Showing posts with label jayaprada. Show all posts
Showing posts with label jayaprada. Show all posts

Saturday, September 20, 2014

Monday, August 12, 2013

ఆనాటి సంగతి: వేటూరికి మహదేవన్ క్లాస్


ఎన్టీఆర్, జయప్రద, జయసుధ నటించిన 'అడవిరాముడు ' (1976) సినిమా చరిత్రను సృష్టించి బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. సత్య చిత్ర సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి కె. రాఘవేంద్రరావు దర్శకుడు. కె.వి. మహదేవన్ సంగీతం సమకూర్చగా వేటూరి రాసిన ప్రతి పాటా సూపర్ హిట్టే. వాటిలో 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరీ' పాట ఆ రోజుల్లో కోటి రూపాయల పాటగా పేరు తెచ్చుకుంది. వాడవాడలా మోగిపోయింది. ఆరింటిలో ఐదు పాటల్ని ఒకే తాళం.. త్రిశ్రంలో రాశారు వేటూరి. అందుకని ఆరో పాటనైనా చతురస్రంలో రాయమని ఆయనకు సూచించారు మహదేవన్. ఆరవది క్లైమాక్స్ పాట. వేటూరి రాసిన పాటను రాఘవేంద్రరావు ఓకే చేసి మహదేవన్ కు  ఇచ్చారు. అది మారు వేషాలతో సాగే పాట. మహదేవన్ కు సన్నివేశం చెప్పి పనిమీద వెళ్లిపోయారు రాఘవేంద్రరావు. పాట చూడగానే మహదేవన్ కోపంగా వేటూరిని చూస్తూ 'ఏం రాశావ్? చదువు' అన్నారు. 'చూడరా చూడరా సులేమాను మియ్యా' అని చదివారు వేటూరి. 'ఇది ఏం తాళం?' అని మహదేవన్ అడిగితే చతురస్రంలో రాశానన్నారు. తను పాడి వినిపించి 'ఇది చతురస్రమా?' అనడిగారు మహదేవన్. కాదన్నారు వేటూరి. తాళం మార్చి రాయమని ఆయనడిగితే ఎలా మార్చాలో వెంటనే వేటూరికి తెలియలేదు. ఇది గమనించిన మహదేవన్ ఇంకో రెండు 'చూడరా'లు తగిలిస్తే సరిపోతుందని చెప్పారు. దాంతో 'చూడర చూడర చూడర చూడర ఒక చూపూ సులేమాన్ మియా' అని తిరిగి రాశారు వేటూరి. అప్పుడది అవలీలగా చతురస్రంలో వచ్చింది. అందరూ విని ఊగిపోయారు.

Saturday, December 8, 2012

బండోడు గుండమ్మ (1980) - సమీక్ష


ఓ అమాయకుల్లో అమాయకుడి కథతో దాసరి నారాయణరావు రూపొందించిన సినిమా 'బండోడు గుండమ్మ'. అమాయకుడైన ఆంజనేయులుకి చెల్లెలంటే ప్రాణం. చిన్న పిల్లలతో కలిసి ఆడుకునే అతను వారి ప్రోద్బలం మీద గుండమ్మను ప్రేమిస్తాడు. క్రమంగా గుండమ్మ కూడా అతడికి మనసిస్తుంది. దశరథరామయ్య కొడుకు డాక్టర్ ప్రసాద్‌తో తన చెల్లెలి పెళ్లి జరగాలంటే  25 వేల రూపాయలు కట్నం కింద ఇవ్వాలంటారు. డబ్బు సంపాదన కోసం పట్నం వెళ్లిన ఆంజనేయులుకు రాఘవరావు తారసపడతాడు. అతను అచ్చం ఆంజనేయులు మాదిరిగానే ఉంటాడు. కానీ రాఘవరావు దోపిడీలు, హత్యలు చేసి డబ్బు సంపాదిస్తుంటాడు. తన స్థానంలో ఆంజనేయుల్ని ప్రవేశపెట్టి పోలీసుల బారి నుంచి తప్పించుకోవాలనుకున్న రాఘవరావు ఓ కారు ప్రమాదంలో గాయపడతాడు. ఆంజనేయుల్ని వెతుక్కుంటూ పట్నం వచ్చిన గుండమ్మ అతడే అనుకొని రాఘవరావును ఊరికి తీసుకుపోతుంది. మరోవైపు రాఘవరావు స్థానంలో అతనింటికి వెళ్తాడు ఆంజనేయులు. ఆ తర్వాత కథ ఎలా నడిచిందనేది ఆసక్తికరం.
కథ, మాటలు, స్క్రీన్‌ప్లేతో పాటు కొన్ని పాటలు కూడా రాసిన దర్శకుడు దాసరి నారాయణరావు ఈ కథను ప్రేక్షకుల్ని అలరించేలా చిత్రీకరించడంలో సఫలమయ్యాడు. ఆంజనేయులు తన చెల్లెలికి సంబంధం మాట్లాడటానికి వెళ్లిన సన్నివేశాల్లో రచయితగా, దర్శకుడిగా ఆయన ప్రతిభ కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. అలాగే ఆంజనేయుల్ని రాఘవరావు తన ఇంటికి తెచ్చినప్పుడు రాఘవ భార్య తన చిన్నారి కొడుక్కి పులి, ఆవు కథను చెప్పే సన్నివేశం ఆయన ఇమాజినేషన్‌కు నిదర్శనం.
ఇటు ఆంజనేయులు, అటు రాఘవరావు పాత్రల్లో కృష్ణ వైవిధ్యభరితమైన నటన ప్రదర్శించాడు. ఆంజనేయులు పాత్రలో ఆయన చూపిన అమాయకత్వం, హావభావాలు ఆకట్టుకుంటాయి. గుండమ్మగా జయప్రద బాగా రాణించగా, రాఘవరావు భార్యగా ప్రభ సరిగ్గా సరిపోయింది. చక్రవర్తి బాణీలు కూర్చిన పాటల్లో 'సిరిపురపు సిన్నోడా', 'ఊరు నిదురపోతోంది.. గాలి నిదురపోతోంది' పాటలు శ్రావ్యంగా ఉన్నాయి. కన్నప్ప ఛాయాగ్రహణం సినిమాకి ఎస్సెట్.

Saturday, December 1, 2012

అగ్నిపూలు (1981) - సమీక్ష


అత్యంత ప్రజాదరణ పొందిన యద్దనపూడి సులోచనారాణి నవల 'అగ్నిపూలు' ఆధారంగా అదే పేరుతో డి. రామానాయుడు నిర్మించిన సినిమాలో కృష్ణంరాజు, జయసుధ, జయప్రద ప్రధాన పాత్రలు పోషించారు. కె. బాపయ్య దర్శకుడు. 'అగ్నిపూలు' కథలో భిన్న దృక్పథాలు, భిన్న వ్యక్తిత్వాలు ఉన్న పాత్రలెన్నో ఉన్నాయి. అన్ని పాత్రలకీ ప్రాముఖ్యం ఉంది. ఏ ఒక్క పాత్ర ఔచిత్యం దెబ్బతినకుండా రెండున్నర గంటల సినిమాగా దీన్ని తీర్చిదిద్దడంలో ఎంతో నేర్పు ప్రదర్శించాడు బాపయ్య.
రాజులు, రాజ్యాలు పోయినా దర్పం వదలని జమీందారు గోవింద వల్లభరాజా. ఆయన కుమారుడు శివప్రసాద్ అమెరికాలో ఉంటూ అక్కడే మేరీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వారికి జానీ, బాబీ అనే ఇద్దరు పిల్లలు. భార్యా పిల్లలతో కలిసి తన ఇంటికి కొడుకు వస్తున్నాడని తెలిసి ఉగ్రుడైన వల్లభరాజా అతడికీ, తనకీ ఎలాంటి సంబంధం లేదని ప్రకటిస్తాడు. ఆయన ఆస్తి మీద కన్నేసిన అల్లుడు విరూపాక్షి రాజా, కూతురు రాజేశ్వరి అగ్నికి ఆజ్యం పోస్తారు. ఇంటికి వచ్చిన శివప్రసాద్, మేరీలను ఔట్‌హౌస్‌లో ఉంచి అవమానిస్తారు. వల్లభరాజా చనిపోతే అతని మృతదేహాన్ని చూసేందుకు కూడా అనుమతించరు.
కాలం గడిచి, విరూపాక్షి రాజా కూడా చనిపోతాడు. అతని కొడుకు కృష్ణ చైతన్య జమీందారీకి అధిపతి అవుతాడు. రుక్మిణి అనే అందాల భామను పెళ్లాడతాడు. ఒక ప్రమాదంలో రుక్మిణి అవిటిదవుతుంది. వల్లభరాజా భార్య అన్నపూర్ణ అభ్యర్థనపై శివప్రసాద్ పిల్లలు జానీ, బాబీలను ఇంటికి తీసుకొస్తారు. తన తల్లిదండ్రుల దారుణ మరణానికి కారకులైన విరూపాక్షి రాజా కుటుంబం మీద, ముఖ్యంగా కృష్ణ చైతన్య మీద పగ తీర్చుకోవాలని చూస్తుంది జానీ. ఆమె చేష్టలు శాంత స్వభావుడైన కృష్ణ చైతన్యకు అర్థం కావు. జానీ దాచుకున్న డైరీ అతడికి దొరుకుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది పతాక సన్నివేశాల్లో తెలుస్తుంది.
భిన్న దృక్పథాలు కలిగిని విరూపాక్షి రాజా, కృష్ణ చైతన్య పాత్రలు రెండింటినీ కృష్ణంరాజు ప్రశంసనీయంగా పోషించారు. ముఖ్యంగా విరూపాక్షి రాజాగా ఆయన నటన బాగా ఆకట్టుకుంటుంది. పగతో రగిలిపోయే జానీ పాత్రలో జయసుధ మరోసారి తన నటనా ప్రతిభను ప్రదర్శించింది. అవిటిదైన రుక్మిణిగా జయప్రద సమర్థవంతంగా నటించింది. ఆమె చేసిన సర్ప నృత్యం సినిమాకే హైలైట్. రాజేశ్వరిగా జయంతి పాత్ర పరిధి మేరకు బాగా చేసింది. సుధాకర్, నిర్మల, శ్రీధర్, గుమ్మడి, సత్యనారాయణ, సుమలత, సుభాషిణి, దిల్‌జిత్ వీర్ ఇతర పాత్రలు పోషించారు. శరత్‌బాబుకు మరికొన్ని డైలాగులు పెడితే బాగుండేది. అల్లు రామలింగయ్యపై చిత్రీకరించిన సన్నివేశాల ప్రయోజనం స్వల్పం.
జంధ్యాల మాటలు, ఆత్రేయ పాటలు, మహదేవన్ సంగీతం, వెంకట్ ఛాయాగ్రహణం సినిమాకి నిండుదనం తెచ్చాయి. మైసూరు లలితమహల్‌ను దర్శకుడు బాపయ్య చక్కగా వినియోగించుకున్నాడు. మొత్తానికి చక్కని నవలా చిత్రాన్ని చూసిన భావన ప్రేక్షకులకు కలుగుతుంది.

Monday, June 18, 2012

సినిమాగా పుట్టపర్తి సాయిబాబా చరిత్ర


పుట్టపర్తి సాయిబాబా మహిమలతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. కోడి రామకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సౌభాగ్య చిత్ర పతాకంపై నిర్మితమవుతోంది. కరాటం రాంబాబు నిర్మాత. చిత్ర విశేషాలను దర్శకుడు కోడి రామకృష్ణ వివరిస్తూ "సాయి భక్తులను స్వయంగా కలుసుకుని వారి అనుభవాలను తెలుసుకుని కథ సిద్ధం చేసుకున్నాం. ఆరునెలలు, 8, 10, 14, 35, 50, 85 ఏళ్ళ బాబా పాత్రధారులను ఈ చిత్రంలో చూడొచ్చు. స్క్రీన్ మీద ఎక్కువ సేపు కనువిందు చేసే బాబా పాత్రధారి కోసం ఎందరెందరినో అనుకున్నాం. మలయాళ నటుడు దిలీప్‌ను ఎంపిక చేశాం. ఈ విషయమై ఆయనకు ఫోన్ చేయగానే 'నేను ఇంతకుముందే బాబా గురించి ఆలోచించాను. అంతలో మీరు ఇలా ఫోన్ చేయడం ఆ భగవంతుడి సంకల్పమేమో' అని అన్నారు. ఇళయరాజా సంగీతం సినిమాకి పెద్ద ఎస్సెట్. ఇందులో 14 పాటలున్నాయి. అన్నీ కథాగమనానికి తోడ్పడేవే'' అని చెప్పారు.
నిర్మాత కరాటం రాంబాబు మాట్లాడుతూ "తొలి షెడ్యూల్‌ను పుట్టపర్తిలో, రెండో షెడ్యూల్‌ను పశ్చిమ గోదావరి పరిసరాల్లో చిత్రీకరించాం. బాబా పాత్రకు సంబంధించిన సన్నివేశాలను, కరణం సుబ్బమ్మ ఇంటి దృశ్యాలను తెరకెక్కించాం. స్థానిక పుట్టాయిగూడెంలో వేసిన బాబా సెట్ చూపరులను ఇట్టే ఆకట్టుకుంది. బ్రిటిష్ కాలానికి సంబంధించిన పరిసరాలను ప్రతిఫలించేలా వేసిన సెట్‌లో బాబాకు సంబంధించిన పలు సన్నివేశాలను చిత్రీకరించాం. దీంతో 40 శాతం చిత్రీకరణ పూర్తయింది. బాబా పాత్రధారికి విదేశీ నిపుణులు మేకప్ వేస్తున్నారు. మిగిలిన అన్ని పాత్రలకోసం ముంబై నుంచి ప్రత్యేకంగా మేకప్‌మేన్‌లను పిలిపిస్తున్నాం. మా సంస్థలో సంచలనాత్మక చిత్రమవుతుంది. త్వరలో పేరును ప్రకటిస్తాం. ప్రశాంతి నిలయం సెట్‌ను కోటి రూపాయల వ్యయంతో అత్యంత భారీ స్థాయిలో హైదరాబాద్‌లో వేస్తున్నాం. ఆర్ట్ డైరక్టర్ నాగు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని అనువణువూ పరిశీలించి సెట్‌ను తీర్చిదిద్దుతున్నారు'' అని అన్నారు.
దిలీప్, జయప్రద, శరత్‌బాబు, సుకుమారి, సిజ్జు, కె.వి.రమణాచారి.ఐ.ఎ.ఎస్., శ్రీజిత్ విజయ్, లక్ష్మి, అమృత, అర్చన, రూపాలక్ష్మి, సుజాత, తులసి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత: కరాటం రాంబాబు, దర్శకత్వం: కోడి రామకృష్ణ, సినిమాటోగ్రాఫర్: వాసు, సంగీతం: ఇళయరాజా, రచన: రాజేంద్రకుమార్, సాహిత్యం: జొన్నవిత్తుల, కళ: నాగు, ఎడిటర్: నందమూరి హరి.

Sunday, September 4, 2011

న్యూస్: నాలుగేళ్ల తర్వాత తెలుగులో ఉపేంద్ర

నాలుగేళ్ల విరామం తర్వాత కన్నడ స్టార్ యాక్టర్ ఉపేంద్ర ఓ తెలుగు సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. కౌశిక్‌బాబు టైటిల్ పాత్రధారిగా జె.కె. భారవి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆదిశంకర'లో నటించేందుకు అతను అంగీకరించాడు. "భారవి తయారుచేసుకున్న 'ఆదిశంకర' సినేరియో అద్భుతంగా ఉంది. ఈ కథలో అమరుక మహారాజు పాత్ర నన్నెంతో ఆకట్టుకుంది. నా ఇమేజ్‌కి, బాడీ లాంగ్వేజ్‌కి అతికినట్టుగా ఉంది. ఇలాంటి చారిత్రాత్మక చిత్రంలో నటించాలనే కోరిక దీనితో తీరుతోంది" అని చెప్పాడు ఉపేంద్ర. 'కన్యాదానం'తో నేరుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అతను 'ఒకే మాట', 'రా', 'నీతోనే ఉంటాను'. చిత్రాల్లో హీరోగా నటించాడు. తెలుగులో అతని చివరి సినిమా 2007లో వచ్చిన 'టాస్'. తెలుగు స్ట్రెయిట్ సినిమాల్లో మంచి అవకాశాలొస్తే తప్పకుండా చేస్తానని చెబుతూ వచ్చిన ఉపేంద్ర ఇప్పుడు హీరోగా కాకపోయినా ఓ చారిత్రక చిత్రంలో కీలక పాత్ర చేయడానికి సిద్ధమయ్యాడు. 'ఆదిశంకర'లో శ్రీహరి, సాయికుమార్, సుమన్, ప్రకాశ్‌రాజ్, ఆనంద్, జయప్రద, రోజా, రోహిణి, తులసి, సంగీత వంటి సీనియర్ తారలు నటిస్తుండటం విశేషం. మరో ఇద్దరు పేరుపొందిన హీరోల్ని కూడా ఈ సినిమాలో నటింపజేసేందుకు భారవి కృషి చేస్తున్నారు. నాగ్ శ్రీవత్స సంగీతం అదిస్తున్న ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండటమే కాక కథ, మాటలు, స్క్రీన్‌ప్లేని కూడా భారవి స్వయంగా సమకూరుస్తున్నారు.