Showing posts with label sekhar kammula. Show all posts
Showing posts with label sekhar kammula. Show all posts

Thursday, December 3, 2015

Need for Artistic Vision in Film Makers

కూసింత కళాత్మక దృష్టి కావాలి!

నేటి నిర్మాతలు, దర్శకుల్లో ఎక్కువమందికి సినిమా అంటే కేవలం వ్యాపారమే. అందులో కళకు చోటులేదనేది వాళ్ల నిశ్చితాభిప్రాయం. ఒకళ్లతో ఒకళ్లు పోటీపడుతూ ఏడాదికి 150 సినిమాల దాకా తీస్తున్నారు. వాటిలో విజయాన్ని సాధించే సినిమాలు పది, పన్నెండుకంటే మించవు. అవైనా ఎందుకు ఆడుతున్నాయని పరిశీలిస్తే కథా కథనాల విషయంలో అవి మిగతా వాటికంటే మెరుగ్గా ఉండటం, తెలిసో తెలియకో వాటిల్లో ఎంతోకొంత కళాదృష్టి కనిపించడం.
ఉదాహరణకు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించిన 'బాహుబలి', 'శ్రీమంతుడు', 'భలే భలే మగాడివోయ్' చిత్రాల్ని తీసుకుందాం. 'బాహుబలి' సాంఘిక సినిమా కాదు. అది జానపదం. అందులోనిది బలమైన కథ కాదు. కథనం, కంటికి 'అబ్బో' అనిపించే విజువల్స్, భారీ యుద్ధ సన్నివేశాలు, ఉద్వేగభరితమైన సన్నివేశాల కారణంగా అది జనానికి నచ్చేసింది.
'శ్రీమంతుడు' సినిమా కథ గొప్పదేమీ కాదు. కానీ అందులోని అంశం ప్రజలకు బాగా పట్టేసింది. రాబందుల వంటి భూ బకాసురులు పీక్కుతింటున్న తన సొంత ఊరిని దత్తత తీసుకొని, దాన్ని బాగు చేసుకున్న యువకుడి విశాల హృదయాన్ని జనం మెచ్చారు. అందులో కథానాయకుడు కోట్లకు వారసుడైనా, కార్లలో తిరగడానికంటే, సైకిల్‌పై ప్రయాణానికే ఇష్టపడతాడు. అందుకే ఆ సినిమా వచ్చాక తెలుగు రాష్ట్రాల్లో సైకిళ్ల అమ్మకాలు పెరిగాయి. సంపన్నవంతులు వెనుకబడిన గ్రామాల్ని దత్తత తీసుకోవడం మొదలుపెట్టారు. అంతటి ప్రభావాన్ని కలిగించిన సినిమా ఇటీవలి కాలంలో మరొకటి లేదు. ఇక 'భలే భలే మగాడివోయ్' సినిమా విషయానికొస్తే, అది తక్కువ బడ్జెట్‌తో తయారైనా, ప్రజల మనసుల్ని భారీ స్థాయిలో గెలుచుకుంది. చిన్నతనం నుండే తీవ్ర మతిమరుపు రుగ్మతను కలిగి ఉండే ఓ యువకుడు ప్రేమలోపడి, తన మతిమరుపు కారణంగా ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొని, చివరకు ఎలా అందరి హృదయాల్ని దోచుకున్నాడనే అంశాన్ని దర్శకుడు ఆసక్తికరంగా మలిచాడు. కథానాయకుడి అమాయకత్వం, తన మతిమరుపును కప్పిపుచ్చుకోడానికి ఒకదాని తర్వాత ఒకటిగా ఆడే అబద్ధాలు ప్రేక్షకుల్లో సానుభూతినే కలిగించాయి కానీ, విముఖతని కలిగించలేదు. ఈ రకంగా ఈ మూడు సినిమాల్లో ఎంతోకొంత కళాత్మకత కనిపిస్తుంది.
అలాగే శేఖర్ కమ్ముల, క్రిష్ వంటి దర్శకులు కేవలం వ్యాపార దృష్టితోనే కాకుండా, వాస్తవిక దృష్టితో సినిమాలు తీస్తున్నారు. శేఖర్ కమ్ముల 'ఆనంద్', 'గోదావరి', 'హ్యాపీడేస్', 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాల్లో జీవితంలోని భిన్న కోణాలు మనకు దర్శనమిస్తాయి. కాకపోతే వాటిలో జీవన సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. ఆయనకు కాస్త భిన్నంగా క్రిష్ దర్శనమిస్తాడు. జీవితంలోని ఆనంద ఘడియల వెనుకే విషాదం కూడా ఉంటుందని ఆయన సినిమాలు చూపిస్తాయి. 'గమ్యం', 'వేదం', 'కంచె' సినిమాల్లో అటు ఆనందమూ, ఇటు విషాదమూ రెండూ కనిపించడం మనం చూడవచ్చు. 'కృష్ణం వందే జగద్గురుం'లో విషాదం బదులు తెలుగువాళ్లకు ఒకప్పుడు ఎంతో ప్రీతిపాత్రమైన రంగస్థల నాటకాన్ని బతికించుకోవాలనే తపన, మైనింగ్ మాఫియాపై పోరాడాల్సిన ఆవశ్యకత మనకు కనిపిస్తాయి. అంటే రెగ్యులర్ సినిమాల్లో కనిపించే నాలుగు ఫైట్లు, ఆరు పాటలు, అనవసర భావోద్రేక సన్నివేశాలు, కథకు సంబంధంలేని రోత కామెడీ ట్రాకుల ఫార్ములా వీళ్ల సినిమాల్లో కనిపించని సంగతి గ్రహించాలి.
ఇదివరకు దర్శకులు సెల్ఫ్ సెన్సారింగ్ పాటించి ప్రేమ సన్నివేశాలను హద్దుల్లో ఉంచేవాళ్లు. వాటివల్ల ప్రజలకు అవి ఎలాంటి హానీ కలుగచేయని రీతిలో ఉండేవి. అందరి ఆదరణ పొందేవి. కానీ రాను రాను విదేశీ మోజుకు, కృత్రిమ నాగరికతకూ అలవాటుపడిన దర్శకులు ప్రణయ ఘట్టాల్ని విచ్చలవిడిగా తీయడం మొదలుపెట్టారు. టీనేజ్ లవ్‌స్టోరీల పేరుతో, కాలేజీ ప్రేమకథల పేరుతో బూతు చిత్రాలు తీస్తూ వస్తున్నారు. తెలిసీ తెలియని వయసులో ఉండే, ఉడుకు రక్తం ఉరకలు వేసే పిల్లల్లో అవి కలిగించే మానసిక వికారాలు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి సినిమాల్ని పిల్లలతో కలిసి చూడాలంటే పెద్దలు సిగ్గుతో చచ్చిపోవాల్సిందే. కాలేజీలు ఎగ్గొట్టి ఇలాంటి సినిమాలు చూస్తూ అవే నిజమైన ప్రేమలుగా భ్రమించి, అమ్మాయిలను ప్రేమ పేరుతో వేధించే సంఘటనలు ఇవాళ సమాజంలో నిత్యకృత్యమైపోయాయి. 'నిర్భయ' వంటి సంఘటనలు పెచ్చుమీరిపోవడానికి బూతు సినిమాల ప్రభావమే ప్రధాన కారణం. ఇలాంటి సినిమాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ, మంచి సినిమాల సంఖ్య తరుగుతూ రావడానికి కారణం ఎవరో దర్శక నిర్మాతలతో పాటు ప్రేక్షకులూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇవాళ మంచి సినిమా తీస్తే దాన్ని ఆస్వాదించే హృదయాలు ఎన్ని? నిర్మాతలు ఇలాంటి మూస కమర్షియల్ సినిమాల్నే ఎక్కువగా నిర్మించడానికి కారణం.. వాళ్లకు డబ్బే ప్రధానం. ఎలాంటి సన్నివేశం తర్వాత ఎలాంటి సన్నివేశం వస్తే జనం ఈలలు వేస్తారు, లాభాలు ఎలా వస్తాయి, ఏ హీరోతో తీస్తే జనం ఎక్కువగా వస్తారు, ఏ డైరెక్టర్‌కు స్టార్ వాల్యూ బాగా ఉంది.. అనే బాక్సాఫీస్ సూత్రాలకు లోబడిపోయి తమ సినిమాల్ని కేవలం వ్యాపారం కోసమే తీస్తున్నారు.
వర్తమానం కంటే గతమెంతో ఘనం అనేది పాత చింతకాయ పచ్చడి లాంటి నానుడి కావచ్చేమో గానీ, తెలుగు సినిమాకు సంబంధించి అది అక్షరాలా నిజం. గతంలోని సినిమాల్లో నటీనటుల నటన ఇప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోయి ఉంది. ఇప్పటి ఏ నటుడి అభినయం గురించి గొప్పగా మనం చెప్పుకోగలం? కారణం మునుపటి తారలు నటనను ఓ కళగా భావించి, పాత్రను, దాని స్వభావాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకొని ఆ పాత్రల్ని సొంతం చేసుకొనేవాళ్లు. ఇప్పటి ఏ నటుడు కానీ, నటి కానీ నటనను కళగా భావించి పాత్ర పోషణ చేస్తున్నారు? ఓ సినిమా చేస్తే ఎంత పారితోషికం అందుతుందనే ధ్యాస తప్పితే, నటనపై అంకితభావం చూపించేవాళ్లు కనిపిస్తారా? ఇవాళ హీరో కావాలంటే నటనకంటే డాన్సులు బాగా వచ్చుండాలి. ఫలానా హీరో బాగా నటించాడని చెప్పుకోవడం కంటే బాగా డాన్సులు, ఫైట్లు చేశాడని చెప్పుకోవడమే గొప్పయింది.
ఇక దర్శకుడి విషయానికి వస్తే పూర్వం తన శక్తివంచన లేకుండా చిత్రాన్ని ఆద్యంతం నవరసాలతో కళాత్మకంగా రూపొందించేవాడు. దర్శకునికి తగినట్లు నటీనటులు అభినయాన్ని ప్రదర్శించి పూర్తి సహకారం అందించేవాళ్లు. అంటే సమష్టి కృషివల్ల సినిమా విజయవంతమై నిర్మాతకు ఇంకో సినిమా తియ్యడానికి ముందడుగు వేసే ధైర్యం వచ్చేది. కానీ ఇవాళ్ల దర్శకునికే దర్శకులుగా మారిపోయారు తారలు. దాంతో దర్శకుడు మనసుకి ఎంత కష్టంగా ఉన్నా రాజీపడి సినిమాని పూర్తిచేశాననిపిస్తున్నాడు.
స్వర్ణయుగ సినిమాల విజయాల పరంపరకూ, ఇప్పటి సినిమాల విజయానికీ తేడాని పోలిస్తే ఎంతో కనిపిస్తుంది. అప్పుడు తయారయ్యే సినిమాల సంఖ్య తక్కువ. అవి కళాత్మకంగా ఉండేవి. ప్రజాదరణ అమితం. ఇప్పుడు సినిమాల సంఖ్య చాలా ఎక్కువ. అంతా వ్యాపార దృష్టే. కళాదృష్టి అసలు లేదు. అందువల్ల ఇప్పటి సినిమాలు అభిరుచి కలిగిన సినీ ప్రియుల్ని ఆకర్షించలేకపోతున్నాయి. కళకూ, ప్రజాదరణకూ సంఘర్షణ రావాల్సిన అవసరం లేదు. సమర్థుడైన దర్శకుడు కళను కించపరచకుండానే ప్రజారంజకమైన చిత్రాలు తీయగలడని అలనాటి కేవీరెడ్డి నుంచి, నిన్నటి కె. విశ్వనాథ్ నుంచి, ఇవాళ్టి క్రిష్, క్రాంతిమాధవ్ దాకా నిరూపిస్తూనే ఉన్నారు. మనకు జాతీయంగా పేరు వచ్చేది ఇలాంటి దర్శకులవల్లే. అందువల్ల మన నిర్మాతలు, దర్శకులు సినిమాలో వ్యాపారానికే తప్ప కళకు  చోటు లేదన్న భ్రమలోనే ఉంటూ కళను విస్మరించకుండా కళాఖండాలను, దృశ్యకావాలనూ తీయవచ్చని గుర్తించాలి. దానికి కావాల్సిందల్లా కూసింత ఆత్మవిశ్వాసం.

Thursday, October 23, 2014

Wednesday, November 2, 2011

ప్రియా ఆనంద్ కనిపించుటలేదు!

తెరపైనా, తెరబయటా యమ చలాకీగా కనిపించే ప్రియా ఆనంద్ '180' సినిమా తర్వాత తెలుగు చిత్రసీమలో కనిపించకపోవడం ఆశ్చర్యకరం. శేఖర్ కమ్ముల 'లీడర్' సినిమాలో టీవీ జర్నలిస్ట్‌గా సెకండ్ హీరోయిన్ పాత్రలో పరిచయమై మెప్పించిన ఆమె 'రామ రామ కృష్ణ కృష్ణ', '180' సినిమాల్లో మెయిన్ హీరోయిన్‌గానూ బాగా రాణించింది. ముఖ్యంగా జయేంద్ర డైరెక్ట్ చేసిన ద్విభాషా చిత్రం '180'లో నిత్య మీనన్ వంటి సహజ నటి ఉన్నప్పటికీ నటిగా ప్రియకి మంచి మార్కులు రావడం గమనార్హం. రేణుక అనే ఎన్నారై యువతిగా ఆమె ప్రదర్శించిన హావభావాలు విమర్శకుల్ని సైతం మెప్పించాయి. ఆ సినిమాతో నటిగా ప్రియ సత్తా ఏమిటో అందరికీ తెలిసిందనీ, దాంతో ఆమెకి మంచి అవకాశాలు రావడం ఖాయమనీ చాలామంది భావించారు. చిత్రంగా ఇప్పటివరకు ఆమె ఏ తెలుగు సినిమాకీ సంతకం చేయలేదు. పెద్ద హీరోలెవరూ ఆమె పట్ల ఆసక్తి చూపడం లేదు. అయితే అలా అని ఆమె ఖాళీగా ఉందనుకుంటే పొరపాటే. 'చీని కం', 'పా' సినిమాల దర్శకుడు బాల్కి రూపొందిస్తున్న సినిమా ద్వారా బాలీవుడ్‌కి పరిచయమయ్యేందుకు సిద్ధమవుతోంది. న్యూయార్క్ నగరంలో ఈ సినిమా షూటింగులో ఇటీవలే పాల్గొంది. అయితే తెలుగు బాగా మాట్లాడగలిగిన ఆమెని తెలుగు చిత్రసీమ పట్టించుకోకపోవడమే బాధాకరం.

Thursday, September 8, 2011

న్యూస్: టైసన్‌కి 'హ్యాపీడేస్' ఎప్పుడో!

శేఖర్ కమ్ముల సినిమా 'హ్యాపీడేస్' ద్వారా ఓ హీరోగా పరిచయమైన రాహుల్ ప్రస్తుతం కెరీర్ క్రైసిస్ ఎదుర్కొంటున్నాడు. ఆ సినిమాతో టిపికల్ వాయిస్‌తో అందర్నీ ఆకట్టుకున్న ఈ టైసన్ సినిమాలు 'రెయిన్‌బో', 'ముగ్గురు' రెండూ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. ఈ రెండింటికీ వి.ఎన్. ఆదిత్య డైరెక్టర్ కావడం గమనార్హం. వీటిలో 'రెయిన్‌బో'లో అతడు సోలో హీరో కాగా, 'ముగ్గురు'లో టైటిల్‌కి తగ్గట్లే ముగ్గురు హీరోల్లో ఒకడిగా నటించాడు.
"మునుపటి రెండు సినిమాలతో పోలిస్తే నటుడిగా ఇప్పుడు మరింత మెరుగయ్యానని అంటున్నారు. నా బలాలు, బలహీనతలు నాకు తెలుసు. తొలి సినిమాతో పోలిస్తే ఇప్పుడు నా డైలాగ్ డిక్షన్ మెరుగైందనే పేరు వచ్చింది. అలాగే డాన్సుల్లోనూ బెటరయ్యానని చెబుతున్నారు. అయితే ఈ విషయంలో ఇంకా ఇంప్రూవ్ కావాలనుకుంటున్నా. దాని కోసం స్పెషల్ క్లాసులకెళ్తున్నా" అని అతను తెలిపాడు.
ప్రస్తుతం రాహుల్ తమిళంలో 'ఉయిర్ మోళి' (ఆత్మ భాష) అనే చిత్రంలో సోలో హీరోగా చేస్తున్నాడు. భారీ నిర్మాణ సంస్థ మీడియా వన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మనోరాజా డైరెక్టర్. 2012 జనవరిలో ఈ సినిమా రిలీజవుతుంది. ఇక తెలుగు విషయానికి వస్తే "త్వరలో 'ఆవకాయ్ బిర్యాని' ఫేమ్ అనీశ్ కురువిల్లా డైరెక్షన్‌లో మల్టీస్టారర్ చెయ్యబోతున్నా. ఈ ఏడాది ఆఖరులోగా లేదా వచ్చే ఏడాది మొదట్లో అది ఉండొచ్చు. ఆ సినిమాకి శేఖర్ కమ్ముల గారు నన్ను రికమెండ్ చేశారు. అనీశ్ కథ చెప్పారు. అది సమకాలీన అర్బన్ థ్రిల్లర్. ఆ సినిమా ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నా" అని చెప్పాడు రాహుల్. మొత్తానికి అతడి కెరీర్‌కి 'హ్యాపీడేస్' రావాలంటే మరి కొంతకాలం ఆగక తప్పదు.

Thursday, July 21, 2011

న్యూస్: 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఎందాకా వచ్చింది?

డైరెక్ట్ చేసిన తొలి సినిమా 'డాలర్ డ్రీమ్స్‌తోటే ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న శేఖర్ కమ్ముల కొంత కాలంగా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' అనే ప్రాజెక్టులో నిమగ్నమై ఉన్నాడు. తనకి ఎంతో పేరు తీసుకు రావడంతో పాటు బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్టయిన 'హ్యాపీడేస్' తరహాలోనే ఈ సినిమా ద్వారా కొత్తవాళ్లని పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే టేలంట్ హంట్ ద్వారా వచ్చిన వారిలోంచి కొంతమందిని ఎంపిక చేసి, వారికి ఆడిషన్ నిర్వహిస్తున్నారు. 'హ్యాపీడేస్'లో నలుగురబ్బాయిలు, నలుగురమ్మాయిలు ప్రధాన పాత్రధారులు కాగా, 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'లో ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. కాలేజీ అనంతర జీవితాన్ని స్పృశించే కథతో ఈ సినిమాని తీయబోతున్నాడు శేఖర్. ఈమధ్యే ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోని ఇండియన్ పెవిలియన్‌లో పాల్గొని, ఆ ఘనత పొందిన ఏకైక తెలుగు దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన చాలా దీక్షతో ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నాడు. కారణం, తానెంతో ఆశలు పెట్టుకున్న 'లీడర్' సినిమా ఆశించిన రీతిలో విజయాన్ని సాధించక పోవడం. 'హ్యాపీడేస్' శతదినోత్సవ సభలో తన సినిమా ఫెయిలైతే అప్పట్నించీ సినిమాలు తియ్యడం ఆపేస్తానని ఆయన ప్రకటించాడు. అది అతి విశ్వాసంతోనో, అహంకారంతోనో చెప్పిన మాటలు కావు. తన మీదా, తన సామర్థ్యం మీదా ఉన్న నమ్మకంతో చెప్పినవి. అందుకే చాలామందికి మల్లే హడావుడిగా ఏదో ఒకటి తీయడం ఆయనకు తెలీదు. తెలిసిందల్లా తను నమ్మిన దాన్ని నిబద్ధతతో తీయడం. ఈ సంగతి ఆయన్ని ఎరిగిన వాళ్లకి బాగా తెలుసు. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ప్రాజెక్టుకి ఆయన తీసుకుంటున్న సమయం ఎక్కువైనా, అంతిమంగా ఆ సినిమాతో ఆయన మరోసారి వార్తల్లో నిలవడం ఖాయం.

Monday, July 18, 2011

న్యూస్: రానాని ప్రేక్షకులు ఇష్టపడతారా?

తొలి రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో మూడో సినిమా మీద ప్రాణమే పెడుతున్నాడు రానా దగ్గుబాటి. శేఖర్ కమ్ముల రూపొందించిన 'లీడర్'లో ముఖ్యమంత్రిగా నటించి బాగానే చేశాడనిపించుకున్న ఈ రామానాయుడి మనవడు, సురేశ్‌బాబు కుమారుడు పూరి జగన్నాథ్ సినిమా 'నేను నా రాక్షసి' కచ్చితంగా తనకి కమర్షియల్ బ్రేక్ ఇస్తుందని ఆశించాడు. కానైతే ఆ సినిమా ఫ్లాప్ అనిపించుకుంది. పైగా ఆ సినిమా వల్ల అతని కంటే ఎక్కువగా ఇలియానాకే పేరు వచ్చింది. ఈ నేపథ్యంలో 'నా ఇష్టం' అనే సినిమా చేస్తున్నాడు రానా. ఇందులో అతని జోడీగా 'బొమ్మరిల్లు' బ్యూటీ జెనీలియా నటిస్తుండటం విశేషం. 'సింహా'తో హిట్టు కొట్టిన పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా ప్రకాశ్ తోలేటి డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. పర్సనాలిటీ పరంగా సీరియస్ కేరక్టర్స్‌కి పనికి వస్తాడనిపించే రానా 'నా ఇష్టం'లో రఫ్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమాతోనైనా ప్రేక్షకులు తనని ఇష్టపడేలా చేసుకోవాలని తపిస్తున్నాడు. అతని ఆశ నెరవేరుతుందా?

Wednesday, July 13, 2011

న్యూస్: నెంబర్‌వన్ రేసులో తమన్నా!

మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా తెలుగులో ఇప్పుడు నెంబర్ వన్ రేసులో దూసుకుపోతోంది. ఈ విషయంలో ఆమె కాజల్ అగర్వాల్‌కి ప్రధాన పోటీదారుగా మారింది. రేసులో నిన్నటి వరకు ముందున్న గోవా సుందరి ఇలియానా వెనకడుగు వేయడం, త్రిష ఇమేజ్ క్రమేపీ తగ్గుతుండటం, తాప్సీ, సమంతా ఇంకా టాప్ స్లాట్‌లోకి రాకపోవడంతో తమన్నాకి అవకాశాలు మెరుగయ్యాయి. ఆరేళ్ల క్రితమే మంచు మనోజ్ సరసన చేసిన 'శ్రీ'తో తెలుగులో అడుగుపెట్టినప్పటికీ ఆమెకి బాగా గుర్తింపు తెచ్చింది శేఖర్ కమ్ముల రూపొందించిన 'హ్యాపీడేస్' సినిమానే. అయితే దాని తర్వాత కూడా ఆమె సరైన సినిమాల్ని ఎంచుకోలేకపోయింది. రెండేళ్ల క్రితం 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' సినిమాలో ఆకట్టుకున్న ఆమె మళ్లీ రెండేళ్ల గ్యాప్‌తో '100% లవ్'తో ప్రేక్షకుల్నీ, విమర్శకుల్నీ సమానంగా సమ్మోహనపరిచింది. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హీరో నాగచైతన్య కంటే తమన్నాకే ఎక్కువ పేరు రావడం గమనార్హం. ఈ సంగతిని నాగచైతన్య తండ్రి, సీనియర్ టాప్ హీరో నాగార్జున సైతం పబ్లిగ్గా చెప్పారు కూడా. ఈ సినిమాతో ఆమెకి వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. '100% లవ్' నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మించిన భారీ చిత్రం 'బద్రీనాథ్'లో రెగ్యులర్ హీరోయిన్‌గా కనిపించినా తనదైన ముద్రని వేసింది తమన్నా. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్టులున్నాయి.
వాటిలో ఒకటి రాంచరణ్‌కి జోడీగా నటిస్తున్న 'రచ్చ' కాగా రెండోది ఎన్‌టీఆర్‌తో చేస్తున్న 'ఊసరవెల్లి'. ఇక మూడోది రాం సరసన నటిస్తున్న 'ఎందుకంటే.. ప్రేమంట'. ఈ మూడు సినిమాలతో తమన్నా తెలుగులో నెంబర్ వన్ తార అవడం ఖాయమని చాలామంది నమ్ముతున్నారు. వారి నమ్మకం నిజమవుతుందో, లేదో వెయిట్ అండ్ సీ.

Thursday, November 25, 2010

ఫోకస్: నిలిచే తార ఎవరు? (చివరి భాగం)

'దేవదాసు'తో ఇలియానా పేరు ఎలా మారుమోగిందో, అలాగే 'ఝుమ్మంది నాదం'తో తాప్సీ పేరు ప్రచార మాధ్యమాల్లో మోగిపోయింది. సహజంగానే ఆమెతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు బారులు తీరారు. ప్రస్తుతానికైతే ఆమె మూడు సినిమాలు చేస్తోంది. ఒకటి ప్రభాస్‌తో దిల్ రాజు నిర్మిస్తోన్న సినిమా, రెండోది విష్ణుతో మోహన్‌బాబు నిర్మిస్తోన్న 'వస్తాడు నారాజు', మూడోది రవితేజ సినిమా 'వీర'. వచ్చే ఏడాది ఆమె డైరీలో ఖాళీ లేదనేది సమాచారం.
ఈ ఇద్దరితో పాటు మరో తార కూడా నేను సైతం అంటూ ముందుకొస్తోంది. ఆమె శేఖర్ కమ్ముల రూపొందించిన 'లీడర్' ద్వారా నాయికగా పరిచయమైన బెంగాలీ భామ రిచా గంగోపాధ్యాయ్. గతంలో శేఖరే పరిచయం చేసిన 'ఆనంద్'తో పరిచయమైన మరో బెంగాలీ తార కమలినీ ముఖర్జీ ఆ సినిమా తర్వాత అనుకున్న మేర రాణించని నేపథ్యంలో రిచా ఎలా నెగ్గుకొస్తుందో చూడాలి. 'లీడర్'లో ఫర్వాలేదనిపించిన ఆమె, రెండో సినిమాలోనే రవితేజ వంటి స్టార్ హీరోతో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ సినిమా పేరు 'మిరపకాయ్'. హరీశ్ శంకర్ దర్శకుడు. కొత్త తారల్లో అందంతో పాటు కొద్దో గొప్పో అభినయ సామర్థ్యం వున్న తార మధురిమ. 'ఆ ఒక్కడు' అనే సినిమాలో తన నటనతో మెప్పించిన ఆమె ఇటీవల వంశీ సినిమా 'సరదాగా కాసేపు'లో నరేశ్‌కి జోడీగా ఆకట్టుకుంది. అయితే ఆమెకి చిత్రసీమ ఏమేరకు అవకాశాలు కల్పిస్తుందనే దానిపైనే ఆమె భవితవ్యం ఆధారపడి వుంది.
ఇక తెలుగు తారల సంగతికొస్తే, వారిలో ఏ ఒక్కరూ కొన్నాళ్లపాటైనా ప్రేక్షకుల్లో ఆదరణ నిలుపుకుంటారని చెప్పలేని స్థితి. 'నచ్చావులే'తో మెరిసిన మాధవీలత ఇమేజ్ ఆ తర్వాత ఒక్కసారిగా మసకబారిపోయింది. ఇప్పుడామెని తలచుకుంటున్నవాళ్లే లేరు. 'అష్టాచమ్మా'లో ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకున్న స్వాతికి స్టార్ ఇమేజ్ రావడం కష్టమే. 'ఆవకాయ్ బిర్యానీ' చేదుగా మారినా, 'బంపర్ ఆఫర్'తో ఓ మోస్తరుగా రాణించిన బిందుమాధవికి సరైన అవకాశాలు లేవు. మిగతావాళ్లకి ఆ మాత్రం పేరు కూడా లేదు. ఏదేమైనా హీరోతో పాటు హీరోయిన్ పాత్రకీ కథలో ప్రాధాన్యత ఉంటేనే నాయికలు ఎక్కువకాలం పరిశ్రమలో నిలుస్తారు. అందుకు హీరోలు, దర్శకులు, రచయితలు పెద్ద మనసు చేసుకోవాలి. (అయిపోయింది)

Tuesday, October 26, 2010

ఫోకస్: 'నంది' లీలలు (చివరి భాగం)

'లీడర్'కి అన్యాయం?
'ఇంకోసారి' అనే సినిమా ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు పోయిందో సాధారణ ప్రేక్షకులకే కాదు విమర్శకులకి కూడా జ్ఞాపకం లేదు. ఆ సినిమాలో నటించించిన వెన్నెల కిశోర్ ఉత్తమ హాస్యనటుడిగా, దాన్ని డైరెక్ట్ చేసిన సుమాన్ పాతూరి తొలి చిత్ర దర్శకుడిగా అవార్డులు పొందారు. హాస్యనటుడిగా అవార్డునివ్వాలంటే అతను ఆ పాత్ర ద్వారా జనాన్ని బాగా నవ్వించాలి కదా. కానీ ఆ సినిమాని చూసిన వాళ్లెంతమంది? సుమన్ పాతూరితో పోలిస్తే ఉత్తమ తొలిచిత్ర దర్శకుడిగా ఎంపికకు అర్హత ఉన్నది ఉత్తమ సకుటుంబ కథా చలనచిత్రంగా అవార్డుకు ఎంపికైన 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' దర్శకుడు కిశోర్ కే అనేదే అత్యధిక విమర్శకుల అభిప్రాయం. ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎం.ఎం. కీరవాణిని ఎంపిక చేశారు. ప్రస్తుత సంగీత దర్శకుల్లో ఆయన అగ్రగణ్యుడనేది నిర్వివాదం. కానీ ఆయన ఆ అవార్డుకు ఎంపికైన చిత్రం సందర్భవశాత్తూ 'మగధీర' కాదు, 'వెంగమాంబ'! జనానికి తెలిసింది 'మగధీర' సంగీతమా? 'వెంగమాంబ' సంగీతమా? ఇలాగే మరికొన్ని అవార్డుల విషయంలోనూ ఇదే అభిప్రాయం కలుగుతుంది.
ఈ అవార్డుల విషయంలో అన్యాయం జరిగిన సినిమా ఏదంటే 'లీడర్' అనే చెప్పాలి. ఈ సినిమాకి కంటితుడుపుగా ఉత్తమ కథా రచయిత అవార్డునిచ్చారు. శేఖర్ కమ్ముల తయారుచేసిన కథ నచ్చిన జ్యూరీకి ఈ సినిమాలో మరే అంశమూ నచ్చకపోవడం వైచిత్రి. రాష్ట్రానికి ముఖ్యమంత్రయి, వ్యవస్థలోని అవినీతిని అంతం చేయాలని తపించే యువకుడి కథతో రూపొందిన ఈ సినిమా జ్యూరీని ఇతర అంశాల్లో ఎందుకు మెప్పించలేక పోయింది? ఉత్తమ చిత్రం కేటగిరీలో ఎంపికైన మూడు చిత్రాల్లోని కథకంటే ఈ సినిమా కథ ఉత్తమమైందని జ్యూరీకి తోచినప్పుడు ఉత్తమ చిత్రాలుగా వాటిని ఏ ప్రాతిపదిక ఆధారంగా ఎంపిక చేసినట్లు? 'నంది అవార్డుల జ్యూరీ లీలలు ఇన్నిన్నికాదయా' అని చెప్పడానికి ఇంతకు మించి నిదర్శనం మరేముంటుంది?  (అయిపోయింది)

Wednesday, October 13, 2010

సినిమా: మంచి సినిమాకి మంచి రోజులు? (చివరి భాగం)

కథనమే కాదు కథా ముఖ్యమే
సరే, ఇక్కడ మనం ప్రస్తావిస్తున్న చిన్న చిత్రం అంటే చెత్త సినిమా కాదు, 'బి' గ్రేడ్ సినిమా అంతకంటే కాదు. చిన్న సినిమా పేరుతో వచ్చే 'బి' గ్రేడ్ సినిమాల వల్లే వాటికి చెడ్డ పేరు వచ్చింది. కానీ ఇక్కడ చిన్న సినిమా అంటే 'ఆనంద్', 'హ్యాపీడేస్', 'వినాయకుడు', 'గమ్యం' లాంటి నవ్య సినిమాలు. బడ్జెట్ పరంగానే అవి చిన్న సినిమాలు కానీ, భారీ బడ్జెట్ తో తీసిన ఎన్నో స్టార్ల సినిమాల కంటే అవి మంచి సినిమాలు, పెద్ద సినిమాలు. మనం చెప్పుకుంటోంది అలాంటి చిన్న, మంచి సినిమాల గురించి. మల్టీప్లెక్స్ విప్లవం మొదలైన కాలంలో ఇక భవిష్యత్ అంతా స్వతంత్ర సినిమాదే అనే అభిప్రాయం కలిగిందనేది నిజం. అయితే అది అనుకున్నంత వేగంగా జరగడం లేదనేదీ వాస్తవం. కారణం కథలో కంటే కథనంలోనే ఎక్కువ కొత్తదనం కనిపిస్తుండటం. థియేటర్లకు వెళ్లకుండా ఇంట్లో వీడియోల్లోనూ, టీవీల్లోనూ సినిమాలు చూడటం మొదలుపెట్టిన వాళ్లు కూడా ఇప్పుడు కనీసం వారాంతాల్లోనైనా సినిమా హాళ్లకు రావాలనుకుంటున్నారు. ఈ తరహా ప్రేక్షకులకి కొత్త తరహా కథలు, కథనాలు కావాలి. స్వతంత్ర సినిమా దర్శకులకి కావలసింది ఇదే. 'తక్కువ బడ్జెట్ తో సినిమా తీసి విడుదల చేస్తే చాలు - శాటిలైట్, వీడియో హక్కులతో పెట్టుబడి అంతా వచ్చేస్తుంది' అనే అభిప్రాయంతో కొంతమంది దర్శకులు కథ, కథనాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టకుండా సినిమాలు తీసి, చెడ్డపేరు తెచ్చుకున్నారు. ఈ ధోరణిని మార్చుకుని హద్దుల్ని చెరిపేసే రీతిలో కష్టపడి పనిచేసి, కొత్తదనంతో సినిమాలు తీయకపోతే నవ్య సినిమాకి ఈరోజు ఉన్న మంచి అవకాశాన్ని జారవిడుచుకున్నవాళ్లు అవుతారు.
ఇవాళ విలక్షణమైన కథ, కథనాలతో తీస్తున్న దర్శకులు ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువమందే ఉండటం తెలుగు సినిమాకి సంబంధించి శుభపరిణామం. వాళ్లు తీసే నాణ్యమైన సినిమాల సంఖ్య ఏడాదికి పది మించగలిగితే స్టార్లు సైతం తమ అభిప్రాయాల్ని మార్చుకుని, ఆ దర్శకులతో పనిచేయాలని ఉవ్విళ్లూరుతారు. శేఖర్ కమ్ముల ఈమధ్య రూపొందించిన 'లీడర్' సినిమాని గానీ, కొత్త దర్శకుడు చైతన్య దంతులూరి తీసిన 'బాణం'ని గానీ, దేవా కట్టా డైరెక్ట్ చేసిన 'ప్రస్థానం'ని గానీ స్టార్ వాల్యూ ఉన్న నటులు చేసినట్లయితే పెద్ద హిట్లయ్యేవి. అయితేనేం, వాటి ద్వారా ఆ దర్శకుల ప్రతిభ బయటపడింది. వాటి వల్ల ఇద్దరు ముగ్గురు ప్రతిభావంతులైన నటులు పరిచయమై, భవిష్యత్ మీద ఆశలు రేకెత్తించారు. ఇదే స్పిరిట్ తో స్వతంత్ర సినిమా దర్శకులు ముందుకు అడుగేయాలి. తెలుగులో మంచి సినిమాలకు కొదవలేదనే పేరు వచ్చే అవకాశం ఉంది వాళ్ల వల్లనే.  (అయిపోయింది)                         

Tuesday, October 12, 2010

సినిమా: మంచి సినిమాకి మంచి రోజులు? (2వ భాగం)

ఆక్సిజన్ ఇచ్చిన 'ఆనంద్'
నిజం చెప్పాలంటే 1989లో రాంగోపాల్ వర్మ అనే కొత్త దర్శకుడు తీసిన 'శివ' సైతం స్వతంత్ర సినిమా అనే చెప్పాలి. అయితే అందులో హీరో నాగార్జున స్టార్ కావడం వల్లే ఆ సినిమా కోట్ల రూపాయల్లో వసూళ్ల వర్షాన్ని కురిపించింది. దాదాపు అదే సమయంలో తమ్మారెడ్డి భరద్వాజ్ రూపొందించిన 'అలజడి' చిత్రం సైతం స్వతంత్ర సినిమానే. స్టార్లు లేకపోవడం వల్లే ఆ సినిమా 'శివ' స్థాయి విజయాన్ని నమోదు చేయలేకపోయింది.  అయినప్పటికీ దానినీ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ప్రేక్షకులు చూశారు.
ఇటీవలి కాలానికొస్తే స్టార్లు లేకుండా 'మంచి కాఫీలాంటి సినిమా' అంటూ శేఖర్ కమ్ముల రూపొందించిన 'ఆనంద్' సినిమాకి పెట్టుబడి పెట్టేందుకు గానీ, దాన్ని విడుదల చేయడానికి గానీ ఎవరూ ముందుకు రాలేదు. అయినా కేవలం తన పనినీ, తన సినిమానీ నమ్ముకున్న శేఖర్ రాష్ట్రం మొత్తం మీద కేవలం మూడంటే మూడు ప్రింట్లతో 'ఆనంద్'ని విడుదల చేస్తే, ఆ తర్వాత అది ఎంత సంచలనాన్ని సృష్టించిందీ, స్వతంత్ర సినిమా దర్శకుడిగా శేఖర్ కి ఎంత మైలేజ్ ఇచ్చిందీ మనకు తెలియంది కాదు. 'ఆనంద్' సినిమా మంచి సినిమా దర్శకులకి అక్సిజన్ లాగా పనిచేసిందని చెప్పాలి.
మూస పంథాలో తీస్తే తప్ప జనం చూడరనే అభిప్రాయం అందరిలో ఉంది. ఆ అభిప్రాయం తప్పని అప్పట్లో 'శివ', ఇప్పట్లో 'ఆనంద్' నిరూపించాయి. అయినప్పటికీ 'కమర్షియల్ ఉచ్చు'లో ఉండేందుకే ఇష్టపడే నిర్మాతలు తాము మార్కెట్ ఉందనుకున్న ఒక స్టార్ హీరోని పెట్టి 20 కోట్ల రూపాయలయినా ఖర్చుచేసి సినిమా తీస్తున్నారు కానీ, దానివల్ల నష్టాలు వచ్చినా భరిస్తున్నారు కానీ ఒక చిన్న చిత్రం మీద ఒక కోటి రూపాయలు వెచ్చించేందుకు మాత్రం అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. వాళ్లకి మరోరకంగా సినిమా నిర్మించడం తెలియకపోవడమే దీనికి కారణమంటే కరెక్టుగా ఉంటుంది. సినిమా నిర్మాణంలో వారికి అర్థమయ్యే ఒకే ఒక అంశం టేబుల్ ప్రాఫిట్. అది రావాలంటే ఒక స్టార్ హీరో లేదా స్టార్ డైరెక్టర్ ఉండాలి. ఇక స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లకు కూడా వాళ్లదైన ఒక అజెండా ఉంటుంది. ఫలానా తరహా సినిమాలనే ప్రేక్షకులు ఇష్టపడతారని వాళ్లు అనుకుంటూ ఉంటారు. కానీ చిత్రమేమంటే వాస్తవాలు అందుకు భిన్నంగా ఉంటాయి. వాళ్లు నటించే సినిమాల్లో సక్సెస్ అయ్యేది 15 నుంచి 20 శాతమే. అంటే ప్రేక్షకుల ఆదరణ పొందాలనే లక్ష్యంతో తీసిన సినిమాల్లో అత్యధిక శాతం పరాజయం పాలవుతుంటాయి. వాటికి పెట్టిన డబ్బులు కూడా తిరిగిరావు. అయినా స్టార్ల దృక్పథంలో మార్పు రావడం లేదు.  (ఇంకావుంది)                      

Sunday, October 10, 2010

సినిమా: మంచి సినిమాకి మంచి రోజులు? (1వ భాగం)

గ్రామీణ ప్రాంతాల్లో సినిమా థియేటర్లు ఒక్కొక్కటే మూతపడుతూ పట్టణాలు, నగరాల్లో మల్టీప్లెక్సుల సంఖ్య పెరుగుతుండటంతో తెలుగు సినిమా నిర్మాణ ఫార్ములా క్రమేపీ మార్పుకు గురవుతోంది. 'స్టార్ మేనియా' ఇప్పటికీ కొనసాగుతున్నా కొత్త తరహా కథాకథనాలతో వస్తున్న సినిమాలు సైతం కొద్దో గొప్పో ఆదరణ పొందుతున్నాయి, 'మంచి సినిమా'గా పేరు తెచ్చుకుంటున్నాయి. చంద్రసిద్ధార్థ్, శేఖర్ కమ్ముల, రవిబాబు, దేవా కట్టా, సాయికిరణ్ అడివి, క్రిష్, చైతన్య దంతులూరి, మధుర శ్రీధర్ వంటి దర్శకులు మంచి సినిమా పట్ల ఆశలు రేకెత్తిస్తున్నారు.
'ఆ నలుగురు' ఆదర్శం
ఆరు సంవత్సరాల క్రితం వచ్చిన 'ఆ నలుగురు' సినిమా ఈ నవ్య పంథాకు మార్గదర్శకంగా నిలిచిందని చెప్పాలి. చంద్రసిద్ధార్థ్ రూపొందించిన ఆ సినిమా 2004 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా నంది అవార్డు పొందడమే కాక, ఉత్తమ నటునిగా రాజేంద్రప్రసాద్ కీ, ఉత్తమ క్యారెక్టర్ నటునిగా కోట శ్రీనివాసరావుకీ అవార్డులు సంపాదించి పెట్టింది. అన్నింటికీ మించి ఆ సినిమాని చెప్పుకోదగ్గ రీతిలో ప్రేక్షకులు సైతం ఆదరించారు. తన సినీ జీవితంలో 'ఆ నలుగురు' సినిమా ఓ మైలురాయి లాంటిదని రాజేంద్రప్రసాద్ గర్వంగా చెప్పుకోవడమే ఈ సినిమా గొప్పతనాన్ని చాటి చెబుతుంది. తన సంపాదనలో సగాన్ని ప్రజోపయోగ కార్యక్రమాలకు వెచ్చించే ఓ దినపత్రిక సంపాదకుడు రఘురామ్ తన మనసుకు విరుద్ధమైన పని చేయాల్సి వస్తే ఎలాంటి సంఘర్షణకు గురవుతాడు, అతడు చినిపోయాక కూడా అతని ఆత్మ ఎంతగా క్షోభిస్తుందనే అంశాన్ని హృద్యంగా చిత్రించిన విధానం అందరి ప్రశంసల్నీ పొందింది. మంచి సినిమా దర్శకుడిగా చంద్రసిద్ధార్థ్ ఎంతో పేరు తెచ్చుకున్నాడు. అయితే అతను కేవలం మంచి సినిమా దర్శకుడే కాదు, 'స్వతంత్ర సినిమా' దర్శకుడు కూడా. 'స్టార్' విలువ మీద ఆధారపడకుండా, నిర్మాత వత్తిళ్లకు తలొగ్గకుండా, తనేం తీయదలచుకున్నాడో, దాన్ని అందంగా, నాణ్యంగా సెల్యులాయిడ్ మీద చిత్రించేవాడూ, మార్కెట్లు, వర్తమాన ధోరణులు, అభిప్రాయాలు, ప్రేక్షకుల అంచనాలు, అమలులో ఉన్న సినిమా రూపకల్పన విధానాల ప్రభావం లేకుండా తీసేవాడూ స్వతంత్ర సినిమా దర్శకుడు అని సూత్రీకరిస్తాడు బాలీవుడ్ లో 'రఘు రోమియో' చిత్ర రూపకర్త రజత్ కపూర్. ఆ రెండు సినిమాలతో పాటు బాలీవుడ్ లో వచ్చిన 'హైదరాబాద్ బ్లూస్', 'మాన్సూన్ వెడ్డింగ్', 'సత్య', 'ఝంకార్ బీట్స్', 'దేవ్ డి', 'హరిశ్చంద్రాచ్చి ఫ్యాక్టరీ', 'ఖర్గోష్' వంటి సినిమాలు స్వతంత్ర సినిమా జెండాని నిలబెట్టేందుకు ఉపకరించాయి. వాటి తరహాలోనే తెలుగులో 'ఆనంద్', 'హ్యాపీడేస్', 'ఎ ఫిల్మ్ బై అరవింద్', 'వినాయకుడు', 'మంత్ర', 'అనసూయ', 'గమ్యం', 'బాణం', 'విలేజ్ లో వినాయకుడు', 'లీడర్', 'ప్రస్థానం', 'అందరి బంధువయ', 'వేదం' వంటి సినిమాలు మంచి సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి. వీటిలో చాలావాటికి ప్రేక్షకాదరణ కూడా ఉండటం ఇక్కడ గమనించాల్సిన అంశం.  (ఇంకావుంది)

Monday, September 20, 2010

సినిమా: 'డమ్మీ' డైరెక్టర్లు!

ఓడకి కెప్టెన్ ఎలాంటివాడో సినిమాకి డైరెక్టర్ అలాంటివాడనే విషయంలో భేదాభిప్రాయాలు వుండవు. ఒక సినిమా హిట్టయినా, ఫ్లాపయినా బాధ్యత దర్శకుడిదే అనేది అందులోని అంతరార్ధం. చిత్రంలో కథ లేకపోయినా తమ కథన నైపుణ్యంతో ఆ చిత్రాన్ని గొప్పగా తీర్చిదిద్దిన ప్రతిభావంతులైన దర్శకులు మనకున్నారు. పూరీ జగన్నాథ్, ఎస్.ఎస్. రాజమౌళి, వి.వి. వినాయక్, శేఖర్ కమ్ముల, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి దర్శకులకు 'నెరేషన్ టెక్నిక్స్' బాగా తెలుసు. ఒక చిన్న పాయింటును ఆధారం చేసుకుని కథనంతోనే చిత్రాన్ని ఆసక్తికరంగా మలచడం వాళ్ల సృజనాత్మకతకు నిదర్శనం. వీళ్లు దర్శకత్వం చేసేప్పుడు నిర్మాతల జోక్యం సినిమా మేకింగ్‌లో ఏమాత్రం వుండదు. ఒకవేళ అలా ఏ నిర్మాతైనా మధ్యలో వేలుపెట్టి 'ఈ సీన్ ఇలా కాదు అలా చేస్తే బాగుంటుంది' అనంటే ఈ దర్శకులు దాన్ని సహించి, నిర్మాత చెప్పినట్లుగా ఆ సీన్‌ని రూపొందిస్తారని అనుకోలేం.
దర్శకత్వం సృజనాత్మకం:
దర్శకత్వం అన్నది సృజనాత్మక ప్రక్రియ. తన మేధస్సుకి అనుగుణంగా సినిమాని రూపొందించే దార్శనికత దర్శకునికే వుంటుంది. ఒక్కో సన్నివేశాన్ని ఎలా రూపొందించాలన్నది 'ఫ్రేమ్ బై ఫ్రేమ్' అతడి మైండులో రూపుదిద్దుకుని వుంటుంది. దానికి తగ్గట్లుగానే అతడు సన్నివేశాల రూపకల్పనలో నిమగ్నమవుతాడు. ఒక్కోసారి కొత్త ఆలోచనలు కూడా సన్నివేశాల చిత్రీకరణ సమయంలో అతడికి కలుగుతుంటాయి. అప్పుడు ఒకసారి ఏ విధంగా ఆ సన్నివేశాన్ని రూపొందిస్తే బాగుంటుందో సమీక్షించుకుని, బేరీజు వేసుకుని, ఫలానావిధంగా తీస్తే బాగుంటుందనే నిర్ధారణకు వచ్చి ఆ రకంగా ఆ సన్నివేశాన్ని తీస్తాడు. సృజనాత్మక శక్తి వున్న దర్శకులు ఇలా ఎప్పటికప్పుడు తమ మేధస్సుకి మరింత పదును పెట్టుకుంటూ వుంటారు. దర్శకుడు చెప్పినట్లు చేసుకుపోవడమే తమ పని.. అని నటీనటులు భావించినప్పుడు ఏ సమస్యా వుండదు. దర్శకుడి పనితనం మీద నమ్మకం వున్న పెద్ద పెద్ద హీరోలు సైతం దర్శకుణ్ణి ఇబ్బంది పెట్టకుండా అతడికి విలువనిచ్చి పూర్తి స్వేచ్ఛనిచ్చేవాళ్లున్నారు. సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈమధ్య ఈ సంగతే చెబుతూ, మహానటుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు కూడా తాను స్వయంగా దర్శకుడైనప్పటికీ తన దర్శకులు ఎలా చెబితే అలా చేసేవారనీ, మధ్యలో జోక్యం కల్గించుకునేవారు కాదనీ గుర్తు చేసుకున్నాడు. అప్పటి హీరోలు గానీ, నిర్మాతలు గానీ దర్శకులకి అలాగే విలువనిచ్చేవాళ్లు. అయితే ఇప్పుడు కొంతమంది హీరోలు దర్శకత్వ పనిలో జోక్యం చేసుకుంటూ వాళ్లని డమ్మీ దర్శకులుగా మారుస్తుండటం చర్చనీయాంశమవుతోంది.
నిర్మాత పెట్టుబడిదారుడు మాత్రమే:
నిజానికి నిర్మాత అంటే సినిమాకు పెట్టుబడిదారుడు. ఒక ప్లానింగ్ ప్రకారం దర్శకునికి చిత్ర రూపకల్పనలో అవసరమయ్యే నటీనటుల్ని గానీ, సన్నివేశాలకు తగినట్లు అవసరమయ్యే సరంజామాను గానీ, లొకేషన్లను గానీ, సెట్టింగులను గానీ సమకూర్చిపెట్టే బాధ్యత నిర్మాతది. అంతే తప్ప ఏ సన్నివేశాన్ని ఎలా తీయాలనేది అతడి పనికాదు. ఆ పని చూసుకునేది దర్శకుడే. అట్లాంటిది ఇప్పుడు కొద్దిమంది నిర్మాతలు పేరుకి దర్శకుణ్ణి పెట్టుకున్నా పెత్తనమంతా వాళ్లే చేస్తుండటం విమర్శలకి తావిస్తోంది. వీళ్లు సీనియర్ దర్శకులైతే తమ మాట నెగ్గదనే సందేహంతో కాబోలు కొత్త దర్శకుల్నీ, లేదా ఇంకా లైమ్‌లైట్‌లోకి రాని దర్శకుల్నీ తమ చిత్రాలకి ఎన్నుకుంటారు. ఈ కొత్త దర్శకులు కూడా పెద్ద నిర్మాత తమకి మంచి అవకాశమిచ్చాడు కదాని పొంగిపోతారు. షూటింగ్ మొదలవకముందే నిర్మాత "సినిమా గురించి నువ్వేమీ బయట మాట్లాడొద్దు. అంతా నేను చూసుకుంటా" అని ఒక ఆజ్ఞ లేదా హెచ్చరికను జారీ చేస్తాడు. దాంతో సదరు దర్శకుడు ముందు ఖంగుతిని, తర్వాత తనకుతాను సర్దిచెప్పుకుని 'రాముడు మంచి బాలుడు' తరహాలో తలాడించి, ఎప్పుడెవరు సినిమా గురించి అడిగినా "ఈ సినిమా గురించి ఏమడిగినా నేను చెప్పను. అంతగా కావాలనుకుంటే ప్రొడ్యూసర్ని అడగండి" అని చెబుతుంటాడు. మనం ఎన్నిసార్లడిగినా ఇదే రికార్డ్ రిపీట్ అవుతుందన్న మాట.
దీన్నిబట్టి అర్ధమయ్యేదేమిటంటే దర్శకుల్ని ఈ నిర్మాతలు తమ కంట్రోలులో వుంచుకుంటున్నారు. భారీ లేదా క్రేజీ చిత్రానికి దర్శకుడిగా తమకి పేరైతే వస్తుంది కదా.. అనే ఆశతో ఈ దర్శకులు తలాడించేస్తున్నారు. ఇటువంటి దర్శకులు భవిష్యత్తులో తమ సృజనాత్మక శక్తిని ఎలా ప్రదర్శించగలరో అర్ధంకాదు. ఓరకంగా వాళ్లు తమలో అంతదాకా వున్న సృజనాత్మకతని కూడా కోల్పోయే ప్రమాదం వుంది. అంతేకాదు. ఈ తరహా నిర్మాతలు ఇతర నిర్మాతలకి కూడా ఆదర్శంగా మారిపోయేందుకు ఆస్కారం వుందనడానికి వీలు కలుగుతోంది. దర్శకుడి పనిలో నిర్మాత జోక్యం చేసుకోవడం వల్ల సినిమా 'కిచిడీ' లాగా తయారై ఇద్దరికీ నష్టం చేకూర్చవచ్చు. అందుచేత నిర్మాతలు తమ పరిధిమేరకు సినిమా నిర్మాణంలో పాలుపంచుకునే విషయమై ఆలోచించాలి. దర్శకులు కూడా 'రాజీ' మనస్తత్వాన్ని వదిలించుకుని, తమ సొంత సృజనాత్మకతతో సినిమాకు పర్ఫెక్షన్ తీసుకొచ్చేందుకు కృషి చేయాలి.

