Showing posts with label anjali devi. Show all posts
Showing posts with label anjali devi. Show all posts

Friday, December 4, 2015

Synopsis of the movie Balaraju (1948)

'బాలరాజు' (1948) చిత్ర కథాంశం

దేవకన్య మోహిని మంచి నాట్యకత్తె. యక్షుణ్ణి ప్రేమిస్తుంది. మోహిని అపురూప సౌందర్యం ఇంద్రుణ్ణి స్థిమితంగా ఉండనీయదు. ఆమె తన కొలువులో నృత్యం చేయాలని ఆమె తండ్రిని ఆజ్ఞాపిస్తాడు. మోహిని ఒప్పుకోదు. తనకు అడ్డు అయ్యాడనే కోపంతో భూలోకంలో ప్రేమంటే తెలీని జడునివికమ్మని యక్షుణ్ణి శపిస్తాడు. మోహినిని బలవంతంగా తన సభకు రప్పిస్తాడు. నాట్యానికి ససేమిరా అంటుంది మోహిని. ఆవేశంతో రగిలిపోయిన ఇంద్రుడు ఆమెను మానవ జన్మ ఎత్తి, ఫలించని ప్రేమతో అల్లాడమని శపిస్తాడు.
యక్షుడు వెలమవాళ్లింట బాలరాజుగా, మోహిని కమ్మవాళ్లింట సీతమ్మగా పుట్టి పెరుగుతుంటారు. సీతమ్మను  ఎవరికంటా పడకుండా ఊరి బయట ఒక ఒంటిస్తంభం మేడలో పెంచుతుంటాడు కమ్మనాయుడు. ఒకరోజు బాలరాజు తన స్నేహితుడు యలమందతో కలిసి ఆ ఇంటిమీదుగా వెళ్లడం చూస్తుంది మోహిని. తొలిచూపుతోనే పాతప్రేమ చిగురిస్తుంది. ఇల్లు విడిచి బాలరాజును  కలుసుకుంటుంది సీత. ఆమె నిద్రపోతుండగా జడత్వంతో వెళ్లిపోతాడు బాలరాజు. వద్దన్న కొద్దీ తనవెంట పడుతున్న సీతను మొదట దెయ్యంగా భావిస్తాడు. తర్వాత మంచిదని నమ్ముతాడు.
అడవి దొంగలు మత్తుమందుజల్లి సీతను ఎత్తుకుపోతారు. వెతకడానికి వెళ్ళిన బాలరాజు మునిశాపంతో పాముగా మారిపోతాడు. సీత తప్పించుకువచ్చి పామైన బాలరాజును కలుసుకుంటుంది. తర్వాత వరసబెట్టి కష్టాలొస్తాయి. బాలరాజు చనిపోతాడు. అశ్వనీ దేవతలు ఇచ్చిన సంజీవిమాలతో అతణ్ణి బతికించుకుంటుంది సీత. ఇంద్రుడు మళ్లీ తయారై ఆమెను నిర్బంధిస్తాడు. దాంతోనూ ఫలితం కనిపించక మాయసీతగా మారి బాలరాజుతో సరసాలాడతాడు. ఆగ్రహంతో ఇంద్రుణ్ణి సీత శపించబోయేసరికి శచీదేవి వచ్చి భర్తను కాపాడమనటంతో కథ సుఖాంతం.

తారాగణం: అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, యస్. వరలక్ష్మి, గాడేపల్లి, డి.ఎస్. సదాశివరావు, కస్తూరి శివరావు
సంగీతం: సి.ఆర్. సుబ్బరామన్, గాలిపెంచల నరసింహారావు
నిర్మాత, దర్శకుడు: ఘంటసాల బలరామయ్య
బేనర్: ప్రతిభా ఫిలిమ్స్
విడుదల తేదీ: 26 ఫిబ్రవరి

Friday, November 20, 2015

Synopsis of the movie ANARKALI (1955)

'అనార్కలి' చిత్ర కథాంశం:

పారశీకంలో పుట్టిన అందాల సుందరి 'నాదిరా' దురదృష్టవశాతూ తనవాళ్లతో కలిసి ఆగ్రా నగరం చేరాల్సి వస్తుంది. ఒకసారి అక్బర్ పాదుషా వారి దానిమ్మతోటలో నాదిరా పూలు కోసుకుంటూ, పాట పాడుతూ ఉంటే, ఆ మధుర గానానికి యువరాజు సలీం ముగ్ధుడవుతాడు. ఆమెను చూసి ఆ దివ్య సౌందర్యానికి దాసుడవుతాడు. నాదిరా కూడా అమాయకంగా సలీం ప్రేమలో పడుతుంది. అప్పట్నించీ రోజూ వాళ్లిద్దరూ ఆ తోటలో కలుసుకుంటూ ఉంటారు. నాదిరా పాడుతున్న సమయంలో ఒకసారి తోటకు వచ్చిన అక్బర్ ఆమె గానానికి పరవశుడై ఆమెకు 'అనార్కలి' అనే బిరుదునిస్తాడు.
కాబూల్‌లో కల్లోలం చెలరేగడంతో, దాన్ని అణచడానికి అక్కడకు వెళ్తాడు సలీం. తన ప్రియుణ్ణి వెదుకుతూ బందిపోటు దొంగలకు పట్టుబడుతుంది అనార్కలి. బానిసల్ని విక్రయించే బజారులో అనార్కలిని బహిరంగంగా వేలం వేస్తాడు బందిపోటు నాయకుడు. ముసుగులో ఉన్న సలీం అధిక ధరకు పాడి ఆమెను కొనుక్కుంటాడు. తన స్వాధీనంలోకి వచ్చిన అనార్‌ను మారువేషంలోని సలీం బలాత్కరించబోతాడు. తన శీలాన్ని భంగపరచవద్దనీ, అదివరకే తన హృదయం మరొకరికి అర్పించాననీ అతన్ని ప్రాధేయపడుతుంది అనార్.
ఆమె నిష్కల్మష ప్రేమను గుర్తించి ఆనందంతో తన ముసుగు తొలగించి, ఆమెనూ ఆనందింపజేస్తాడు సలీం.
యుద్ధంలో సలీంకు బలమైన గాయం తగులుతుంది. అతన్ని ఆగ్రా తీసుకుపోతారు. అనార్ కూడా ఆగ్రా చేరుకుంటుంది. ఎన్ని మందులు వాడినా సలీంకు స్పృహ రాదు. చివరకు అనార్ మధురగానం చెవికి సోకి ఈ లోకంలోకి వస్తాడు సలీం. అనార్ చేసిన మేలుకు సంతోషించిన అక్బర్ ఆమెకు తన కోటలో ఆతిథ్యం ఇస్తాడు. ఆమె అక్కడే నివాసం ఉంటుంది. సలీం ఆరోగ్యవంతుడైన సంతోషంలో ఆగ్రాలో మహోత్సవాలు చేయిస్తాడు అక్బర్. అనార్ అద్భుత నాట్యానికి నజరానాగా ఆమెను రాజనర్తకిగా నియమిస్తాడు.
సలీంపై ఆశలు పెట్టుకున్న గుల్‌నార్‌కు అనార్‌పై అసూయ కలుగుతుంది. సలీం, అనార్ ప్రణయాన్ని భగ్నం చేయాలని కక్ష కడుతుంది. సలీం యువరాజ పట్టాభిషేక మహోత్సవంలో అనార్కలి నాట్యం ఏర్పాటు చేస్తారు. పానీయంలో మత్తుమందు కలిపి అనార్ చేత తాగిస్తుంది గుల్‌నార్. మైకంతో నాట్యంలోనే శృంగార చేష్టలు చేస్తూ యువరాజుపై పడుతుంది అనార్.
దాంతో అక్బర్ ఆమెను ఖైదుచేయిస్తాడు. ఇది తట్టుకోలేని సలీం తండ్రిపై తిరుగుబాటు చేస్తాడు. తల్లిముఖం చూసి తన యుద్ధాన్ని విరమించి బందీ అవుతాడు. దర్బార్‌లో అనార్, సలీంలను దోషులుగా నిర్ణయించి ఇద్దరికీ మరణదండన విధిస్తాడు అక్బర్. సలీంను వధించడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో అక్బర్ స్వయంగా కుమారుని చంపడానికి పూనుకుంటాడు. కానీ అతనిలోని పుత్రవాత్సల్యం వెనుకంజ వేయిస్తుంది. సలీంను విడిచిపెడతారు. మరోవైపు అనార్కలిని సజీవ సమాధి చేస్తుంటారు. ఆమెను కాపాడాలని గుర్రంపై బయలుదేరుతాడు సలీం. దారిలో అతనిపై బాణం వేస్తుంది గుల్‌నార్. అది అతని వెన్నులో దిగుతుంది. అయినా తన ప్రయత్నం వీడక ముందడుగు వేస్తాడు. సలీం వచ్చేసరికి అనార్ సమాధి పూర్తయిపోతుంది. విలపిస్తూ తన తలను సమాధికేసి కొట్టుకుంటాడు.

తారాగణం: అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, ఎస్వీ రంగారావు, కన్నాంబ, చిత్తూరు నాగయ్య, పేకేటి శివరాం, సురభి బాలసరస్వతి, హేమలత
సంగీతం: ఆదినారాయణరావు
నిర్మాత: ఆదినారాయణరావు
దర్శకుడు: వేదాంతం రాఘవయ్య
బేనర్: అంజలీ పిక్చర్స్
విడుదల తేదీ: 28 ఏప్రిల్

Thursday, November 12, 2015

Synopsis of the movie UNDAMMA BOTTU PEDATHA (1968)

'ఉండమ్మా బొట్టుపెడతా' కథాంశం:

