Wednesday, July 27, 2011
న్యూస్: తమిళంలో అదరగొడ్తున్న తెలుగు కుర్రాడు
తెలుగులో ఆదరణ పొందలేకపోయిన ఓ తెలుగు కుర్రాడు తమిళంలో మంచి గుర్తింపుతో పాటు మంచి సినిమాల అవకాశాల్నీ పొందుతూ ముందుకు దూసుకు పోతున్నాడు. అతను ఆది. అసలు పేరు సాయిప్రదీప్ పినిశెట్టి. 'పెదరాయుడు' డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి కుమారుడు. 2006లో తేజ డైరెక్ట్ చేసిన 'ఒక విచిత్రం'తో హీరోగా పరిచయమైన ప్రదీప్ ఆ సినిమా అట్టర్ ఫ్లాపవడంతో తెలుగులో మరో సినిమా అవకాశాన్ని పొందలేక పోయాడు. కానీ అతడి రూపం తమిళ దర్శకుడు సామిని ఆకట్టుకుంది. అంతే. 'మిరుగం' అనే సినిమా తీసేశాడు. విచ్చలవిడి ప్రవర్తనతో ఎయిడ్స్ రోగిగా అతడి నటన తమిళ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే దాన్ని హిట్ చేశారు. ఆ సినిమాతో ప్రదీప్ కాస్తా ఆదిగా మారాడు. ఆ సినిమా తెలుగులో 'మృగం'గా అనువాదమై ఇక్కడా సొమ్ము చేసుకుంది. 'మిరుగం' తర్వాత తమిళంలో ఒక్కో అవకాశం అతడి వళ్లో వచ్చి వాలుతోంది. అక్కడ ఇప్పటికి అతడివి నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. రెండేళ్ల క్రితం ఎస్. శంకర్ నిర్మించిన 'ఈరం'తో మరో విజయాన్ని అందుకున్నాడు ఆది. ఆ సినిమాని ఇటీవలే దిల్ రాజు తెలుగులో 'వైశాలి' పేరుతో విడుదల చేసి సక్సెస్ సాధించిన సంగతి మనకి తెలుసు. దీంతో ఆది తమిళంలో నటించిన మిగతా సినిమాలు కూడా తెలుగులో డబ్ అవుతున్నాయి. 2010 డిసెంబర్‌లో వచ్చిన 'అయ్యనార్' సినిమా 'వస్తాద్'గా, 2011 ఫిబ్రవరిలో విడుదలైన 'ఆదు పులి' సినిమా 'చెలగాటం' పేరుతో రాబోతున్నాయి. ఆది ప్రస్తుతం నటిస్తున్న తమిళ చిత్రం 'అరవాన్' అక్కడ అమితాసక్తిని రేకెత్తిస్తోంది. 600 యేళ్ల క్రితం నాటి మదురై నేపథ్యంతో వసంతబాలన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. సు. వెంకటేశన్ ప్రసిద్ధ నవల 'కావల్ కొట్టం' ఆధారంగా ఈ సినిమా తయారవుతోంది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అది కూడా తెలుగులో వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. అంటే ఏమిటి? మనవాళ్లు ఆదరించకపోయినా తమిళులు ఆదిని తమవాణ్ణి చేసుకున్నారు. ఇప్పుడిప్పుడే మనవాళ్లు అతడి వైపు చూస్తున్నారు. త్వరలోనే తెలుగులో అతడు తన రెండో సినిమా చేసే అవకాశాలున్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment