Showing posts with label nithya menon. Show all posts
Showing posts with label nithya menon. Show all posts

Monday, August 22, 2016

Saturday, June 30, 2012

క్లైమాక్స్ సీన్లలో 'ఒక్కడినే'


నారా రోహిత్ హీరోగా, నిత్యామీనన్ హీరోయిన్‌గా శ్రీనివాస్ రాగ దర్శకత్వంలో గులాబీ మూవీస్ పతాకంపై సి.వి.రెడ్డి నిర్మిస్తున్న 'ఒక్కడినే' చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటిలో జరుగుతోంది. ఈ సందర్భంగా సి.వి.రెడ్డి మాట్లాడుతూ 'మా సినిమాలోని పతాక సన్నివేశాల చిత్రీకరణని ఈ నెల 27 నుంచి రామోజీ ఫిలింసిటిలో ప్రారంభించా. చిత్రంలోని ప్రధాన తారాగణమంతా పాల్గొంటున్నారు. జూలై 3 వరకూ జరిగే షూటింగ్‌తో మూడు పాటలు మినహా చిత్రం పూర్తవుతుంది. ఆ మూడు పాటల్లో ఐటెం సాంగ్‌ని హైదరాబాద్‌లోను, మిగిలిన రెండు డ్యూయెట్లని విదేశాల్లో జూలై ప్రథమార్థంలోగా చిత్రీకరిస్తాం. ప్రస్తుతం శబ్దాలయా థియేటర్‌లో డబ్బింగ్ జరుగుతోంది' అని తెలిపారు.
నాగబాబు, సాయికుమార్, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ, బెనర్జీ, జీవి, ఆలీ, శ్రీనివాసరెడ్డి, సత్యకృష్ణ, సుధ, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: చింతపల్లి రమణ, సంగీతం: కార్తీక్, ఫొటోగ్రఫీ: ఆండ్ర బాబు, నిర్మాత: సి.వి.రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్ రాగ.

Wednesday, November 2, 2011

ప్రియా ఆనంద్ కనిపించుటలేదు!

తెరపైనా, తెరబయటా యమ చలాకీగా కనిపించే ప్రియా ఆనంద్ '180' సినిమా తర్వాత తెలుగు చిత్రసీమలో కనిపించకపోవడం ఆశ్చర్యకరం. శేఖర్ కమ్ముల 'లీడర్' సినిమాలో టీవీ జర్నలిస్ట్‌గా సెకండ్ హీరోయిన్ పాత్రలో పరిచయమై మెప్పించిన ఆమె 'రామ రామ కృష్ణ కృష్ణ', '180' సినిమాల్లో మెయిన్ హీరోయిన్‌గానూ బాగా రాణించింది. ముఖ్యంగా జయేంద్ర డైరెక్ట్ చేసిన ద్విభాషా చిత్రం '180'లో నిత్య మీనన్ వంటి సహజ నటి ఉన్నప్పటికీ నటిగా ప్రియకి మంచి మార్కులు రావడం గమనార్హం. రేణుక అనే ఎన్నారై యువతిగా ఆమె ప్రదర్శించిన హావభావాలు విమర్శకుల్ని సైతం మెప్పించాయి. ఆ సినిమాతో నటిగా ప్రియ సత్తా ఏమిటో అందరికీ తెలిసిందనీ, దాంతో ఆమెకి మంచి అవకాశాలు రావడం ఖాయమనీ చాలామంది భావించారు. చిత్రంగా ఇప్పటివరకు ఆమె ఏ తెలుగు సినిమాకీ సంతకం చేయలేదు. పెద్ద హీరోలెవరూ ఆమె పట్ల ఆసక్తి చూపడం లేదు. అయితే అలా అని ఆమె ఖాళీగా ఉందనుకుంటే పొరపాటే. 'చీని కం', 'పా' సినిమాల దర్శకుడు బాల్కి రూపొందిస్తున్న సినిమా ద్వారా బాలీవుడ్‌కి పరిచయమయ్యేందుకు సిద్ధమవుతోంది. న్యూయార్క్ నగరంలో ఈ సినిమా షూటింగులో ఇటీవలే పాల్గొంది. అయితే తెలుగు బాగా మాట్లాడగలిగిన ఆమెని తెలుగు చిత్రసీమ పట్టించుకోకపోవడమే బాధాకరం.

Friday, September 16, 2011

న్యూస్: హీరోయిన్లకు 'మా' నోటీసులు

ఇప్పటివరకు తమ సంఘంలో సభ్యత్వం తీసుకోని కొంతమంది హీరోయిన్లకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నోటీసులు జారీ చేసింది. ముంబైతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి చోట్ల నుంచి పలువురు తారలు తెలుగు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరిలో కొంతమంది 'మా'లో సభ్యత్వం తీసుకోకుండానే నటిస్తూ వస్తున్నారు. వీరివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిర్మాతలు వారిపై 'మా'కు ఫిర్యాదు చేసినా, వారు తమ సభ్యులు కాకపోవడంతో 'మా' ఎలాంటి చర్యలూ తీసుకోలేకపోతోంది. ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పినా వారు సభ్యత్వం తీసుకోకపోవడంతోనే సుమారు 14 మంది హీరోయిన్లకు ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. వారిలో చాలాకాలం నుంచే తెలుగు సినిమాల్లో నటిస్తున్న త్రిష, జెనీలియా, తమన్నాతో పాటు ఇటీవలి కాలంలో క్రేజ్ పొందిన సమంత, నిత్యమీనన్, పార్వతీ మెల్టన్ వంటి తారలు ఉన్నారు. సెప్టెంబర్ 30లోగా వీరు సభ్యత్వం తీసుకోకపోతే అక్టోబర్ 1 నుంచి వారికి సహకరించకూడదని 'మా' నిర్ణయించింది.

Friday, August 12, 2011

న్యూస్: 'సెగ' ఆరిపోయింది!

నానికి 'సెగ' తగిలింది. ఆ సినిమా గురించి అతను చెప్పిన గొప్పలు ఉత్తవని తేలిపోయాయి. బాక్సాఫీసు వద్ద అది ఫెయిలైంది. తమిళ వెర్షన్ 'వెప్పం' పరిస్థితి కూడా ఇదేనని తెలిసింది. 'సెగ'లో కార్తీక్ పాత్రలో నాని రాణించాడు. డైరెక్టర్ అంజన సినిమాని రియలిస్టిక్‌గా తీసింది. పెద్దల పెంపకం సరిగా లేకపోతే పిల్లలు ఎలా తయారవుతారనే కథాంశంతో ఈ సినిమాని ఆమె రూపొందించింది. అయితే ఈ సినిమాలోని పాత్రలు, సన్నివేశాలు ప్రేక్షకుల్ని మెప్పించలేక పోయాయి. అందుకే బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. ప్రధానంగా క్రైం థ్రిల్లర్‌గా కనిపించిన ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ మిస్సయ్యింది. తెలుగు ప్రేక్షకులు ఇటీవలి కాలంలో ఆదరించిన సినిమాలన్నీ ఎంటర్‌టైనర్సే కావడం గమనార్హం. ఈ సినిమా రిలీజ్‌కి ముందు "నందినీరెడ్డి తరహాలోనే అంజన చాలా ప్రతిభావంతురాలు. నాలుగు సినిమాలు చేస్తే ఆమె ఇంటర్నేషనల్ లెవల్లో పేరు తెచ్చుకుంటుంది" అని తెగ పొగిడేశాడు నాని. దాంతో 'సెగ' చాలా గొప్పగా ఉంటుందనీ, నానికి మరో హిట్టు గ్యారంటీ అని అంతా అనుకున్నారు. రిలీజయ్యాక చూస్తే ఫలితం తారమారయ్యింది. ఇటు నాని నటనని గానీ, అటు అంజన డైరెక్షన్ గురించి గానీ గొప్పగా చెప్పినవాళ్లు ఒక్కరూ లేకుండా పోయారు. 'అలా మొదలైంది'లో జంటగా ఆకట్టుకున్న నాని, నిత్యమీనన్ ఈ సినిమాలో ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేక పోయారు. ఇకనుంచైనా నాని భూమ్మీద నడిస్తే అతని కెరీరుకి మంచిదని సలహా ఇస్తున్నారు విశ్లేషకులు.

Friday, August 5, 2011

న్యూస్: మంచి సినిమాలకే నందులు!

గతంలో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకే ఎక్కువ అవార్డుల్ని కట్టబెడుతూ వచ్చిన నంది అవార్డుల జ్యూరీ గత యేడాది నుంచీ అర్థవంతమైన, మంచి చిత్రాలకు అవార్డులనిస్తూ 'నంది'కి గౌరవాన్ని కల్పిస్తోంది. 2010 సంవత్సరానికి దర్శకుడు ఎన్. శంకర్ ఆధ్వర్యంలోని జ్యూరీ ప్రకటించిన అవార్డులు ఈ సంగతిని స్పష్టం చేశాయి. ఈసారి ఉత్తమ అవార్డులు మూడూ విమర్శకుల ప్రశంసల్ని పొందిన సినిమాలకే రావడం గమనార్హం. అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క ప్రధాన పాత్రలు పోషించగా క్రిష్ డైరెక్ట్ చేసిన 'వేదం' ఉత్తమ చిత్రంగా బంగారు నందిని గెలుగుకోగా, 2009 సంవత్సరంలో ఉత్తమ చిత్రంగా బంగారు నందిని పొందిన 'సొంత ఊరు' దర్శకుడు పి. సునీల్‌కుమార్‌రెడ్డి మత్స్యకారుల దయనీయ జీవితాన్ని ఆవిష్కరించిన 'గంగపుత్రులు' ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. సునీల్‌కుమార్‌రెడ్డికే ఉత్తమ దర్శకుడి అవార్డు దక్కడం గమనార్హం. ఇక తృతీయ ఉత్తమ చిత్రంగా సాయికుమార్, శర్వానంద్, సందీప్ నటించగా దేవా కట్టా డైరెక్ట్ చేసిన 'ప్రస్థానం' నిలిచింది. ప్రజాదరణ పొందిన చిత్రంగా నిజంగా ప్రేక్షకుల ఆదరణ పొందిన రాజమౌళి చిత్రం 'మర్యాద రామన్న'ని జ్యూరీ ఎంపిక చేసింది. గతంలో ఈ కేటగిరీలో చాలా చోట్ల అసలు రిలీజే కాని 'పెళ్లాం పిచ్చోడు' అనే రాజేంద్రప్రసాద్ సినిమాని ఎంపిక చేసిన సంగతి జ్ఞాపకం చేసుకుంటే జ్యూరీ ఈసారి ఎంత వాస్తవికంగా పనిచేసిందో అర్థమవుతుంది. అలాగే సకుటుంబంగా చూడదగ్గ ఉత్తమ చిత్రం అవార్డుని చంద్రసిద్ధార్ట్ డైరెక్ట్ చేసిన 'అందరి బంధువయ'కు ప్రకటించారు. సమాజంలో నైతికత, మానవత్వం ముఖ్యమని చెప్పిన ఈ సినిమాని విమర్శకులు ఎంతగానో అభిమానించారు. ఇక జాతీయ సమగ్రతా చిత్రంగా బాలకృష్ణ హీరోగా దాసరి నారాయణరావు రూపొందించిన 'పరమవీరచక్ర'కు ఇచ్చారు.
వ్యక్తిగత అవార్డుల విషయానికొస్తే ఉత్తమ నటుడి అవార్డు బాలకృష్ణకు దక్కింది. 2001 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 'నరసింహనాయుడు' పాత్ర పోషణకు గాను ఉత్తమ నటుడి అవార్డును అందుకున్న ఆయన మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఆ అవార్డును పొందడం విశేషమే. 'పరమవీరచక్ర'కు కాకుండా, చాలా కాలం తర్వాత ప్రేక్షకాభిమానాన్ని పొందిన 'సింహా'లో చేసిన రెండు పాత్రలకు గాను ఈ అవార్డు ఆయనకు లభించడం గమనార్హం. 2011 సంక్రాంతికి విడుదలైనా, 2010లోనే సెన్సార్ సర్టిఫికెట్ పొందిన 'అలా మొదలైంది'లో అద్భుతంగా అభినయించిన నిత్యమీనన్ ఉత్తమ నటిగా ఎంపికవగా, ఆ చిత్రాన్ని జన రంజకంగా మలిచిన నందినీరెడ్డి ఉత్తమ తొలిచిత్ర దర్శకురాలిగా నిలిచింది. 'సింహా"కి చక్కని సంగీతాన్నిచ్చిన చక్రి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. తొలి చిత్రమే అయినా 'మర్యాద రామన్న'లో విశేషంగా రాణించిన నాగినీడు ఉత్తమ విలన్‌గా అవార్డును అందుకోనున్నారు. ఇలా అనేక అవార్డులు పారదర్శకంగా ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.