భూమిని నమ్ముకుని కాయకష్టం చేసి శ్రమించే దశరథరామయ్య (నాగయ్య) కుటుంబం ఒక సంవత్సరం పంటలు పుష్కలంగా పండించింది. అది గుర్తించిన ప్రభుత్వం ఆయనను 'కృషి పండిట్' బిదురుతో సత్కరించాలనుకుంది. ఆ బిరుదుకు తను అర్హుణ్ణి కాననీ, తన మనవరాలు లక్ష్మి అని చెబుతూ ఆయన తన కుటుంబ గాథను వివరిస్తాడు. ఆ కథ ప్రకారం...
దశరథరామయ్యకు నలుగురు కొడుకులు. పెద్ద కొడుకు శ్రీనివాసులు (నాగభూషణం) పేకాట మినహా మరో వ్యాపకంలేని వ్యక్తి. అతని భార్య తులశమ్మ (జానకి) మూఢభక్తి శిఖామణి. పత్రీ పుష్పాలతో దేవుణ్ణి కొలవడం తప్ప ఇల్లూ వాకిలీ చక్కదిద్దుకోవడం ఎరుగని ఇల్లాలు. రెండో కొడుకు వెంకటేశ్వర్లు (అర్జా జనార్దనరావు) కండబలంతో రౌడీగా బతుకుతూ, నిత్యం సారా మైకంతో భార్య శేషు (సూర్యకళ)పై పిడిగుద్దులు కురిపిస్తుంటాడు. పగలంతా మొగుడితో కీచులాటలాడి, తన్నులుతిని అదే ఊళ్లోని పుట్టింటికి పోవడం, రాత్రయ్యేసరికల్లా సింగారించుకుని మొగుడి పక్కలో చేరడం శేషు దినచర్య.
మూడో కొడుకు ఆంజనేయులు (చలం) మోజుపడి ఇంగ్లీష్ చదివిన అమ్మాయిని భార్యగా చేసుకొని, ఆమెకు బెడ్ కాఫీ అందిస్తూ వంటవాడిగా తయారైన మనిషి. ఆ భార్య సుమతి (మీనాకుమారి) అచ్చంగా కుమతి. మొగుణ్ణి వాజమ్మను చేసి దర్జా, దర్పం వెలిగిస్తూ ఉంటుంది. ఇక నాలుగో కొడుకు కృష్ణ (కృష్ణ) అవివాహితుడు. తన భాగానికొచ్చిన పొలాన్ని నమ్ముకొని తండ్రికి అండగా ఉన్న మంచివాడు.
బాధ్యత తెలీని కొడుకులూ, కోడళ్లతో అరాచకత్వం తాండవిస్తున్న ఇంటిని చూసి దశరథరామయ్య కుమిలిపోతుంటాడు. ఆ ఊళ్లోనే ఓ హరిదాసు (ధూళిపాళ) కుటుంబం ఉంటోంది. ఆయనకు ఒకే ఒక్క కూతురు లక్ష్మి (జమున). 'అడుగడుగున గుడివుంది, అందరిలో గుడివుంది' అని నమ్మిన యువతి. శుచి, శుభ్రం ఉన్న ఇంట్లోనే శ్రీ మహాలక్ష్మి కొలువుంటుందని ఆమె నమ్మకం.
హరిదాసు రోజూ ఊళ్లో భిక్షాటన చేసి, ఆ వచ్చిన బియ్యాన్ని పాపాయమ్మకు అమ్ముకుని, ఆ డబ్బు ఆమె వద్దే కూడబెడుతుంటాడు. ఆ డబ్బుతో కూతురికి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయాలనేది ఆయన సంకల్పం. పాపాయమ్మ (సూర్యకాంతం) పేరుకు తగినట్లే పాపాలపుట్ట. కాఫీ ఇడ్లీల దగ్గర్నుంచి 'రూపాయి సోడా' (సారా) దాకా ఆమె దగ్గర దొరుకుతాయి. ఎవరింట్లోనన్నా ఏ వస్తువైనా కనిపించలేదంటే అది పాపాయమ్మ ఇంట్లో తాకట్టుకు చేరివుంటుందని చెప్పుకుంటారు. లక్ష్మికి సంబంధం ఖాయం చేసుకున్న హరిదాసు తన డబ్బు కోసం పాపాయమ్మ దగ్గరకు వచ్చి అడుగుతాడు. ఆ డబ్బు ఇవ్వకపోగా హరిదాసే తన డబ్బు కాజేయడానికి తనను కొట్టాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆయనను అరెస్ట్ చేయిస్తుంది పాపాయమ్మ.
పీటలమీద పెళ్లి చెదిరిపోవడం, తన తండ్రి అపనిందకు గురికావడం భరించలేని లక్ష్మి ఆత్మహత్యకు పూనుకుంటుంది. ఆమెను కృష్ణ కాపాడతాడు. అదే ముహూర్తానికి లక్ష్మిని తనయింటి కోడలిగా చేసుకుంటాడు దశరథరామయ్య. ముష్టివాడి కూతుర్ని ఆ ఇంటి కోడల్ని చేసినందుకు పెద్ద కోడళ్లు ఈసడిస్తారు. అడుగడుగునా అవమానిస్తారు. తోడికోడళ్లు ఎలా ప్రవర్తించినా, ఆ ఇంటికి దీపంగా, భర్తకు నీడగా ఉంటూ వస్తుంది లక్ష్మి.
అరాచకత్వం, అపరిశుభ్రం తాండవిస్తున్న ఆ ఇంటినుండి శ్రీ మహాలక్ష్మి వెళ్లిపోతుండగా, ఆమెను అక్కడ నిలిపేందుకు ఆత్మత్యాగం చేసిన లక్ష్మి పేరంటాలై వెలుస్తుంది. ఆమె ఆత్మత్యాగంతో కళ్లు తెరిచిన ఆ కుటుంబం ఏకమై, అందరూ కష్టించి పనిచేసి, ఆ ఇంటిని సిరులతో కళకళలాడిస్తారు.

తారాగణం: కృష్ణ, జమున, గుమ్మడి, షావుకారు జానకి, ధూళిపాళ, సూర్యకాంతం, అంజలీదేవి, చలం, నాగభూషణం, నాగయ్య, అర్జా జనార్దనరావు, మీనాకుమారి, సూర్యకళ
సంగీతం: కె.వి. మహదేవన్
సమర్పణ: ఆదుర్తి సుబ్బారావు
నిర్మాత: సి. సుందరం
దర్శకత్వం: కె. విశ్వనాథ్
బేనర్: బాబూ మూవీస్
విడుదల తేది: 28 సెప్టెంబర్ 1968

Tuesday, November 10, 2015

Synopsis of the movie BHALE MASTARU (1969)

'భలే మాస్టారు' కథాంశం:

డిగ్రీ అర్హతలు అన్నీ ఉన్న నిరుద్యోగి మధు. చదువు పూర్తయ్యేసరికి ఉన్న ఇల్లు కూడా తాకట్టు పాలవుతుంది. కన్నతల్లి క్షయవ్యాధికి గురవడంతో ఆమెను రక్షించుకునే దారి తెలీక విలవిలలాడిపోతాడు. ఆ సమయంలో ఒక పత్రికా ప్రకటన ఎడారిలో ఒయాసిస్సులాగా కనిపించింది. ఆ ప్రకటన సారాంశం.. జమీందార్ గారింట్లో ప్రైవేట్ మాస్టార్ ఉద్యోగం. నెలకు రూ. 700 జీతం. ఎమ్మే డిగ్రీ ఉండాలి. అన్నింటికీ మించి వయసు 50 సంవత్సరాలు దాటి ఉండాలి.. ఈ వయసొక్కటే అతడికి ప్రతిబంధకమైంది. ఏదేమైనా తల్లికి వైద్యం చేయించాలంటే డబ్బు కావాలి. కాలేజీలో ఆడిన నాటకాలు గుర్తుకొస్తాయి. ధైర్యే సాహసే లక్ష్మీ అనుకొని 25 యేళ్ల యువకుడు కాస్తా 50 యేళ్ల మధ్యవయస్కుడిగా జమీందార్ గారింట్లో అడుగుపెడతాడు.
ఇక్కణ్ణించి మధు జీవితం కొత్తగా మొదలవుతుంది. జమీందారిణి తమ్ముని పిల్లలు విజయ (బీయస్సీ), విమల (పీయూసీ), మెట్రిక్‌ను నాలుగేళ్లుగా చదువుతున్న బుచ్చిబాబు, మరో నలుగురు చిన్నపిల్లలు - వీళ్లకు చదువు చెప్పాలి. ఈ వయసుమీరిన మాస్టారి పీడ ఎలాగైనా వదిలించుకోవాలని వాళ్లూ, ఈ గడుగ్గాయిల్ని దారికి తెచ్చి ఉద్యోగం నిలబెట్టుకోవాలని మధూ - ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఉంటారు.
మధు, విజయ సినిమాటిక్‌గా కలుసుకుని, కాస్త కరుకుగా, మరికాస్త ఘాటుగా ఊసులాడుకుని చివరకు సినిమాటిక్‌గానే ప్రేమలో పడతారు. ఆ సమయంలో అనుకోని ఉపద్రవం వచ్చి పడుతుంది. వయసుమళ్లిన జమిందారిణి హృదయంలో ప్రేమ బీజాలు మొలకెత్తుతాయి. ఎవడో ఓ మగాడు తన అక్కను మోసగించిన దాని ఫలితంగా ఆమె ఆత్మాహుతి చేసుకోవడంతో మొత్తం మగజాతి మీదనే ద్వేషం పెంచుకున్న జమిందారిణి సీతాదేవి మాస్టారుపై మనసు పారేసుకుంటుంది. అతణ్ణి పెళ్లిచేసుకోవాలని భావిస్తుంది. ఈలోగా మాస్టారు మేనల్లుడిగా పరిచయమైన మధుకు విజయనిచ్చి, ఆ తర్వాత తమ పెళ్లి జరుపుకోవాలని ఆమె ఉవ్విళ్లూరుతున్న సమయంలో కథ అడ్డం తిరుగుతుంది.
వయసొచ్చిన మరో అమ్మాయి విమల పైలా పచ్చీసుగా తిరిగే గిరి అనేవాడి వలలోపడి గర్భవతవుతుంది. గిరి ఆమెను చేపట్టేందుకు నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకోడానికి నదిలో దూకుతుంది. మాస్టారు ఆమెను కాపాడటంతో మధు నిజ స్వరూపం వెళ్లడవుతుంది. విమల జీవితాన్ని నాశనం చేసి, విజయను సైతం వల్లో వేసుకుని తనలో ప్రేమను రగిలించింది మధేననే కక్షతో అతణ్ణి కాల్చి చంపబోతుంది జమిందారిణి. ఆ సమయానికి అక్కడికి వచ్చిన మధు తల్లి ఆ తుపాకీ గుండుకు అడ్డువెళ్లి కొడుకును రక్షిస్తుంది.
కథ ఇక్కడితో ఆగక ఇంకొంత దూరం నడిచి బోల్డన్ని ఫైట్లూ ఫీట్లూ చేసి గిరిని మధు పట్టుకొని వచ్చి విమలకు అప్పగించి, జమిందారిణికి కనువిప్పు కలిగించి, విజయను సొంతం చేసుకోవడంతో కంచి వెళుతుంది.

తారాగణం: ఎన్టీ రామారావు, కాంచన, షీలా, అంజలీదేవి, కృష్ణంరాజు, రాజబాబు, అల్లు రామలింగయ్య, రమాప్రభ
సంగీతం: టి.వి. రాజు
నిర్మాత: సి.యస్. రాజు
దర్శకత్వం: ఎస్.డి. లాల్
బేనర్: విజయగిరి ధ్వజ

Thursday, August 15, 2013

ఆనాటి సంగతి: అంజలి ఎందరికో అమ్మ, వదిన!

అంజలీదేవి కథానాయికగా నటించినప్పటి కంటే 'లవకుశ'లో సీతగా, 'రంగుల రాట్నం'లో తల్లిగా నటించినప్పటి నుంచే ఆమెకు అభిమానులు ఎక్కువయ్యారు. ఆమె నటించిన చిత్రాలు ప్రజల మనసులపై ఎంతటి అమోఘమైన ప్రభావాన్ని చూపించాయో ఆమె ఔట్‌డోర్ షూటింగులకు వెళ్లిన అనేక సందర్భాల్లో వెల్లడైంది. ఒకసారి ఆమె శ్రీశైలం వెళ్లి వస్తుండగా ఒక గ్రామం దగ్గర జనం దారికి అడ్డుగా నిల్చుని, కారు రాగానే ఆపారు. కొందరు ఆడవాళ్లు "సీతమ్మ తల్లీ కారు దిగమ్మా" అని ఆప్యాయతతో కోరారు. దిగిన వెంటనే కొంతమంది ఆమె కాళ్లకు నమస్కరించారు. ధాన్యపు కంకుల గుత్తులు కానుకగా సమర్పిస్తూ, నుదుట కుంకుమ తిలకం దిద్ది "తొలి పంటమ్మా! నీకిస్తున్నాం. నీకు జయం కలగాలి" అని అంతా ఏకకంఠంతో పలకడమో ఆమె పరవశించి పోయారు. జీవితం చరితార్థమైందని భావించారు. ఇది 'లవకుశ' విడుదలయ్యాక ప్రజల్లో ఆమెపై ఏర్పడిన పవిత్ర భావం. ఇలాగే 'వదినగారి గాజులు' చూసిన కొంతమంది మగవాళ్లు "నీలాంటి వదిన కావాలని కోరుకుంటున్నాం" అని ఉత్తరాలు రాశారు. 'ఇలవేల్పు', 'రుణానుబంధం', 'రంగుల రాట్నం', 'బడిపంతులు' సినిమాలు వచ్చాక ఆమెను వదినగా, తల్లిగా, సోదరిగా ఊహించుకుని సంబోధిస్తూ వచ్చారు జనం.

Friday, November 18, 2011

అప్పుడు 'లవకుశ'.. ఇప్పుడు 'శ్రీరామరాజ్యం'