Saturday, June 19, 2010

Ninna 'Gamyam'.. Nedu 'Vedam'

మూసలోపడి కొట్టుకుపోతున్న తెలుగు సినిమాకి అప్పుడప్పుడు ఎవరో ఒక దర్శకుడు రేపటి మీద ఆశని రేకెత్తిస్తూ వస్తున్నాడు. శేఖర్ కమ్ముల, సాయికిరణ్ అడివి, జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) వంటి దర్శకులు సృజనాత్మకపరంగా తెలుగు సినిమాని ఓ మెట్టుపైకి తీసుకెడతారనే నమ్మకాన్ని కలిగిస్తున్నారు. 'మినిమం గ్యారంటీ' ఉచ్చులో పడకుండా మన సినిమాల్లో చెప్పని కథలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. 'గమ్యం' సినిమా వచ్చినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. జీవితంలోని వెలుగునీడల్ని, జీవిత సారాంశాన్ని ఇంత అందంగా తియ్యగల దర్శకులు తెలుగులో ఉన్నారా! అన్నదే ఆ ఆశ్చర్యానికి కారణం. ఆవారాగా, ఆకతాయిగా తిరిగే గాలి శీను తనకు ఎదురైన అనుభవాలనుంచి నేర్చుకున్న పాఠాలతో ఎలా ఆఖరుకి త్యాగమూర్తిగా మిగిలాడో చూసి, కళ్లతో పాటు గుండెనీ తడిచేసుకున్నాం. గాలి శీను కళ్ల ముందు నుంచి ఇంకా అదృశ్యమవకుండానే ఇప్పుడు మరో కేబుల్ రాజు ఆ స్థానంలో వచ్చి నిల్చున్నాడు. 'వేదం'లో కేబుల్ రాజుని చూస్తే 'గమ్యం'లోని గాలి శీను జ్ఞాపకమొస్తాడు. ఆకతాయితనంలో గాలి శీనుని మించినవాడు కేబుల్ రాజు. డబ్బుకోసం ఎదుటివాళ్లని బోల్తాకొట్టించడంలో మొనగాడు. డబ్బున్న అమ్మాయి ప్రేమని పొంది, రంగుల కలల్లో విహరిస్తున్నవాడు. ఒకప్పుడు అందరూ ఈసడించుకున్నవాళ్లే, చీదరించుకున్నవాళ్లే చివరాఖరుకి అతడు చేసిన త్యాగానికి
కదిలిపోయి జేజేలు పలికారు. జీవన వాస్తవం అంటే అదే. 'గమ్యం'తో ఎంతగా ఆశ్చర్యపరిచాడో, 'వేదం'తో అంతగానూ అబ్బురపరిచాడు క్రిష్‌లోని డైరెక్టర్. 'గమ్యం'కి మూలం 'మోటార్ సైకిల్ డైరీస్' అన్నారు. 'వేదం'కి ప్రేరణ ఆరేళ్ల క్రితం ఆస్కార్ అవార్డులు పొందిన 'క్రాష్' అంటున్నారు. కావచ్చు. కాకపోవచ్చు. ఒకవేళ అది నిజమేననుకున్నా, ఎంతమంది దర్శకులు ఎన్ని సినిమాల్ని కాపీ కొట్టలేదు. కానీ తెలుగుతనానికి దగ్గరగా, అందంగా, ఆర్ద్రంగా వాటిని మలిచిందెంతమంది? ఆ కళేదో, ఆ విద్యేదో క్రిష్ నేర్చాడనుకోవాలి. తన సినిమాలు హాలీవుడ్ నుంచో, మరో వుడ్ నుంచో వండినవి కాదని అంటాడు క్రిష్. కావాలంటే తన కథల, తన పాత్రల మూలాలు నిజ జీవితంలోనూ, సాహిత్యంలోనూ ఉన్నాయంటాడు. 'వేదం'లో తను సృజించిన ఐదు ప్రధాన పాత్రలే కాక, మిగతా చిన్న చిన్న పాత్రలు కూడా మన కళ్లముందు కనిపించేవేనంటాడు.
'వేదం'అఓ ఐదు ప్రధాన పాత్రలూ ఒకదానికొకటి పూర్తిగా భిన్నమైనవే కాదు, వాటి కథలూ భిన్నమైనవే. సంపన్న కుటుంబానికి చెందిన వివేక్ చక్రవర్తి (మంచు మనోజ్) అనే రాక్‌స్టార్, మధ్య తరగతికి చెందిన ముస్లిం యువకుడు రహీముద్దీన్ ఖురేషి (మనోజ్ బాజ్‌పేయి), దిగువ తరగతికి చెందిన కేబుల్ రాజు (అల్లు అర్జున్), పూట గడవడమే కష్టమైన చేనేత కార్మికుడు రాములు (నాగయ్య), సమాజమంతా ఈసడించుకునే, రాత్రి జీవితం మాత్రమే ఉండే వేశ్య అమలాపురం సరోజ (అనుష్క).. ఒక్కొక్కరిది ఒక్కో కథ, ఒక్కో వెత.
తల్లి సైనికుడిగా చూడాలనుకుంటే రాక్‌స్టార్ కావాలనుకున్న వివేక్ చక్రవర్తిలోని స్వార్థం అతణ్ణి ఏ పరిస్థితుల్లో నిలిపిందో, ఆ పరిస్థితుల నుంచి పాఠం నేర్చుకున్న అతను చివరికి అమ్మ గర్వపడే స్థాయికి ఎలా చేరుకున్నాడో చూసి సంతృప్తిపడతాం. దైనందిన జీవితంలో కేబుల్ రాజు వంటి వ్యక్తులు తగలని వాళ్లం ఉండం. కానీ అలాంటివాళ్లు మనకి ఏ సినిమాలోనూ కనిపించలేదు. అందుకే రెబల్‌గా, చిలిపిగా, ఆకతాయిగా కనిపించే పక్కా మాస్ క్యారెక్టర్ కేబుల్ రాజుని మొదట కోపగించుకుంటాం. తర్వాత అతణ్ణి భుజాలమీద పెట్టుకుంటాం. "రాములు కథ అనుకున్నప్పుడు ఒక వృత్తి పనివాణ్ణిగా చూపించాలనుకున్నా. ఇటీవలి కాలంలో సిరిసిల్ల చేనేత కార్మికుల ఆత్మహత్యలు హెడ్‌లైన్స్‌లో నిలిచాయి. కథకి రెలటివిటీగా ఉంటుందని రాములుని చేనేత కార్మికుడిగా చూపించా" అని చెప్పాడు క్రిష్. తనకు హైదరాబాద్‌లో ఎదుగుదల ఉండదనీ, అందుకని దుబాయ్ వెళ్లి సంపాదించి, మెరుగైన జీవనం గడపాలనుకునే రాహీముద్దీన్ ఖురేషి లాంటి మధ్యతరగతి జీవులు ఎక్కడ వెతికినా కనిపిస్తారు. అమలాపురం సరోజ పాత్ర సృష్టి వెనుక బాలగంగాధర్ తిలక్ 'ఊరి చివరి ఇల్లు'లోని పాత్ర ప్రేరణ ఉందంటాడు క్రిష్. ఒక వేశ్య అయినా పిల్లవాడికి పాలిచ్చే సరోజని చూసినప్పుడు ఎవరూ ఆమెలో శృంగారాన్ని చూడకపోవడం అతని దర్శకత్వ చాతుర్యానికి నిదర్శనం. ఈ పాత్రల్ని తెరమీద ధరించిన వాళ్లంతా వాటికి న్యాయం చేకూర్చడం వల్ల ఆ పాత్రలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ముఖ్యంగా కేబుల్ రాజుగా అల్లు అర్జున్, సరోజగా అనుష్క తమ నటనతో ఆ పాత్రలకి వన్నెతెచ్చారు. క్లైమాక్స్ సన్నివేశాల్లో వివేక్ చక్రవర్తి పాత్రలో మనోజ్ హావభావాలు ఒక పట్టాన మరచిపోలేం. అలాగే పటేల్ దగ్గరున్న మనవణ్ణి విడిపించుకుని, అతడి చేయి పట్టుకుని నడిపించుకువెళ్లే రాములులోని రేపటి మీద ఆశ మనల్ని కదిలిస్తుంది. క్రిష్ మనసులోని దృశ్యాలకి జ్ఞానశేఖర్ కెమెరా ఇచ్చిన తెరరూపం అత్యున్నత స్థాయిలో ఉందని చెప్పడానికి సందేహించాల్సిన పనిలేదు. అతడికిది తొలి సినిమా అంటే నమ్మడం కష్టం. పాటల్లో కంటే కీరవాణి కీబోర్డు నేపథ్య సంగీతానికి బాగా ఉపకరించింది. ఆయా సన్నివేశాల్లోని మూడ్ ఎలివేట్ అయ్యింది ఆయన సంగీతం వల్లే. ఎడిటింగ్‌ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఐదు కథల్ని బిగి సడలకుండా, బోర్ కొట్టించకుండా ఆసక్తికరంగా కూర్చడం కత్తిమీద సాము. ఆ పనిని శ్రావణ్ నైపుణ్యంగా చేసుకుపొయ్యాడు. మూస సినిమాల్నే ఇష్టపడే వాళ్ల సంగతేమో కానీ కమర్షియాలిటీని మిస్ కాకుండానే కొత్తదనం కురిసే సినిమాల్ని చూడాలనుకున్న వాళ్లకి 'వేదం' తొలకరి జల్లులాంటిదే.

Friday, June 18, 2010

Rana.. The Rising Actor

శేఖర్ కమ్ముల రూపొందించిన 'లీడర్'తో కథానాయకుడిగా పరిచయమైన రానా (రామానాయుడు) చిత్రమైన సమస్యని ఎదుర్కొంటున్నాడు. ఆయన పొడవాటి రూపమే ఆ సమస్య. దీనివల్ల ఆయనకి తగ్గ కథానాయకిని అన్వేషించడం కష్టమైపోతోంది. ఈ సంగతిని ఆయనే చెప్పాడు. వంద రోజులు నడిచిన తొలి సినిమా 'లీడర్'లో ఆయన సరసన రిచా గంగోపాధ్యాయ్ ప్రదాన నాయకిగా పర్వాలేదనిపించింది. రెండో నాయిక ప్రియా ఆనంద్ అయితే మరీ పొట్టిగా కనిపించింది. అందువల్లే ఇప్పుడు తెలుగులో రెండో సినిమాకి నాయిక ఎంపిక కోసం కషపడుతున్నారు. ఈ రెండో సినిమాకి డైరెక్టర్ ఎవరో కాదు. రానా బాబాయ్ వెంకటేశ్ కథానాయకుడిగా 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రాన్ని రూపొందించిన శ్రీరాఘవ. "ఇది తెలుగు, తమిళ భాషల్లో ఉంటుంది. ఐదు వేల సంవత్సరాల క్రితం నేపథ్యంలో జరిగే కాల్పనిక కథ అది. తెలుగులో సురేశ్ ప్రొడక్షన్స్‌లో ఈ సినిమా ఉంటుంది. ఇది కొత్త తరహాలో ఉంటుందని చెప్పగలను. తెలుగు సంభాషణలు కూడా రెగ్యులర్ సినిమాల్లో మాదిరిగా ఉండవు. అడవిలో ఎక్కువ షూటింగ్ ఉంటుంది" అని చెప్పాడు రానా. హీరోయిన్ ఎంపిక జరిగితే ఈ నెలలోనే షూటింగ్ మొదలవుతుంది.
ప్రస్తుతం రానా హిందీలో 'దం మారో దం' చేస్తున్నాడు. ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్, ప్రతీక్ బబ్బర్ (రాజ్ బబ్బర్ కొడుకు)తో కలిసి నటిస్తున్నాడు. విశేషమేమంటే ఈ చిత్రంలో అతనికి జోడీగా బిపాషా బసు నటిస్తోంది. తెలుగులో గతంలో మహేశ్ సరసన 'టక్కరి దొంగ'లో కనిపించిన బిపాషా బాలీవుడ్‌లో పెద్ద హీరోయిన్ కిందే లెక్క. అలాంటిది అక్కడ తొలి సినిమాలోనే బిపాషాతో జతకట్టే అవకాశం దక్కింది రానాకి. ఈ సినిమాకి రోహన్ సిప్పీ దర్శకుడు. గోవా నేపథ్యంలో డ్రగ్ మాఫియా చుట్టూ అల్లిన కథతో ఈ సినిమా తయారవుతోంది.
తెలుగులో 'లీడర్' తర్వాత వెంటనే సినిమా ప్రారంభించకుండా ఇంత సమయం ఎందుకు తీసుకున్నట్లు? "నా తొలి సినిమా వంద రోజులు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉంది. ఒక ప్రయోగంగా చేసిన ఆ సినిమాని ప్రేక్షకులు మెచ్చడం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అయితే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నమైన ప్రత్యామ్నాయ సినిమాలు చేయొచ్చా, లేదా అని తెలుసుకోవడం కోసం కొంత సమయం తీసుకున్నా. ఒక ప్రధాన స్రవంతి కథకు ప్రత్యామ్నాయ ట్రీట్మెంట్ ఇచ్చి చేసిన సినిమా 'లీడర్'. రోజువారీ అందరూ ఎదుర్కొనే సమస్యల్ని చూపించిన సినిమా. దాని ఫలితంతో పూర్తి స్థాయిలో నేను సంతృప్తి చెందా. ఈ తరహా సినిమాలు చేయొచ్చనే నమ్మకాన్ని అది కలిగించింది" అని వివరించాడు రానా. ఆయనలో కేవలం నటుడే కాదు రచయిత కూడా ఉన్నాడు. స్వయంగా కొన్ని కథలు రాసుకున్నాడు కూడా. ఒక కథ తాలూకు పూర్తి స్క్రిప్టు ఆయా వద్ద సిద్ధంగా ఉంది. సమీప భవిష్యత్తులో ఆ కథతో సినిమా చేసే అవకాశముందని ఆయన చెప్పాడు.