Showing posts with label oosaravelli. Show all posts
Showing posts with label oosaravelli. Show all posts

Sunday, October 30, 2011

లేటుగా వచ్చిన ఇమేజ్

ఆరేళ్ల క్రితం 'శ్రీ' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైనప్పటికీ 2007లో వచ్చిన 'హ్యాపీడేస్'తోటే మంచి గుర్తింపు తెచ్చుకున్న తమన్నా చాలా ఆలస్యంగా క్రేజీ స్టార్‌గా మారింది. 'హ్యాపీడేస్' తర్వాత తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేస్తూ వచ్చిన ఆమె 2011 మేలో వచ్చిన సుకుమార్ సినిమా '100% లవ్' సినిమాలో ఇటు గ్లామర్, అటు పర్ఫార్మెన్స్ పరంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. చక్కని వంపుసొంపులున్నప్పటికీ మొహం వెడల్పుగా ఉండటమే ఆమె రూపంలో కొట్టొచ్చినట్లు కనిపించే మైనస్ పాయింట్. 'బద్రినాథ్'లో ఇదే స్పష్టమైంది. పాటల్లో గ్లామర్ డ్రస్సుల్లో అదరగొట్టినా ఆ సినిమా ఫ్లాపవడంతో ఆమెకి కొంత నిరుత్సాహం కలిగిన మాట నిజం. అయితే ఎన్టీఆర్‌తో చేసిన 'ఊసరవెల్లి' నటిగా ఆమెకి మరింత పేరు తెచ్చింది. అందులో నీహారికగా కోమా నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రదర్శించిన అభినయం ప్రేక్షకుల కళ్లల్లో ఇంకా మెదలుతూనే ఉంది. ఆ రకంగా ఈ సినిమా ఎన్టీఆర్ కంటే ఎక్కువగా తమన్నాకే పేరు తెచ్చింది. ప్రస్తుతం ఆమె మూడు క్రేజీ ప్రాజెక్టులు చేస్తోంది. అవి - రాంచరణ్‌తో చేస్తున్న 'రచ్చ', ప్రభాస్ సరసన చేస్తున్న 'రెబల్', రాంతో జంటగా నటిస్తున్న 'ఎందుకంటే ప్రేమంట'. ఓవైపు ఇలియానా ఇమేజ్ తగ్గిపోయినా, మరోవైపు సమంత టాప్ స్లాట్‌కి దూసుకు వస్తున్న నేపథ్యంలో నెంబర్‌వన్ హీరోయిన్ అనిపించుకోవడం తమన్నాకి అంత సులువు కాదు.

Friday, October 14, 2011

న్యూస్: 'ఊసరవెల్లి' ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్?!

మహేశ్ 'దూకుడు' తొలివారం రూ. 50 కోట్ల గ్రా, రూ. 35 కోట్ల షేర్ సాధించిందని నిర్మాతలు ప్రకటిస్తే, మాది అంతకంటే పెద్ద రికార్డ్ అంటూ ఎన్టీఆర్ 'ఊసరవెల్లి' నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ప్రకటనలిచ్చారు. ఆయనిచ్చిన ప్రకటన ప్రకారం ఆ సినిమా తొలి వారం రూ. 56 కోట్ల గ్రాస్, రూ. 39 కోట్ల షేర్ సాధించింది. అంటే షేర్ విషయంలో 'దూకుడు' కంటే 'ఊసరవెల్లి' నాలుగాకులు ఎక్కువ చదివిందన్న మాట. తొలి వారం కలెక్షన్లలో ఇది ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్. చిత్రమేమంటే 'దూకుడు'ది జెన్యూన్ విజయమని (నిర్మాతలు ఎక్కువ కలెక్షన్లు ప్రకటించ వచ్చు గాక) ఇండస్ట్రీ, ట్రేడ్ వర్గాలు అంగీకరిస్తుంటే, 'ఊసరవెల్లి'ది జెన్యూన్ విజయమని ఆ వర్గాల్లో అత్యధికులు నమ్మడం లేదు. ఎందుకంటే 'ఊసరవెల్లి' ఆడుతున్న చాలా థియేటర్లలో కనిపిస్తున్న ప్రేక్షకుల సంఖ్యే దానికి ప్రబల నిదర్శనం. అయితే తమదే రికార్డ్ విజయమని చెప్పుకోవడానికి హీరోలు, వారి అభిమానులు తాపత్రయపడుతుంటే రికార్డులు బద్దలు కాకుండా ఉంటాయా? రానున్న రోజుల్లో 'పంజా', 'రచ్చ' సినిమాలకి ఇంకెన్ని రికార్డులు బద్దలవుతాయోననే కామెంట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ రికార్డుల దాహం ఎలాంటి పరిణామాలకి దారి తీస్తుందో తెలీదు కానీ ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్ మాత్రం 'దూకుడు', 'ఊసరవెల్లి' నిర్మాతల మీద వేయి కళ్లు వేసి చూస్తున్నట్లు సమాచారం.

Wednesday, October 12, 2011

న్యూస్: అభిమానుల మధ్య రికార్డుల గోల!


మహేశ్ 'దూకుడు' బాక్సాఫీస్ వద్ద యమ దూకుడుతో దూసుకుపోతుంటే, ఎన్టీఆర్ 'ఊసరవెల్లి'ని అంతకంటే హెచ్చు స్థాయిలో 'ప్రమోట్' చేయడానికి నానా హంగామా జరుగుతోంది. తొలిరోజు 'దూకుడు' రూ. 12 కోట్ల గ్రాస్ సాధించిందని దాని నిర్మాతలు ప్రకటిస్తే, 'ఊసరవెల్లి' ఏకంగా 15 కోట్ల గ్రాస్ కొల్లగొట్టిందని దాని నిర్మాత ప్రకటించాడు. దీంతో ఇప్పుడు ఈ రెండు సినిమాల విషయంలో అభిమానులు 'రికార్డుల'పై దృష్టిపెట్టారు. 'దూకుడు'కి మార్నింగ్ షో నుంచే జెన్యూన్‌గా హిట్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. నిజంగానే అది సరికొత్త రికార్డులు సాధించే దిశగా వెళ్తుంటే, దాని నిర్మాతలు అది సాధించే రికార్డుల్నే హైలైట్ చేస్తూ రావడం మిగతా హీరోల అభిమానుల్లో పౌరుషాన్ని రగిల్చింది. 'ఊసరవెల్లి' విషయంలో అదే జరుగుతోంది. 'దూకుడు' కంటే తమ హీరో సినిమాయే పెద్ద హిట్టని చెప్పడానికి ఎన్టీఆర్ అభిమానులు హంగామా చేస్తున్నారు. అయితే విడుదలైన రోజే 'ఊసరవెల్లి'కి బ్యాడ్ టాక్ వచ్చింది. చాలామంది ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ పాత్రని డైరెక్టర్ సురేందర్‌రెడ్డి చూపించిన తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. 'ఊసరవెల్లి' వచ్చాక టాప్ హీరోల్ని ఎలా ప్రొజెక్ట్ చేయాలో సురేందర్‌రెడ్డికి తెలీడం లేదనే వ్యాఖ్యలూ వినిపించాయి. ఇప్పటివరకు అతను కల్యాణ్‌రాం (అతనొక్కడే), రవితేజ (కిక్)కి మాత్రమే హిట్లివ్వగలిగాడు. ఎన్టీఆర్‌తో చేసిన 'అశోక్', మహేశ్‌తో చేసిన 'అతిథి' ఫ్లాపయ్యాయి. ఇప్పుడు 'ఊసరవెల్లి'తో అదే ట్రెండుని అతను కొనసాగించాడని విమర్శకులు అంటున్నారు. వీకెండ్‌లో బాగానే కలెక్ట్ చేసిన 'ఊసరవెల్లి' అసలు సత్తా సోమవారంతో తేలిపోయింది. చాలా థియేటర్లు సగం కూడా నిండలేదు. మరోవైపు మూడో వారంలో ఉన్న 'దూకుడు'కి సోమవారం కూడా థియేటర్ల వద్ద సందడి కనిపించింది. తమ హీరోల అభివృద్ధిని కాంక్షించే నిజమైన అభిమానులు చేయాల్సింది వాస్తవ స్థితిని యథాతథంగా గుర్తించడం, ఎదుటి హీరోల సినిమాలు హిట్టయితే మనస్ఫూర్తిగా అభినందించి, తమ వంతు సూపర్‌హిట్ వచ్చేదాకా సంయమనం పాటించడం. 'ఊసరవెల్లి' కాకపోతే 'దమ్ము' ఉంది. అది బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపవచ్చు. అప్పటిదాకా ఓపిక పట్టండి. లేకపోతే ఈ రికార్డుల గోల ముదిరిపోయి, ఏ సినిమా విడుదలైనా మొదట రికార్డులకే ప్రాధాన్యం ఇచ్చి ఊదరగొట్టే ప్రమాదం ఉంది. ఇది అనారోగ్యకర వాతావరణాన్ని సృష్టిస్తుంది.

Monday, October 3, 2011

న్యూస్: 'దూకుడు'ని అడ్డుకోవడమే 'ఊసరవెల్లి' లక్ష్యం!

