Thursday, July 14, 2011
న్యూస్: అది హిట్టయితే ఓకే, లేకపోతే..?
సీనియర్ హీరోయిన్ త్రిష క్రేజ్ తెలుగులో క్రమేపీ తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఏడేళ్ల క్రితం 'వర్షం'తో యువత కలల రాణిగా ఆవిర్భవించిన ఈ తమిళ తార ఆ మరుసటి యేడాదే 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'తో అగ్ర తారల్లో చేరిపోయింది. ఈ రెండూ ఎమ్మెస్ రాజు నిర్మించినవే కావడం గమనార్హం. అనంతరం 'అతడు', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే', 'కృష్ణ', 'కింగ్' వంటి హిట్ సినిమాల్లో నటించి నెంబర్‌వన్ హీరోయిన్ అనిపించుకుంది. ఆ తర్వాత కాలంలో కొత్త తారల సందడి వల్ల ఆమె కెరీర్ వెనుకపట్టు పట్టింది. 'కింగ్' తర్వాత ఆమె చేసిన 'శంఖం', 'నమో వెంకటేశ' సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక పోయాయి. ఆమె పాత్రలు కూడా అంతే. వాటి తర్వాత పవన్ కల్యాణ్‌తో తొలిసారిగా నటించిన 'తీన్‌మార్' కూడా ఆమెకి ప్రయోజనం కలిగించలేదు. ఇప్పుడు ఆమె చేతిలో ఒకే తెలుగు సినిమా ఉంది. అది వెంకటేశ్‌తో చేస్తున్న మలయాళ 'బాడీగార్డ్' రీమేక్. బెల్లంకొండ సురేశ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకుడు. వెంకటేశ్ కాంబినేషన్‌లో ఇది మూడో సినిమా. ఈ సినిమా బాక్సాఫీసు ఫలితం తెలుగులో త్రిష కెరీర్‌ని ప్రభావితం చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ సినిమా హిట్టయితే సరే, లేకపోతే.. సమస్యే.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment