Showing posts with label tollywood. Show all posts
Showing posts with label tollywood. Show all posts

Saturday, December 17, 2022

Lyricist Samavedam Shanmukha Sharma Filmography



Telugu Veera Levara (1995)

Aayanaki Iddaru (1995)

Peda Rayudu (1995)

Pelli Sandadi (1996)

Priya O Priya (1997)

Subhakankshalu (1997)

Thaali (1997)

Snehithulu (1998)

All Rounder (1998)

Suryavamsam (1998)

Goppinti Alludu (2000)

Oke Maata (2000)

Okkadu Chalu (2000)

Tuesday, November 24, 2015

Discrimination on Telugu Cinema

తెలుగు సినిమాలపై వివక్ష

నేడు థియేటర్ల లభ్యత విషయంలో పెద్ద సినిమాలు, చిన్న సినిమాల మధ్య ఎలాగైతే వివక్ష కొనసాగుతూ ఉందో, గతంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు, తమిళ సినిమాల  మధ్య అలాంటి వివక్షే కొనసాగేది. ఉదాహరణకు 1948లో కొన్ని తమిళ చిత్రాలు ఒకేసారి 50 కేంద్రాల్లో (అప్పట్లో అది చాలా ఎక్కువ) విడుదలయ్యాయి. కానీ ఒక్క తెలుగు చిత్రం కూడా పట్టుమని పది కంటే ఎక్కువ కేంద్రాల్లో విడుదల కాలేదు. ఆ ఏడాది ఆగస్టులో ఒక తెలుగు సినిమాకి 6 కేంద్రాల్లో ఒకేసారి విడుదల చేయాలంటే ముడి ఫిల్మ్ దొరకలేదు. తమిళ సినిమాలకూ, తెలుగు సినిమాలకూ మధ్య నెలకొన్న ఈ వివక్ష అన్యాయమంటూ అప్పట్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆ వివక్ష చివరంటా కొనసాగింది.

Sunday, November 15, 2015

Need Change of Attitude of Film Makers

సినీ నిర్మాతల దృక్పథం మారాలి

సినిమాలు చాలావరకు ప్రజల మానసిక తత్వాల్లో, ప్రవర్తనలో మార్పు కలుగజేస్తాయి. ప్రతి సినిమా ఏదోవిధంగా ప్రజల మనస్సులలో హత్తుకుపోతుంది. సాధారణంగా జనం సినిమాల్లోని మంచికంటే, చెడునే ఎక్కువగా గ్రహిస్తుంటారు. 'చిడుము అబ్బుతుంది గానీ, సిరి అబ్బదు' అని పెద్దలు ఊరకే అన్నారా! సినిమా విలువని ఇతర దేశాలవాళ్లు గుర్తించినట్లు మనవాళ్లు గుర్తించలేదు. వాళ్లు ఉపయోగించుకుంటున్నట్లు, మనవాళ్లు వాటిని ఉపయోగించుకోవడం లేదు.
అయితే ఇటీవల మహేశ్ కథానాయకుడిగా దర్శకుడు కొరటాల శివ రూపొందించిన 'శ్రీమంతుడు' చిత్రం ప్రజలపై మంచి ప్రభావాన్ని చూపడం ఆనందించదగ్గ విషయం. అందులో కథానాయకుడు కోటీశ్వరుడైనప్పటికీ, ఎక్కువగా సైకిల్ మీదనే ప్రయాణం చేస్తుంటాడు. ఇది యువతని బాగా ఆకర్షించడంతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సైకిల్ వినియోగం పెరిగింది. అలాగే అతను ఒక ఊరిని దత్తత తీసుకొని, దాన్ని బాగు చేయడమనే అంశం బాగా ప్రచారంలోకి వచ్చి, సంపన్నవంతులు ఏదో ఒక ఊరిని దత్తత తీసుకోవడం మొదలుపెట్టారు. సినిమా కలిగించే మేలు ఎలా ఉంటుందో దీన్నిబట్టి అర్థమవుతుంది. అయితే ఇలాంటి మేలు కలిగించే సినిమాల కంటే ప్రజల నడతపై చెడు ప్రభావాన్ని కలిగించే సినిమాలే ఎక్కువగా వస్తుండటమే బాధాకరం.
రాంగోపాల్‌వర్మ తీసిన 'ఐస్‌క్రీం' లాంటి సినిమాల్లోని శృంగార, హింసాత్మక సన్నివేశాలు శ్రుతిమించి రాగాన పడ్డాయి. అవన్నీ యవ్వనంలోని లేత హృదయాల్ని ఎంత సునాయాసంగా కల్మష పరుస్తాయో ఇట్టే గ్రహించవచ్చు. వీటి వల్ల సమాజ జీవితం బలహీనమవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
సమాజంలోని చెడు ఏవిధంగా ఉందో చూపిస్తూ, దానివల్ల ఎన్ని ఉపద్రవాలు జరుగుతున్నాయో తెలియజేస్తూ, దానికి పరిష్కారాల్ని కమర్షియల్ ఫార్మట్‌లోనే చూపించవచ్చు. రాజకీయ, అధికార అవినీతిపై పోరాటం ప్రధానంగా కథాంశాలు తయారుచేసి సినిమాలు తీయవచ్చు. అయితే ఇలాంటి సినిమాల్ని యథాతథంగా తీస్తే ప్రభుత్వ అధీనంలోని సెన్సార్ బోర్డులు అడ్డు తగులుతుండటం శోచనీయం. ప్రభుత్వాన్నీ, దాని వ్యవస్థల్నీ, అధికార మదాంధుల్నీ ప్రశ్నించే సినిమాలు సెన్సార్ కత్తెరకు గురవుతుంటాయి. రాజ్యంపై తిరుగుబాటు నేపథ్యంలో సినిమాలు తీసే ఆర్. నారాయణమూర్తి సినిమాలకు అలాంటి కత్తిరింపులు ప్రతిసారీ జరుగుతూనే ఉన్నాయి. అయినా అలుపెరుగని యోధునిలా ఆయన ఆ తరహా సినిమాల్నే తీస్తూ రావడం సామాన్య విషయం కాదు. ఆయనను ఆదర్శంగా తీసుకొని మరింతమంది నిర్మాతలు, దర్శకులు సమాజానికి ఉపకరించే కథలతో సినిమాలు తీయాలి.
ప్రజలకు ఉపయోగపడే, వాళ్ల అభిరుచుల్ని పెంచే సినిమాలు విరివిగా రాకపోవడానికి మూడు కారణాలు కనిపిస్తాయి. మొదటిది - ప్రభుత్వ అధీనంలోని సెన్సార్ బోర్డులు అడ్డు తగలడం, రెండోది - ప్రభుత్వ సహకారం లేకపోవడం, మూడోది - ప్రజల నుంచి మంచి సినిమాల కోసం డిమాండ్ రాకపోవడం. ఈ ప్రతికూలతలు లేనట్లయితే తెలుగులో మంచి సినిమాలు క్రమం తప్పకుండా వస్తాయని చెప్పొచ్చు.

Wednesday, August 14, 2013

మంచి కాలం వస్తుంది

చాలామంది విజ్ఞులు, సంస్కారవంతులు, పాత్రికేయులు, పెద్దలు, నిజంగా ఈ సినిమా పరిశ్రమ పట్ల ప్రేమాభిమానాలు కలవాళ్లు 'రోజు రోజుకీ రాసి హెచ్చుతున్నప్పటికీ వాసి తరిగిపోతోంది' అని బాధ పడుతున్నారు. నిజమే. తెలుగులో ఓ సామెత ఉండనే ఉంది - మంది ఎక్కువైతే మజ్జిగ పల్చనవుతుందని. అందుచేత, సినిమాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ వాటిలో సరుకు తగ్గడం సహజమే. ముఖ్యంగా పాశ్చాత్య చిత్రాలలోని హింసా, అశ్లీల శృంగార ప్రభావం మన చిత్రాల్లో బలంగా పాదుకుపోయాయి. ఇది మనకు బాధాకరమైన విషయమే. ఈ అనారోగ్యకరమైన పరిణామాలకు చిత్ర పరిశ్రమ బయట ఉన్న శ్రేయోభిలాషులు, హితులు ఎంతగా బాధపడుతున్నారో, ప్రతినిత్యం పరిశ్రంలో ఉండి పనిచేస్తున్న పలువురు పెద్దలూ బాధపడుతున్నారు.
అయితే క్రమక్రమంగా సినిమాలు చూసేవారి దృక్పథంలోనూ, తీసేవారి దృక్పథంలోనూ మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం కొద్దిమందైనా చక్కని మానవత్వపు విలువలున్న కథల్నీ, ప్రయోజనాత్మకమైన ఇతివృత్తాల్నీ ఎన్నుకొని, అత్యుత్తమమైన చిత్రాల్ని తీస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం. కొండ కొనకు చేరుకున్నది ఏదైనా కింద పడిపోక తప్పదు. ఇప్పుడు ఆ స్థాయికి చేరుకున్న అశ్లీల శృంగార, హింసా చిత్రాల గతి కూడా అంతే. పరిణామ సిద్ధాంతం ప్రకారం మంచి కాలం వస్తుందనే ఆశిద్దాం.

Wednesday, February 20, 2013

సినిమాపై పన్ను పడుతోంది


మూలిగే నక్క మీద తాటికాయ పడటమంటే ఇదే. అసలే నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయి, విజయాల శాతం కనిష్టస్థాయికి పడిపోయి, ప్రతి ఏటా వందల కోట్ల రూపాయల నష్టాల్ని చవిచూస్తూ వస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడు పన్నుల దాడితో మరింత ఉక్కిరిబిక్కిరవుతోంది. పరిశ్రమలో 24 శాఖల వారు పనిచేస్తున్నా, ఈ పన్నుల బెడదను అంతిమంగా ఎదుర్కోబోతున్నదీ, దాని దెబ్బ రుచి చూడబోతున్నదీ పెట్టుబడిదారుడైన నిర్మాతే. దీంతో మునుముందు సినీ నిర్మాణం మరింత క్లిష్టం కాబోతున్నదనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి వినోదపు పన్ను కడుతోంది చిత్ర పరిశ్రమ. ఇది థియేటర్‌లో సినిమా చూస్తున్న ప్రేక్షకుడి ద్వారా వసూలవుతోంది. సరాసరిన చూసుకుంటే రాష్ట్రంలోని ప్రతి థియేటర్ నుంచి ఏడాదికి రూ. కోటి చొప్పున ప్రభుత్వానికి జమవుతోంది. అలాగే సినిమా తీయడానికి ఉపయోగించే ఫిల్మ్ నెగటివ్, పాజిటివ్ మీద ఎక్సయిజ్ డ్యూటీ చెల్లిస్తోంది పరిశ్రమ. సాధారణంగా ఇప్పటికే ఒక పన్ను కడుతున్న వస్తువు మీద ఇతర పన్నులు వేయరు. కానీ సినిమా విషయానికి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మరో రెండు పన్నులు దాడి చేశాయి. ఒకటేమో రాష్ట్ర ప్రభుత్వం విధించిన వాల్యూ యాడెడ్ టాక్స్ (వ్యాట్) కాగా, మరొకటేమో కేంద్ర ప్రభుత్వం వేసిన సేవా పన్ను.
నిర్మాత ఓ సినిమాని ఎవరికైనా అమ్మితే, అమ్మిన రేటు మీద 14.5 శాతం వ్యాట్ కట్టమని రాష్ట్రం ఆదేశిస్తే, సినిమాకి పనిచేసే, సంవత్సరాదాయం పది లక్షలు దాటే ప్రతి వ్యక్తీ 12.36 శాతం సేవా పన్ను (సర్వీస్ టాక్స్) కట్టమని కేంద్రం హుకుం జారీచేసింది. జూలై 1 నుంచి ఈ సర్వీస్ టాక్స్ అమల్లోకి వచ్చింది. దీంతో నిర్మాతలు గుండెలు గుభేల్మంటున్నాయి. తమ జేబులు పూర్తిగా ఖాళీ అవడమే కాకుండా నిండా మునిగిపోతామని అమితంగా ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు వ్యాట్, మరోవైపు సర్వీస్ టాక్స్‌తో సినిమా వ్యాపారం చేయడమెలా అనే సంశయస్థితిలో పడిపోయారు. ఇప్పటికే చాలామంది నిర్మాతలకూ, పంపిణీదారులకూ వాణిజ్య పన్నుల శాఖ వ్యాట్ కట్టమనీ, లేదంటే ఆఫీసులు సీజ్ చేస్తామనీ శ్రీముఖాలు పంపారు.
సినిమాపై వ్యాట్ అనేది మన రాష్ట్రంలో తప్ప మరెక్కడా లేదు. అలాంటిది ఇక్కడే దాన్ని విధించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. దీన్ని పూర్తిగా తొలగించాలనీ, అలా కాని పక్షంలో కనిష్టంగా మాత్రమే వసూలు చేయాలనీ కోరుతూ ఇప్పటికే పలు దఫాలు ప్రభుత్వాన్ని కలిశారు నిర్మాతలు. నాలుగు నెలల క్రితం జరిగిన నంది అవార్డుల వేడుకలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ వ్యాట్‌పై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆగస్ట్‌లో దీనిపై ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. ఇక్కడ ఇంకో సంగతి చెప్పుకోవాలి. మన పొరుగునే ఉన్న తమిళనాడులో క్లీన్ 'యు' సర్టిఫికెట్ వచ్చిన సినిమాలకు అక్కడి ప్రభుత్వం వినోదపు పన్నును మినహాయించింది. దీని వల్ల హింస, అశ్లీలత, అసభ్యతకు తావులేని మంచి సినిమాలకు ప్రోత్సాహం లభిస్తున్నట్లయింది. ఇక్కడ అలాంటి వెసులుబాటు లేదు.
ఇప్పుడు సేవా పన్ను వల్ల ఖరీదైన కళాకారులు, సాంకేతిక నిపుణులు ఆ పన్ను పరిధిలోకి రానున్నారు. ఆ పన్నుని వారు నిర్మాతలపై రుద్దడం సహజం కాబట్టి ఇప్పటికే అదుపు తప్పిన నిర్మాణ వ్యయం మరింత భారీగా పెరిగే ప్రమాదముందని నిర్మాతలు భయపడుతున్నారు. ఇవాళ సినిమా బడ్జెట్‌లో ఆర్టిస్టుల, టెక్నీషియన్ల పారితోషికాలకి అయ్యే వ్యయం 50 శాతం పైమాటే. సర్వీస్ టాక్స్ కారణంగా సుమారు 8 శాతం మేర బడ్జెట్ పెరగబోతోంది. ఇది కేంద్ర ప్రభుత్వం విధించిన పన్ను కావడంతో దేశవ్యాప్తంగా ఆందోళన, నిరసన వ్యక్తమైతే తప్ప అది తొలగే వీలులేదు. దేశంలోని అన్ని భాషా చిత్రసీమలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారానే అది జరగాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు సినిమా భవిష్యత్తు ఏం కాబోతున్నదనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ 'పన్ను' ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే చిత్ర పరిశ్రమ అంతా తమకు తిండి పెడుతున్న నిర్మాతకు అండగా ఏకతాటిపై నిలిచి పోరాటం చేయడం వినా మరో దారిలేదు.
ఆఫీసులు చెన్నైకి మారిపోతాయి
 -డి. సురేశ్‌బాబు, ఫిల్మ్‌చాంబర్ అధ్యక్షుడు
2005 నుంచి వ్యాట్ అమలు చేస్తున్నారు. సినీ పరిశ్రమకి కూడా దాన్ని వర్తింపజేశారు. ఏ డిస్ట్రిబ్యూటర్ కైనా సినిమాని అమ్మితే ఆ అమ్మిన దానిమీద 14.5 శాతం వ్యాట్ కట్టాలన్నారు. దాంతో అప్పట్నించీ వ్యాట్ తీసేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నాం. ఇప్పటికే ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్ కడుతున్నాం కాబట్టి, ఒక వస్తువు మీద రెండు పన్నులు వేయడం న్యాయంకాదని చెబుతూ వస్తున్నాం. అలా ఇప్పటివరకు వ్యాట్ కట్టలేదు. అయితే ఏడాది నుంచీ వ్యాట్ కట్టమని వాణిజ్య పన్నుల శాఖ నుంచి ప్రొడక్షన్ ఆఫీసులకీ, డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులకీ వరుసగా నోటీసులు వస్తున్నాయి. వైజాగ్ వంటి చోట్ల పన్ను కట్టకపోతే ఆఫీసుల్ని సీజ్ చేస్తామనే దాకా వెళ్లారు. పైగా 2005 నుంచి 2011 దాకా ఎరియర్స్ కూడా కట్టమంటున్నారు. అంటే ఒకేసారి పరిశ్రమ నుంచి దాదాపు రూ. 200 కోట్ల నుంచి 250 కోట్ల దాకా కట్టాల్సి వస్తుంది. ఈ వ్యాట్ స్థానిక నిర్మాణ సంస్థలకే అమలు చేస్తున్నారు. ముంబైలోనో, చెన్నైలో ఉండి ఇక్కడ సినిమాలు తీసినా వ్యాట్ పడదు. డబ్బింగ్ సినిమాలకీ వ్యాట్ వర్తించదు. ఇదింకా దారుణం. వినోదపు పన్ను కట్టి, ఈ వ్యాట్ కూడా కడితే సినిమా మీద పన్ను 24 శాతం దాటిపోతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే సినిమా ఆఫీసులన్నీ చెన్నైకి మారిపోతాయి. ఇదే విషయం ప్రభుత్వానికి చెప్పాం. అక్కడనుంచి సానుకూల స్పందనే వచ్చింది. అతి త్వరలోనే ఈ పన్నును కనీస స్థాయికి తగ్గిస్తారని ఆశిస్తున్నాం. సినిమాపై టాక్స్ ఏదైనా సరే నిర్మాతలనే కట్టమంటారు ఆర్టిస్టులూ, టెక్నీషియన్లూ. అందువల్ల కేంద్రం విధించిన సర్వీస్ టాక్స్‌ని అంతిమంగా భరించాల్సింది నిర్మాతలే. దీన్ని తగ్గించమని కేంద్రాన్ని కోరుతున్నాం. ఈ పన్నుల అంశాన్ని దృష్టిలో పెట్టుకొని తాము చేయబోయే సినిమా వర్కవుట్ అవుతుందా, లేదా అనేది నిర్మాతలు ముందే గ్రహించుకోవాలి. మిగతా అంశాల కంటే స్క్రిప్టుకే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి.
సినిమా హాలు కంటే షాపింగ్ కాంప్లెక్స్ మేలు 
-టి. ప్రసన్నకుమార్, నిర్మాతల మండలి కార్యదర్శి 
ఇప్పటికే ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్, ఎక్సయిజ్ డ్యూటీ వంటివి ప్రభుత్వానికి కడుతున్నాం. ఒక్కో థియేటర్‌పై సంవత్సరానికి సగటున ఒక కోటి రూపాయలు వినోదపు పన్ను కడుతున్నాం. అదే ప్లేస్‌లో షాపింగ్ కాంప్లెక్స్ ఉంటే దానిలో 10 శాతం కూడా టాక్స్ కట్టం. అలాగే 1950ల నాటికీ, ఇప్పటికీ ఆస్తి పన్ను వెయ్యింతలు పెరిగింది. ప్రభుత్వం ఇస్తున్న సౌకర్యాలు తక్కువ, విధిస్తున్న పన్నులు మాత్రం చాలా ఎక్కువ. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మనకు లొకేషన్ చార్జీలు కూడా చాలా ఎక్కువ. పేరుకి వీటి అనుమతులకు సింగిల్‌విండో ఉందని చెబుతున్నా ప్రాక్టికల్‌గా అమలు కావడం లేదు. ఏడాది క్రితం కాస్ట్ కంట్రోల్‌లో భాగంగా తమ వ్యక్తిగత సిబ్బంది జీతభత్యాల్ని తామే భరించుకుంటామని ఆర్టిస్టులు సంతకాలు పెట్టారు కానీ అవి ఇప్పటికీ అమలు జరగటం లేదు. వాటిని నిర్మాతలే భరిస్తున్నారు. సర్వీస్ టాక్స్ రద్దు కావడానికి ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పోరాటం చేయబోతున్నాం. 
ప్రమాదంలో నిర్మాత 
-కె.ఎస్. రామారావు, సీనియర్ నిర్మాత
ఆరేళ్ల నుంచీ వ్యాట్ తీసేయమని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం. ప్రతిసారీ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు కానీ, దీన్ని తీసేయడంలో ఎవరూ శ్రద్ధ చూపించలేదు. వ్యాట్ విధిస్తే ఏడాదికి ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వానికి నలభై నుంచి యాభై కోట్ల దాకా వస్తుంది. దీనిలో ఉన్న సమస్య ఏమిటంటే ఎంత ఖర్చుతో సినిమా తీస్తే ముందు ఆ ఖర్చుపై వ్యాట్ కట్టి ఆ తర్వాతే సినిమాని విడుదల చేసుకోవాలి. విడుదలకు ముందు పారితోషికాలే కట్టలేని స్థితిలో ఉంటున్న నిర్మాత ఈ వ్యాట్ కూడా కట్టాల్సి వస్తే ఏమైపోవాలి? సినిమా విడుదలై ఫ్లాపయితే కష్టాల్లో ఉండే నిర్మాతకి వ్యాట్ కట్టమని నోటీసు ఇస్తే ఏం చేయాలి? అంటే నిర్మాత ప్రమాదంలో పడిపోయినట్లే. చిరంజీవిగారు కూడా శ్రద్ధ తీసుకుని మమ్మల్ని ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లారు. సి.ఎం. కూడా బాగా స్పందించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సినిమాలపై విధించిన సర్వీస్ టాక్స్ జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది కూడా అంతిమంగా నిర్మాత మీదే పడుతుంది.
- ఆంధ్రజ్యోతి, 28 జూలై 2012

Wednesday, November 23, 2011

బిగ్ స్టోరీ: సినిమా బడ్జెట్‌ని బట్టి టెక్కెట్ ధరలు!

