Wednesday, July 6, 2011
న్యూస్: నయనతార కెరీర్ ముగిసినట్లేనా?
కేరళ కుట్టి నయనతార నట జీవితం ఇక ముగిసినట్లేనా? ప్రస్తుతానికైతే అవుననే చెప్పాలి. ఆమె చివరి చిత్రాన్ని తెలుగులోనే చేసింది. అది 'శ్రీరామరాజ్యం'. ఇందులో ఆమె రామాయణ గాథలోని సీత పాత్ర చేసింది. ఒక పౌరాణిక సినిమాతో కెరీర్‌కి ఆమె ముగింపు పలుకుతుండటం విశేషమనే చెప్పాలి. అందుకే చివరి రోజు షూటింగులో ఆమె బాగా ఎమోషనల్ అయిపోయి కన్నీళ్లు పెట్టేసుకుంది కూడా. ఆఖరి రోజు ఆమె పాల్గొన్న చివరి సీను ముగియగానే అక్కడున్న యూనిట్ సభ్యులంతా ఆమెపై పూల వర్షాన్ని కురిపించారు. నిర్మాత సాయిబాబు స్వయంగా ఆమె మీద పూలు చల్లి రెండు చేతులతో నమస్కరించారు. అందరికీ దండం పెడుతూ, కళ్ల నుంచి చెంపలమీదికి నీళ్లు కారుతుండగా దర్శకుడు బాపు పాదాలకి నమస్కరించింది నయనతార. ఆయన ఆమెని ఆశీర్వదించారు. ఈ సినిమా యూనిట్‌ని వీడిపోతున్నానన్న బాధో, ఇదే చివరి సినిమా అనే ఆవేదనో కానీ ఆమె మొత్తానికి కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సినిమాలో బాలకృష్ణ శ్రీరామునిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. సీతారాములుగా ఆ ఇద్దరూ తెరమీద కనిపిస్తారనేది ఆసక్తికరం. ఇదివరకు 'లవకుశ'లో సీతారాములుగా అంజలీదేవి, ఎన్‌టీ రామారావు అమోఘంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇప్పుడు అదే కథతో తీసిన 'శ్రీరామరాజ్యం'లో బాలకృష్ణ, నయనతార ఆ పాత్రల్లో ఆకట్టుకునే అవకాశాలున్నాయి. 'సింహా'లో ఆ ఇద్దరూ ప్రేక్షకుల్ని మెప్పించిన సంగతి తెలిసిందే. మొదట 'శ్రీరామరాజ్యం'లో చేయడానికి నయన వెనుకాడింది. ప్రభుదేవాతో పెళ్లి నిర్ణయం జరిగాక సినిమాలకి గుడ్‌బై చెబుతున్నట్లు ఆమె ప్రకటించింది. అయితే బాలకృష్ణ ఆమెనే సీతగా కోరుకోవడం, దర్శకుడు బాపు కావడం వల్లే ఆమె చివరి నిమిషంలో సీతగా నటించేందుకు అంగీకారం తెలిపింది. యూనిట్ వర్గాల ప్రకారం ఆ పాత్రని ఆమె సమర్థంగా పోషించింది. అందుకే తృప్తికరంగా సినిమాలకు సెలవు చెప్పింది నయనతార. ఈ సినిమా తర్వాత ఆమె తెరమీద కనిపించే అవకాశాలు లేనట్లే.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment