Showing posts with label dasari narayana rao. Show all posts
Showing posts with label dasari narayana rao. Show all posts
Tuesday, October 13, 2015
Saturday, November 22, 2014
Saturday, November 15, 2014
Thursday, September 11, 2014
Saturday, December 8, 2012
బండోడు గుండమ్మ (1980) - సమీక్ష
ఓ అమాయకుల్లో అమాయకుడి కథతో దాసరి నారాయణరావు రూపొందించిన సినిమా 'బండోడు గుండమ్మ'. అమాయకుడైన ఆంజనేయులుకి చెల్లెలంటే ప్రాణం. చిన్న పిల్లలతో కలిసి ఆడుకునే అతను వారి ప్రోద్బలం మీద గుండమ్మను ప్రేమిస్తాడు. క్రమంగా గుండమ్మ కూడా అతడికి మనసిస్తుంది. దశరథరామయ్య కొడుకు డాక్టర్ ప్రసాద్‌తో తన చెల్లెలి పెళ్లి జరగాలంటే 25 వేల రూపాయలు కట్నం కింద ఇవ్వాలంటారు. డబ్బు సంపాదన కోసం పట్నం వెళ్లిన ఆంజనేయులుకు రాఘవరావు తారసపడతాడు. అతను అచ్చం ఆంజనేయులు మాదిరిగానే ఉంటాడు. కానీ రాఘవరావు దోపిడీలు, హత్యలు చేసి డబ్బు సంపాదిస్తుంటాడు. తన స్థానంలో ఆంజనేయుల్ని ప్రవేశపెట్టి పోలీసుల బారి నుంచి తప్పించుకోవాలనుకున్న రాఘవరావు ఓ కారు ప్రమాదంలో గాయపడతాడు. ఆంజనేయుల్ని వెతుక్కుంటూ పట్నం వచ్చిన గుండమ్మ అతడే అనుకొని రాఘవరావును ఊరికి తీసుకుపోతుంది. మరోవైపు రాఘవరావు స్థానంలో అతనింటికి వెళ్తాడు ఆంజనేయులు. ఆ తర్వాత కథ ఎలా నడిచిందనేది ఆసక్తికరం.
కథ, మాటలు, స్క్రీన్‌ప్లేతో పాటు కొన్ని పాటలు కూడా రాసిన దర్శకుడు దాసరి నారాయణరావు ఈ కథను ప్రేక్షకుల్ని అలరించేలా చిత్రీకరించడంలో సఫలమయ్యాడు. ఆంజనేయులు తన చెల్లెలికి సంబంధం మాట్లాడటానికి వెళ్లిన సన్నివేశాల్లో రచయితగా, దర్శకుడిగా ఆయన ప్రతిభ కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. అలాగే ఆంజనేయుల్ని రాఘవరావు తన ఇంటికి తెచ్చినప్పుడు రాఘవ భార్య తన చిన్నారి కొడుక్కి పులి, ఆవు కథను చెప్పే సన్నివేశం ఆయన ఇమాజినేషన్‌కు నిదర్శనం.
ఇటు ఆంజనేయులు, అటు రాఘవరావు పాత్రల్లో కృష్ణ వైవిధ్యభరితమైన నటన ప్రదర్శించాడు. ఆంజనేయులు పాత్రలో ఆయన చూపిన అమాయకత్వం, హావభావాలు ఆకట్టుకుంటాయి. గుండమ్మగా జయప్రద బాగా రాణించగా, రాఘవరావు భార్యగా ప్రభ సరిగ్గా సరిపోయింది. చక్రవర్తి బాణీలు కూర్చిన పాటల్లో 'సిరిపురపు సిన్నోడా', 'ఊరు నిదురపోతోంది.. గాలి నిదురపోతోంది' పాటలు శ్రావ్యంగా ఉన్నాయి. కన్నప్ప ఛాయాగ్రహణం సినిమాకి ఎస్సెట్.
Thursday, July 5, 2012
దాసరి ఆచరణలోకి దిగాలి
దాసరి నారాయణరావు మాటలు ఆపేసి, ఆచరణలోకి దిగాలని సీనియర్ నిర్మాత, పంపిణీదారుడు చదలవాడ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదనీ, లీజుదార్లపై తిరుగుబాటుకు తాను కంకణం కట్టుకుంటున్నాననీ ఆదివారం సీనియర్ దర్శకుడు దాసరి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన చదలవాడ "చిన్న సినిమాల విషయంలో ఆదివారం దాసరిగారు చేసిన వ్యాఖ్యల విషయంలో వంద శాతం నేను ఏకీభవిస్తున్నా. అయితే ఆయన చాలా కాలం నుంచే ఈ మాటల్ని చెబుతూ వస్తున్నారు. కేవలం ప్రకటనలకే ఆయన పరిమితవుతున్నారు. అలా కాకుండా ఆయన తన మాటల్ని ఆచరణలో చూపిస్తే చిన్న నిర్మాతలు నిజంగానే సంతోషిస్తారు. ఆయన ఆచరణలో దిగితే చిన్న సినిమాలకు మేలు జరగడమనేది పది నిమిషాల పని. దళారుల వల్ల మహా మహా నిర్మాతలే సినిమా నిర్మాణాన్ని మానేసుకుని వేరే వ్యాపారాల్లోకి వెళ్లిపోతున్నారు. సీనియర్ నిర్మాతలు ఇవాళ ఎంతమంది సినిమాలు తీస్తున్నారో గమనిస్తే అర్థమైపోతుంది, పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో. నిర్మాతల పెట్టుబడిని దళారులు కాజేస్తున్నారు. చాలామంది వ్యక్తులు తమకు దాసరి వంటివాళ్లు అండగా ఉంటారని భావించి మోసపోతున్నారు. అలాంటి ఎంతోమంది చిన్న సినిమాల నిర్మాతలకు మేలు జరగాలంటే వెంటనే దాసరిగారు కార్యాచరణ చేపట్టాలి'' అని చెప్పారు.
Monday, July 2, 2012
ఎవరైనా చిన్న సినిమా అంటే నరికేస్తా
"ఎవరైనా చిన్న సినిమా అంటే నరికేస్తాను. ఎవరిది పెద్ద సినిమా? ఎవరు పెద్ద? సక్సెస్ ఈజ్ ద బిగ్. సక్సెస్ కంటే పెద్ద సినిమా మరోటి లేదు'' అని వ్యాఖ్యానించారు నూట యాభై చిత్రాల దర్శకుడు డాక్టర్ దాసరి నారాయణరావు. ఆదివారం ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన 'ఈ రోజుల్లో' వంద రోజుల వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. "నాకు తెలిసి ఈ ఆరేడు సంవత్సరాల్లో నా మనసుకు నచ్చినవి మూడే మూడు సినిమాలు. ఒకటి 'బొమ్మరిల్లు', తర్వాత 'అలా మొదలైంది', ఇప్పుడు 'ఈ రోజుల్లో'. ఈ సినిమా కోసం ఒక్క వారానికే థియేటర్లు బుక్ చేశారు. 'ఇది వంద రోజులు ఆడుతుంది, ఆ ఫంక్షన్‌కి నేనొస్తాన'ని చెప్పాను. సినిమాని నేను ప్రేక్షకుడిగానే చూస్తా. సినిమాలో ఏడుపు సీన్లుంటే నా కళ్లవెంట నీళ్లొస్తాయి. నవ్వు సీన్లొస్తే చంటి పిల్లాడిలా నవ్వుతాను. నేను బడ్జెట్ గురించి మాట్లాడటం లేదు. ఆ రోజుల్లో కేవలం రూ. లక్షతో పాటలు లేకుండా, అక్కడక్కడా తప్పితే మాటలు కూడా లేకుండా తీసిన 'నీడ' పెద్ద సినిమానా? చిన్న సినిమానా? 110 రోజులాడింది. ప్రేక్షకులు ఏ సినిమాని ఆదరిస్తారో అదే పెద్ద సినిమా. ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టి తీసిన సినిమానో, అమెరికాలో షూటింగ్ చేసిన సినిమానో పెద్ద సినిమా కాదు. 'ప్రేమాభిషేకం' కంటే పెద్ద హిట్టు లేదు. దానికి ఊటీ కూడా వెళ్లలేదు. పాటలన్నీ విజయా గార్డెన్స్‌లోనే తీశాను. వాటికంటే గొప్ప సాంగ్స్ ఉన్నాయా, ఈ మధ్య వచ్చే సినిమాల్లో. ఈ రోజు కోట్లు గురించి మాట్లాడుతున్నారు. 'ఒసేయ్ రాములమ్మా' సినిమా నేల టిక్కెట్టు రూ. రెండు, పై టిక్కెట్లు రూ. 10 ఉన్న రోజుల్లో రూ. 22.5 కోట్లు వసూలు చేసింది. ఇవాళ రేట్ల ప్రకారం లెక్కేస్తే రూ. 220 కోట్లు అవుతాయి. రికార్డుల గురించి కాదు మాట్లాడుకోవాల్సింది, సినిమాల గురించి. 'ఈ రోజుల్లో' సినిమాలో కథలేదు. నిత్య జీవిత సత్యాలున్నాయి. ఒక అబ్బాయిని ఒక అమ్మాయి ఎలా వాడేసుకుంటుంది, ఎలా తీసి అవతల పారేస్తుంది, ఎలా నాకేస్తుంది.. ఇదీ ఇందులో ఉంది. ఇవాళ ఏదైతే యూత్‌లో నడుస్తుందో, సమ సమాజంలో ఏం జరుగుతోందో.. దాన్ని వడపోసి, చక్కని స్క్రీన్‌ప్లేతో తీశాడు మారుతి. 'ఈ రోజుల్లో' వంటివి పది సినిమాలు వస్తే చాలు'' అని ఆయన చెప్పారు.
దిల్ రాజు మాట్లాడుతూ "చిన్న సినిమాలు తీసేవాళ్లకి ఇన్‌స్పిరేషన్ 'ఈ రోజుల్లో'. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవడానికి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ థియేటర్లలో విడుదలయ్యేలా చేసి సహకారం అందించాను. అన్ని తరగతుల ప్రేక్షకులు చూస్తే ఇంకా ఎక్కువగా రెవెన్యూ సాధించాల్సిన సినిమా'' అన్నారు. కేవలం 'ఈ రోజుల్లో' సక్సెస్‌ని మాత్రమే కాక దాని వెనుక ఉన్న ప్లానింగ్, కృషిని కూడా ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలని నిర్మాత కె. అచ్చిరెడ్డి సూచించారు. ఈ సినిమాకి పెట్టిన ఖర్చునీ, వచ్చిన కలెక్షన్లనూ చూస్తే ఇండస్ట్రీ రికార్డ్ అని చెప్పాలని నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ చెప్పారు.
నిర్మాతల్లో ఒకరైన ఎస్.కె.ఎన్. మాట్లాడుతూ "రచయిత స్వామిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రెండో సినిమా తియ్యబోతున్నాం. మేం తెలుగు ఆర్టిస్టులు, టెక్నీషియన్లతోనే సినిమాలు తీస్తాం'' అన్నారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ "డబ్బులున్నంత మాత్రాన సినిమాలు తియ్యకూడదు. సినిమాని ప్రేమించి తియ్యాలి. అప్పుడే సక్సెస్ వస్తుంది. దాసరిగారి చేతులమీదుగా వంద రోజుల షీల్డు అందుకోవడం నా జీవితంలో జరిగిన అద్భుతం. ఇప్పుడు నా కథని నమ్మి బెల్లంకొండ సురేశ్ 'బస్‌స్టాప్' నిర్మిస్తున్నారు. అది పెద్దలు, పిల్లలు కూడా చూసి ఆనందించే పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం'' అని చెప్పారు.
ఈ సందర్భంగా ఈ సినిమా యూనిట్ సభ్యులు, డిస్ట్రిబ్యూటర్లకు దాసరి నారాయణరావు, తమ్మారెడ్డి భరద్వాజ్ వంద రోజులు షీల్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు బెల్లకొండ సురేశ్, ఎం.ఎల్. కుమార్‌చౌదరి, బి.ఎ. రాజు, సురేశ్ కొండేటి, దర్శకుడు రవికుమార్‌చౌదరి, రచయిత సంజీవి, మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ వాసు, డాక్టర్ దశరథరామిరెడ్డి, హీరోలు శ్రీ, సాయి, హీరోయిన్ రేష్మా, నిర్మాత శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్ ప్రభాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మూడు దశాబ్దాల మోహన్‌బాబు నిర్మాణ సంస్థ
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో డా. మోహన్‌బాబుది ప్రత్యేకమైన బాణీ. నటనలో విలక్షణత ఆయన ప్రత్యేకత. ఒడిదుడుకులతో ప్రారంభమైన సినీ జీవితం సాఫీగా మారి, ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఆయన చేసిన కృషి ప్రశంసనీయం. హీరోగా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన తరువాత విలన్ అయ్యారు, కామెడీ విలన్‌గా నటించారు, మళ్లీ హీరోగా మారిన ఆయన ప్రస్తుతం హీరోగానే కొనసాగుతున్నారు. నటుడుగా 500 చిత్రాల్లో నటించి, నిర్మాతగా 56 సినిమాలు నిర్మించిన మోహన్‌బాబు గురించి, ఆయన విలక్షణ వ్యక్తిత్వం గురించి ఎంతయినా చెప్పవచ్చు. అయితే ఈ రోజున ఆయన గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన అంశం ఒకటుంది.
అదేమిటంటే.. 'స్వర్గం-నరకం' చిత్రంతో నటుడిగా ఆయనకు సినీ జన్మ ప్రసాదించిన డాక్టర్ దాసరి నారాయణరావు 'కేటుగాడు' సినిమాతో సోలో హీరోని చేశారు. ఆ సినిమా తరువాత ఇక హీరోగానే కొనసాగాలనే సంకల్పంతో ఆరు నెలల పాటు ఏ ఆఫర్లు అంగీకరించకుండా సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ను నెలకొల్పి, తొలి సారిగా 'ప్రతిజ్ఙ' చిత్రం నిర్మించారు మోహన్‌బాబు. ఆ సినిమా విడుదలై నేటికి సరిగ్గా 30 ఏళ్లు.
ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలు.... ఆర్టిస్టు అయిన ఏడేళ్లకే సొంతంగా చిత్ర నిర్మాణసంస్థను నెలకొల్పడం నిజంగా ఆ రోజుల్లో ఒక సాహసమే. అందుకే ఈ విషయమై తన గురువు దాసరిని కలిసి ఆయన సలహా అడిగారు మోహన్‌బాబు. 'ఆరి ్టస్ట్‌గా బిజీగా ఉన్నావు.. పేరు తెచ్చుకుంటున్నావు.. ఇలాంటి సమయంలో నీకు చిత్రనిర్మాణం అవసరమా?' అని ఆయన అన్నారు. అయితే పక్కనే ఉన్న దాసరి పద్మ మాత్రం దానికి అంగీకరించలేదు. 'నీకెందుకు నేనున్నాను.. ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి.. ఆల్ ది బెస్ట్' అని ఆవిడ ప్రోత్సహించడంతో ముందడుగు వేశారు మోహన్‌బాబు. ఆ రోజుల్లో ఎం.డి. సుందరం ప్రముఖ కథార చయిత. కన్నడంలో, తమిళంలో చాలా చిత్రాలకు కథలు అందించారు. తెలుగులో కూడా కొన్ని చిత్రాలకు కథారచయితగా పనిచేశారు. ఆయన చెప్పిన ఓ కథ మోహన్‌బాబుకి బాగా నచ్చడంతో దాన్ని సినిమాగా తీయడానికి నిర్ణయించుకున్నారు. అప్పటికి దర్శకుడు ఎవరనేది ఇంకా ఫైనలైజ్ అవలేదు.
ఆ తరుణంలో ఆర్టిస్ట్ ప్రభాకరరెడ్డి దర్శకుడు బోయిన సుబ్బారావు పేరు సజెస్ట్ చేసి, ' నీ టెంపర్‌మెంట్‌కి తగిన దర్శకుడతను' అని చెప్పడంతో తన సినిమా దర్శకత్వ బాధ్యతలు ఆయనకి అప్పగించారు మోహన్‌బాబు. హీరోయిన్‌గా కవితను, మిగిలిన పాత్రలకు సత్యనారాయణ, గిరిబాబు, త్యాగరాజు, సాక్షి రంగారావు తదితరుల్ని ఎంపిక చేసి షూటింగ్‌కు ప్రొసీడ్ అయ్యారు. టెక్నీషియన్ల విషయంలో కూడా రాజీ పడకుండా ఆ నాడు అగ్ర స్థానంలో ఉన్న సంగీత దర్శకుడు సత్యంను, ఛాయాగ్రాహకుడు పుష్పాల గోపీకృష్ణని, ఎడిటర్ కె.ఎ.మార్తాండ్‌ని ఎన్నుకొన్నారు.
ఎన్టీఆర్ ఆశీస్సులు చెన్నయ్ వాహినీ స్టూడియోలో ఉదయం ఏడు గంటలకు జరిగిన పాటల రికార్డింగ్‌కు ఎన్టీఆర్ హాజరై ఆశీస్సులు అందచేశారు. ఆ రోజు చెన్నయ్‌కి దూరంగా ఓ లొకేషన్‌లో 'బొబ్బిలిపులి' షూటింగ్ ఉంది. అందుకే మేకప్‌తో అక్కడి వెళుతూ మార్గ మధ్యంలో మోహన్‌బాబు రికార్డింగ్‌కు ఎన్టీఆర్ హాజరై కొబ్బరి కాయ కొట్టారు. 'ఈ సినిమా హిట్ అవుతుంది.. నువ్వు పెద్ద హీరోవవుతావు' అని ఆశీర్వదించారు. దాసరి పద్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక 'ప్రతిజ్ఞ' చిత్రం షూటింగ్ తిరుపతికి సమీపంలో ఉన్న కొటాల గ్రామంలో ప్రారంభమైంది. అప్పట్లో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కెమెరా స్విచాన్ చేయగా, దాసరి పద్మ క్లాప్ ఇచ్చారు. 27 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. సినిమా తొలి కాపీ వచ్చిన తరువాత హీరో కృష్ణ తల్లితండ్రులకు సినిమా చూపించి అభిప్రాయం అడిగారు మోహన్‌బాబు. సినిమా బాగుందని వాళ్లు మంచి రిపోర్ట్ ఇచ్చారు. మంచి టాక్ స్ప్రెడ్ కావడంతో వైజాగ్ ప్రాంతానికి చెందిన ధనరెడ్డి అనే ఆయన సినిమా కొని రాష్ట్రమంతా విడుదల చేశారు. ఘన విజయం సాధించిన ఈ చిత్రం ఐదు కేంద్రాల్లో వంద రోజులు పూర్తి చేసుకుంది. చెన్నయ్ మ్యూజిక్ అకాడెమీ హాలులో జరిగిన శతదినోత్సవానికి అక్కినేని నాగేశ్వరరావు, శివాజీ గణేశన్, దాసరి నారాయణరావు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
అలా 30 ఏళ్ల క్రితం నిర్మాతగా కూడా తన ప్రస్థానం ప్రారంభించిన మోహన్‌బాబు ఇంతవరకూ 56 చిత్రాలు నిర్మించి శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ సంస్థ ను ఉన్నత స్థానంలో నిలబెట్టారు. ఈ సంస్థ నిర్మిస్తున్న మూడు చిత్రాలు ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్నాయి.
Thursday, October 20, 2011
ప్రత్యేక వ్యాసం: హాస్యానికి 'రాజ'బాబు
కామెడీ ఆర్టిస్టుల్లో రాజబాబు స్థానం ప్రత్యేకమైంది. పాత తరం హాస్యనటుల్లో కస్తూరి శివరావు, రేలంగి వెంకట్రామయ్య తరువాత అంత వైభవాన్ని కళ్ల చూసింది ఆయనే. రాజబాబు తీసుకున్నంత పారితోషికం మరే ఇతర హాస్యనటుడు తీసుకోలేదేమో! ఆ రోజుల్లో కొంతమంది హీరోల పారితోషికానికి సమానంగా ఆ మొత్తం ఉండేది. ఒకచోట కుదరుగా ఉండకుండా వంకర్లు తిరిగిపోతూ వెరయిటీ మాడ్యులేషన్‌తో రాజబాబు డైలాగులు చెబుతుంటే ప్రేక్షకులు నవ్వు ఆపుకోలేక పోయేవారు. అగ్ర హీరోలు సైతం రాజబాబు వచ్చే వరకూ షూటింగ్ స్పాట్‌లో ఎదురుచూసిన సందర్భాలు ఉన్నాయి. 'నేను కోట్ల రూపాయలు సంపాదించాను' అని సగర్వంగా ప్రకటించుకున్న ఏకైక హాస్యనటుడు కూడా బహుశా రాజబాబు ఒక్కరేనేమో! హాస్య నటులు చరిత్ర రాస్తే అందులో మొదటి పేజీల్లోనే ఉండే పేరు ఆయనదని చెప్పవచ్చు. అయితే హాస్యనటుడిగా రాజబాబు ప్రస్థానం అంత తేలికగా మొదలవలేదు. పావలాతో మద్రాసుకు చేరుకున్న ఈ పుణ్యమూర్తుల అప్పలరాజు చాలాకాలం అన్నం లేక, సరైన బట్ట లేక కార్పొరేషన్ నీళ్లతో కడుపు నింపుకుంటూ ఎవరైనా పుణ్యమూర్తులు ఏరోజనై కడుపునిండా అన్నం పెడితే దాంతో రెండు మూడు రోజులు బతికేవారు. 'అలా అప్పుడప్పుడు అన్నం పెట్టిన మహానుభావుడు ఆనాటి హీరోయిన్ రాజసులోచన ఇంటి తోటమాలి. అవకాశాలు దొరక్క ట్యూషన్లు కూడా చెప్పేవాణ్ణి. నేను ట్యూషన్ చెప్పే ఇంట్లో ఏదో మూల కుక్కపిల్లలా పడుకుని ఉంటే ఎవరో లేపి కాఫీయో, రెండు ఇడ్లీలో ఇచ్చేవారు' అని ఆ రోజుల్లో రాజబాబు చెప్పిన మాటలు ఇప్పుడు మళ్లీ విన్నా 'అయ్యో పాపం' అనిపించకమానదు. చివరికి ఆయన నిరీక్షణ ఫలించి 'సమాజం' చిత్రంతో పరిశ్రమకు పరిచయమయ్యారు. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజబాబు తన నటజీవితాన్ని కామెడీతో ప్రారంభించినా విలనీతో పాటు విభిన్న పాత్రలను పోషించి మెప్పించారు. హీరోగా కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. డా.దాసరి నారాయణరావు తొలి సినిమా 'తాత-మనవడు' చిత్రంలో ఆయనే హీరో. ముందు ఆ వేషం వేయడానికి వెనుకంజ వేసినా దాసరి ప్రోత్సాహంతో ఆ పాత్ర పోషించారు రాజబాబు. ఆ సినిమాకి ఆయనకి ఎంతో పేరు తెచ్చింది. ఆ తరువాత దాసరి దర్శకత్వంలో రూపొందిన 'తిరుపతి'లో కూడా ఆయనే హీరో. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాజబాబు నిర్మించిన తొలి సినిమా 'ఎవరికి వారే యమునా తీరే'కు దర్శకుడు దాసరి కావడం. 'బావా.. బావా' అనుకుంటూ ఎంతో ఆప్యాయంగా మెలిగేవారిద్దరు. దాసరి రూపొందించిన చిత్రాల్లో మంచి పాత్రలు చేశారు రాజబాబు.
పుట్టిన రోజున మంచి కార్యక్రమాలు
తన బతుకు పుస్తకంలో పేజీలు తరిగిపోతుండటంతో , ఆఖరి పేజీ దగ్గర పడిపోతోందేమోనన్న భయం ఆవరించి ఆ లోపు కొన్ని మంచి పనులు చేయాలన్న తపనతో రాజబాబు పబ్లిక్ ట్రస్ట్ ఏర్పాటు చేసి తన శక్తి మేరకు ఇతరులకు ఆర్థికంగా సహాయం చేసేవారు. ముఖ్యంగా తన పుట్టిన రోజు ఏ ప్రయోజనం లేకుండా జరగడం అసంతృప్తికరంగా అనిపించి ఆ రోజున సీనియర్స్‌ని సన్మానించేవారు రాజబాబు. నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేసి కొత్త నటీనటులు పరిశ్రమకి పరిచయం కావడానికి దోహదపడ్డారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ రోజుల్లో 'పాతాళభైరవి' చిత్రంలో బాలకృష్ణ (అంజిగాడు) నటన రాజబాబుని ఎంతో ప్రభావితం చేసింది. ఆ సినిమాని ఓ తొంభై సార్లు చూశారాయన. చూసిన ప్రతిసారీ హాస్యనటుడు కావాలనే కోరిక బలపడేది. అందుకే తను హాస్యనటుడిగా స్థిరపడిన తరువాత ఓ పుట్టిన రోజున బాలకృష్ణను సన్మానించి తన కృతజ్ఙతలు వెల్లడించారు రాజబాబు.
నిర్మాతగా..
భవిష్యత్‌లో ఎప్పుడైనా కథ రాసుకుని స్వీయ దర్శకత్వంలో సినిమా తీయాలనే కోరిక రాజబాబుకి ఉండేది. ఆ ప్రయత్నంలో భాగంగా బాబ్ ఆండ్ బాబ్ క్రియేషన్స్ బేనరుపై 'మనిషి రోడ్డున పడ్డాడు' చిత్రాన్ని నిర్మించారు రాజబాబు. దీనికి కథకుడు ఆయనే. ఈ సినిమాలో ట్రాజెడీ వేషం వేశారు. ఎప్పుడు తమని నవ్వించే రాజబాబు తెరపై ఏడుస్తూ కనిపించే సరికి ప్రేక్షకులు కూడా కంటతడి పెట్టారు. తనని చూసిన జనం మనసారా నవ్వుకోవాలి కానీ అలా ఏడవకూడదనుకున్న రాజబాబు ఇకపై ట్రాజెడీ వేషాలు వేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగానే ఆయన తీయాలనుకున్న 'సరస్వతి లక్ష్మి బ్రహ్మ', 'సంఘం చేసి బొమ్మలు' చిత్రాలు తీయలేకపోయారు.
మాటల్లో వేదాంతం, వైరాగ్యం
ప్రేక్షకులకు నవ్వులు పంచే రాజబాబు జీవితం వెనుక బలమైన విషాదం ఏదైనా దాగి ఉందా అనిపించేది ఒక్కోసారి. ఆయన తాగినా మత్తులో ఉన్నా, లేకపోయినా వేదాంత వైరాగ్యాల గురించి సుదీర్ఘంగా మాట్లాడేవారు. అలాగే ఇంటర్య్వూల సారాంశం వేదాంతపరంగానే ఉండేది. తెరపై అంతగా నవ్వించే రాజబాబు ఎంతో భావగర్భితంగా, వేదాంత ధోరణిలో మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచేది.
కెరీర్‌ని దెబ్బతీసిన అలవాటు
అలవాట్లు ఎప్పుడు ఎలా ప్రారంభమవుతాయో చెప్పలేం కానీ అంత బిజీగా ఉన్న రాజబాబు కెరీర్ కుదేలవడానికి ప్రధాన కారణం మద్యపానమే కారణమని చెబుతారు.విపరీతంగా తాగి షూటింగ్‌లకు గైరు హాజరయ్యేవారని అంటారు. రాజబాబుని పెట్టుకుంటే సినిమాకి హెల్ప్ అవుతుందనుకునే రోజులు పోయి ఆయనతో సినిమా చేయడం రిస్క్ అని భావించే పరిస్థితి ఏర్పడటానికి కారణం ఇదేనంటారు. అయితే తను తాగి షూటింగ్‌కి వచ్చేవాణ్ణనే అంటే రాజబాబు ఒప్పుకునేవారు కాదు. ' నేను తాగుతాను. పని లేని రోజున మాత్రమే తాగుతాను. మేకప్ వేసుకున్న తరువాత తాగను. కానీ పరిశ్రమ నన్ను దూరం చేసింది. విషప్రచారం చేసి పక్కన పెట్టింది. నిర్జీవమైన వస్తువులతో ఆడుకోండి. కానీ మనుషుల జీవితాలతో మాత్రం ఆడుకోవద్దు' అనేవారాయన ఆ రోజుల్లో. 'నేను ఏ నిర్మాతకి, దర్శకుడికి అన్యాయం చేయలేదు. అప్పలరాజుని రాజబాబుగా మార్చి మంచి పొజిషన్‌లో నిలబెట్టి చివరికి ముంచెయ్యడం పరిశ్రమకి భావ్యమా ' అని ఆయన ఆవేదనతో ప్రశ్నించినా దానికి చివరి రోజుల్లో స్పందన కరువైంది.
ఆయనకే దక్కిన గౌరవం
తన పుట్టిన ఊరికి, కన్నవారికి ఎంతో ప్రతిష్టలు తెచ్చిన రాజబాబు శిలావిగ్రహాన్ని ఈ ఏడాది ఏప్రిల్ నెల్లో రాజమండ్రిలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా 70 మంది హాస్యనటీనటుల కలయికలో 'హాస్యకుంభమేళ' పేరుతో ఓ నవ్వుల కార్యక్రమాన్ని నిర్వహించింది తెలుగు చిత్రపరిశ్రమ. ఇదే రాజబాబుకి మాత్రమే దక్కిన గౌరవం.
(అక్టోబర్ 20 రాజబాబు జయంతి)

Monday, October 10, 2011
స్పెషల్ స్టోరీ: రాజమౌళి విజయ దరహాసం!
దర్శకత్వం వహించిన ఎనిమిది సినిమాల్లో ఏడు విజయాలు సాధించిన దర్శకుడిగా యస్.యస్. రాజమౌళి తెలుగు చలనచిత్ర చరిత్రలో తనకంటూ ఓ శాశ్వత పేజీని సంపాదించుకున్నారు. ఇదివరలో దాసరి నారాయణరావు తొలి సినిమా 'తాత మనవడు' నుంచి పదకొండో సినిమా 'మనుషులంతా ఒక్కటే' వరకు వరుసగా పదకొండు విజయవంతమైన చిత్రాలకు (ఈ మధ్యలో వచ్చిన 'రాధమ్మ పెళ్లి' బాక్సాఫీసు ఫలితం విషయంలో భిన్నాభిప్రాయాలున్నా) దర్శకత్వం వహించడం ఒక చరిత్ర అయితే, ఉండకూడనన్ని ప్రతికూల పరిస్థితులున్న నేటి కాలంలో ఎనిమిదింటిలో ఒకటి మినహా ఏడు హిట్లను అందించిన రాజమౌళిది ఇంకో చరిత్ర.
'స్టూడెంట్ నెం.1' (2002) నుంచి మొదలైన ఆయన విజయ విహారం మూడో సినిమా 'సై' మినహా 'మర్యాదరామన్న' (2010) దాకా అప్రతిహతంగా కొనసాగుతూ వచ్చింది. 'సై' సైతం ప్రేక్షకుల్ని అలరించినా, పెట్టుబడి ఎక్కువ కావడంతో లాభాలు సాధించలేకపోయింది. ప్రస్తుతం 'ఈగ' పేరుతో ఆయన తన తొమ్మిదో చిత్రాన్ని తెరకెక్కించే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్టీఆర్‌ని 'స్టూడెంట్ నెం.1'తో మాస్‌కి చేరువ చేసిన ఆయన 'సింహాద్రి'తో టాప్ స్టార్‌ని చేశారు. ఆ సినిమా ప్రభావం ప్రేక్షకుల మీద ఎంతగా పడిందంటే, తర్వాత వచ్చిన ఎన్టీఆర్ సినిమాల్ని వారు 'సింహాద్రి'తో పోల్చుకుంటూ అసంతృప్తి చెందుతూ వచ్చారు. అలాంటి నేపథ్యంలో మరోసారి 'యమదొంగ'తో ఎన్టీఆర్‌కి విజయానందాన్ని చేకూర్చారు రాజమౌళి. అలా రాజమౌళి-ఎన్టీఆర్ కాంబినేషన్‌కు తిరుగనేదే లేకుండా పోయింది. ఒక్క ఎన్టీఆర్‌తోనే కాకుండా మిగతా హీరోలకూ వాళ్ల కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రాల్ని అందించారు రాజమౌళి. ప్రభాస్‌కు 'ఛత్రపతి', రవితేజకు 'విక్రమార్కుడు', రాంచరణ్‌కు 'మగధీర', సునీల్‌కు 'మర్యాదరామన్న' వంటి హిట్లనిచ్చారు. వీటిలో 'మగధీర' చిత్రం మునుపటి తెలుగు చలనచిత్ర వసూళ్ల రికార్డుల్ని తిరగరాసిన సంగతి ప్రస్తావనార్హం. మిగతా హీరోలతో ఆయన తీసిన చిత్రాలన్నీ అప్పటివరకు వాళ్ల కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లని సాధించిన చిత్రాలు కావడం విశేషం.
ఇప్పుడు ఆయన తీస్తున్న 'ఈగ' పట్ల కూడా చిత్రసీమ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఎక్కువగా గ్రాఫిక్స్ మీద ఆధారపడ్డ ఈ చిత్రం టైటిల్‌కు తగ్గట్లే ఓ 'ఈగ' ప్రధాన పాత్రధారిగా రూపొందుతోంది. విలన్ చేతిలో చనిపోయిన హీరో మరుజన్మలో ఈగగా పుట్టి ఆ విలన్ మీద ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేది ఇందులోని ప్రధానాంశం. హీరోగా నాని, విలన్‌గా కన్నడ నటుడు సుదీప్ నటిస్తున్న ఈ చిత్రంలో సమంత నాయిక. ఇటీవలే (సెప్టెంబర్ 27తో) పదేళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్న అగ్ర దర్శకుడు రాజమౌళి మునుముందు తెలుగు సినిమా స్థాయి పెరగడంలో ప్రధాన పాత్ర పోషిస్తారని ఆశించవచ్చు.
(అక్టోబర్ 10 రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా)

Wednesday, September 28, 2011
ఇంటర్వ్యూ: పబ్లిసిటీ ఆర్టిస్ట్ ఈశ్వర్
పబ్లిసిటీ ఆర్టిస్టుగా మరచిపోలేని సంఘటనలెన్నో
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 'సినిమా పోస్టర్'కి ఉండే ప్రాధాన్యత ఏమిటో అందరికీ తెలిసిందే. ఆ రంగంలో ఆయనే అత్యంత సీనియర్ పబ్లిసిటీ ఆర్టిస్టు. ఇవాళ చేతితో పనిలేకుండా కంప్యూటర్‌తో సునాయాసంగా సినిమాల డిజైన్లు చేస్తున్నారు. కానీ తన కాలంలో కుంచెతో అద్భుతమైన పోస్టర్లకి ప్రాణం పోసి, ఆ సినిమాలపట్ల ప్రేక్షకుల్లో అనురక్తిని కలిగించిన అపురూప పబ్లిసిటీ చిత్రకారుడు ఈశ్వర్. ఇటు రాసిపరంగా కానీ, అటు వాసిపరంగా కానీ సినీ ఆర్ట్ రంగంలో ఎవరెస్టు శిఖరం, ఎన్నటికీ చెరిగిపోని సంతకం ఈశ్వర్. 45 సంవత్సరాల కాలంలో ఏకంగా 2,500 చిత్రాలకు పనిచేసిన ఆ కళాశిల్పి ఇటీవలే తన జీవితానుభవాలతో పాటు, తాను గీసిన సినీ బొమ్మలతో 'సినిమా పోస్టర్' అనే పెద్ద పుస్తకాన్ని వెలువరించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా సంభాషించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
నా కెరీర్‌లో నేను పనిచేసిన సుమారు రెండు వేల పైచిలుకు సినిమాల ప్రతిఫలంలో నాకు దక్కింది మూడవ వంతు కూడా లేదు. నాకే కాదు. ప్రతి సినీ జీవికి ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది. అందరి విజయం వెనుక ఈ రహస్యం దాగి ఉంటుంది. డబ్బు కంటే అందరి మన్ననలూ పొందడం ముఖ్యం. ఆయా కంపెనీలకు పర్మినెంట్ టెక్నీషియన్‌గా సాగిపోవడం ఇంకా ముఖ్యం. ఆ రకంగా ఇవాళ నేను సాధించిన దానికి ఎంతో ఆనందంగా ఉన్నా.'సినిమా పోస్టర్'కి అదే ప్రేరణ
ఒక రోజున సేతు అనే తమిళ నటుడు ఆమ్‌స్టర్‌డామ్ (నెదర్లాండ్స్)కి చెందిన ఎడో బౌమన్ అనే వ్యక్తిని తీసుకుని నా వద్దకు వచ్చాడు. తాను బాలీవుడ్ సినీ పోస్టర్స్ మీద పరిశోధన చేస్తున్నానని బౌమన్ చెప్పాడు. హిందీ చిత్రసీమలోని అనేకమంది నిర్మాతల్నీ, పోస్టర్ డిజైనర్లనూ కలిశాడు. అనేక హిందీ సినిమాల పోస్టర్లని సేకరించాడు. వాటిలో నేను చేసిన పోస్టర్లు చాలానే ఉన్నాయి. మూడు గంటల పాటు నన్ను ఇంటర్వ్యూ చేశాడు బౌమన్. అతను సేకరించిన వివరాలతో ఆ తర్వాత లండన్‌లోనూ, లాజ్ ఏంజిల్స్‌లోనూ ఉన్న టాస్‌చెన్ పబ్లికేషన్స్ సంస్థ 'ఆర్ట్ ఆఫ్ బాలీవుడ్' అనే పుస్తకం తెచ్చింది. బౌమన్ నన్ను కలవడం నాకు స్ఫూర్తినిచ్చింది. మన పోస్టర్ల మీద విదేశీయులు సైతం పుస్తకాలు తెస్తుంటే మన పోస్టర్ల మీద మనమెందుకు ఓ పుస్తకం రాయకూడదనిపించింది. అలా మూడేళ్ల కష్టంతో 'సినిమా పోస్టర్' తెచ్చా.
మామూలు శ్రమకాదు
దీని కోసం నిజంగా ఎంతో శ్రమించా. పుస్తకాన్ని ఎలా తీసుకు రావాలి? వెనక్కి తిరిగి చూసుకుంటే నా ఆర్ట్ వర్క్ ఏదీ నా వద్ద లేదు. అప్పుడు వాటిని వెతకడం ప్రారంభించా. నా వద్ద పనిచేసిన 52 మంది పబ్లిసిటీ ఆర్టిస్టుల్ని సంప్రదించా. వారిలో నలుగురైదుగురు నేను వేసిన పోస్టర్లనీ, ఆర్ట్ వర్క్‌నీ తీసుకొచ్చి ఇచ్చారు. అయినా 45 ఏళ్ల కాలంలో నా పనిలో నాకు లభ్యమైంది కేవలం 5 శాతం మాత్రమే. నేను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల సినిమాలకే కాక ఒరియా, బెంగాలీ, అస్సామీ చిత్రాలకూ పనిచేశా. అన్నీ కలిపి సుమారు 2500 సినిమాలకు పనిచేశా. కానీ నాకు వాటిలో 1900 సినిమాలే దొరికాయి. నా జీవిత కథతో పాటు ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన ఆర్టిస్టులతో పాటు దక్షిణ, ఉత్తర భారతదేశంలో పేరుపొందిన ఆర్టిస్టుల జీవిత కథలు సేకరించి వారి గురించి రాశా. పద్నాలుగు మంది ప్రఖ్యాత తెలుగు చిత్రకారుల గురించి అధ్యయనం చేసి రాశా. సినీ ఇండస్ట్రీలో నేను అతి సన్నిహితంగా మెలిగిన మహోన్నత వ్యక్తులతో గడిపిన మధుర క్షణాలు గుర్తు చేసుకున్నా.
మరచిపోలేని సంఘటనలు
1970లలో ఓ దీపావళికి ఆరుగురు పేరుపొందిన తమిళ హీరోలు.. ఎంజీఆర్, శివాజీ గణేశన్, జెమిని గణేశన్, జయశంకర్, రవిచంద్రన్, శివకుమార్ సినిమాలు విడుదలయ్యాయి. వాటన్నింటికీ నేనే పబ్లిసిటీ ఆర్టిస్టుని. ఇలా అందరు హీరోల చిత్రాలకు ఒకే పబ్లిసిటీ ఆర్టిస్ట్ డిజైన్ చేయడం అదివరకే కాదు, ఆ తర్వాత కూడా ఎప్పుడూ జరగలేదు. అది నా అదృష్టం. తెలుగు చిత్రసీమ వజ్రోత్సవ వేడుకల్లో సినీ ప్రముఖుల నడుమ అశేష జన సందోహంలో నిష్ణాతులతో పాటు నాకూ గౌరవ పురస్కారాన్ని అందించడం నేనెన్నడూ మరువలేని సంఘటన. ఒకనాడు ఏకాకిగా బిక్కుబిక్కుమంటూ దిక్కుతోచని స్థితిలో పాండీ బజార్‌లో తిరిగిన నన్ను ఇవాళ సినీ జగత్తులో ఏకైక సీనియర్ పబ్లిసిటీ ఆర్టిస్టుగా గుర్తించి వజ్రోత్సవ వేడుకల్లో సెలబ్రిటీగా నన్ను గౌరవించడంతో నా శ్రమ చరితార్థమైందనిపించింది. అంతకుముందు 1974లో డిస్టిబ్యూటర్లందరూ కలిసి బెజవాడలో అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా చేసిన ఘన సన్మానాన్ని కూడా నేను మర్చిపోలేను. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదొరై 9 అడుగుల నిలువెత్తు ఆయిల్ పెయింటింగ్ వేసే అవకాశం రావడం నాకు లభించిన భాగ్యంగా భావిస్తా. దాన్ని వేసే అవకాశం కల్పించింది అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి. అది వేయడానికి నెల రోజుల సమయమిచ్చారు. ఈ మధ్యలో నేనెంతవరకు ఆ బొమ్మ వేశానో చూడ్డానికి కరుణానిధి స్వయంగా రెండుసార్లు మా ఇంటికి రావడం మరచిపోలేని అనుభూతి. ఆ పెయింటింగుని రాజాజీ హాలులో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆవిష్కరించడం నా జీవితంలో మరో గొప్ప ఘటన.
తొలి దర్శకుణ్ణి
'అయినవాళ్లు' సినిమాకి అనుకోకుండా దర్శకత్వం వహించా. భీమలింగం అనే అతన్ని దర్శకత్వం నుంచి తప్పించడంతో దానికి కథ ఇచ్చిన నేనే బలవంతంగా డైరెక్ట్ చేయాల్సి వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటం వల్ల నాకు మరో దారి లేకపోయింది. అంతా కొత్తవాళ్లతో తీసిన ఆ సినిమా ఆడలేదు. ఇప్పుడు దాని ప్రింటు కూడా దొరకడం లేదు. ఏదేమైనా తెలుగులో డైరెక్టర్ అయిన తొలి పబ్లిసిటీ ఆర్టిస్టుని నేనే. ఇతర భాషల్లో చూసుకుంటే నాకంటే ముందు మలయాళంలో పబ్లిసిటీ ఆర్టిస్టు పి.ఎన్. మీనన్ డైరెక్టర్ అయ్యాడు.
అక్కినేని గ్రూప్ అనే ముద్ర
నటుల్లో శోభన్‌బాబు నాతో సన్నిహితంగా మెలిగేవారు. అలాగే కృష్ణ కూడా. వాళ్ల అత్యధిక సినిమాలకి నేనే ఆర్టిస్టుని. రామారావు గారి సొంత సినిమాలకు పనిచేయకపోయినా ఆయన నటించిన 50 సినిమాలకి పనిచేశా. అయితే అక్కినేనిగారితో సినిమాలు తీసిన కంపెనీలన్నీ నాతో పనిచేయించుకోవడంతో నా మీద ఏఎన్నార్ గ్రూప్ అనే ముద్రపడింది. సీనియర్ దర్శకుడు దాసరి నారాయణరావు, నేను ఒకే ఊరినుంచి ఈ రంగానికి వచ్చాం. ఆయనకంటే నేను ఏడేళ్ల ముందు వచ్చా. ఆయన తీసిన 150 సినిమాల్లో 82 సినిమాలకి పబ్లిసిటీ ఆర్టిస్టుని నేనే. నాతో పాటు గంగాధర్ కూడా ఈ రంగంలో ఎంతో పేరు తెచ్చుకున్నాడు. అయితే మేమెప్పుడూ ఒకరికొకరం పోటీ అనుకోలేదు.
అదే పెద్ద అవార్డు
నేనేనాడు అవార్డుల కోసం ప్రాకులాడలేదు. ఈ 50 సంత్సరాల కాలంలో చిత్రసీమ నా పట్ల చూపిన ఆదరాభిమానాలకు మించిన అవార్డు మరొకటి లేదు. సినీ అవార్డు అనేది ఓ కథను సెల్యులాయిడ్ మీదకు తీసుకురావడానికి శ్రమించిన నటీనటులు, సాంకేతిక వర్గానికి సంబంధించినది. పబ్లిసిటీ అనేది దానికి ఎంతవరకు వర్తిస్తుంది? సినిమా పూర్తయి తొలి కాపీ వచ్చాక మా అవసరం ఏర్పడుతుంది. ఇది నిర్మాణానికి అంటీ అంటనట్లుండే శాఖ. అందుకేనేమో దీనికి అవార్డులు ప్రకటించలేదు. అయినా చిత్ర పరిశ్రమలోని 24 శాఖల్లో పబ్లిసిటీని చేర్చడం సంతోషమే.
'సాక్షి' నుంచి 'దేవుళ్లు' దాకా
1967లో బాపు దర్శకత్వం వహించిన తొలి సినిమా 'సాక్షి'తో ప్రారంభమైన నా సినీ ప్రస్థానం 2000వ సంవత్సరంలో కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన 'దేవుళ్లు' సినిమాతో ముగిసింది. ఆ తర్వాత నేనే సినిమాకీ పనిచేయలేదు. నన్ను పరిశ్రమ వద్దనుకోలేదు. నేనే కావాలని దూరంగా ఉన్నా. ఒక ఉప్పెనలా కంప్యూటర్ సిస్టమ్ ఈ రంగంలోకి ప్రవేశించింది. మాన్యువల్స్‌లో ఎన్నో ప్రయోగాలు చేసిన మా తరం ఇప్పుడు ఈ కొత్తతరంలో పోటీకి దిగడం సరికాదనిపించింది. అలా అని నేను పూర్తిగా ఈ రంగానికి దూరం కాలేదు. పాత సినిమాలకి కొత్త పోస్టర్లు వేస్తూ వస్తున్నా. మా తరంలో మమ్మల్ని పబ్లిసిటీ ఆర్టిస్టులన్నారు. ఇప్పుడు పబ్లిసిటీ డిజైనర్స్ అంటున్నారు. నేడు ఈ శాఖకు 'ఆర్ట్'తో సంబంధంలేకుండా పోయింది. చెయ్యి తిరిగిన ఆర్టిస్టయితేనే కాని మా కాలంలో నెట్టుకు రాలేకపోయేవాళ్లం. ఇప్పుడు అన్ని వసతులు కంప్యూటర్‌లో ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేట్ చేసే పరిజ్ఞానం సంపాదిస్తే చాలనే పరిస్థితి ఉన్నప్పుడు నాలాంటి వాడు దూరంగా ఉండటమే మంచిదని నా గౌరవాన్ని నేను దక్కించుకున్నా. సాంకేతిక నైపుణ్యం పెరగడం, కొత్త కొత్త టెక్నాలజీ రావడం మంచిదే. కంప్యూటర్‌తో అద్భుతాలే చేయొచ్చు. హాలీవుడ్ సినిమాలకి చేస్తున్న పబ్లిసిటీ డిజైన్ల ప్రమాణాల్ని మనవాళ్లు అందుకోవాలి.
Monday, September 26, 2011
బిగ్ స్టోరీ: 'నాయిక' రంగుల జీవితం!
చిత్రసీమ అంటే రంగుల ప్రపంచమని అందరికీ తెలుసు. ఇక్కడి తారల జీవితాలు ఎలా ఉంటున్నాయో, తరచూ చూస్తూనే ఉన్నాం. వెండితెరపై సూపర్‌స్టార్లుగా వెలిగిన తారామణుల్లో కొంతమంది జీవితాలు అర్ధంతరంగా ఆగిపోతే, ఎంతోమంది జీవితాలు దయనీయంగా ముగిసిపోయాయి. అలాంటి తారల నిజ జీవితాలు వెండితెరపై ఆవిష్కృతమైతే... వాటికంటే రసభరిత చిత్రాలూ, హృదయాల్ని ద్రవింపజేసే కథలూ మరేముంటాయి! అయితే అలాంటి వాస్తవిక గాథా చిత్రాలు తెలుగులో రావడం అరుదు. ఇతర భాషల్లోనే అలాంటి చిత్రాలు రూపొందుతుండటమనేది వాస్తవిక దృశ్యం. ఇవాళ అలాంటి రెండు సినిమాలు ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్నాయి. వాటిలో ఒకటి ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చలకూ, విమర్శలకూ తావిస్తున్న హిందీ చిత్రం 'ద డర్టీ పిక్చర్' కాగా, మరొకటి మలయాళంలో రూపొందుతున్న 'నాయిక'
శృంగార తారగా ఓ తరాన్ని తన ఒంపుసొంపులు, వొంటి విరుపులతో ఊపేసిన మత్తుకళ్ల సుందరి సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'ద డర్టీ పిక్చర్'. ఇందులో స్మిత పాత్రని విద్యాబాలన్ పోషిస్తుండటం ఓవైపు ఆసక్తినీ, మరోవైపు వివాదాన్నీ రేపుతోంది. ఐటం సాంగ్స్‌లో నర్తించడం ద్వారానే కాక, వ్యాంప్ పాత్రలతోనూ స్మిత ఎంతో పేరు తెచ్చుకుంది. ఈ శృంగార కెరటం కేవలం 36 సంవత్సరాల వయసులో ఆత్మహత్య చేసుకుని, అర్ధంతరంగా తనువు చాలించడం అందర్నీ కలచివేసింది. అలాంటి ఆమె జీవితాన్ని డైరెక్టర్ మిలన్ లూథ్రియా తెరకెక్కిస్తుండగా, తల్లీకూతుళ్లు శోభా కపూర్, ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 2 స్మిత జయంతికి ఈ సినిమాని విడుదల చేసేందుకు వారు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో నసీరుద్దీన్ షా, తుషార్ కపూర్, ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. స్మిత జీవితంలోని ముగ్గురు పురుషుల పాత్రల్ని వాళ్లు చేస్తున్నారు. స్మిత రూపానికీ, విద్యా బాలన్ ఆకారానికీ అసలు పోలికే లేదనీ, స్మితకి ప్రధానాకర్షణ అయిన మత్తు కళ్లు కానీ, వంపుసొంపుల విన్యాసాలు కానీ విద్యాబాలన్‌లో లేవనీ, అలాంటప్పుడు ఆమె ఎలా ఆ పాత్రకి న్యాయం చేస్తుందనే వ్యాఖ్యలు విమర్శకుల నుంచి వస్తున్నాయి. అయితే వీటినేమీ పట్టించుకోకుండా ఏక్తా కపూర్, మిలన్ లూథ్రియా తమ పని తాము చేసుకుపోతున్నారు. అన్ని ప్రశ్నలకీ తమ సినిమానే సమాధానం చెబుతుందనేది వారి అభిప్రాయం. ఈ సినిమా స్క్రిప్టుని రజత్ అరోరా సమకూర్చాడు.
ఇక దక్షిణాదిన ఆసక్తిని కలిగిస్తున్న మరో చిత్రం 'నాయిక'. మలయాళంలో ఈ సినిమాని జయరాజ్ రూపొందిస్తున్నాడు. కేవలం రాష్ట్ర స్థాయి అవార్డుల్నే కాక జాతీయ, అంతర్జాతీయ అవార్డుల్ని కూడా సొంతం చేసుకున్న జయరాజ్ తీస్తున్నందువల్లే 'నాయిక' పట్ల అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. తెలుగు తార అయివుండీ, మలయాళ సినిమాల ద్వారానే మూడుసార్లు జాతీయ ఉత్తమ నటిగా 'ఊర్వశి' అవార్డును పొందిన శారద జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తీస్తున్నారని ప్రచారం జరిగింది. ఇప్పటికీ ఇంటర్నెట్‌లో ఇది శారద జీవితంపై తీస్తున్నట్లుగానే వార్తలు చలామణీ అవుతున్నాయి. ఈ వర్తల్ని శారద స్వయంగా ఖండించారు. అయితే ఈ చిత్రంలో ఆమె స్వయంగా తన నిజ జీవిత పాత్రను చేస్తుండటం విశేషం. ప్రధాన కథలో ఆమె పాత్ర కూడా వస్తుంది. మరైతే ప్రధాన కథ ఎవరిది? ఒకప్పుడు మలయాళ ప్రేక్షకుల్ని ఉర్రూతలూపి, అర్ధంతరంగా సినిమాల నుంచి మాయమైన ఓ తార జీవితం ఈ చిత్రం. ఆ తార ఎవరంటే... షీలా! తెలుగులోనూ ఆమె నటించింది. అదీ అల్లాటప్పా హీరోలతో కాదు. 'నేనే మొనగాణ్ణి'లో ఎన్టీఆర్‌తో, 'విచిత్ర కుటుంబం'లో శోభన్‌బాబుతో నటించింది షీలానే. అందాలరాశి అయిన ఆమె అకస్మాత్తుగా సినిమాల నుంచి విరమించుకుంది. అలాంటి ఆమె పాత్రని తెరమీద ఆవిష్కరిస్తున్న తార పద్మప్రియ. ఆమె కూడా తెలుగులో ఆర్పా పట్నాయక్ సోదరిగా 'శీను వాసంతి లక్ష్మి'లో, చంద్రసిద్ధార్థ్ రూపొందించిన 'అందరి బంధువయ'లో శర్వానంద్ జోడీగానూ నటించింది. 'నాయిక'లో జయరాం హీరోగా నటిస్తుంటే, మమతా మోహన్‌దాస్ ఓ కీలక పాత్రను చేస్తోంది. అర్ధంతరంగా మాయమైన 'నాయిక'ను అన్వేషించే పాత్రలో ఆమె కనిపించబోతోంది.
తెలుగులో ఇదివరకు తారల జీవితాలు ఎలా ఉంటాయో దాసరి నారాయణరావు రూపొందించిన 'శివరంజని', వంశీ డైరెక్ట్ చేసిన 'సితార' సినిమాలు చూపించాయి. అయితే ఇవి నిజ జీవిత కథలు కావు. 'శివరంజని'లో టైటిల్ పాత్ర చేసిన జయసుధ జీవితంలోని కొన్ని ఘట్టాలున్నాయని అంటారు కానీ ఆ సినిమా పూర్తిగా ఆమె కథైతే కాదు. ఇక 'సితార' చిత్రానికి ఆధారం వంశీ స్వయంగా రాసిన 'మహల్లో కోయిల' నవల. ఆ మధ్య వర్థమాన తార ప్రత్యూష అనుమానాస్పద స్థితిలో మరణించిన తర్వాత ఆమె పేరుమీద సత్యారెడ్డి ఓ సినిమా తీశారు కానీ అది ఆమె జీవిత కథ కాదు. ఓ సంఘటనని ఆధారం చేసుకుని రూపొందించిన సినిమానే.
ఏదేమైనా పైకి కనిపించినట్లు సినీ తారల జీవితాలు రంగుల మయం కాదనీ, కలల వెన్నంటే కష్టాలూ, కన్నీళ్లూ, వ్యధలూ ఉంటాయనీ 'ద డర్టీ పిక్చర్', 'నాయిక' చిత్రాలు మనకి చూపించబోతున్నాయి. కాకపోతే వాటిలో హిందీ సినిమా ఎక్కువ కమర్షియల్ కోణంలో తయారవుతుంటే, మలయాళ చిత్రం వాస్తవికతే ప్రధానంగా తయారవుతోంది. ప్రేక్షకులు వాటికి ఎలా స్పందిస్తారో చూడాలి.
Thursday, September 1, 2011
న్యూస్: డైరెక్టర్లకి దాసరి విజ్ఞప్తి
చిత్రసీమలో దర్శకుడిదే ఎప్పుడూ పైచేయిగా ఉండాలని 150 సినిమాలతో ప్రపంచ రికార్డ్ సృష్టించిన దాసరి నారాయణరావు తరచూ చెబుతుంటారు. దీంతో పాటు డైరెక్టర్లకి ఆయనో విజ్ఞప్తి కూడా చేస్తున్నారు.
"సినిమాల సక్సెస్ రేటు తగ్గిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే కొంతమంది వ్యక్తులు థియేటర్లు లీజుకు తీసుకుని రూపాయికి ఇంకో రూపాయి లాభం వేసుకుని రెంటు వసూలు చేస్తూ నిర్మాతల్ని ఇబ్బందులకి గురి చేస్తున్నారు. ఇంతకుముందు పెద్ద హీరోల సినిమా విడుదలైన రెండు వారాల పాటు టిక్కెట్ రేటు పెంచితే దాని వల్ల లాభం జరుగుతుందని అనుకుని ఆ పద్ధతికి మద్దతు పలికారు. తెలియక వారు చేసిన ఈ పని వల్ల థియేటర్ల రెంట్లు పెరిగాయి. రెంటల్ సిస్టం వల్ల ఎన్నో మంచి సినిమాలు నాశనం అవుతున్నాయి. పర్సంటేజ్ విధానం అమలు చేసే విషయంలో ప్రతిసారీ మోసం జరుగుతోంది. ఇప్పుడు తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. మొదటి నుంచి నా నినాదం ఒక్కటే. దర్శకుడిదే ఎప్పుడూ పైచేయిగా ఉండాలి. దానిని ఆచరణలో పెట్టి చూపిస్తున్న ఈనాటి దర్శకుల్ని చూసి నేను గర్వపడుతున్నా. పెద్ద హీరోలు సైతం దర్శకుడి మీద ఆధారపడేలా చేసిన ఇప్పటి టాప్ డైరెక్టర్లను అభినందిస్తున్నా. అయితే ఒక విషయం. ఎక్కువ రోజులు షూటింగ్ చేస్తేనే సినిమా బాగా వస్తుందనే అభిప్రాయాన్ని మార్చుకోండి. ఆ రోజుల్లో మేం 40 రోజుల్లో తీసిన సినిమాని మీరు 80 రోజుల్లో తియ్యండి. అంతేకానీ 250 రోజులు తీసి నిర్మాతని ఇబ్బంది పెట్టకండి. నిర్మాణ వ్యయం తగ్గించడం దర్శకుల చేతుల్లో ఉన్న పని. విమర్శిస్తున్నానని అనుకోకుండా ఆత్మావలోకనం చేసుకుని సినిమాల సక్సెస్ రేటు పెంచమని చెబుతున్నా" అని ఆయన చెప్పారు.
Friday, August 5, 2011
న్యూస్: మంచి సినిమాలకే నందులు!
గతంలో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకే ఎక్కువ అవార్డుల్ని కట్టబెడుతూ వచ్చిన నంది అవార్డుల జ్యూరీ గత యేడాది నుంచీ అర్థవంతమైన, మంచి చిత్రాలకు అవార్డులనిస్తూ 'నంది'కి గౌరవాన్ని కల్పిస్తోంది. 2010 సంవత్సరానికి దర్శకుడు ఎన్. శంకర్ ఆధ్వర్యంలోని జ్యూరీ ప్రకటించిన అవార్డులు ఈ సంగతిని స్పష్టం చేశాయి. ఈసారి ఉత్తమ అవార్డులు మూడూ విమర్శకుల ప్రశంసల్ని పొందిన సినిమాలకే రావడం గమనార్హం. అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క ప్రధాన పాత్రలు పోషించగా క్రిష్ డైరెక్ట్ చేసిన 'వేదం' ఉత్తమ చిత్రంగా బంగారు నందిని గెలుగుకోగా, 2009 సంవత్సరంలో ఉత్తమ చిత్రంగా బంగారు నందిని పొందిన 'సొంత ఊరు' దర్శకుడు పి. సునీల్‌కుమార్‌రెడ్డి మత్స్యకారుల దయనీయ జీవితాన్ని ఆవిష్కరించిన 'గంగపుత్రులు' ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. సునీల్‌కుమార్‌రెడ్డికే ఉత్తమ దర్శకుడి అవార్డు దక్కడం గమనార్హం. ఇక తృతీయ ఉత్తమ చిత్రంగా సాయికుమార్, శర్వానంద్, సందీప్ నటించగా దేవా కట్టా డైరెక్ట్ చేసిన 'ప్రస్థానం' నిలిచింది. ప్రజాదరణ పొందిన చిత్రంగా నిజంగా ప్రేక్షకుల ఆదరణ పొందిన రాజమౌళి చిత్రం 'మర్యాద రామన్న'ని జ్యూరీ ఎంపిక చేసింది. గతంలో ఈ కేటగిరీలో చాలా చోట్ల అసలు రిలీజే కాని 'పెళ్లాం పిచ్చోడు' అనే రాజేంద్రప్రసాద్ సినిమాని ఎంపిక చేసిన సంగతి జ్ఞాపకం చేసుకుంటే జ్యూరీ ఈసారి ఎంత వాస్తవికంగా పనిచేసిందో అర్థమవుతుంది. అలాగే సకుటుంబంగా చూడదగ్గ ఉత్తమ చిత్రం అవార్డుని చంద్రసిద్ధార్ట్ డైరెక్ట్ చేసిన 'అందరి బంధువయ'కు ప్రకటించారు. సమాజంలో నైతికత, మానవత్వం ముఖ్యమని చెప్పిన ఈ సినిమాని విమర్శకులు ఎంతగానో అభిమానించారు. ఇక జాతీయ సమగ్రతా చిత్రంగా బాలకృష్ణ హీరోగా దాసరి నారాయణరావు రూపొందించిన 'పరమవీరచక్ర'కు ఇచ్చారు.
వ్యక్తిగత అవార్డుల విషయానికొస్తే ఉత్తమ నటుడి అవార్డు బాలకృష్ణకు దక్కింది. 2001 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 'నరసింహనాయుడు' పాత్ర పోషణకు గాను ఉత్తమ నటుడి అవార్డును అందుకున్న ఆయన మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఆ అవార్డును పొందడం విశేషమే. 'పరమవీరచక్ర'కు కాకుండా, చాలా కాలం తర్వాత ప్రేక్షకాభిమానాన్ని పొందిన 'సింహా'లో చేసిన రెండు పాత్రలకు గాను ఈ అవార్డు ఆయనకు లభించడం గమనార్హం. 2011 సంక్రాంతికి విడుదలైనా, 2010లోనే సెన్సార్ సర్టిఫికెట్ పొందిన 'అలా మొదలైంది'లో అద్భుతంగా అభినయించిన నిత్యమీనన్ ఉత్తమ నటిగా ఎంపికవగా, ఆ చిత్రాన్ని జన రంజకంగా మలిచిన నందినీరెడ్డి ఉత్తమ తొలిచిత్ర దర్శకురాలిగా నిలిచింది. 'సింహా"కి చక్కని సంగీతాన్నిచ్చిన చక్రి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. తొలి చిత్రమే అయినా 'మర్యాద రామన్న'లో విశేషంగా రాణించిన నాగినీడు ఉత్తమ విలన్‌గా అవార్డును అందుకోనున్నారు. ఇలా అనేక అవార్డులు పారదర్శకంగా ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.

Saturday, July 30, 2011
న్యూస్: ఇండస్ట్రీలో సౌందర్యలు ఎంతమంది?
టాలీవుడ్‌లో సావిత్రులు, సౌందర్యలు ఎంతమందున్నారో లెక్క తేలడం లేదు. అవును మరి. ప్రతి హీరోయిన్నీ ఎవరో ఒకరు సౌందర్యతోటో, సావిత్రితోటో, లేదంటే జయసుధతోటో పోల్చడం పరిపాటైపోయింది. ఇటీవల 'తెలుగమ్మాయి' ఆడియో ఫంక్షన్‌లో ఆ సినిమా హీరోయిన్ సలోనిని సొందర్య అంతటి నటంటూ ఆకాశానికెత్తేశాడు సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ. ఆయన పోలికని అదే ఫంక్షన్‌లో పాల్గొన్న ఆయన గురువు దాసరి నారాయణరావు సున్నితంగా తోసిపుచ్చడం గమనార్హం. "రామకృష్ణా అప్పుడే ఎందుకు తొందర. సౌందర్యకి ఎవరూ పోలిక కారు" అని ఆయన సున్నితంగా శిష్యుణ్ణి మందలించారు. కోడి రామకృష్ణ ఏ సినిమా ఫంక్షన్‌లో పాల్గొన్నా ఆ సినిమాకి సంబంధించిన వాళ్లని ఊహాతీతంగా పొగడ్తల వర్షంలో ముంచెత్తడం అలవాటే. ఆయన సంగతి అలా పక్కన పెడదాం.
సొందర్య ప్రమాదవశాత్తూ మృతి చెందాక మొదట స్నేహని ఆమెతో పోల్చడంతో ఈ పోలికల గొడవ ఎక్కువవుతూ వచ్చింది. 'అన్నమయ్య', 'రాధా గోపాలం' సినిమాలు చేసిన ఆమెని సౌందర్య అంతటి నటిగా కొంతమంది ప్రశంసల్లో ముంచెత్తారు. కానీ ఆమె ఆ సినిమాల తర్వాత సరిగా రాణించలేక పోయింది. తెలుగులో ఆమె కెరీర్ ఎదగలేదు. ఆమధ్య 'కలవరమాయే మదిలో' సినిమా చేసిన స్వాతిని ఆ చిత్ర నిర్మాత మోహన్ వడ్లపట్ల "సావిత్రి తర్వాత అంతటి నటి స్వాతే" అని తీర్మానించేశారు. అంటే వాణిశ్రీ, జయసుధ, సుహాసిని, విజయశంతి, సౌందర్య కూడా స్వాతి ముందు దిగదుడుపే అని ఆయన పరోక్షంగా చెప్పాడన్న మాట. ఆ సినిమానే కాదు, ఆ తర్వాత కూడా స్వాతి చెప్పుకోదగ్గ రీతిలో తెలుగులో రాణించలేదు. భూమిక, ఛార్మి, అనుష్క వంటి వాళ్లని కూడా సౌందర్యతో మనవాళ్లు పోల్చిన సందర్భాలున్నాయి. కొద్ది రోజుల క్రితం 'అలా మొదలైంది' నాయిక నిత్యమీనన్‌ని కూడా కొంతమంది సౌందర్యతోటీ, జయసుధతోటీ పోల్చారు. నో డౌట్. ఆ సినిమాలో నిత్య నటించలేదు, బిహేవ్ చేసింది. అయినా ఆమెని సౌందర్యతో పోల్చలేం. ఇలా చాలామంది సౌందర్యలను మనవాళ్లు తమ మాటల ద్వారా సృష్టించారు. కానీ ప్రేక్షకుల హృదయాల్లో ఇప్పటికీ మరో సౌందర్య రాలేదన్నది నిఖార్సయిన నిజం. సినిమావాళ్లు ఊరికే సౌందర్యతో ఇతర తారల్ని పోల్చడం మానితే బెటర్.

Wednesday, July 27, 2011
న్యూస్: తండ్రి లాగే రామునిగా బాలయ్య అలరిస్తాడా?
వరుసగా ఏడు ఫ్లాపుల తర్వాత వచ్చిన సూపర్ హిట్ మూవీ 'సింహా'తో జూలు విదిల్చాడు నందమూరి బాలకృష్ణ. తన పని అయిపోయిందని జరుగుతున్న ప్రచారానికి ఆ సినిమాతో జవాబిచ్చాడు. అయితే ఆ వెంటనే వెటరన్ డైరెక్టర్ దాసరి నారాయణరావు 150వ సినిమా 'పరమవీరచక్ర' చేసి పొరబాటు చేశాడు. ప్రేక్షకులు ఆ సినిమాని నిర్ద్వంద్వంగా తిరస్కరించినా ఇప్పటికీ అది తన దృష్టిలో గొప్ప సినిమానే అని గొప్పలు చెబుతూనే ఉన్నారు దాసరి. దాని సంగతి పక్కన పెడితే ఇప్పుడు బాలకృష్ణ మూడు సినిమాలు చేస్తున్నాడు. వాటిలో బాపు దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న పౌరాణిక చిత్రం 'శ్రీరామరాజ్యం' ప్రధానమైంది. ఎన్టీఆర్ ఒకప్పటి చిత్రరాజం 'లవకుశ' ఆధారంగా కొద్దిపాటి మార్పులు చేర్పులతో ఈ సినిమా తీస్తున్నారు. దివంగత ముళ్లపూడి వెంకటరమణ సంభాషణలు రాసిన ఈ చిత్రంలో రామునిగా బాలకృష్ణ నటిస్తుంటే, ఆయన సరసన సీతగా అందాల తార నయనతార నటించడం విశేషం. సూపర్‌హిట్ మూవీ 'సింహా' తర్వాత వారు కలిసి పనిచేసిన సినిమా కావడంతో ఈ జోడీ తప్పకుండా మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు. తన చివరి కాల్షీట్ రోజు నయనతార ఈ సినిమా సెట్స్ మీద భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడం చర్చనీయాంశమైంది. ఇందులో వాల్మీకిగా అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మణునిగా శ్రీకాంత్, భరతునిగా సాయికుమార్ నటిస్తుండటంతో సినిమాకి స్టార్ వాల్యూ కూడా ఏర్పడింది. ఇది కాక పరుచూరి మురళి డైరెక్షన్‌లో తయారవుతున్న సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్నాడు బాలకృష్ణ. ఇటీవలే సీనియర్ డైరెక్టర్ బి. గోపాల్ నిర్దేశకత్వంలో 'హర హర మహదేవ' సినిమా మొదలైంది. ఈ సినిమాలతో, ముఖ్యంగా 'శ్రీరామరాజ్యం'తో బాలయ్య తెలుగు ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేస్తాడని ఆయన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలు నెరవేరుతాయా?
Monday, June 27, 2011
Wednesday, June 1, 2011
Friday, December 10, 2010
ఫోకస్: 1947 తర్వాత తెలుగు సినిమా-2
అంతదాకా జానపద, పౌరాణిక, కుటుంబ కథాచిత్రాలే రాజ్యం చేస్తూ వుంటే 'గూఢచారి 116'తో యాక్షన్ సినిమాల ఒరవడి మొదలైంది. కృష్ణ నటించిన ఈ సినిమా భారతదేశ చలనచిత్ర చరిత్రలోనే తొలి జేంస్‌బాండ్ తరహా చిత్రం. ఈ చిత్రకథ ఆరుద్ర కలం నుంచి రూపుదిద్దుకోవడం మరో విశేషం. ఆ తర్వాత ప్రేమ కథాచిత్రాలు, యాక్షన్ సినిమాలు సమానంగా ఆదరణ పొందుతూ వచ్చాయి. 70వ దశకంలో వీటి జోరు ఎక్కువగా కొనసాగుతుండగానే పాశ్చాత్య సినిమాల ప్రభావం తెలుగు సీమకి కూడా సోకింది. దాంతో పగ, ప్రతీకారం అంశాలతో సినిమాలు నిర్మించడం మొదలై, అవే సినిమాకి తప్పనిసరి వస్తువులకింద మారిపోయాయి. అయినప్పటికీ 'కాలం మారింది' వంటి అభ్యుదయ చిత్రాలు కొన్ని వచ్చాయి. దేశంలోనే మొట్టమొదటి కౌబాయ్ సినిమా 'మోసగాళ్లకి మోసగాడు' వచ్చింది. యాదృచ్ఛికంగా ఈ సినిమాకి రచన చేసింది కూడా ఆరుద్ర, హీరోగా నటించింది కృష్ణ. 1974లో సొంత నిర్మాణ సంస్థ పద్మాలయా స్టూడియోస్‌పై కృష్ణ 'అల్లూరి సీతారామరాజు' సినిమా నిర్మించి ఆ పాత్రలో తానే నటించాడు. తెలుగులో ఇది తొలి సినిమా స్కోప్ సినిమాగా చరిత్రకెక్కింది. స్వాతంత్ర్య పోరాట నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా చెప్పుకోదగ్గ ఘన విజయాన్నే సాధించింది. ఈ దశకంలోనూ కొన్ని పౌరాణిక సినిమాలు వచ్చాయి. ఎన్‌టీ రామారావు స్వయంగా దర్శకత్వం వహించి త్రిపాత్రల్లో (కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు) నటించిన 'దానవీరశూర కర్ణ' కలెక్షన్ల వర్షం కురిపించింది. భారతంలో దుష్టపాత్రగా చిత్రీకరణకు గురైన దుర్యోధనుణ్ణి కొత్త కోణంలో ఆవిష్కరించి ఆ పాత్రకి హీరో ఇమేజ్ తీసుకొచ్చిన ఘనత ఎన్‌టీఆర్‌దే.
80వ దశకంలో తెలుగు సినిమా పూర్తిగా కమర్షియల్ మయమైపోయింది. డాన్సులూ, ఫైట్లూ లేకపోతే సినిమా జనంలోకి పోదన్న అభిప్రాయానికి వచ్చారు నిర్మాతలూ, దర్శకులూ, హీరోలూ. బూతు సంభాషణలూ, శృంగార సన్నివేశాలూ వున్న సినిమాలు తామరతంపరగా వచ్చాయి. క్లబ్ డాన్సులు సాధారణమయ్యాయి. 70వ దశకం ఆఖర్లో నటుడిగా రంగప్రవేశం చేసిన చిరంజీవి హీరోగా మారి నిలదొక్కుకొంటున్న సమయంలో 'ఖైదీ' అతడి స్థాయిని అనూహ్యంగా పెంచేసింది. యాక్షన్ చిత్రాల్లొ 'ఖైదీ' సరికొత్త ట్రెండుని నెలకొల్పింది. తెలుగులో హీరోల డాన్సులకి అక్కినేని ఆద్యులైనప్పటికీ వాటికి ఎక్కువ ప్రాచుర్యం కలిపించింది చిరంజీవే. ఓ వైపు యాక్షన్ సినిమాలు వెల్లువగా వస్తున్నా, మరోవైపు కళాత్మక విలువలున్న చిత్రాలు కొద్ది సంఖ్యలో అయినా వచ్చాయి. కె. విశ్వనాథ్ సృష్టి 'శంకరాభరణం' తెలుగు సినిమాకే గర్వకారణమైన చిత్రంగా చరిత్రలో సుస్థిరస్థానం సంపాదించింది. శాస్త్రీయ సంగీతమే హీరోగా తీసిన ఈ చిత్రం దేశ విదేశాల్లో విమర్శకుల ప్రశంసలు అందుకొంది. అక్కినేనితో దాసరి నారాయణరావు రూపొందించిన 'మేఘసందేశం' కూడా ఈ కోవలోకే వస్తుంది. ఈ దశకంలోనే మాదాల రంగారావు నటించిన 'యువతరం కదిలింది', 'ఎర్ర మల్లెలు', 'విప్లవ శంఖం' వంటి విప్లవాత్మక చిత్రాలు కూడా వచ్చాయి. అభ్యుదయ చిత్రాల సృష్టికర్తగా టి. కృష్ణ 'వందేమాతరం', 'నేటి భారతం', 'ప్రతిఘటన', 'రేపటి పౌరులు' వంటి సినిమాలు రూపొందించాడు. (ఇంకావుంది)

Saturday, October 23, 2010
ఫోకస్: 'నంది' లీలలు! (2వ భాగం)
నారా రోహిత్ కథానాయకుడిగా, చైతన్య దంతులూరి దర్శకుడిగా పరిచయమైన 'బాణం' సినిమా జనాదరణ పొందలేకపోయినా విమర్శకుల్ని మెప్పించింది. భ్రష్టుపట్టిపోయిన ఈ వ్యవస్థను ప్రక్షాళన చెయ్యాలని భావించే ఒక యువకుని కథ ఈ సినిమా. ఆ క్రమంలో అతడు ఎలాంటి అడ్డంకుల్ని ఎదుర్కొన్నాడు, ఆ అడ్డంకుల్ని చట్టం పరిధిలో ఎలా పరిష్కరించాడనేది ప్రధానాంశం. సమాజాన్ని ఆలోచింపజేసే సినిమా. 'కలవరమాయె మదిలో' ఉత్తమ తృతీయ చిత్రంగా అవార్డు గెలుచుకోవడం ఆశ్చర్యపరిచే విషయం. ఇటు జనాన్నీ, అటు విమర్శకుల్నీ మెప్పించలేకపోయిన ఈ బోరింగ్ ఫిల్మ్ నంది జ్యూరీని ఆకట్టుకోవడం విశేషమే. ఎప్పటికైనా ఎ.ఆర్. రెహమాన్ సంగీతంలో పాటలు పాడే అవకాశాన్ని చేజిక్కించుకోవాలని ఆశించే ఓ ఔత్సాహిక గాయని కథ ఈ సినిమా.
విమర్శలెదుర్కొన్న 'ఉత్తమ నటుడు'
ప్రజాదరణ పొందిన ఉత్తమ చిత్రంగా 'మగధీర'ని మించిన సినిమా ఇంకేముంటుంది? దీన్ని తప్పుపట్టే వాళ్లయితే లేరు. ఇదే సినిమా మరో ఎనిమిది అవార్డుల్ని గెలుచుకుని సత్తా చాటింది. 'మగధీర' సరికొత్త బాక్సాఫీసు రికార్డుల్ని సృష్టించడానికి ప్రధాన కారణమైన ఎస్.ఎస్. రాజమౌళి ఉత్తమ దర్శకుడిగా ఎంపికవడమూ సబబే. ఇదే సినిమాకి సమకూర్చిన నృత్యాలతో జాతీయ నృత్య దర్శకుడిగా అవార్డుని గెలుచుకున్న శివశంకర్, జాతీయ స్థాయిలో స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డు పొందిన కమల్ కణ్ణన్ లకే ఆ అవార్డులనివ్వడం మినహా జ్యూరీకి చేసేదేముంటుంది? అలాగే ఉత్తమ ఎడిటరుగా కోటగిరి వెంకటేశ్వరరావు, కళా దర్శకుడిగా రవీందర్, శబ్దగ్రాహకుడిగా రాధాకృష్ణ, కాస్ట్యూమ్ డిజైనరుగా రమా రాజమౌళికి అవార్డులు ప్రకటించారు. వీటికి అదనంగా కథానాయకుడు రాంచరణ్ కి స్పెషల్ జ్యూరీ అవార్డు(!)ని ప్రకటించారు. ఇలా రాంచరణ్ కి జ్యూరీ అవార్డు ప్రకటించి, దాసరి నారాయణరావుని ఉత్త నటుడిగా ఎంపికచేయడం విమర్శకి తావిచ్చింది. చిరంజీవి - రాంచరణ్ అభిమానులు సహజంగానే ఇందులో రాజకీయం ఉందని ఆరోపించారు. దాసరికి ఈ అవార్డుని ప్రకటిస్తారని విమర్శకులు సహా ఎవరూ ఊహించలేదు. 'మేస్త్రి'లో పాలకొల్లు అనే పాత్రలో జీవించినందుకు గాను ఆయనకు జ్యూరీ ఈ అవార్డుని అందించిందనుకోవాలి. గమనించదగ్గ సంగతేమంటే, ఈ సినిమాలో పాలకొల్లు ప్రస్తుత ప్రభుత్వ విధానాల మీద విరుచుకుపడతాడు. సినిమా ప్రారంభంలో ఈ సినిమాలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితమనీ, ఎవర్నీ ఉద్దేశించినవి కాదనీ చెప్పినా, చిరంజీవిని లక్ష్యంగా చేసుకునే, ఆయన్ని విమర్శించడానికే ఈ సినిమా తీశారని అంతా భావించారు. అలాంటి సినిమాలో నటించిన ఆయనకు ఉత్తమ నటుడి అవార్డునివ్వడం చాలామందికి మింగుడుపడని సంగతి. (ఇంకావుంది)

Subscribe to:
Posts (Atom)