సినిమా ప్రియుల్ని రానున్న ఐదు నెలల కాలం కనువిందు చేయనున్నది. క్రేజీ హీరోల, డైరెక్టర్ల సినిమాలు కొన్ని రిలీజవుతుండటమే దీనికి కారణం. మొదట ఆగస్ట్ 5న రాం హీరోగా నటించిన 'కందిరీగ' విడుదలవుతోంది. దీంతో కలుపుకుంటే ఈ యేడాది ఆఖరులోగా సుమారు 15 క్రేజీ సినిమాలు విడుదలవుతున్నాయి. సినిమాటోగ్రాఫర్‌గా కొన్ని సినిమాలకు పనిచేసిన సంతోష్ శ్రీనివాస్ 'కందిరీగ'తో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 'మస్కా' తర్వాత రాం, హన్సిక మరోసారి జతకట్టగా, 'యువత' ఫేం అక్ష మరో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు ఎంటర్‌టైన్‌మెంటే ప్రధాన బలం. 'రెడీ' తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలేని రాం 'కందిరీగ'తో హిట్ కొట్టాలని తపిస్తున్నాడు.
నాగచైతన్య, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన 'దడ' సినిమా విడుదల కోసం చాలామందే వేచి చూస్తున్నారు. ఆగస్టు 12న రానున్న ఈ సినిమాతో అజయ్ భుయాన్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. అమెరికా నేపథ్యంతో రూపొందిన ఈ సినిమాలోని ఫైట్స్‌ని ఇంటర్నేషనల్ మాస్టర్స్ కంపోజ్ చేయడం గమనార్హం. హీరోయిన్ కాజల్‌ని ఆపద నుంచి రక్షించే యువకునిగా నటించిన నాగచైతన్య ఈ సినిమాతో మాస్ ఇమేజ్‌ని ఆశిస్తున్నాడు.
ఇప్పటివరకు అనిశ్చితిలో ఉన్న మహేశ్ 'దూకుడు' విడుదల ఓ కొలిక్కి వచ్చినట్లు అగుపిస్తోంది. ఆగస్టు 26న ఈ సినిమా విడుదలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ రోజు కాకపోయినా సెప్టెంబర్ తొలి వారంలోనైనా 'దూకుడు' వస్తుందని ఆశించవచ్చు. 'ఖలేజా' తర్వాత మహేశ్ నటిస్తున్న ఈ సినిమాకి శ్రీను వైట్ల దర్శకుడు. సమంత నాయికగా నటిస్తున్న ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌పై అనిల్ సుంకర, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో అంబరాన్నంటుతున్న అంచనాలున్న సినిమా ఇదే. 'పోకిరి' తర్వాత హిట్‌లేని మహేశ్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాడు.
సెప్టెంబర్‌లో రెండు ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అవి బాబాయ్, అబ్బాయ్ సినిమాలు కావడం విశేషం. ఆ సినిమాలు బాలకృష్ణ 'శ్రీరామరాజ్యం', ఎన్టీఆర్ 'ఊసరవెల్లి'. 'శ్రీరామరాజ్యం'లో సీతారాములుగా నయనతార, బాలకృష్ణ నటిస్తుండగా, బాపు దర్శకత్వం వహిస్తున్నారు. అలనాటి అజరామర చిత్రం 'లవకుశ'కు ఇది రీమేక్. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని అమితంగా అలరిస్తుందనీ, తద్వారా పెద్ద విజయాన్ని సాధిస్తుందనీ సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'ఊసరవెల్లి'పై ప్రేక్షకుల్లో ఎటువంటి అంచనాలున్నాయో విడమర్చి చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ కేరక్టరైజేషన్ హైలైట్‌గా రూపొందుతున్న ఈ సినిమా 'కిక్' తర్వాత సురేందర్‌రెడ్డి సృజనాత్మక శక్తికీ, ఎన్టీఆర్ ఇమేజ్‌కీ ఓ పరీక్ష కానున్నది. వాళ్లిద్దరి కాంబినేషన్లో ఇదివరకు వచ్చిన 'అశోక్' హిట్ అనిపించుకోలేక పోయింది. ఆ అసంతృప్తిని 'ఊసరవెల్లి'తో పారదోలాలని ఆ ఇద్దరూ గట్టి పట్టుదలతో ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర చినీ చిత్ర బేనర్‌పై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్. 'రాఖీ' తర్వాత ఎన్టీఆర్‌తో దేవిశ్రీ ప్రసాద్ పని చేస్తున్న ఈ చిత్రానికి రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రాఫర్ కావడం గమనార్హం.
ఇక అక్టోబర్‌లో ఇద్దరు సీనియర్ హీరోల సినిమాలు రిలీజవుతున్నాయి. అవి నాగార్జున 'రాజన్న', వెంకటేశ్ మలయాళ 'బాడీగార్డ్' రీమేక్. 'రగడ' వంటి కమర్షియల్ హిట్, 'గగనం' వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం తర్వాత నటిస్తున్న 'రాజన్న' నాగార్జున కెరీర్‌లో మరో కీలకమైన చిత్రం కానున్నది. 1940-50 నాటి నేపథ్యంలో రజాకార్ల దురాగతాల మీద తిరుగుబాటు బావుటా ఎగురవేసిన 'రాజన్న' అనే పోరాట యోధుని కల్పిత కథతో ఈ చిత్రాన్ని వి. విజయేంద్రప్రసాద్ రూపొందిస్తున్నారు. ఇందులోని యాక్షన్ సన్నివేశాల్ని ఆయన కుమారుడు, నేటి టాప్ డైరెక్టర్ రాజమౌళి తీస్తున్నాడు. నాగార్జునకి జోడీగా స్నేహ నటిస్తున్న ఈ సినిమాతో నాగార్జున కీర్తి నటునిగా మరింత ఉన్నత శిఖరాలకు చేరుకునే అవకాశం ఉంది.