మొత్తానికి 'ఊసరవెల్లి'ని అక్టోబర్ 6న రిలీజ్ చేయడానికే నిర్మాత ఛత్రపతి ప్రసాద్ నిశ్చయించేశారు. ఈ సినిమా నిజంగా 6న వస్తుందా లేక, 13కి వాయిదా పడుతుందా? అనే సందేహం తలెత్తింది. ఎందుకంటే సెప్టెంబర్ 23న రిలీజైన మహేశ్ 'దూకుడు' రికార్డ్ కలెక్షన్లు సాధిస్తోంది. ఎక్కువ థియేటర్లలో ఆడుతోంది. అలాంటప్పుడు 'ఊసరవెల్లి'కి ఎక్కువ థియేటర్లు దొరుకుతాయా అనే సందేహం కలిగింది. పైగా 'ఊసరవెల్లి'కి మంచి కలెక్షన్లు రావాలన్నా ఒక వారం ఆలస్యంగా విడుదల చేస్తేనే మంచిదనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ల అభిప్రాయం ప్రకారం 'ఊసరవెల్లి' అక్టోబర్ 13న విడుదలైతే ఇటు దానికీ, అటు 'దూకుడు'కీ ప్రయోజనం ఉంటుందని వాళ్లు సూచిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ మరో రకంగా తలుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 'దూకుడు' రికార్డులకి బ్రేక్ వెయ్యడంతో పాటు, టాలీవుడ్ నెంబర్‌వన్ రేసులో తానూ ముందున్నట్లు చెప్పాలనేది అతని అభిమతంగా ఫిలింనగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్, సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో ఇదివరకు వచ్చిన 'అశోక్' ఫెయిలైంది. ఇప్పుడు ఎలాగైనా సూపర్‌హిట్ కొట్టాలనే తపనతో ఆ ఇద్దరూ 'ఊసరవెల్లి'కోసం కృషిచేశారు. తప్పుకుండా ఈ సినిమా బిగ్ హిట్టవుతుందనే నమ్మకం ఎన్టీఆర్‌లో కనిపిస్తోంది. అందుకే ఆరునూరైనా అక్టోబర్ 6నే సినిమా విడుదల చేయాలని అతను పట్టుపట్టడంతో నిర్మాత ప్రసాద్ మరో దారిలేక విడుదలకు సిద్ధమయ్యారు. ఒక్కటి మాత్రం నిజం. 'ఊసరవెల్లి' రాక 'దూకుడు' రికార్డుల్ని ప్రభావితం చేయనున్నది. ఆ ప్రభావం థియేటర్ల సంఖ్య మీదా, కలెక్షన్ల మీదా కనిపించనున్నది. చూద్దాం, ఎన్టీఆర్ పట్టుదల చివరికి ఎలాంటి పరిస్థితుల్ని కల్పిస్తుందో...

Sunday, August 28, 2011

న్యూస్: రెండు హిట్లు, రెండు ఫ్లాపులు!

ఇప్పటివరకు నాలుగు సినిమాల్ని డైరెక్ట్ చేసిన సురేందర్‌రెడ్డి రెండు హిట్లు, రెండు ఫ్లాపులతో బ్యాలెన్స్‌గా ఉన్నాడు. తొలి సినిమా 'అతనొక్కడే', నాలుగో సినిమా 'కిక్'తో హిట్లు కొట్టిన అతను రెండు, మూడు సినిమాలైన 'అశోక్', 'అతిథి'లతో ఫ్లాపులు చవిచూశాడు. ఇప్పుడతను తన ఐదో సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ సినిమా 'ఊసరవెల్లి'. అఫిషియల్‌గా ఆ సినిమా టైటిల్‌ని ప్రకటించారు. ఇందులో ఎన్టీఆర్ హీరో. ఇదివరకు ఆ ఇద్దరూ కలిసి 'అశోక్' చేశారు. ఆ సినిమాతో పరాజయం పొందిన వాళ్లు 'ఊసరవెల్లి'తో ఆ చేదు అనుభవాన్ని మరచిపోవాలని ఆశిస్తున్నారు. విపరీతమైన వయొలెన్స్, ఏమాత్రం కొత్తదనం లేని కథ వల్లనే 'అశోక్' ఫ్లాపయ్యిందని సురేందర్‌రెడ్డి గ్రహించాడు. అందుకే 'ఊసరవెల్లి'ని 'కిక్' తరహాలోనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా మలుస్తున్నాడు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్. ఎన్టీఆర్, తమన్నా మధ్య వచ్చే సీన్లు యూత్‌ని బాగా ఎట్రాక్ట్ చేస్తాయని ఆ సినిమా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సురేందర్‌కి పర్మనెంట్ రైటర్‌గా మారిన వక్కంతం వంశీ కథని అందించిన ఈ సినిమాకి 'బృందావనం' ఫేం కొరటాల శివ డైలాగ్స్ రాస్తున్నాడు. ఇదివరకు ఎన్టీఆర్ 'రాఖీ'కి సూపర్బ్ మ్యూజిక్‌నిచ్చిన దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి బాణీలనిస్తున్నాడు. 'ఛత్రపతి ప్రసాద్' నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా పేరుపొందిన మోడల్ విద్యుత్ జామ్వాల్, రాంగోపాల్‌వర్మ సినిమా 'కాంట్రాక్ట్' ఫేం ఆద్విక్ మహాజన్ టాలీవుడ్‌కి పరిచయమవుతున్నారు. మొత్తానికి 'ఊసరవెల్లి'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాలనే సురేందర్‌రెడ్డి తపని ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.