ఇంతకాలం తెలుగు సినిమాల్లో పరభాషా నాయికలు, పరభాషా విలన్లతో పాటు పరభాషా దర్శకుల హోరు ఎక్కువయ్యిందని వాపోతూ వచ్చాం. తెలుగు వాళ్లని పట్టించుకోవడం లేదని బెంగపడుతూ వచ్చాం. ఇప్పుడు ఆ బాధ దర్శకుల విషయంలో పడాల్సిన అవసరం లేదు. మళ్లీ మన దర్శకులకి రోజులొచ్చాయి. ఎస్.ఎస్. రాజమౌళి, పూరి జగన్నాథ్, వి.వి. వినాయక్, శ్రీను వైట్ల, త్రివిక్రం, సుకుమార్, సురేందర్‌రెడ్డి, సంపత్ నంది, శ్రీకాంత్ అడ్డాల వంటి దర్శకులు రాణిస్తుండటంతో ఇతర భాషల నుంచి వచ్చే దర్శకుల తాకిడి ఇటీవల తగ్గింది. కొంత కాలం క్రితం తెలుగు దర్శకులపై కంటే ఇతర భాషా దర్శకులపైనే మన హీరోలు, నిర్మాతలు నమ్మకం పెట్టుకున్నట్లు కనిపించింది. తమిళ కథలు, తమిళ దర్శకులే శరణ్యమన్నట్లు మన హీరోలు, నిర్మాతలు అప్పట్లో వ్యవహరించారు. ప్రస్తుతం టాప్ హీరోల్లో పవన్‌కల్యాణ్, ప్రభాస్ మాత్రమే తమిళ దర్శకులతో పనిచేస్తున్నారు. పవన్ కల్యాణ్‌తో విష్ణువర్థన్ 'పంజా' తీస్తుంటే, ప్రభాస్‌తో రాఘవ లారెన్స్ 'రెబల్' తీస్తున్నాడు.
ఇదివరలో తెలుగులో మంచి డిమాండ్ ఉన్న పి. వాసు, విక్రమన్, సురేశ్‌కృష్ణలను ఇప్పుడు తెలుగు హీరోలెవరూ పట్టించుకోవడం లేదు. 'ఏ మాయ చేసావె' హిట్ తర్వాత కూడా గౌతం మీనన్ వెంట మన వాళ్లెవరూ పడటం లేదు. 'ఆడవాళ్ల మాటలకు అర్థాలే వేరులే' హిట్ తర్వాత కూడా సెల్వరాఘవన్ మళ్లీ తెలుగు వైపు దృష్టిపెట్టలేదు. 'సత్యం'తో ధూంధాంగా తెలుగులోకి వచ్చిన మలయాళీ సూర్యకిరణ్‌ని ఎవరూ పట్టించుకోవడం లేదు. 'ప్రియమైన నీకు', 'అమ్మాయి బాగుంది' సినిమాల దర్శకుడు బాలశేఖరన్ ఏమయ్యాడో తెలీదు. 'నాని', 'పులి' సినిమాల ఫెయిల్యూర్‌తో ఎస్.జె. సూర్య పత్తాలేకుండా పోయాడు. తెలుగులోనే దర్శకత్వంలో ఓనమాలు దిద్దుకున్న బొమ్మరిల్లు భాస్కర్ తమిళుడైనా అతన్ని తెలుగువాడిగానే ట్రీట్ చేయాలి. తమిళం వైపు చూపు సారించకుండా తెలుగులోనే కెరీర్ వెదుక్కుంటున్న కరుణాకరన్‌కూ మినహాయింపు ఇవ్వొచ్చు.
ఓ వైపు హీరోయిన్లు, ఇంకోవైపు విలన్లు, సైడు విలన్లు, కేరక్టర్ ఆర్టిస్టులు, మరోవైపు రీమేక్‌లు తెలుగు సినీ పరిశ్రమపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంటే సృజనాత్మక రంగమైన దర్శకత్వం కూడా దిగుమతికి గురికావడం తెలుగు సినీరంగంలోని భావ దారిద్ర్యాన్ని పట్టిస్తున్నదని నిన్నటిదాకా బాధపడినవాళ్లు ఇప్పుడు ఒకింత ఊపిరి పీల్చుకుంటున్నారు. నిన్నటి స్థితిపై "తెలుగు సినిమా చూస్తే ఏమున్నది గర్వకారణం... సమస్తం పరభాషా వాసనమయం" అంటూ శ్రీశ్రీని అనుకరిస్తూ మాట్లాడిన కవులు ఇప్పుడు తెలుగు దర్శకులకి మంచి రోజులు రావడంతో ఖుషీ అవుతున్నారు.
తెరముందు నాయకుడు హీరో కావచ్చు. తెరవెనుక నాయకుడు (కెప్టెన్) మాత్రం దర్శకుడే. అటువంటి నాయకత్వ స్థానంలో మనవాళ్లని కాకుండా ఇతర భాషలవాళ్లకి పెద్దపీట వేయడం ఏమంత న్యాయం? 'ప్రతిభ ఎవరిలో ఉన్నా ప్రోత్సహించాలి. అందుకు భాషా భేదం అడ్డుకాకూడదు' అంటారు కొంతమంది. నిజమే. అయితే అది కొంతవరకే. ఒకరిద్దర్ని అలా తీసుకు రావడంలో తప్పులేదు. అయితే అదేపనిగా ఒకరి తర్వాత మరొకర్ని దిగుమతి చేసుకుంటూ పోతుంటే మన దర్శకులు ఏం కావాలి? మనవాళ్లు తీసే సినిమాలన్నీ ఫెయిలయ్యి, పరాయి దర్శకుల సినిమాలు బ్రహ్మాండంగా ఆడుతుంటే.. సరేననుకోవచ్చు. అలా ఏమీ జరగడం లేదు. పొరుగింటి పుల్లకూర రుచి అన్న సామెతగా హీరోలు, నిర్మాతలు పర భాషా దర్శకులవైపు చూపు సారిస్తూ రావడం వల్లే వాళ్ల హవా నడిచింది. ఇప్పుడు వాళ్ల చేతుల్లో విజయాన్ని అందించే మంత్రదండమేదీ లేదని తెలియడంతో తిరిగి తెలుగు దర్శకులకి ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ఈ ట్రెండు మనకి మంచిదే.
No comments:
Post a Comment