'రాజన్న'కు పోటీగా వస్తున్న వెంకటేశ్ సినిమా 'గంగ - ద బాడీగార్డ్'. 'తులసి' తర్వాత సరైన హిట్టులేని వెంకటేశ్ కొంత పట్టుదలతో ఈ సినిమా చేస్తున్నారు. 'డాన్ శీను' ఫేం గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని శ్రీ సాయిగణేశ్ ప్రొడక్షన్స్ బేనర్‌పై బెల్లంకొండ సురేశ్ నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్ త్రిషకు బాడీగార్డ్‌గా కనిపించనున్నారు వెంకటేశ్. మలయాళ హిట్ ఫిల్మ్ 'బాడీగార్డ్'కి ఇది రీమేక్. ఈ సినిమాతో కమర్షియల్ హిట్ సాధించ గలననే నమ్మకం ఆయనలో కనిపిస్తోంది.
నవంబరులో మూడు సినిమాలు వచ్చే అవకాశాలున్నాయి. రాంచరణ్ 'రచ్చ' వాటిలో ఒకటి. 'ఏమైంది ఈవేళ' ఫేం సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్. మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమాని రాంచరణ్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాడు. 'మగధీర' తర్వాత చేసిన 'ఆరెంజ్' అట్టర్‌ఫ్లాప్ కావడమే దీనికి కారణం. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో మంచి లవ్ స్టోరీ కూడా ఉంది. నవంబరులో రాని పక్షంలో డిసెంబరులోనైనా ఈ సినిమా రిలీజవుతుంది.
వేణు శ్రీరాంని డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ దిల్ రాజు నిర్మిస్తున్న 'ఓ మై ఫ్రెండ్' నవంబరులోనే వస్తుందని అంటున్నారు. ఇందులో హీరో సిద్ధార్థ్ కాగా, హీరోయిన్లు శ్రుతి హాసన్, హన్సిక. 'అనగనగా ఓ ధీరుడు' నుంచి సిద్ధార్థ్, శ్రుతి హాసన్ మధ్య రొమాన్స్ జరుగుతున్నదనే ప్రచారం నేపథ్యంలో అందరి కళ్లూ ఈ సినిమా మీదున్నాయి. నిజానికి ఇందులో మొదట తననే తీసుకున్నారనీ, తర్వాత సిద్ధు పట్టుబట్టి తన ప్లేస్‌లో శ్రుతిని తీసుకునేలా చేశాడనీ నిత్య బహిర్గతం చేసిన సంగతి ప్రస్తావనార్హం.
చిరంజీవి కేంపు నుంచి వస్తున్న మరో హీరో సినిమా నవంబర్‌లోనే రిలీజవబోతోంది. అతను చిరంజీవి మేనల్లుడు సాయి ధరంతేజ్ కాగా ఆ సినిమా 'రేయ్'. స్వీయ నిర్మాణంలో బొమ్మరిల్లు పతాకంపై వైవీఎస్ చౌదరి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. 'దేవదాసు' తర్వాత తీసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అనడంతో ఈ సినిమాని చాలా శ్రద్ధపెట్టి తీస్తున్నాడు చౌదరి. ఇందులో ధరంతేజ్ సరసన శుభ్ర అయ్యప్ప నాయికగా పరిచయం కాబోతోంది.
ఇక డిసెంబర్‌లో మరిన్ని రసవత్తర చిత్రాలు ఒకదానితో మరొకటి ఢీకొననున్నాయి. లారెన్స్ డైరెక్షన్‌లో కృష్ణంరాజు, ప్రభాస్ తండ్రీ కొడుకులుగా నటిస్తున్న 'రెబెల్', నాగార్జున హీరోగా శ్రీనివాసరెడ్డి రూపొందిస్తున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ 'ఢమరుకం', గోపీచంద్, తాప్సీ జంటగా కృష్ణవంశీ తీస్తున్న 'మొగుడు' ఈ నెల్లో రానున్నాయి. విష్ణువర్ధన్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న 'కాళీ' కూడా డిసెంబర్లో వచ్చే అవకాశాల్ని తోసిపుచ్చలేం.
ఇన్ని సినిమాలు ఒకదాని తర్వాత మరొకటి వస్తుండటంతో ఏ సినిమా ప్రేక్షకాదరణ పొందుతుంది, ఏది తిరస్కారానికి గురవుతుంది.. అన్నది ఆసక్తికర అంశం. 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ వ్యయంతో తయారవుతున్న ఈ సినిమాలు విజయాన్ని సాధిస్తే తెలుగు సినీ పరిశ్రమ కళకళలాడుతుంది. అయితే విడుదలైన క్రేజీ సినిమాలన్నీ విజయాన్ని సాధించిన దాఖలా ఇంతదాకా లేదు కాబట్టి ఈసారీ అది పునరావృతమవుతుందనడంలో సందేహం లేదు. ఎటొచ్చీ బంతి ఉండేది ప్రేక్షకుడి కోర్టులోనే. చూద్దాం అతడు ఎటువంటి తీర్పునిస్తాడో...
No comments:
Post a Comment