Tuesday, July 19, 2011

న్యూస్: నితిన్ ప్రేక్షకుల 'ఇష్క్' పొందుతాడా?

నితిన్‌కి హిట్టొచ్చి ఎంత కాలమైందో జ్ఞాపకముందా? ఏడేళ్లు! అవును. అతని చివరి హిట్ మూవీ 'సై'. అది కూడా నిర్మాతకి డబ్బులు తీసుకు రాలేదు. కొన్నవాళ్లే లాభపడ్డారు. అంతకు ముందు 'జయం', 'దిల్' సినిమాలతో రెండు వరుస హిట్లిచ్చిన అతను నాలుగో సినిమా 'సై'తో మరో సక్సెస్ సాధించాననుకున్నాడు. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వ ప్రతిభతో రగ్బీ నేపథ్యంలో నడిచే ఆ సినిమా చాలామందిని ఆకట్టుకుంది. దాని తర్వాత నితిన్ 13 సినిమాల్లో నటించాడు. వాటిలో ఏ ఒక్కటీ అతనికి సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. ఆ సినిమాల్లో రాంగోపాల్‌వర్మ డైరెక్షన్‌లో చేసిన హిందీ సినిమా 'అగ్యాత్' కూడా ఉంది. అంటే నితిన్ బాలీవుడ్ ఎంట్రీ సైతం నిరాశనే కలిగించింది. కృష్ణవంశీ (శ్రీ ఆంజనేయం), కె. రాఘవేంద్రరావు (అల్లరి బుల్లోడు), తేజ (ధైర్యం), ఎన్. శంకర్ (రాం) వంటి దర్శకులు కూడా తర్వాతి కాలంలో అతనికి సక్సెస్సులు ఇవ్వలేకపోయారు. ప్రియమణి అందాల కనువిందు చేసిన 'ద్రోణ' కానీ, మోస్ట్ గ్లామరస్ గర్ల్ ఇలియానాతో చేసిన 'రెచ్చిపో' కానీ, క్యూట్ గర్ల హన్సికతో నటించిన 'సీతారాముల కల్యాణం.. లంకలో' కానీ అతడికి విజయాన్ని చేకూర్చలేక పోయాయి. అతని కెరీర్ కోసం తండ్రి ఎన్. సుధాకర్‌రెడ్డి చేయని ప్రయత్నమంటూ లేదు. అయినా కూడా నితిన్ ఎందుకనో ప్రేక్షకుల్ని అలరించలేక పోతున్నాడు. ప్రస్తుతం అతను 'ఇష్క్' అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో 'అలా మొదలైంది'తో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్న నిత్య మీనన్ హీరోయిన్. విక్రం కుమార్ అనే కొత్త డైరెక్టర్ రూపొందిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ఓ విశేషం ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ పి.సి. శ్రీరాం దీనికి పని చేస్తుండటం. ఈ సినిమాతోనైనా నితిన్ తన పరాజయ పరంపరకి అడ్డుకట్ట కట్టుకోగలడా? వెయిట్ అండ్ సీ.

Wednesday, July 13, 2011

న్యూస్: మరో చక్కని నటి దొరికింది!