అందరి కళ్లూ ఇప్పుడు 'శ్రీరామరాజ్యం' మీదే. గురువారం (17) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఇటు సినీ వర్గాల్లో, అటు సామాన్య ప్రజానీకంలో అమితాసక్తి వ్యక్తమవుతోంది. 'శ్రీకృష్ణార్జున విజయం' (1996) తర్వాత నందమూరి బాలకృష్ణ నుంచి వస్తున్న పౌరాణిక చిత్రం ఇదే. ఉత్తరరామ చరిత్ర ఆధారంగా తండ్రీ కొడుకులు సి. పుల్లయ్య, సి.ఎస్. రావు దర్శకత్వంలో రూపొందిన 'లవకుశ'కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీసు ఫలితం తెలుగులో తిరిగి పౌరాణిక చిత్రాల రూపకల్పనపై ప్రభావం చూపబోతోంది. ఈ చిత్రం విజయం సాధిస్తే మరిన్ని పౌరాణిక చిత్రాల నిర్మాణానికి ఊతం లభిస్తుందని విశ్లేషకులు నమ్ముతున్నారు.
ఈ సందర్భంగా అఖండ విజయం సాధించిన మునుపటి చిత్రంతో, ప్రస్తుత చిత్రాన్ని పోల్చడం సహజం. 26 కేంద్రాల్లో విడుదలైన 'లవకుశ' అన్ని కేంద్రాల్లోనూ వంద రోజులు ఆడి, తెలుగులో రూ. కోటి వసూలు చేసిన తొలి చిత్రంగా (టిక్కెట్ రేట్లు పావలా నుంచి ఒక రూపాయి ఉన్న కాలంలో) రికార్డు పుటలకెక్కింది. 18 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. అప్పటి ఆంధ్రప్రదేశ్ జనాభా మూడు కోట్లు కాగా, ఈ చిత్రాన్ని 1.98 కోట్ల మంది చూసినట్లు అంచనా. అలాంటి 'లవకుశ'లో సీతారాములుగా అంజలీదేవి, నందమూరి తారకరామారావు ఎంత గొప్ప స్థాయిలో రాణించారో, అభినవ సీతారాములుగా ఎంతగా నీరాజనాలు అందుకున్నారో అప్పటి జనానికి తెలుసు. ముఖ్యంగా శ్రీరామునిగా ఎన్టీఆర్ రూపం జన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది 'లవకుశ'లో ఆయన పోషించిన ఆ పాత్రతోనే.
త్రేతాయుగంలో శ్రీరాముడు ఇలాగే ఉండేవాడేమోనని భ్రమించే రీతిలో ఆయన జనాన్ని సమ్మోహహితుల్ని చేశారు. ఇప్పుడు ఆ పాత్రని బాలకృష్ణ ఎలా చేశారనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. రూపపరంగా చూస్తే, ఎన్టీఆర్ వంటి సమ్మోహనశక్తి లేకపోయినా ఆయన తర్వాత రాముని పాత్రలో ఇమడ గలిగేది బాలకృష్ణే అనే అభిప్రాయం సర్వత్రా ఉంది. శ్రీరాముని రూపంలోని బాలకృష్ణ స్టిల్స్ ఆ విషయాన్నే ధృవీకరిస్తున్నాయి. 'లవకుశ'లో సీతగా అంజలీదేవి ప్రభావమూ అసామాన్యమైనదే. ఆ పాత్రలో ఆమె అద్భుతంగా ఒదిగిపోయారు. లక్ష్మణుడు తనని అడవులకు పంపిన కారణం తెలిశాక ఆమె పలికించిన కరుణ రసం ఎప్పటికీ మన హృదయాల్ని తాకుతూనే ఉంటుంది. ఇక పతాక సన్నివేశాల్లో ఆమె అభినయం అపూర్వమనే చెప్పాలి. అలాంటి పాత్రను ఇప్పుడు నయనతార చేయడమే ఒక విచిత్రం. తన కాలానికి అంజలి గొప్పనటిగా అప్పటికే పేరు తెచ్చుకున్నారు. ఇక్కడ నయనతార తెలుగు నటి కాదు. తెలుగు భాష సరిగా తెలీదు కూడా. అయినా ప్రచార చిత్రాల్లో సీతగా ఆమె ఆహార్యం చక్కగా ఉంది. ఇప్పటికే 'సింహా' చిత్రంలో బాలకృష్ణ, నయనతార జంట ప్రేక్షకుల్ని అలరించింది. అప్పటివరకు గ్లామర్ రోల్స్‌కి పేరుపొందిన నయనతార ఆ సినిమాల్లో చీరల్లో హుందాగా కనిపించిన తీరే ఇప్పుడు సీత పాత్రకు ఎంపిక చేసేందుకు దోహదం చేసింది. అంజలిని ఆమె ఏ తీరున మరిపిస్తుందన్నది చూడాల్సిందే. 
ఇక చిత్రంలో కీలకమైంది లక్ష్మణుని పాత్ర. మునుపటి చిత్రంలో ఆ పాత్రని కాంతారావు అమోఘంగా పోషించారు. సీతను అడవులకు పంపాలని శ్రీరాముడు నిర్ణయించినప్పుడు, ఆ బాధ్యత తనమీదే పడ్డప్పుడు కాంతారావు ప్రదర్శించిన నటన అత్యుత్తమం. ఇప్పుడు ఆ సన్నివేశాల్లో శ్రీకాంత్‌ని మనం చూడబోతున్నాం. ఆయన ఓ పౌరాణిక పాత్రను పోషించడం ఇదే ప్రథమం. వాల్మీకిగా చిత్తూరు నాగయ్యను చూసిన కళ్లతో అక్కినేని నాగేశ్వరరావును చూడటం అపురూపం. నటులుగా ఇద్దరూ ఏ స్థాయి నటులో మనకు తెలిసిందే. 
ఇదంతా తెరమీద మనం చూడబోయే వ్యవహారం కాగా తెరవెనుక దర్శకత్వాన్ని ప్రస్తావించుకోవడం సందర్భోచితం. 'లవకుశ'ను తలపెట్టింది సి. పుల్లయ్య. అయితే అకస్మాత్తుగా సినిమా మధ్యలో ఆయన మరణించడంతో ఆ బాధ్యతను గొప్పగా నెరవేర్చారు ఆయన కుమారుడు సి.ఎస్. రావు. అలా తండ్రీకొడుకులు ఒక పౌరాణిక చిత్రరాజాన్ని తెలుగు దేశానికి అందిస్తే, ఇప్పుడు ఆ పని నిర్వహించింది ఇప్పటికే ఎన్నో కళాఖండాల్ని అందించిన బాపు. సహచరుడు ముళ్లపూడి వెంకటరమణ ఈ సినిమా మధ్యలో అర్ధంతరంగా స్వర్గస్తులైతే, ఒంటిగానే తాననుకున్న రీతిలో 'శ్రీరామరాజ్యం'ను తీర్చిదిద్దారు బాపు. ఎనభై ఏళ్ల వయసులోనూ చెక్కుచెదరని ఏకాగ్రతతో ఈ చిత్రాన్ని ఆయన మలచిన తీరుకు ఆ సినిమా యూనిట్ అంతా జేజేలు పలుకుతున్నారు. 
దీంతో పాటు సంగీతాన్నీ ప్రస్తావించుకోవాలి. 'లవకుశ' విజయంలో ఘంటసాల సంగీత బాణీలకూ ప్రత్యేక స్థానముంది. 'శ్రీరామరాజ్యం'కు ఆ బాధ్యతని అత్యంత సమర్ధంగా నిర్వహించారు ఇళయరాజా. ఇవన్నీ ఒకెత్తయితే పౌరాణికాలు తియ్యాలంటేనే బెంబేలెత్తే ఈ రోజుల్లో ఖర్చుకు వెరవకుండా, భారీ రిస్కుకు దడవకుండా ఈ సినిమాని నిర్మించి అందరి దృష్టినీ ఆకర్షించారు యలమంచిలి సాయిబాబా. ఇన్ని విశేషాలున్న 'శ్రీరామరాజ్యం' ఏ రీతిన ఆడుతుందో, 'లవకుశ'ను ఎంతగా మరిపిస్తుందో వేచి చూడాల్సిందే.

Wednesday, September 21, 2011

ఇంటర్వ్యూ: తెలంగాణా శకుంతల

తెలంగాణా శకుంతల అనే పేరు ఎలా వచ్చింది?
- నేను శకుంతల అనే పేరుతోనే తెలుగు సినిమా పరిశ్రమలో ప్రవేశించాను. నేను నటిగా బిజీగా మారాక అదే పేరుతో మరొకరు వచ్చారు. ఒకే పేరుతో ఇద్దరు ఉండటం నిర్మాతలకు కన్ఫ్యూజన్ కలిగించింది. తెలంగాణా మాండలికంతో నేను నటించిన సినిమాలు విజయవంతం కావడంతో నిర్మాతలు నా పేరును తెలంగాణా శకుంతలగా మార్చారు.
రంగస్థలం నుంచి ఇక్కడకు వచ్చినప్పుడు ఎలా ఫీలయ్యారు?
- ఎలాంటి కళాకారులకైనా స్టేజి అనేది ఓ పెద్దబాలశిక్షలాంటిది. బాల్యంలో బాలశిక్షలో నేర్చుకున్న విషయాలు జీవితమంతా గుర్తున్నట్లు స్టేజి మీద మేము పొందిన శిక్షణ విభిన్న పాత్రల పోషణలో మాకు ఉపయోగపడుతుంటుంది. స్టేజి మీద నటించేప్పుడు కదలికల విషయంలో ఓ రకమైన స్వేచ్ఛ ఉంటుంది. అదే సినిమా అంటే కెమెరా పరిధిలోనే నటించాలి. నాటకంలో జనం మన కళ్లముందే కనపడుతుంటారు. అదే సినిమా అయితే జనం ఎదురుగా ఉన్నారనుకుని కెమెరాని దృష్టిలో పెట్టుకుని నటించాలి. స్టేజి మీద విజృంభించిన నటీనటులకు కెమెరా పరిధిలో ఉండాలంటే ఏనుగును తెచ్చి సీసాలో బంధించినట్లే అనిపిస్తుంది మొదట్లో. తర్వాత్తర్వాత అలవాటైపోతుంది.
ఈ మధ్య ఏ సినిమాలో చూసినా మీరు అరుస్తున్నారెందుకు?
- పాత్ర మేనరిజంలో వైవిధ్యం చూపించాలని స్టేజి మీద స్వేచ్ఛ తీసుకుంటాం. అదే సినిమాలో అయితే దర్శకుని అభిరుచి, సూచనల మేరకు నటించాలి. ఓ కేరక్టర్ హిట్టయితే అలాంటి పాత్రల్నే దర్శకులు రూపకల్పన చేస్తుంటారు. అన్ని సినిమాల్లో అదే కొనసాగితే మీరన్నట్లు ఒకే మూసలో వచ్చిన పాత్రల్లా కనిపిస్తాయి. సీమ కథలతో వచ్చిన సినిమాల్లో అలా అరుపులతో నటించి, అవి హిట్టయ్యేసరికి దర్శకులు అలాంటి పాత్రల్నే ఇస్తున్నారు.
దర్శకత్వ ఆలోచనేమైనా ఉందా?
- ఆ కోరికైతే ఉంది. అయితే సినిమాలకు కాదు. ముందుగా ఓ మంచి నాటకానికి దర్శకత్వం వహించాలనుకుంటున్నా. స్టేజి నుంచి సినిమాలకి వచ్చినవాళ్లు స్టేజికి దూరమవుతున్నారనే అపవాదు నాపై రాకుండా ఓ మంచి నాటకాన్ని నా దర్శకత్వంలో ప్రదర్శించాలనుకుంటున్నా. ఇక సినిమా అంటారా. ఇప్పుడే కాదు. మరికొంత కాలం పోనివ్వండి.
కెరీర్ మొత్తంలో మీకు సంతృప్తినిచ్చిన పాత్రలు?
- నిజం చెప్పాలంటే ఇప్పటివరకూ నేను నటించిన పాత్రల్లో నాకు పూర్తిగా సంతృప్తినిచ్చిన పాత్ర లభించలేదనే చెప్పాలి. ఓ పక్షి స్వేచ్ఛగా ఆకాశంలో విహరించినట్లే ఏదైనా ఓ మంచి పాత్రలో అలా విజృంభించి విశ్వరూపం ప్రదర్శించాలని ఉంది. ఇప్పటివరకూ నటించిన సినిమాల విషయానికొస్తే 'ఒసేయ్ రాములమ్మా', 'నువ్వు నేను', 'ఒక్కడు', 'వీడే' సినిమాల్లో నా పాత్రలు కొంతవరకు సంతృప్తినిచ్చాయి.
మీ కలేమిటి?
- కామెడీ, విలన్, గయ్యాళి పాత్రల్లో నటించా. 'బంగారు తల్లి' సినిమాలో జమున, 'రంగుల రాట్నం'లో అంజలీదేవి వంటి నటీమణులు చేసిన మాతృమూర్తి పాత్రల్లో నటించాలని ఉంది. అలాగే పూర్తిగా కరుణరసం గల శబరి పాత్రలోనైనా నటించాలని ఉంది.

Wednesday, July 6, 2011

న్యూస్: నయనతార కెరీర్ ముగిసినట్లేనా?

కేరళ కుట్టి నయనతార నట జీవితం ఇక ముగిసినట్లేనా? ప్రస్తుతానికైతే అవుననే చెప్పాలి. ఆమె చివరి చిత్రాన్ని తెలుగులోనే చేసింది. అది 'శ్రీరామరాజ్యం'. ఇందులో ఆమె రామాయణ గాథలోని సీత పాత్ర చేసింది. ఒక పౌరాణిక సినిమాతో కెరీర్‌కి ఆమె ముగింపు పలుకుతుండటం విశేషమనే చెప్పాలి. అందుకే చివరి రోజు షూటింగులో ఆమె బాగా ఎమోషనల్ అయిపోయి కన్నీళ్లు పెట్టేసుకుంది కూడా. ఆఖరి రోజు ఆమె పాల్గొన్న చివరి సీను ముగియగానే అక్కడున్న యూనిట్ సభ్యులంతా ఆమెపై పూల వర్షాన్ని కురిపించారు. నిర్మాత సాయిబాబు స్వయంగా ఆమె మీద పూలు చల్లి రెండు చేతులతో నమస్కరించారు. అందరికీ దండం పెడుతూ, కళ్ల నుంచి చెంపలమీదికి నీళ్లు కారుతుండగా దర్శకుడు బాపు పాదాలకి నమస్కరించింది నయనతార. ఆయన ఆమెని ఆశీర్వదించారు. ఈ సినిమా యూనిట్‌ని వీడిపోతున్నానన్న బాధో, ఇదే చివరి సినిమా అనే ఆవేదనో కానీ ఆమె మొత్తానికి కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సినిమాలో బాలకృష్ణ శ్రీరామునిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. సీతారాములుగా ఆ ఇద్దరూ తెరమీద కనిపిస్తారనేది ఆసక్తికరం. ఇదివరకు 'లవకుశ'లో సీతారాములుగా అంజలీదేవి, ఎన్‌టీ రామారావు అమోఘంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇప్పుడు అదే కథతో తీసిన 'శ్రీరామరాజ్యం'లో బాలకృష్ణ, నయనతార ఆ పాత్రల్లో ఆకట్టుకునే అవకాశాలున్నాయి. 'సింహా'లో ఆ ఇద్దరూ ప్రేక్షకుల్ని మెప్పించిన సంగతి తెలిసిందే. మొదట 'శ్రీరామరాజ్యం'లో చేయడానికి నయన వెనుకాడింది. ప్రభుదేవాతో పెళ్లి నిర్ణయం జరిగాక సినిమాలకి గుడ్‌బై చెబుతున్నట్లు ఆమె ప్రకటించింది. అయితే బాలకృష్ణ ఆమెనే సీతగా కోరుకోవడం, దర్శకుడు బాపు కావడం వల్లే ఆమె చివరి నిమిషంలో సీతగా నటించేందుకు అంగీకారం తెలిపింది. యూనిట్ వర్గాల ప్రకారం ఆ పాత్రని ఆమె సమర్థంగా పోషించింది. అందుకే తృప్తికరంగా సినిమాలకు సెలవు చెప్పింది నయనతార. ఈ సినిమా తర్వాత ఆమె తెరమీద కనిపించే అవకాశాలు లేనట్లే.

Friday, August 27, 2010

Nostalgia: NTR and ANR combo first film


మహానటులు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు కలిసి నటించిన తొలి సినిమా 'పల్లెటూరి పిల్ల' (1950). హీరోగా ఎన్టీఆర్ కెమెరా ముందుకు వచ్చిన తొలి సినిమా కూడా ఇదే. అయితే ముందుగా విడుదలైంది మాత్రం 'షావుకారు'. ఇది దర్శకుడిగా బి.ఎ. సుబ్బారావుకు తొలి చిత్రం. అంజలీదేవి టైటిల్ రోల్ చేసిన ఈ సినిమాకి రిజక్ట్ షెరిటన్ రాసిన 'ఫిజారో' ఆంగ్ల నాటకం ఆధారం. దీన్ని తెలుగు వాతావరణానికి అనుగుణంగా మార్చి కథ తయారుచేశారు పి. ఆదినారాయణరావు. ఆయన ఈ సినిమాకి సంగీతం అందించడమే కాక ఓ పాట సైతం రాశారు.
ఇందులోని రెండో హీరో అయిన వసంత్ పాత్రను మొదట అప్పటి సీనియర్ హీరో కల్యాణం రఘురామయ్య చేశారు. అంజలీదేవి కాంబినేషనులో కొన్ని సీన్లు తీశాక ఆయన సినిమానుంచి తప్పుకున్నారు. దాంతో ఆ పాత్రను అక్కినేని పోషించారు. ఇందులో మెయిన్ హీరో రామారావు కాబట్టి ఆయన పేరు మొదట వెయ్యమని నాగేశ్వరరావు సూచించినా సీనియారిటీని గౌరవించాలని నాగేశ్వరరావు పేరే టైటిల్స్ లో వేశారు నిర్మాత, దర్శకుడు అయిన సుబ్బారావు.