Showing posts with label veerabhimanyu. Show all posts
Showing posts with label veerabhimanyu. Show all posts

Saturday, December 26, 2015

Beginning Days: Kanchana

తొలి రోజుల్లో: కాంచన

విజయవాడలో పుట్టిన కాంచన మద్రాసులో పెరిగింది. ఆమె తండ్రి రామకృష్ణశాస్త్రి పేరుపొందిన ఇంజనీర్. చిన్నప్పట్నించీ కాంచనకు సంగీతమంటే ఇష్టం. రేడియోలో వచ్చే పాటల్ని శ్రద్ధగా వింటూ ఆ గాయకుల గొంతులతో పాటు తన గొంతూ కలిపి పాడుతూ ఆనందిస్తుండేది. పాటకు తగ్గట్లు గంతులు కూడా వేస్తుండేది. కూతుర్లోని ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఆమెకు తొమ్మిదో యేట నుంచే నాట్యంలో శిక్షణనిప్పించారు. వడయూర్ రామయ్య పిళ్లే వద్ద నృత్యంలో వివిధ రీతుల్ని వంటపట్టించుకుంది. హైస్కూల్ అయ్యాక ఇంటర్మీడియెట్ కోసం యతిరాజ్ కాలేజీలో చేరింది. ఆ కాలంలో చాలా నాటకాల్లో వేషాలు వేసి తరచూ బహుమతులందుకొంటూ ఉండేది. ఇంటర్మీడియెట్ అయ్యాక చదువు మానేసింది.
ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఉబుసుపోక పేపర్లో కనిపించిన ఓ ఎయిర్ హోస్టెస్ ఉద్యోగానికి దరఖాస్తు చేసింది. ఇంటర్వ్యూలో ఎంపికై ఎయిర్ హోస్టెస్‌గా మారింది. రెండేళ్లు సరదాగా గడిచిన తర్వాత ఆ ఉద్యోగం ఆమెకు విసుగు పుట్టించింది. అయినా అందులోనే కాలం నెట్టుకొస్తున్న సందర్భంలో తమిళ నిర్మాత కోవై చెళియన్ విమాన ప్రయాణంలో ఆమెను చూసి, తన మిత్రుడైన డైరెక్టర్ శ్రీధర్‌కు ఆమె గురించి చెప్పాడు. అప్పట్లో శ్రీధర్ 'కాదలిక్క నేరమిల్లై' చిత్రాన్ని రంగుల్లో తియ్యాలని కొత్త తారల కోసం అన్వేషిస్తున్నాడు. అలా కాంచనను శ్రీధర్‌కు పరిచయం చేశారు కోవై చెళియన్. కాంచన మొహంలో కనిపించిన సజీవ హావభావాలు శ్రీధర్‌కు బాగా నచ్చాయి. అందుకే తన సినిమాలో ఆమెను కథానాయికగా తీసుకున్నాడు. వెంటనే ఎయిర్ హోస్టెస్ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి సినీ రంగంలో అడుగుపెట్టింది కాంచన. 'కాదలిక్క నేరమిల్లై' విడుదలైంది. తమిళనాట ఆ సినిమా రికార్డ్ కలెక్షన్లను సాధించింది. ఒకే ఒక్క సినిమాతో కాంచన పేరు మారుమోగింది. పలువురు నిర్మాతలు, దర్శకుల దృష్టిలో పడింది.
రాజలక్ష్మీ ప్రొడక్షన్స్ వాళ్ల 'వీరాభిమన్యు' చిత్రంతో తెలుగువాళ్ల అభిమాన నటి అయ్యింది కాంచన. ఆ తర్వాత వచ్చిన అన్నపూర్ణా పిక్చర్స్ వారి 'ఆత్మగౌరవం', పద్మశ్రీ వారి 'ప్రేమించి చూడు' మొదలుకొని 'నేనంటే నేనే', 'తల్లి ప్రేమ', 'భలే మాస్టారు'  వంటి చిత్రాల్లో విభిన్న పాత్రల్లో రాణించింది. తెలుగులో బిజీ తారగా మారింది. తమిళంలోనూ ఆమెకు మంచి గిరాకీ ఏర్పడింది. అదే సమయంలో హిందీలో 'ఫర్జ్' సినిమా చేసింది.
అన్నట్లు కాంచన అసలు పేరు వసుంధర. కాలేజీ చదువు ముగియగానే 'భట్టి విక్రమార్క'లో కాళికాదేవిగా నటించింది. కానీ తర్వాత అవకాశాలు రాకపోవడంతో ఎయిర్ హోస్టెస్‌గా మారింది. తిరిగి శ్రీధర్ పుణ్యమా అని చిత్రసీమలో నిలబడింది.

Saturday, August 17, 2013

కాంచనమాల మొదటి చిత్రం

'శ్రీకృష్ణ తులాభారం' (1935)లో ఒక అప్రధాన పాత్ర చేసిన కాంచనమాలకు హీరోయిన్‌గా మొదటి చిత్రం 'వీరాభిమన్యు' (1936). సాగర్ మూవీటోన్ పతాకంపై డాక్టర్ అంబాలాల్ ఎం. పటేల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అమీన్ దర్శకుడు. ఇది సాగర్ వాళ్లు 'వీరాభిమన్యు' పేరుతోటే హిందీలో తీసిన సినిమాకు రీమేక్. అభిమన్యునిగా పులిపాటి వెంకటేశ్వర్లు, ఉత్తరగా కాంచనమాల నటించగా, కీలకమైన సుభద్ర పాత్రను సురభి కమలాబాయి అద్భుతంగా పోషించారు. ఈ సినిమా షూటింగ్‌ను ఉత్తర గర్భాదానం సన్నివేశంతో ప్రారంభించారు. తొలిరోజే కాంచనమాల తనకిచ్చిన కాస్ట్యూమ్స్ వేసుకోనని మొండికేసింది. ఎవరు చెప్పినా ఒప్పుకోలేదు. ఆమె కోసం డ్రస్సులో కొద్ది మార్పులు చేశారు. కాని ఈ సీనులే కొంత కాలానికి రీషూట్ చేయాల్సి వచ్చినప్పుడు తాను మొదట వద్దన్న డ్రస్సు వేసుకోడానికి కాంచమాల ఒప్పుకుంది. ఆ డ్రస్సులో ఆనాడు కానమాల కనిపించినంత అందంగా తెలుగు తెర మీద చాలా కాలం వరకూ మరో తార కనిపించలేదని చెప్పుకునే వాళ్లు. సాగర్ మూవీటోన్ స్టూడియోలో ఆమె చాలా మంచి ఇంప్రెషన్ కలిగించింది. సెట్టు మీద ఆమె శరీరం వంచి కష్టపడేది. అందుచేత టెక్నీషియన్లు ఆమె మీద చాలా అభిమానంగా ఉండేవాళ్లు. మెహబూబ్ ఆమెకు హిందీ నేర్పి తన చిత్రాల్లో నటింప చేస్తానని అడిగాడు. కాంచనమాల ఒప్పుకుంటే తెలుగు సినిమా ఒక గొప్ప అందాల తారను మిస్సయ్యేది.