Friday, July 15, 2011
న్యూస్: ఛార్మితో పోటీపడ్డ 'మాయగాడు'
హీరో వేణులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు సక్సెస్సుల మీదున్నప్పుడు చాలా కేర్‌లేస్‌గా కనిపిస్తూ వచ్చిన అతను ఇప్పుడు జర్నలిస్టులతో మాట్లాడేప్పుడు చాలా నమ్రతగా, వినయంగా మాట్లాడుతున్నాడు. 'మాయగాడు' విడుదలలో జాప్యం జరిగినా సినిమా తప్పకుండా ఆడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ప్రధానంగా సినిమాలో హీరోయిన్ ఛార్మితో తన జోడీ చాలా అందంగా కనిపిస్తుందని చెబుతున్నాడు. "సినిమాలో మొత్తం ఆరు పాటలుండగా, వాటిలో నాలుగు డ్యూయెట్లు. స్వతహాగా ఛార్మి మంచి డాన్సర్. ఈ పాటల్లో ఆమెతో డాన్సుల్లో నేను పోటీపడ్డా. నా డాన్సులు చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నింటిలో ఇలా ఆరు పాటలూ బ్రహ్మాండంగా వచ్చినవి లేవు. ఈ పాటలతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాకి ప్రధాన బలం" అని చెప్పాడు వేణు. ఈ సినిమాలో అతను కష్టపడకుండా మాయ మాటలతో బతికేద్దామనుకునే లీలాకృష్ణ అనే పల్లెటూరి యువకుడి పాత్రని చేశాడు. అతను సిటీకి వచ్చి, ఓ అమ్మాయి ప్రేమలో పడ్డాక ఆమె వల్ల ఎలా ప్రయోజకుడిగా మారాడన్నది కథ. పర భాషా నటులు సైతం తెలుగులో తమ పాత్రలకి తమే డబ్బింగ్ చెప్పుకుంటుంటే తెలుగు వాడయ్యుండీ అతను మాత్రం ఇంకా తెరమీద సొంత గొంతు పలికించలేదు. "తమిళనాడులోనే పెరగడం వల్ల డబ్బింగ్ చెప్పాలంటే ఏదో సంకోచం నన్నాపుతోంది. ఎవరైనా పక్కనుండి ముందుకు తోస్తే నా పాత్రకి నేనే వాయిస్‌నిస్తా. సొంత గొంతు కాకపోవడం వల్లే 'గోపి గోపిక గోదావరి' వంటి హిట్ సినిమాని కూడా ఇంతదాకా నేను చూడలేదు. ఆ లోపాన్ని సరిచేసుకోవాలి" అని చెప్పాడు వేణు. 16న విడుదలవుతున్న 'మాయగాడు' అతడి ఆశల్ని నిలబెడుతుందో, లేదో చూడాలి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment