దర్శకత్వం వహించిన ఎనిమిది సినిమాల్లో ఏడు విజయాలు సాధించిన దర్శకుడిగా యస్.యస్. రాజమౌళి తెలుగు చలనచిత్ర చరిత్రలో తనకంటూ ఓ శాశ్వత పేజీని సంపాదించుకున్నారు. ఇదివరలో దాసరి నారాయణరావు తొలి సినిమా 'తాత మనవడు' నుంచి పదకొండో సినిమా 'మనుషులంతా ఒక్కటే' వరకు వరుసగా పదకొండు విజయవంతమైన చిత్రాలకు (ఈ మధ్యలో వచ్చిన 'రాధమ్మ పెళ్లి' బాక్సాఫీసు ఫలితం విషయంలో భిన్నాభిప్రాయాలున్నా) దర్శకత్వం వహించడం ఒక చరిత్ర అయితే, ఉండకూడనన్ని ప్రతికూల పరిస్థితులున్న నేటి కాలంలో ఎనిమిదింటిలో ఒకటి మినహా ఏడు హిట్లను అందించిన రాజమౌళిది ఇంకో చరిత్ర.
'స్టూడెంట్ నెం.1' (2002) నుంచి మొదలైన ఆయన విజయ విహారం మూడో సినిమా 'సై' మినహా 'మర్యాదరామన్న' (2010) దాకా అప్రతిహతంగా కొనసాగుతూ వచ్చింది. 'సై' సైతం ప్రేక్షకుల్ని అలరించినా, పెట్టుబడి ఎక్కువ కావడంతో లాభాలు సాధించలేకపోయింది. ప్రస్తుతం 'ఈగ' పేరుతో ఆయన తన తొమ్మిదో చిత్రాన్ని తెరకెక్కించే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్టీఆర్‌ని 'స్టూడెంట్ నెం.1'తో మాస్‌కి చేరువ చేసిన ఆయన 'సింహాద్రి'తో టాప్ స్టార్‌ని చేశారు. ఆ సినిమా ప్రభావం ప్రేక్షకుల మీద ఎంతగా పడిందంటే, తర్వాత వచ్చిన ఎన్టీఆర్ సినిమాల్ని వారు 'సింహాద్రి'తో పోల్చుకుంటూ అసంతృప్తి చెందుతూ వచ్చారు. అలాంటి నేపథ్యంలో మరోసారి 'యమదొంగ'తో ఎన్టీఆర్‌కి విజయానందాన్ని చేకూర్చారు రాజమౌళి. అలా రాజమౌళి-ఎన్టీఆర్ కాంబినేషన్‌కు తిరుగనేదే లేకుండా పోయింది. ఒక్క ఎన్టీఆర్‌తోనే కాకుండా మిగతా హీరోలకూ వాళ్ల కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రాల్ని అందించారు రాజమౌళి. ప్రభాస్‌కు 'ఛత్రపతి', రవితేజకు 'విక్రమార్కుడు', రాంచరణ్‌కు 'మగధీర', సునీల్‌కు 'మర్యాదరామన్న' వంటి హిట్లనిచ్చారు. వీటిలో 'మగధీర' చిత్రం మునుపటి తెలుగు చలనచిత్ర వసూళ్ల రికార్డుల్ని తిరగరాసిన సంగతి ప్రస్తావనార్హం. మిగతా హీరోలతో ఆయన తీసిన చిత్రాలన్నీ అప్పటివరకు వాళ్ల కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లని సాధించిన చిత్రాలు కావడం విశేషం.
ఇప్పుడు ఆయన తీస్తున్న 'ఈగ' పట్ల కూడా చిత్రసీమ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఎక్కువగా గ్రాఫిక్స్ మీద ఆధారపడ్డ ఈ చిత్రం టైటిల్‌కు తగ్గట్లే ఓ 'ఈగ' ప్రధాన పాత్రధారిగా రూపొందుతోంది. విలన్ చేతిలో చనిపోయిన హీరో మరుజన్మలో ఈగగా పుట్టి ఆ విలన్ మీద ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేది ఇందులోని ప్రధానాంశం. హీరోగా నాని, విలన్‌గా కన్నడ నటుడు సుదీప్ నటిస్తున్న ఈ చిత్రంలో సమంత నాయిక. ఇటీవలే (సెప్టెంబర్ 27తో) పదేళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్న అగ్ర దర్శకుడు రాజమౌళి మునుముందు తెలుగు సినిమా స్థాయి పెరగడంలో ప్రధాన పాత్ర పోషిస్తారని ఆశించవచ్చు.
(అక్టోబర్ 10 రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా)
No comments:
Post a Comment