూ తెలుగు సినిమాలకి గట్టి పోటీదారులుగా నిలుస్తున్నాయి. చాలా సందర్భాల్లో తెలుగు సినిమాకి ఈ డబ్బింగ్ సినిమాల వల్ల థియేటర్లు దొరకని పరిస్థితి ఎదురవుతోంది. ఇదే తెలుగు సినిమా పరిశ్రమకి ప్రతికూల అంశమనుకుంటూ ఉంటే ఇప్పుడు ఏకంగా తెలుగు డైరెక్టర్ల అవకాశాల్ని తమిళులు తన్నుకుపోతున్నారు! దాన్ని మన హీరోలు ప్రోత్సహిస్తున్నారు!!
ఇవాళ పదికి మించిన తెలుగు సినిమాలు తమిళ డైరెక్టర్ల చేతుల్లో ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగక మానదు. వాటిలో మొదటగా పవన్ కల్యాణ్ సినిమా 'పులి' ఆగస్టు 12న రిలీజుకు సిద్ధమవుతోంది. దీనికి ఎస్.జె. సూర్య డైరెక్టర్. ఇదివరకు సూర్య, పవన్ కాంబినేషన్లో 'ఖుషి' వచ్చి సూపర్ డూపర్ హిట్టయ్యింది. దాంతో సహజంగానే 'కొమరం పులి' సినిమా మీద అంచనాలు అంబరాన్నంటుతున్నాయి. 'బొమ్మరిల్లు'తో తెలుగులోనే కెరీర్ ఆరంభించిన తమిళుడు భాస్కర్, 'పరుగు' తర్వాత ఇప్పుడు రాంచరణ్ హీరోగా 'ఆరంజ్' సినిమా చేస్తున్నాడు. జెనీలియా, కొత్తమ్మాయి షాజన్ పదమ్సీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని అంజనా ప్రొడక్షన్స్ బ్యానరుపై నాగబాబు నిర్మిస్తున్నారు.
రాంచరణ్ తోటే మరో సినిమా 'మెరుపు' తీస్తున్న డైరెక్టర్ కూడా తమిళుడే. అతను ధరణి. మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ కథానాయిక. ధరణికి ఇదే తొలి తెలుగు సినిమా కాదు. ఇదివరకు అతను పవన్ కల్యాణ్ హీరోగా 'బంగారం' సినిమాని డైరెక్ట్ చేశాడు. తెలుగులో నిర్మాత ఎ.ఎం. రత్నం కుమారుఢు రవికృష్ణ హీరోగా 'ముద్దుల కొడుకు' చిత్రాన్ని రూపొందించిన రాధామోహన్ ఇప్పుడు నాగార్జునతో 'గగనం'ని తీస్తున్నాడు. బ్రహ్మానందం ప్రధాన పాత్ర చేస్తున్న ఈ సినిమాలో నాగార్జున ఆర్మీ కమెండోగా నటిస్తున్నారు. ఈ సినిమాకి నిర్మాత దిల్ రాజు. ఆమధ్య దిల్ రాజు బ్యానరులోనే వచ్చిన 'ఆకాశమంత' డైరెక్టర్ కూడా రాధామోహనే. తమిళ డైరెక్టర్ పి. వాసు తెలుగువాళ్లకి కొత్తవాడేం కాదు. ఆయన తమిళంలో రూపొందించిన అనేక సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. స్వయంగా ఆయన కొన్ని తెలుగు సినిమాల్ని డైరెక్ట్ చేశారు. రజనీకాంత్ తో ఆయన తీసిన 'చంద్రముఖి' తెలుగులోనూ సూపర్ హిట్ అయిన సంగతి మనకు తెలుసు. ఇప్పుడు వెంకటేశ్ తో ఆయన 'చంద్రముఖి-2' తీస్తున్నారు. అనుష్క, రిచా గంగోపాధ్యాయ్ కూడా నటిస్తున్న ఈ సినిమా కన్నడంలో ఇటీవల విడుదలై సూపర్ హిట్టయిన 'ఆప్తకక్షక'కి రీమేక్. బెల్లంకొండ సురేశ్ ఈ సినిమాకి నిర్మాత. వరుణ్ సందేశ్, వేగ, శరణ్యా మోహన్ కాంబినేషనులో రూపొందుతున్న 'హ్యాపీ హ్యాపీగా' సినిమాని తమిళుడైన కొత్త డైరెక్టర్ ప్రియా శరణ్ రూపొందిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మరో తమిళ డైరెక్టర్ కదిర్ తో 'కుదిరితే కప్పు కాఫీ' అనే సినిమా చేయబోతున్నాడు వరుణ్ సండేశ్. ఆగస్టులో షూటింగ్ మొదలయ్యే ఈ సినిమాని మహాగణపతి ఫిలిమ్స్ బ్యానరుపై ఎం. సుధాకర్ నిర్మిస్తున్నారు. 'హృదయం', 'ప్రేమదేశం', 'ప్రేమికుల రోజు' సినిమాలతో కదిర్ ఇప్పటికే తెలుగువాళ్లకి బాగా పరిచయం.
'ఘర్షణ', 'ఏమాయ చేసావె' సినిమాలను తెలుగులో తీసిన తమిళ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఇప్పుడు రానాని డైరెక్ట్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో తయారయ్యే ఈ సినిమాలో సమంతా హీరోయిన్. ఈ నెలలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతోంది. తెలుగులోనే కెరీర్ సృష్టించుకున్న తమిళ దర్శకుడు ఎ. కరుణాకరన్ 'డార్లింగ్' తర్వాత రాంచరణ్ తో సినిమా చేయడానికి కథ రెడీ చేసుకున్నాడు. అయితే రాంచరణ్ ప్రస్తుతం 'ఆరంజ్', 'మెరుపు' సినిమాలతో బిజీగా మారడంతో రామ్ తో సినిమా చెయ్యాడానికి ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తోంది. అలాగే 'మాస్', 'స్టైల్', 'డాన్' సినిమాల డైరెక్టర్ లారెన్స్ తెలుగులో ప్రభాస్ ని డైరెక్ట్ చెయ్యడానికి సిద్దమవుతున్నాడు. శ్రీ బాలాజీ సినిమా పతాకంపై జె. భగవాన్, జె. పుల్లారావు సంయుక్తంగా నిర్మించే ఈ సినిమాలో అనుష్క హీరోయిన్. తమిళంలో అజిత్ తో 'బిల్లా'ని డైరెక్ట్ చేసిన విష్ణువర్థన్ తెలుగులో అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నాడు. అతని తొలి తెలుగు సినిమాలో హీరో మరెవరో కాదు.. అల్లు అర్జున్. ఇటు తెలుగు, అటు తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా నిర్మాణం కాబోతోంది.
ఇలా అనేక తెలుగు సినిమాలు ఇవాళ తమిళ డైరెక్టర్ల చేతుల్లో ప్రాణం పోసుకుంటున్నాయి. ఆమేరకు తెలుగు డైరెక్టర్లు అవకాశాలు కోల్పోయినట్లేగా. తమకి సబ్జెక్టు నచ్చడమే ముఖ్యం కానీ, డైరెక్టర్ ఏ భాష వాడనేది తమకు అనవసరమనేది మన హీరోల మాట. అంటే తెలుగు దర్శకులు చెబుతున్న కథలు వాళ్లకి నచ్చడం లేదనేదే దానికి అర్థం. ఈ విషయమై మన డైరెక్టర్లు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే భవిష్యత్తులో టాలీవుడ్డులో తమిళ డైరెక్టర్ల పెత్తనమే చలామణీ అయ్యే ప్రమాదం ఉంది.

No comments: