ఓడకి కెప్టెన్ ఎలాంటివాడో సినిమాకి డైరెక్టర్ అలాంటివాడనే విషయంలో భేదాభిప్రాయాలు వుండవు. ఒక సినిమా హిట్టయినా, ఫ్లాపయినా బాధ్యత దర్శకుడిదే అనేది అందులోని అంతరార్ధం. చిత్రంలో కథ లేకపోయినా తమ కథన నైపుణ్యంతో ఆ చిత్రాన్ని గొప్పగా తీర్చిదిద్దిన ప్రతిభావంతులైన దర్శకులు మనకున్నారు. పూరీ జగన్నాథ్, ఎస్.ఎస్. రాజమౌళి, వి.వి. వినాయక్, శేఖర్ కమ్ముల, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి దర్శకులకు 'నెరేషన్ టెక్నిక్స్' బాగా తెలుసు. ఒక చిన్న పాయింటును ఆధారం చేసుకుని కథనంతోనే చిత్రాన్ని ఆసక్తికరంగా మలచడం వాళ్ల సృజనాత్మకతకు నిదర్శనం. వీళ్లు దర్శకత్వం చేసేప్పుడు నిర్మాతల జోక్యం సినిమా మేకింగ్‌లో ఏమాత్రం వుండదు. ఒకవేళ అలా ఏ నిర్మాతైనా మధ్యలో వేలుపెట్టి 'ఈ సీన్ ఇలా కాదు అలా చేస్తే బాగుంటుంది' అనంటే ఈ దర్శకులు దాన్ని సహించి, నిర్మాత చెప్పినట్లుగా ఆ సీన్‌ని రూపొందిస్తారని అనుకోలేం.
దర్శకత్వం సృజనాత్మకం:
దర్శకత్వం అన్నది సృజనాత్మక ప్రక్రియ. తన మేధస్సుకి అనుగుణంగా సినిమాని రూపొందించే దార్శనికత దర్శకునికే వుంటుంది. ఒక్కో సన్నివేశాన్ని ఎలా రూపొందించాలన్నది 'ఫ్రేమ్ బై ఫ్రేమ్' అతడి మైండులో రూపుదిద్దుకుని వుంటుంది. దానికి తగ్గట్లుగానే అతడు సన్నివేశాల రూపకల్పనలో నిమగ్నమవుతాడు. ఒక్కోసారి కొత్త ఆలోచనలు కూడా సన్నివేశాల చిత్రీకరణ సమయంలో అతడికి కలుగుతుంటాయి. అప్పుడు ఒకసారి ఏ విధంగా ఆ సన్నివేశాన్ని రూపొందిస్తే బాగుంటుందో సమీక్షించుకుని, బేరీజు వేసుకుని, ఫలానావిధంగా తీస్తే బాగుంటుందనే నిర్ధారణకు వచ్చి ఆ రకంగా ఆ సన్నివేశాన్ని తీస్తాడు. సృజనాత్మక శక్తి వున్న దర్శకులు ఇలా ఎప్పటికప్పుడు తమ మేధస్సుకి మరింత పదును పెట్టుకుంటూ వుంటారు. దర్శకుడు చెప్పినట్లు చేసుకుపోవడమే తమ పని.. అని నటీనటులు భావించినప్పుడు ఏ సమస్యా వుండదు. దర్శకుడి పనితనం మీద నమ్మకం వున్న పెద్ద పెద్ద హీరోలు సైతం దర్శకుణ్ణి ఇబ్బంది పెట్టకుండా అతడికి విలువనిచ్చి పూర్తి స్వేచ్ఛనిచ్చేవాళ్లున్నారు. సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈమధ్య ఈ సంగతే చెబుతూ, మహానటుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు కూడా తాను స్వయంగా దర్శకుడైనప్పటికీ తన దర్శకులు ఎలా చెబితే అలా చేసేవారనీ, మధ్యలో జోక్యం కల్గించుకునేవారు కాదనీ గుర్తు చేసుకున్నాడు. అప్పటి హీరోలు గానీ, నిర్మాతలు గానీ దర్శకులకి అలాగే విలువనిచ్చేవాళ్లు. అయితే ఇప్పుడు కొంతమంది హీరోలు దర్శకత్వ పనిలో జోక్యం చేసుకుంటూ వాళ్లని డమ్మీ దర్శకులుగా మారుస్తుండటం చర్చనీయాంశమవుతోంది.
నిర్మాత పెట్టుబడిదారుడు మాత్రమే:
నిజానికి నిర్మాత అంటే సినిమాకు పెట్టుబడిదారుడు. ఒక ప్లానింగ్ ప్రకారం దర్శకునికి చిత్ర రూపకల్పనలో అవసరమయ్యే నటీనటుల్ని గానీ, సన్నివేశాలకు తగినట్లు అవసరమయ్యే సరంజామాను గానీ, లొకేషన్లను గానీ, సెట్టింగులను గానీ సమకూర్చిపెట్టే బాధ్యత నిర్మాతది. అంతే తప్ప ఏ సన్నివేశాన్ని ఎలా తీయాలనేది అతడి పనికాదు. ఆ పని చూసుకునేది దర్శకుడే. అట్లాంటిది ఇప్పుడు కొద్దిమంది నిర్మాతలు పేరుకి దర్శకుణ్ణి పెట్టుకున్నా పెత్తనమంతా వాళ్లే చేస్తుండటం విమర్శలకి తావిస్తోంది. వీళ్లు సీనియర్ దర్శకులైతే తమ మాట నెగ్గదనే సందేహంతో కాబోలు కొత్త దర్శకుల్నీ, లేదా ఇంకా లైమ్‌లైట్‌లోకి రాని దర్శకుల్నీ తమ చిత్రాలకి ఎన్నుకుంటారు. ఈ కొత్త దర్శకులు కూడా పెద్ద నిర్మాత తమకి మంచి అవకాశమిచ్చాడు కదాని పొంగిపోతారు. షూటింగ్ మొదలవకముందే నిర్మాత "సినిమా గురించి నువ్వేమీ బయట మాట్లాడొద్దు. అంతా నేను చూసుకుంటా" అని ఒక ఆజ్ఞ లేదా హెచ్చరికను జారీ చేస్తాడు. దాంతో సదరు దర్శకుడు ముందు ఖంగుతిని, తర్వాత తనకుతాను సర్దిచెప్పుకుని 'రాముడు మంచి బాలుడు' తరహాలో తలాడించి, ఎప్పుడెవరు సినిమా గురించి అడిగినా "ఈ సినిమా గురించి ఏమడిగినా నేను చెప్పను. అంతగా కావాలనుకుంటే ప్రొడ్యూసర్ని అడగండి" అని చెబుతుంటాడు. మనం ఎన్నిసార్లడిగినా ఇదే రికార్డ్ రిపీట్ అవుతుందన్న మాట.
దీన్నిబట్టి అర్ధమయ్యేదేమిటంటే దర్శకుల్ని ఈ నిర్మాతలు తమ కంట్రోలులో వుంచుకుంటున్నారు. భారీ లేదా క్రేజీ చిత్రానికి దర్శకుడిగా తమకి పేరైతే వస్తుంది కదా.. అనే ఆశతో ఈ దర్శకులు తలాడించేస్తున్నారు. ఇటువంటి దర్శకులు భవిష్యత్తులో తమ సృజనాత్మక శక్తిని ఎలా ప్రదర్శించగలరో అర్ధంకాదు. ఓరకంగా వాళ్లు తమలో అంతదాకా వున్న సృజనాత్మకతని కూడా కోల్పోయే ప్రమాదం వుంది. అంతేకాదు. ఈ తరహా నిర్మాతలు ఇతర నిర్మాతలకి కూడా ఆదర్శంగా మారిపోయేందుకు ఆస్కారం వుందనడానికి వీలు కలుగుతోంది. దర్శకుడి పనిలో నిర్మాత జోక్యం చేసుకోవడం వల్ల సినిమా 'కిచిడీ' లాగా తయారై ఇద్దరికీ నష్టం చేకూర్చవచ్చు. అందుచేత నిర్మాతలు తమ పరిధిమేరకు సినిమా నిర్మాణంలో పాలుపంచుకునే విషయమై ఆలోచించాలి. దర్శకులు కూడా 'రాజీ' మనస్తత్వాన్ని వదిలించుకుని, తమ సొంత సృజనాత్మకతతో సినిమాకు పర్ఫెక్షన్ తీసుకొచ్చేందుకు కృషి చేయాలి.
No comments:
Post a Comment