ఇప్పటికే ఓ కుటుంబం థియేటర్‌లో సినిమా తిలకించాలంటే జేబు ఖాళీ అయ్యే పరిస్థితి ఉంటే, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఫిలించాంబర్ తీసుకున్న నిర్ణయం సగటు సినిమా ప్రియుడి పాలిట శరాఘాతం కానున్నది. సినిమాకైన బడ్జేట్‌ని బట్టి టిక్కెట్ ధరల్ని రూ. 35 నుంచి రూ. 100 వరకు పెంచుకునే వెసులుబాటు కల్పించాలని ఫిలించాంబర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సబ్‌కమిటీ తీసుకున్న నిర్ణయంతో ఈ పరిస్థితి ఉత్పన్నం కాబోతోంది. డబ్బింగ్ సినిమాల హవాని నియంత్రించి, చిన్న చిత్రాల్ని బతికించాలనే ఉద్దేశంతో చాంబర్ ఏర్పాటుచేసిన సబ్ కమిటీ అందుకు కొన్ని నిర్ణయాల్ని సూచించిన సంగతి తెలిసిందే. వాటితో పాటు సినిమా నిర్మాణానికయ్యే వ్యయానికి తగ్గట్లుగా థియేటర్లలో టిక్కెట్ ధరల్ని పెంచుకునే వెసులుబాటుని నిర్మాతలకు కల్పించాలనేది కూడా ఆ కమిటీ చేసిన నిర్ణయాల్లో ఒకటి. ఈ నిర్ణయాల్ని ప్రభుత్వానికి నివేదించనున్నట్లు చాంబర్ అధ్యక్షుడు డి. సురేశ్‌బాబు తెలిపారు. ప్రభుత్వం కనుక ఇందుకు సమ్మతించినట్లయితే భారీ బడ్జెట్ సినిమాలు విడుదలైనప్పుడల్లా సామాన్య ప్రేక్షకుడికి సినిమా వినోదం భారీ ఖర్చు వ్యవహారం అవడం ఖాయం. అయితే ఎంత బడ్జెట్ సినిమాకి టిక్కెట్ ధరని ఎంతగా పెంచుకోవచ్చనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
గతంలో భారీ సినిమాలు విడుదలైనప్పుడు తొలి రెండు వారాల్లో పై తరగతి టిక్కెట్ ధరల్ని 75 శాతం పెంచుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. కొద్ది నెలలు ఈ పరిస్థితి కొనసాగాక చిన్న నిర్మాతలతో పాటు ప్రేక్షకుల నుంచి కూడా నిరసనలు వ్యక్తం కావడంతో రెండు వారాల పెంపు పద్ధతిని తీసేసి, మొత్తంగా టిక్కెట్ ధరల్ని కొద్దిగా పెంచారు. దీనివల్ల నగరాల్లో పై తరగతి టిక్కెట్ ధర రూ. 50కు చేరుకుంది. అంటే నలుగురు సభ్యులున్న ఓ కుటుంబం సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లాలంటే కేవలం టిక్కెట్లకే రూ. 200 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇతరత్రా ఖర్చులు కలుపుకుంటే కనీసం రూ. 300 ఉంటే తప్ప సినిమాకి వెళ్లలేని స్థితి. సినిమా అనేది ఖరీదైన వినోదంగా మారినందునే పైరసీ డీవీడీల మీద ప్రేక్షకులు ఆధారపడుతున్నారనేది ఓ నిజం. కేవలం పది లేదా ఇరవై రూపాయల అద్దెతో ఇంటిల్లిపాదీ బయటకు కదలకుండానే ఇంట్లో సినిమా చూసుకునే వీలుండటంతో దాన్నే సౌకర్యంగా భావించి, పైరసీ డీవీడీల పట్ల జనం ఆసక్తి చూపిస్తున్నారు. పైరసీ విషయంలో నిర్మాతలు ఎంత అప్రమత్తంగా వ్య్వహరిస్తున్నా, సినిమా విడుదలైన ఒకటి, రెండు రోజుల్లోపలే దానికి సంబంధించిన పైరసీ డీవీడీలు బయటకు వచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిలించాంబర్ పెద్దలు తీసుకున్న నిర్ణయం సగటు ప్రేక్షకుడికి మరింత భారం కానున్నది. మొదట్నించీ టిక్కెట్ ధరల పెంపుని వ్యతిరేకిస్తున్న చిన్న సినిమాల నిర్మాతలు ఈ విషయంలో ఎలా స్పందిస్తారో వేచి మూడాలి.

Friday, October 14, 2011

న్యూస్: ప్రతిభకి తగ్గ ఫలితం పొందని మ్యూజిక్ డైరెక్టర్లు

ప్రతిభ ఉంటే సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ కావడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే అది ఉపాధికి పనికొస్తుందేమో కానీ మానసికంగా అంత సంతృప్తినివ్వదు. ఈ సంగతి చాలామంది సంగీత దర్శకులకి అనుభవమే. తమ ప్రతిభకి తగ్గట్లుగా ఇక్కడ పారితోషికాలు అందటం లేదని వాళ్లు బాధపడుతున్నారు. ఓవైపు ఓ సినిమా హిట్టయితే డైరెక్టర్‌కి కోట్లు చెల్లించేందుకు సిద్ధపడుతున్న నిర్మాతలు సంగీత దర్శకుల వద్దకు వచ్చేసరికి గీసి గీసి బేరాలాడుతున్నారు. సినిమా రిలీజైన వెంటనే ఆ సంగీత దర్శకుడి స్థాయిని బట్టి కూడా రెమ్యూనరేషన్లు ఆధారపడి ఉంటున్నాయి. చాలా సందర్భాల్లో సినిమా హిట్టయినా, ఆడియో సీడీలు ఆశించిన రీతిలో సేల్ కాకపోతే ఆ ప్రభావం మ్యూజిక్ డైరెక్టర్ రెమ్యూనరేషన్ మీద పడుతోంది. కొన్ని సందర్భాల్లో సినిమా చెత్తగా ఉన్నా మ్యూజిక్ సూపర్‌హిట్టవడం మనం చూస్తున్నాం. అంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ ప్రతిభకి తగ్గ ఫలాన్ని పొందాలి. కానీ అప్పుడు కూడా అతనికి మొండిచేయే ఎదురవుతోంది. ఇవాళ ఆడియో సేల్స్ బాగాలేవు కాబట్టి మ్యూజిక్ మీదపెట్టే బడ్జెట్ తగ్గించమని మ్యూజిక్ డైరెక్టర్లని కోరుతున్నారు నిర్మాతలు. దానికి ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఒప్పుకోకపోతే తక్కువ వసూలుచేసే మ్యూజిక్ డైరెక్టర్లని తీసుకుంటున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు కోరుకుంటున్నారు.

Tuesday, September 27, 2011

న్యూస్: హీరోయిన్‌గా ఫెయిలైన చిన్న జేజమ్మ!

దివ్య అంటే ఎవరూ అంత త్వరగా గుర్తుపట్టక పోవచ్చు. కానీ 'చిన్న జేజమ్మ' అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. అవును. 'అరుంధతి'లో చిన్నప్పటి అనుష్కగా నటించి భలేగా ప్రేక్షకుల్ని మెప్పించిన ఆ బేబీ దివ్య మూడేళ్లు తిరిగేసరికి హీరోయిన్ అవతారమెత్తేసింది. అందుకే 'నేను నాన్న అబద్ధం' సినిమా విడుదలైనప్పుడు ప్రేక్షకులు ఒకింత ఆసక్తిని ప్రదర్శించారు. అయితే ఆ ఆసక్తికి తగ్గట్లుగా సినిమా ప్రేక్షకుల్ని మెప్పించలేక పోతోంది. తొలివారం ఆంధ్ర, సీడెడ్‌లలో ఫర్వాలేదనిపించేట్లు ఉన్న కలెక్షన్లు నైజాం ఏరియాలో బాగా డల్‌గా ఉన్నాయి. హీరోయిన్ పాత్రలో దివ్య ఆకట్టుకోలేకపోవడం ఈ సినిమాకి మైనస్‌గా మారింది. ఇప్పుడే యవ్వనంలో అడుగుపెట్టిన దివ్య అందాల ప్రదర్శన కూడా ఎవర్నీ మెప్పించలేక పోతోంది. ట్రాన్స్‌పరంట్ బట్టల్తో బీచ్‌లలో ఆమె పరుగులు తీస్తుంటే ఎవరూ ఎంజాయ్ చేయలేకపోయారు. అయితే ఆమె అమాయక చూపులు, మొహంలో లేతదనం వారిని ఆకట్టుకోలేక పోలేదు. కానీ హీరోయిన్ పాత్ర పోషణలో ఆమె విఫలమైందనడంలో సందేహం లేదు. ఇళ్లల్లో పెద్దల ప్రేమ లభించకపోవడం, అభద్రతా భావం వల్ల అబ్బాయిలతో అమ్మాయిలు లేచిపోతున్నారని ఈ కథ చెబుతుంది. ఈ కథని చెప్పడంలో దర్శకుడు గోవింద్ వరహ కల్పించిన పాత్రలకి తగిన తారాగణం లేకపోవడం వల్ల అంటే మిస్ కేస్టింగ్ వల్ల కథ అనాసక్తంగా తయారైంది. హీరో పాత్ర చేసిన ఆనంద్ ('100% లవ్'లో సెకండ్ హీరో) మాత్రం తన అభినయంతో మెప్పించాడు. దివ్య ఇంకో రెండేళ్లపాటైనా విరామం తీసుకుని నటిస్తే బాగుంటుందని చెప్పొచ్చు.

Sunday, September 25, 2011

న్యూస్: వెయ్యిమంది అంధులు నటిస్తున్న 'వి'

స్లీప్‌లెస్ డ్రీమ్స్ పతాకంపై వివేక్ దర్శకత్వంలో పి. మహేశ్ నిర్మిస్తున్న చిత్రం 'వి'. ఈ సినిమాకి సంబంధించిన విశేషం - వెయ్యిమంది పైగా అంధులు ఇందులో నటించబోతున్నారు. వీరిలో 40 మంది ప్రధాన పాత్రధారులు. దర్శకుడు వివేక్ ఈ సంగతి తెలిపారు. "ప్రపంచంలో పూర్తిగా అంధులతోటే నిర్మించిన చిత్రం ఇంతవరకూ లేదు. ఆ రికార్డుని 'వి' సొంతం చేసుకోబోతోంది. అయితే సినిమాలో వాళ్లు అంధులుగా కాకుండా సాధారణ వ్యక్తులుగా నటించబోతున్నారు. అందుకే అక్టోబర్ 15న జరిగే షూటింగ్ ప్రారంభోత్సవానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిథులు హాజరు కాబోతున్నారు. 'ముందుగా ప్రయాణం ప్రారంభించండి. హాయిగా ప్రయాణించి, సుఖంగా ఇంటికి చేరండి' అనే పాయింట్‌తో ఈ చిత్ర కథ నడుస్తుంది. ట్రాఫిక్‌లో తలెత్తే అనేక ఇబ్బందుల్ని ప్రధానంగా చూపిస్తున్నాం. ఈ చిత్రం ద్వారా వచ్చే ఆదాయంతో సుమారు 400 మంది అంధులకు ఆపరేషన్ చేసి, కళ్లు తెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. మిగతా వివరాలు త్వరలో ప్రకటిస్తాం'' అని ఆయన చెప్పారు. ఈ చిత్రానికి మార్ఫి రచన చేస్తున్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా తెలుగులో చేస్తున్న ఈ బృహత్ ప్రయత్నం సక్సెస్ కావాలని ఆశిద్దాం.

Thursday, September 22, 2011

బిగ్ స్టోరీ: టాలీవుడ్‌లో కథలకి కరువొచ్చింది!

తెలుగు సినిమా కథల కరువుతో అల్లాడుతోంది. మూస కథలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక బొక్క బోర్లా పడుతోంది. యూత్ సినిమాలు, ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు, యాక్షన్ సినిమాలు... ఏవీ జనాన్ని అలరించలేక పోతున్నాయి. నావెల్టీ, లేదా వెరైటీ సినిమాలు ఏడాదికి ఒకట్రెండు కంటే మించడం లేదు. తలా తోకాలేని, అర్థం పర్థంకాని కథల్ని తెరకెక్కించేందుకు కోట్లాది రూపాయల్ని ఖర్చుపెట్టేందుకు దర్శకులూ, నిర్మాతలూ తెగ తాపత్రయపడుతున్నారు. విమర్శని ఏమాత్రం సహించలేక 'మేం తీసేదే సినిమా. మీరు దాన్ని చూడాల్సిందే' అన్న తరహాలో వ్యవహరిస్తుండటం వల్ల విడుదలైన వారానికే రీళ్ల డబ్బాలు నిర్మాత ఇంటికి తిరుగుముఖం పడుతున్నాయి.
హీరోల కాల్షీట్లు, లొకేషన్లు, భారీ సెట్లు, ఇతర హంగామాల గురించి తప్ప నిర్మాతలు కానీ, దర్శకులు కానీ సరైన కథ గురించి పట్టించుకోవడం లేదన్నది ఏ సినిమా చూసినా తెలిసిపోతుంది. 2011లో ఎనిమిది నెలల కాలంలో విడుదలైన సినిమాల్లో 10 శాతం సినిమాలు కూడా సక్సెస్‌కి నోచుకోకపోవడానికి కారణం? కథ, కథనం విషయంలో దర్శకులు ఏ మాత్రం శ్రద్ధ వహించనందువల్లే.
పొరుగున ఉన్న తమిళ రంగంలో ప్రతిభావంతులైన రచయితలు, దర్శకులు కొత్త కథలకు, సృజనాత్మక చిత్రాలకు శ్రీకారం చుడుతుంటే మనం మాత్రం కొత్త సీసాలో పాత సారాలాగా రసం కోల్పోయిన చెరుకు పిప్పిలాంటి కథల్నే మార్చి మార్చి తీసుకుంటూ ఎంతో విలువైన కాలాన్నీ, డబ్బునీ వృథా చేసుకుంటున్నాం. లేటెస్టుగా తమిళం నుండి వచ్చిన 'రంగం', '1947 ఎ లవ్‌స్టోరీ' సినిమాల్నే తీసుకోండి. ఒకదానికొకటి పూర్తి భిన్నమైన ఈ సినిమాలు అక్కడివాళ్ల సృజనాత్మక శక్తిని చాటుతున్నాయి. '1947 ఎ లవ్‌స్టోరీ'ని దాని డైరెక్టర్ ఎ.ఎల్. విజయ్ రూపొందించిన విధానం అత్యుత్తమం. టైటిల్లో ఉన్నట్లు అప్పటి నేపథ్యాన్ని గొప్పగా కళ్లముందుంచాడు. ఓ చాకలి కుర్రాడికీ, బ్రిటీష్ గవర్నర్ కుమార్తెకీ మధ్య కలిగే అనురాగాన్ని అతి సుందరంగా, గుండెల్ని హత్తుకునేట్లు చిత్రించాడు. మనవాళ్ల నుంచి ఎప్పటికీ అలాంటి చిత్రాన్ని ఊహించలేం. కె. రాఘవేంద్రరావు వంటి గొప్ప దర్శకుడు వెంకటేశ్‌తో 'సుభాష్ చంద్రబోస్'ని ఎలా తీశాడో చూశాం కదా. టాలీవుడ్ బాక్సాఫీస్ తమిళ డబ్బింగులతో నిండిపోతున్నదని గగ్గోలు పెడుతున్నవాళ్లంతా ఆ సమయాన్ని తెలుగు సినిమా నాణ్యత మీద పెడితే బాగుంటుంది. సరైన కథ లేకుండా భారీ హంగులు ఆర్భాటాలు, క్రేజీ కాంబినేషన్లతో సినిమా తీస్తే వాటికి ఓపెనింగ్స్ తప్ప నిలకడైన 'రన్' ఉండదు. వారం రోజులకే థియేటర్లన్నీ ఖాళీ ఐపోతాయి.
తెలుగు చిత్రసీమలో కథారచయితలే లేరా? మంచి కథల్ని సృజించే సత్తా మనవాళ్లలో లేదా? ఇదివరలో ఎన్ని మంచి కథలు మన రచయితల నుంచి రాలేదు? ఆణిముత్యాల్లంటి సినిమాలెన్నో, కళాఖండాల్లాంటి సినిమాలెన్నో తెలుగు నుంచి వచ్చాయి కదా! ఒకటిన్నర దశాబ్దం నుంచే టాలీవుడ్‌లో కథాదారిద్ర్యం రాజ్యమేలుతోంది. ఇందుకు కారణం సత్తా కలిగిన రచయితలు తమలోని శక్తి సామర్థ్యాల్ని పూర్తిగా ప్రదర్శించలేక పోవడమే. శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, మిష్టర్ పెళ్లాం, పెళ్లి పుస్తకం, లేడీస్ టైలర్, ప్రతిఘటన, మయూరి, పెళ్లి సందడి, తలంబ్రాలు, అంకుశం, అరుంధతి, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర, ఒక్కడు, మగధీర, ఆర్య, కొత్త బంగారులోకం వంటి హిట్ సినిమాలకు కథల్ని అందించింది మన రచయితలే కదా. అవకాశాలు కల్పించాలే కానీ 'హ్యాపీడేస్'ని తీసుకొచ్చే కథల్ని తయారు చెయ్యడానికి వర్థమాన రచయితలెందరో సినీ ఫీల్డులో ఛాన్సుల కోసం నిర్మాతల, దర్శకుల ఇళ్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. బిజీగా ఉండే రచయితల్ని మరింత బిజీ చెయ్యడం వల్ల మంచి కథలు పుట్టవు. కొత్తగా పెన్ను చేతబట్టిన ఔత్సాహిక రచయితలకి ప్రోత్సాహం అందజేస్తే రజతోత్సవ, శతదినోత్సవ చిత్రాలకు కథలు దొరుకుతాయి.
మన సోకాల్డ్ అగ్ర నిర్మాతలు మొదలు చిన్న నిర్మాతల దాకా, దర్శకులకు సైతం కథ గురించి తీరిగ్గా చర్చించే అవకాశమే ఉండటం లేదు. ఒకవేళ అవకాశం ఉన్నప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్నారు. కథ తయారు చేయడంలో ఎక్కువ సమయాన్ని వెచ్చించడానికి ఎవరూ ఇష్టపడనట్లే కనిపిస్తోంది. ఎంతసేపూ లొకేషన్లు లేదా హీరో డేట్లు లేదా భారీ సెట్టింగులు - వీటి మీద ఉండే ఆసక్తి కథను ఎంపిక చేసుకునేప్పుడు ఉండటం లేదు. ఇంకా చెప్పాలంటే కొత్త కథలు ఎక్కడుంటాయి అంటూ తిరిగి ప్రశ్నిస్తుంటారు. కొత్త కథలు, కొత్త ప్రయోగాలు తెలుగు ప్రేక్షకులు మెచ్చరంటూ స్టేట్‌మెంట్లు కూడా ఇస్తుంటారు. అయితే 2011లో జనం మెచ్చిన సినిమాల్లో ఎక్కువగా రెగ్యులర్ సినిమాలకు భిన్నమైనవే కావడం గమనార్హం. 'రంగం', 'కాంచన', 'బ్రమ్మిగాడి కథ', '100% లవ్', 'మిస్టర్ పర్ఫెక్ట్', 'అలా మొదలైంది', 'గోల్కొండ హైస్కూల్' వంటివి ప్రజాదరణ పొందడం గమనించయినా కథల విషయంలో నిర్మాతలు, దర్శకులు మరింత శ్రద్ధ వహించాలి. లేకపోతే తెలుగు సినిమా ఒక హిట్టు, పది ఫ్లాపుల సంప్రదాయం నుంచి ఎన్నటికీ బయటపడదు.

Friday, September 2, 2011

న్యూస్: అవినీతి మీద టాలీవుడ్‌కి చిత్తశుద్ధి ఉందా?

అన్నా హజారే వెంట టాలీవుడ్ కూడా కదిలి వచ్చింది. ర్యాలీలు నిర్వహించింది. పాదయాత్రలు చేపట్టింది. దీక్షలూ నిర్వహించింది. ఎప్పుడో తుఫానులు సంభవించినప్పుడు తప్పితే, సామాజిక సమస్యలపై అంతగా స్పందించని టాలీవుడ్ ఇప్పుడిప్పుడే సమాజంలోకి వస్తోంది. సినిమా ఒక శక్తివంతమైన మాధ్యమమని గుర్తించాక, నిజానికి దీనిని ఉపయోగించి అవినీతి మీద యుద్ధం ప్రకటించి ఉంటే ఇవాళ అన్నా హజారే స్థానంలో టాలీవుడ్ ఉండేది. అవినీతి మీద సినిమాలు తీయలేదని కాదు. తీసినవి చిత్తశుద్ధిలేని ఫక్తు కమర్షియల్ మసాలాలు. వాటిలో నినాదాల్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. వెంకటేశ్‌తో 'గణేశ్' తీసినా, చిరంజీవితో 'ఠాగూర్' తీసినా వాటిలో కొన్ని జ్వలింపజేసే సన్నివేశాలకి అప్పటికప్పుడు రక్తం ఉడుకుతుంది. సినిమా చూసి వచ్చాక ఆ చూసి ఉద్రేకపడిపోయిన ఆ అవినీతి రక్కసినే మర్చిపోతారు ప్రేక్షకులు. కమర్షియల్ సినిమాల ప్రయోజనం అంతవరకే. అయితే ఇదే అన్నా హజారే కథతో చిరంజీవితో కె. బాలచందర్ తీసిన వాస్తవిక కథా చిత్రం 'రుద్రవీణ'ని భారత ప్రభుత్వం గుర్తించి, జాతీయ అవార్డుతో సత్కరించిన విషయం గుర్తించుకోవాలి. ఇప్పుడు అవినీతి వ్యతిరేక సమరంతో దేశవ్యాప్త ప్రజానీకంలో ఉత్తేజాన్ని రగిలిస్తున్న అన్నా హజారే దీక్షలకు స్పందించిన టాలీవుడ్ ప్రముఖులు ఆయనకు తమ మద్దతు ప్రకటిస్తున్నారు.
ఇటీవల 2జి స్పెక్ట్రం స్కాం నేపథ్యంలో ఓ ప్రముఖ తెలుగు దర్శకుడు ఓ పేరుపొందిన హీరోని దృష్టిలో ఉంచుకుని కథ తయారు చేసుకున్నాడు. అది పూర్తిగా మూస ఫార్ములా పాతరోతే. అందులో స్టార్ చేసే కమర్షియల్ విన్యాసాలే కనిపిస్తాయి తప్పితే అసలు స్కాం మీద చిత్తశుద్ధి ఉండదు. దీన్ని కూడా కాసేపు ఆనందించి మర్చిపోతారు ప్రేక్షకులు. స్కాములు కానీ, దేశాన్ని పీడిస్తున్న ఏ సమస్యయినా గానీ.. వాటిని పబ్లిసిటీకి ఉపయోగించుకుంటూ సినిమాలు చుట్టేస్తారు తప్పితే, వాస్తవికంగా ప్రజల్లోకి సమస్య తీవ్రతని తీసుకెళ్లి జాగృతం చేయాలన్న సదాశయాలేవీ ఉండవు. ఈ సామాజిక ప్రయోజనాన్ని సాధించలేని టాలీవుడ్ ప్రముఖులు ఇప్పుడు అన్నా హజారేని పట్టుకుని అవినీతి మీద మాట్లాడుతూ జనంలోకి వస్తున్నారు. మీరేం చేశారని జనం అడిగితే, పోనీ వాళ్లతో ర్యాలీల్లో, పాదయాత్రల్లో అనుసరిస్తున్న కుర్రాళ్లే నిలదీస్తే సమాధానం ఉండదు. సమస్యల మీద సరుకులేని సినిమాలు తీసి సొమ్ములు చేసుకుని, ఆ సమస్యల మీదే జనంలోకి వెళ్లడం తమ వైఫల్యాన్ని చాటుకోవడం కాదా? ద్వంద్వ వైఖరిని వెల్లడించుకోవడం కాదా? సినిమా అనే శక్తివంతమైన సాధనాన్ని దుర్వినియోగం చేశామని చెప్పుకోవడం కాదా? ఆలోచించండి.

Monday, August 15, 2011

బిగ్ స్టోరీ: టాలీవుడ్‌లో ఫైనాన్సర్లకి ఎంత కష్టం?

టాలీవుడ్‌లో అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఒకతను డైరెక్టర్ అవుదామనుకున్నాడు. కానీ తనతో సినిమా తీయడానికి డబ్బులు ఎవరు పెడతారు? అనే ఆలోచన అతని మదిలో మెదిలింది. అప్పుడే ఓ చిన్న పరిష్కారం తోచింది. అంతే! సినిమా తీయడానికి ఓ నలుగురు వ్యక్తుల్ని చూసుకుని మనిషికి ఇన్ని లక్షలు అంటూ లెక్కలు వేసుకున్నాడు. తన వద్ద ఉన్న 10 లక్షల రూపాయల్ని లెక్కలోకి తీసుకున్నాడు. ఫైనాన్స్ కోసం వేట మొదలుపెట్టాడు. చివరికి ఫైనాన్సర్‌ను పట్టుకుని అతని కోరికి మేరకు అందంగా ఉన్న హీరో హీరోయిన్లతో సినిమా ప్రారంభించాడు. సినిమా విడుదల సమయంలో డబ్బులు తిరిగి ఇస్తానని అగ్రిమెంట్ రాసుకున్నాడు. తన వద్ద ఉన్న 10 లక్షల రూపాయల్లోంచి నయాపైస కూడా ఖర్చు చేయకుండా ఫైనాన్సర్ ఇచ్చిన డబ్బుతో సినిమా చుట్టేశాడు. మొత్తానికి షూటింగ్ పూర్తయింది. కాని ఫైనాన్సర్ చేతికి డబ్బులు రావాలంటే సినిమా విడుదల కావాలి. దానికంటే ముందు బిజినెస్ కావాలి. అప్పుడే ఫైనాన్సర్ చేతికి డబ్బులు వస్తాయి. అయితే ఎంతకీ సినిమా బిజినెస్ కావడం లేదు. ఫైనాన్సర్‌కు డబ్బు రావడం లేదు. తన వద్ద ఉన్న డబ్బులు అయిపోవచ్చాయి. రోజురోజుకు ఫైనాన్సర్ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతోంది. చివరికి ఆ నిర్మాత నుంచి డబ్బులు ఎలా రాబట్టుకోవాలో తెలీక కృష్ణానగర్ రోడ్లపై పిచ్చోడిలా తిరిగుతూ వచ్చాడు.
సినిమాలకు ఫైనాన్స్ చేసి చితికిపోయిన ఇలాంటి ఫైనాన్సర్లు ఇప్పుడు టాలీవుడ్‌లో అనేకమంది కనిపిస్తారు. సినిమా విడుదల సమయంలో డబ్బులు ఇస్తామని సదరు నిర్మాత చేసిన అగ్రిమెంట్ ప్రకారం ఆ సినిమా రిలీజయ్యేంతవరకు ఫైనాన్సర్ నోరు కట్టేసుకోవాల్సిందే. అయితే ఆ సినిమా రిలీజ్ కాదు. ఫైనాన్సర్ చేతికి డబ్బులు రావు. ఇలాంటి స్థితిలో ఏం చేయాలో అర్థంకాక అనేకమంది ఫైనాన్సర్లు తమ దుకాణాల్ని మూసుకునే పరిస్థితి వస్తోంది. చేసిన అగ్రిమెంట్ ప్రకారంగా చెప్పిన సమయానికి చేతికి డబ్బులు రాకపోతుండటంతో అనేకమంది ఫైనాన్సర్లు విలవిల్లాడుతున్నారు.
అగ్రిమెంట్లు ఎలా జరుగుతాయంటే...
సినిమా నిర్మాణం కోసం ఫైనాన్సర్లు, నిర్మాతలు ముందుగా అగ్రిమెంట్ చేసుకుంటారు. అయితే ఈ అగ్రిమెంట్‌లో ఎంత టైంలో డబ్బు చెల్లిస్తారనే సంగతి మాత్రం ఉండదు. ఏదో ఓ ల్యాబ్‌లో నిర్మాత, ఫైనాన్సర్‌కు మధ్య ఓ ఏరియా అమ్ముకునే హక్కులు కల్పిస్తూ అగ్రిమెంట్ జరుగుతుంది. అగ్రిమెంట్ కాపీ ల్యాబ్ వద్ద ఉంటుంది. సినిమా బిజినెస్ అయినా ఫైనాన్సర్ క్లియరెన్స్ లేకపోతే సినిమా విడుదలను ఆపేసే అవకాశం ఉంటుంది. క్లియరెన్స్ లెటర్ ఫైనాన్సర్ ఇస్తేనే సినిమా రిలీజ్‌కు నోచుకుంటుంది. ప్రధానంగా సినిమా బిజినెస్ అయ్యాక డబ్బులు ఇస్తామనో, లేక ఓ ఏరియా రాసి ఇస్తామనో అగ్రిమెంట్ చేసుకుంటారు. ఏ ఏరియా అయితే నిర్మాత రాసి ఇస్తారో ఆ ఏరియాలో సినిమా విడుదల చేసుకునే హక్కులు కేవలం ఫైనాన్సర్లకు మాత్రమే ఉంటాయి. ఈ విధంగా జరిగే ఒప్పందాల ప్రకారం అనుకున్న సమయంలో బిజినెస్ కాకపోవడం, ఫైనాన్సర్ చేతికి డబ్బులు రాకపోవడంతో నిర్మాత, ఫైనాన్సర్ల మధ్య గొడవలు జరిగిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది ఫైనాన్సర్లు 5 నుంచి 10 శాతం వడ్డీకి ఇచ్చి మునిగిపోయి ఉన్నారని పలువురు ఫైనాన్సర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినిమా బిజినెస్ జరిగితే ఫర్వాలేదు. కానీ బిజినెస్ జరగలేదంటే ఇక ఫైనాన్సర్ సంగతి అంతే!
నిర్మాత కావడమే బెటర్
తెలుగులో సినిమాకు ఫైనాన్స్ చేయడం కంటే ఏకంగా నిర్మాతగా మారడమే బెటరని అనేకమంది ఫైనాన్సర్లు అభిప్రాయపడుతున్నారు. సినిమా నిర్మాణానికి సుమారు 50 నుంచి 60 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు కాల్చుకునే బదులు స్వయంగా తామే సినిమా నిర్మించడం మంచిదని వారు భావిస్తున్నారు. ఒకవేళ సినిమా బిజినెస్ కాకపోయినా సొంతంగా తామే విడుదల చేసుకునే వీలుంటుంది. నష్టం వచ్చినా తాము చేసిన బిజినెస్ వల్లనేనని సరిపెట్టుకోవచ్చు. అంతే కాని లక్షలాది రూపాయలు వేరొకరి చేతికిచ్చి చేతులు కాల్చుకోవడం ఎందుకని ఫైనాన్సర్లు అంటున్నారు. సినిమాలకే ఫైనాన్స్‌లు ఇవ్వాలనుకుంటే అవే డబ్బులతో చిన్న సినిమాని నిర్మించి విడుదల చేయడమే మంచిదని భావిస్తున్నారు. ఫైనాన్స్ తీసుకున్న నిర్మాతలు తిరిగి డబ్బులు కట్టక, ల్యాబ్ నుంచి బయటకిరాక అనేక సినిమాలు ఆగిపోయి ఉన్నాయని ఫైనాన్సర్లు చెబుతున్నారు.
మారిన ఫైనాన్స్ విధానం
లక్షలాది లేదంటే కోట్లాది రూపాయలు నిర్మాతలకు ధారాదత్తం చేసి మునిగిపోవడం ఇష్టంలేక పలువురు ఫైనాన్సర్లు కొత్త విధానాన్ని పాటిస్తున్నారు. ఇంతకుముందు జరిగే ఒప్పందాల ప్రకారం అనేకమంది ఫైనాన్సర్లు ఆర్థికంగా చితికిపోయిన నేపథ్యంలో కొత్తగా ఫైనాన్స్ ఇచ్చే వాళ్లంతా నిర్మాతలు ఏదైనా ప్రాపర్టీ చూపిస్తేనే సినిమాకు ఫైనాన్స్ చేస్తున్నారని నిర్మాతలు అంటున్నారు. చిన్న సినిమాలకు సరైన ఫైనాన్స్ దొరక్క, బడ్జెట్ సమస్య వల్ల అనేక సినిమాల షూటింగులు మధ్యలోనే ఆగిపోయాయని నిర్మాతలు చెబుతున్నారు. ఇదీ మన తెలుగు చిత్రసీమలో ఫైనాన్సర్లు ఎదుర్కొంటున్న జఠిల సమస్య. ఇలాంటి సమస్యల నుంచి తమని బయటపడేసేలా ఫిల్మ్ చాంబర్ తగిన చర్యలు చేపట్టాలని పలువురు ఫైనాన్సర్లు కోరుతున్నారు.

Tuesday, August 31, 2010

Movies: Terror December


డిసెంబర్ అంటేనే టాలీవుడ్ వణికిపోతోంది. ఆంధ్ర, సీడెడ్, నైజాంలతో కూడిన ఎగ్జిబిషన్ రంగం ఆందోళన చెందుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ డిసెంబర్ చివర్లో నివేదిక ఇవ్వాలి. అనుకూలంగా ఇచ్చినా, వ్యతిరేకంగా ఇచ్చినా తిరిగి ఉద్యమాలు రాజుకుని సినిమాలు నష్టపోతాయని ఈ వర్గాల భయం. జనవరిలో సంక్రాంతికి పెద్ద సినిమాలే విడుదలకి సిద్ధమవుతాయి. వీటి గతేమిటో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఇదిలా వుంటే, ఒక అగ్రహీరోతో ఒక ప్రముఖ నిర్మాత అనుకున్న సినిమా సందిగ్ధంలో పడింది. కారణం పైన చెప్పుకున్నదే. జనవరిలో ఈ సినిమా పరిస్థితి ఎలా ఉంటుందోననీ, అందువల్ల హీరో సహా డైరెక్టర్, హీరోయిన్ తమ పారితోషికాల్లో సగమే తీసుకోవాలనీ, మిగిలిన సగం అప్పటి పరిస్థితిని బట్టి చూసుకుందామని ఆ నిర్మాత ప్రతిపాదించినట్లు సమాచారం. దీనిమీద ఏకాభిప్రాయం కుదరక సినిమా వాయిదా వేసుకున్నారని ఫిలింనగర్ భోగట్టా.