ప్రియా ఆనంద్ రూపంలో మరో మంచి నటి తెలుగు తెరకి దొరికిందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. '180'లో రేణుకా నారాయణన్ అనే ఎన్నారై అమ్మాయి పాత్రని ఆమె చేసిన తీరే దీనికి కారణం. తొలి సినిమా 'లీడర్', రెండో సినిమా 'రామ రామ కృష్ణ కృష్ణ'లో ఆమె పాత్రలు, నటన జస్ట్ ఓకే అనిపించుకున్నాయి. అయితే ఆమెలోని నటనని వెలికి తీసిన సినిమా మాత్రం '180' అనే చెప్పాలి. జయేద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటు ప్రేక్షకుల, అటు విమర్శకుల ప్రశంసల్ని అందుకుంది. ఇందులో ప్రతిభావంతురాలైన నిత్య మీనన్ ఉన్నప్పటికీ ప్రియకే ఎక్కువ మార్కులు పడటం గమనార్హం. కారణం.. నిత్య పాత్ర చిన్నది కావడం, ప్రియది ప్రధాన హీరోయిన్ పాత్ర కావడం. ఈ పాత్రకి ఆమే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంది. పైగా మొదటి రెండు సినిమాల్లో లేని గ్లామర్ లుక్ ఈ సినిమాలో ఆమెలో బాగా కనిపించింది. సినిమాటోగ్రాఫర్ బాలసుబ్రమణియన్ ప్రతిభ దీని వెనుక ఉండవచ్చు. ఇప్పటివరకు టాప్ హీరోల దృష్టిలో పడని ఈ బ్యూటీకి '180' విడుదల తర్వాత ఆ అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది. ఇంకా ఏ సినిమా ఫైనలైజ్ కాకపోయినా అతి త్వరలోనే ఒకట్రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో ప్రియ కనిపించే ఛాన్సులు ఎక్కువగానే ఉన్నాయి.

Thursday, July 7, 2011

న్యూస్: నాని కెరీర్‌కి ఊపు 'సెగ'

డైరెక్టర్ కాబోయి యాక్టర్ అయిన నాని కెరీర్ 'అలా మొదలైంది'తో మళ్లీ గాడిలో పడింది. తొలి రెండు సినిమాలు 'అష్టా చమ్మా', 'రైడ్' హిట్టవగా, 'స్నేహితుడా', 'భీమిలి కబడ్డి జట్టు' ఫెయిలయ్యాయి. రెండు హిట్లు, రెండు ఫ్లాపులతో బేలన్స్ అయిన అతడి కెరీర్ మళ్లీ 'అలా మొదలైంది'తో ఇంకో మెట్టు పైకెక్కింది. చేసిన ఐదు సినిమాల్లో మూడు హిట్టవడం చిన్న విషయమేమీ కాదు. ఇప్పుడు అతడి దృష్టి తమిళ, తెలుగు భాషలు రెండింటిలోనూ రానున్న 'సెగ' మీదే ఉంది. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ తమిళంలో చేసిన 'వెప్పం'. అంజనా అలీ ఖాన్ ఈ సినిమా డైరెక్టర్. 'అలా మొదలింది' డైరెక్టర్ నందినీరెడ్డి తరహాలోనే అంజన కూడా నానికి మంచి దోస్త్. ఆ సినిమాలో నానికి జోడీగా నటించిన నిత్యమీనన్ ఈ సినిమాలోనూ నటించడం ఇంటరెస్టింగ్. ఈ నెల్లోనే ఈ సినిమాలు విడుదల కానున్నాయి. అయితే వీటికంటే అతడికి పెద్ద పేరు తీసుకొచ్చే అవకాశమున్న సినిమా మరోటి ఉంది. అది 'ఈగ'. ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్టర్ కావడమే ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్ అని వేరే చెప్పాల్సిన పనిలేదు. విలన్ (సుదీప్) చేతిలో చనిపోయిన హీరో (నాని) తర్వాత జన్మలో ఈగగా పుట్టి విలన్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేది ఈ సినిమా కథ. ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని కథతో వస్తున్న ఈ సినిమా నాని కెరీర్‌కి బూస్ట్‌నివ్వడం ఖాయం. ఇదే కాక అశోక్ అనే మరో కొత్త డైరెక్టర్ తీస్తున్న 'పిల్ల జమీందారు' అనే ఇంకో సినిమా కూడా చేస్తున్నాడు నాని. మొత్తానికి కుర్ర హీరోల్లో మంచి నటుడిగా ఎక్కువ మార్కులు పొందుతోంది నిస్సందేహంగా అతడే.