సరికొత్త ఇమేజ్ కోసం తపన
ఇవాళ పెద్ద హీరోలకు ఒక్కో సినిమా ఒక్కో అగ్ని పరీక్ష. యువతరం హీరోలు పోటీగా విజయపథంలో దూసుకుపోతుంటే మరోవైపు హీరో స్థాయిని పట్టించుకోకుండా పెద్ద హీరోల సినిమాల్ని (బాగో లేకపోతే) తిప్పికొడుతున్నారు ప్రేక్షకులు. అందువల్ల చేసే ప్రతి సినిమాకూ ఆ హీరోలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. మిగతా సీనియర్ టాప్ హీరోలతో పోలిస్తే వెంకటేశ్‌ది కాస్త విభిన్న శైలి. ఇటీవలి కాలంలో ఏ పెద్ద హీరో చేయనన్ని వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ వస్తున్నారాయన. 'ఈనాడు', 'నమో వెంకటేశ', 'నాగవల్లి' సినిమాల్లో ఒకదానికొకటి పొంతనలేని పాత్రలు చేసిన ఆయన ఇప్పుడు ఆ మూడింటికీ భిన్నమైన 'బాడీగార్డ్' పాత్రని చేస్తున్నారు. సబ్జెక్టు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ రావడం వల్ల పాతికేళ్ల సినీ జీవితంలో ఫెయిల్యూర్ల కంటే సక్సెస్సలనే పొందుతూ వచ్చారు.విలక్షణ నటుడు
తొలి చిత్రం 'కలియుగ పాండవులు' (1986)తో పర్వాలేదనిపించిన వెంకటేశ్.. తమ పక్కింటి కుర్రాడిలా అనిపించేసరికి జనం ఆదరించారు. తండ్రి దగ్గుబాటి రామానాయుడు అప్పటికే పేరుపొందిన నిర్మాతే అయినా ఆయన ప్రభావం నుంచి అతి త్వరగా బయటపడి, హీరోగా తనకంటూ ఓ స్థాయిని ఏర్పరచుకోగలిగారు. హీరోగా జనానికీ, నటుడిగా విమర్శకులకూ ఎప్పుడూ ఫేవరేట్‌గానే ఉంటూ వస్తోన్న ఆయనకు స్వర్ణకమలం (1988), శత్రువు ('91), చంటి ('92), ధర్మచక్రం ('96), గణేశ్ ('98), నువ్వు నాకు నచ్చావ్ ('01), మల్లీశ్వరి ('04), ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ('07) తదితర సినిమాలు బాగా పేరు తెచ్చిపెట్టాయి. టాప్ హీరోగా ఎదిగిన ఓ నటుడు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయడం ఆయన తరానికి సంబంధించినంత వరకు ఓ ప్రయోగం, ఓ సాహసం. 'పవిత్రబంధం' (1996)తో ఆ సాహసం చేసి నటుడిగా మరో మెట్టు పైకెక్కారు. తనది గ్లామరస్ ఫేస్ కాకపోయినా ఎప్పుడూ చిలిపిగా నవ్వుతున్నట్లుండే ముఖంతో బొబ్బొలి రాజా, ప్రేమంటే ఇదేరా, కలిసుందాం రా, నువ్వు నాకు నచ్చావ్ చిత్రాల్లో లవర్ బాయ్‌గా మెప్పించారు. నిర్మాతగా తండ్రి సపోర్ట్ ఎంతగా ఉన్నా నటుడిగా అంచెలంచెలుగా ఎదిగి నిర్మాతలకు, బయ్యర్లకు హాట్ ఫేవరేట్ అయ్యారు. తను చేసిన ప్రయోగాల్లో అత్యధిక భాగం సొంత సంస్థలో చేసినవే. ఈ రకంగా తనలోని నటుణ్ణి తృప్తిపరచుకోవడంతో పాటు కమర్షియర్ ఎంటర్‌టైనర్స్ చేసి, బయ్యర్లను తృప్తిపరచడం అలవాటుగా చేసుకున్నారు. అందుకే తొలినాళ్లలో ప్రతి యేటా కనీసం ఓ సూపర్‌హిట్ సినిమాని ఆయన అందించారు. 1990లో వచ్చిన 'బొబ్బిలి రాజా' సినిమా ఆయనకు అమితమైన స్టార్‌డం తీసుకొచ్చింది. ఆ తర్వాత కూలీ నెం.1 ('91), చంటి ('92), సుందరకాండ ('92), అబ్బాయిగారు ('93) వంటి హిట్ సినిమాలు చేశారు. తిరిగి 1996 నుంచి వరుస హిట్లతో మిగతా టాప్ స్టార్లకు నిద్రలేకుండా చేశారు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, పవిత్రబంధం, పెళ్లి చేసుకుందాం, సూర్యవంశం, రాజా చిత్రాలు మహిళా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకోగా ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, కలిసుందాం రా, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలతో యువతనూ ఆయన బాగా ఆకర్షించగలిగారు.
ఫ్యామిలీ సినిమాలకే ప్రాధాన్యం
మిగతా టాప్ హీరోలతో పోలిస్తే ఆయన కొన్నేళ్లుగా చేసిన సినిమాల్లో ఫ్యామిలీని టార్గెట్ చేసుకున్నవే ఎక్కువ. 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' నుంచి దీనిని మనం గమనించవచ్చు. గణేశ్, జయం మనదేరా, జెమిని, ఘర్షణ, లక్ష్మీ, తులసి వంటి కొద్ది సినిమాల్లోనే యాక్షన్ ఛాయలు కనిపిస్తాయి. మిగతావన్నీ ఫ్యామిలీ కోసం ఉద్దేశించిన ఫార్ములా సినిమాలే. అదే తొలి రోజుల్లో అయితే రక్త తిలకం, ధృవనక్షత్రం, బ్రహ్మపుత్రుడు, బొబ్బిలి రాజా, శత్రువు, చినరాయుడు, కొండపల్లి రాజా, ధర్మచక్రం వంటి యాక్షన్ ప్రధాన సినిమాలు చాలానే చేశారాయన. కొన్ని యాక్షన్ సినిమాలు బాక్సాఫీసు వద్ద ఫెయిలైతే అయివుండవచ్చు గాక.. యాక్షన్ సినిమాల వల్లనే ఆయన టాప్ హీరోగా ఎదిగారన్నది నిర్వివాదం. యాక్షన్ సినిమాల్లో చేయడం శరీరానికి ఎక్కువ శ్రమ. అందువల్లనో, ఏమో ఆయన లైటర్ వీన్ సినిమాల్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ వస్తున్నారు. ఆయన ఇటీవలి సినిమాలు 'చింతకాయల రవి', 'నమో వెంకటేశ' ఇదే కోవలో ఉండటం గమనార్హం. అలాగే రీమేక్ సినిమాలకూ ఆయన పెద్దపీట వేస్తున్నారు.
టూటౌన్ రౌడీ, చంటి, సుందరకాండ, అబ్బాయిగారు, రాజా, శీను, వాసు, జెమిని, వసంతం, ఘర్షణ, సంక్రాంతి, ఈనాడు, నాగవల్లితో పాటు ఇప్పుడు చేస్తున్న బాడీగార్డ్ కూడా రీమేక్ సినిమానే. దీనికి తోడు పరభాషా దర్శకులకు ఆయన చాలా అవకాశాలు ఇస్తున్నారు. విక్రమన్, ఉదయశంకర్, కరుణాకరన్, చరణ్, గౌతం మీనన్, సెల్వరాఘవన్, పి. వాసు తదితర తమిళ దర్శకులతో ఆయన చేశారు. అయితే యాక్షన్ సినిమాల సంఖ్య తగ్గించి, ఫ్యామిలీ సినిమాలు ఎక్కువ చేస్తూ రావడం వల్ల మాస్ ప్రేక్షకుల్లో ఆయన ఇమేజ్ తగ్గిందన్నది విశ్లేషకుల అభిప్రాయం. కన్నడంలో 'ఆప్త రక్షక' హిట్టవడానికీ, తెలుగులో 'నాగవల్లి' ఫ్లాపవడానికీ నేటివిటీ సమస్య ప్రధాన కారణం. రానున్న మలయాళ 'బాడీగార్డ్' రీమేక్ ఆయన ఇమేజ్‌ని ఏ మేరకు నిలుపుతుందో వేచి చూడాల్సిందే.
No comments:
Post a Comment