ఇప్పటికే ఓ కుటుంబం థియేటర్‌లో సినిమా తిలకించాలంటే జేబు ఖాళీ అయ్యే పరిస్థితి ఉంటే, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఫిలించాంబర్ తీసుకున్న నిర్ణయం సగటు సినిమా ప్రియుడి పాలిట శరాఘాతం కానున్నది. సినిమాకైన బడ్జేట్‌ని బట్టి టిక్కెట్ ధరల్ని రూ. 35 నుంచి రూ. 100 వరకు పెంచుకునే వెసులుబాటు కల్పించాలని ఫిలించాంబర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సబ్‌కమిటీ తీసుకున్న నిర్ణయంతో ఈ పరిస్థితి ఉత్పన్నం కాబోతోంది. డబ్బింగ్ సినిమాల హవాని నియంత్రించి, చిన్న చిత్రాల్ని బతికించాలనే ఉద్దేశంతో చాంబర్ ఏర్పాటుచేసిన సబ్ కమిటీ అందుకు కొన్ని నిర్ణయాల్ని సూచించిన సంగతి తెలిసిందే. వాటితో పాటు సినిమా నిర్మాణానికయ్యే వ్యయానికి తగ్గట్లుగా థియేటర్లలో టిక్కెట్ ధరల్ని పెంచుకునే వెసులుబాటుని నిర్మాతలకు కల్పించాలనేది కూడా ఆ కమిటీ చేసిన నిర్ణయాల్లో ఒకటి. ఈ నిర్ణయాల్ని ప్రభుత్వానికి నివేదించనున్నట్లు చాంబర్ అధ్యక్షుడు డి. సురేశ్‌బాబు తెలిపారు. ప్రభుత్వం కనుక ఇందుకు సమ్మతించినట్లయితే భారీ బడ్జెట్ సినిమాలు విడుదలైనప్పుడల్లా సామాన్య ప్రేక్షకుడికి సినిమా వినోదం భారీ ఖర్చు వ్యవహారం అవడం ఖాయం. అయితే ఎంత బడ్జెట్ సినిమాకి టిక్కెట్ ధరని ఎంతగా పెంచుకోవచ్చనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
గతంలో భారీ సినిమాలు విడుదలైనప్పుడు తొలి రెండు వారాల్లో పై తరగతి టిక్కెట్ ధరల్ని 75 శాతం పెంచుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. కొద్ది నెలలు ఈ పరిస్థితి కొనసాగాక చిన్న నిర్మాతలతో పాటు ప్రేక్షకుల నుంచి కూడా నిరసనలు వ్యక్తం కావడంతో రెండు వారాల పెంపు పద్ధతిని తీసేసి, మొత్తంగా టిక్కెట్ ధరల్ని కొద్దిగా పెంచారు. దీనివల్ల నగరాల్లో పై తరగతి టిక్కెట్ ధర రూ. 50కు చేరుకుంది. అంటే నలుగురు సభ్యులున్న ఓ కుటుంబం సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లాలంటే కేవలం టిక్కెట్లకే రూ. 200 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇతరత్రా ఖర్చులు కలుపుకుంటే కనీసం రూ. 300 ఉంటే తప్ప సినిమాకి వెళ్లలేని స్థితి. సినిమా అనేది ఖరీదైన వినోదంగా మారినందునే పైరసీ డీవీడీల మీద ప్రేక్షకులు ఆధారపడుతున్నారనేది ఓ నిజం. కేవలం పది లేదా ఇరవై రూపాయల అద్దెతో ఇంటిల్లిపాదీ బయటకు కదలకుండానే ఇంట్లో సినిమా చూసుకునే వీలుండటంతో దాన్నే సౌకర్యంగా భావించి, పైరసీ డీవీడీల పట్ల జనం ఆసక్తి చూపిస్తున్నారు. పైరసీ విషయంలో నిర్మాతలు ఎంత అప్రమత్తంగా వ్య్వహరిస్తున్నా, సినిమా విడుదలైన ఒకటి, రెండు రోజుల్లోపలే దానికి సంబంధించిన పైరసీ డీవీడీలు బయటకు వచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిలించాంబర్ పెద్దలు తీసుకున్న నిర్ణయం సగటు ప్రేక్షకుడికి మరింత భారం కానున్నది. మొదట్నించీ టిక్కెట్ ధరల పెంపుని వ్యతిరేకిస్తున్న చిన్న సినిమాల నిర్మాతలు ఈ విషయంలో ఎలా స్పందిస్తారో వేచి మూడాలి.
No comments:
Post a Comment