Saturday, September 11, 2010
సినిమా: 'పులి' మీద వివాదం కరెక్టేనా?
పవన్ కల్యాణ్ సినిమా 'కొమరం పులి' టైటిల్ మీద వివాదం సరైనదేనా? టైటిల్లో 'కొమరం' అని ఉన్నంత మాత్రాన దానికి గిరిజన పోరాట యోధుడు కొమరం భీమ్ ని కించపరిచినట్లుగా భావించవచ్చా? నిజాయితీగా ఆలోచిస్తే ఆ టైటిల్ వల్ల కొమరం భీమ్ పేరుకి వచ్చిన నష్టం ఏమీ లేదని అర్థమవుతుంది. సినిమాలో ఎక్కడా భీమ్ ప్రస్తావన లేదు. కొమరం పులి కూడా ఆకతాయి హీరో కాదు. బాద్యతాయుతమైన, డ్యూటీలో నిక్కచ్చిగా ఉండే నిజాయితీ కలిగిన పోలీసాఫీసర్. హీరోయిన్ తో వచ్చే సన్నివేశాలతో తప్పిస్తే పులి ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగానే కనిపిస్తాడు.
మరెందుకు వివాదం? మహా నాయకుల పేర్లతో ఎన్ని సినిమాలు రాలేదు. వాటిమీద గొడవలేమీ జరగలేదే. నిజానికి కొమరం పులి మీద గొడవ భీమ్ కి సంబంధించినది కాదని ఇట్టే తెలిసిపోతుంది. చిరంజీవి కుటుంబం సమైక్యాంధ్రకి మద్దతు పలకుతుండటమే ఈ గొడవకి కీలకమని భావించాలి. ఆయన కుటుంబానికి చెందిన హీరోల సినిమాల్ని తెలంగాణలో ఆడనివ్వమని ఇప్పటికే ఓయు జేఏసి, ఇతర తెలంగాణ సంఘాలు ప్రకటించాయి. దానిలో భాగంగానే టైటిల్ వివాదం తెరమీదకు వచ్చింది.
ఒకవేళ ఉద్దేశపూర్వకంగానే నిర్మాతలు టైటిల్ కి 'కొమరం పులి' అని పెట్టినా వివాదం సహేతుకం కాదు. ఆ సినిమాని తెలంగాణలో ఆడనివ్వమని గొడవ చెయ్యడం సమర్థనీయం కాదు. దాని సంగతి తెలంగాణ ప్రేక్షకులే చూసుకుంటారు. టైటిల్లో 'కొమరం' అని పెట్టడం వాళ్లకి ఇష్టం లేకపోతే ఆ సినిమాని చూసేందుకు తిరస్కరించడం ద్వారా వాళ్లే తీర్పునిస్తారు. ఏ సినిమాకైనా ప్రేక్షకులను మించిన తీర్పరులు ఇంకెవరుంటారు?
అలా కాకుండా ఆ సినిమాని తెలంగాణలో ఆడనివ్వమని గొడవ చేయడం ద్వారా దానిపై ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని వాళ్లే రేకెత్తిస్తున్నారన్న మాట. ఇది ఆ సినిమాకి మేలే చేకూరుస్తుంది కానీ నష్టం కాదు. ఇప్పుడు థియేటర్లలో ఆడకుండా అడ్డుకునే వాళ్లు రేపు ఆ సినిమా చానళ్లలో ప్రసారమైనప్పుడు ఎలా అడ్డుకుంటారు? ఏదేమైనా 'కొమరం పులి' విడుదల రోజే ఆ సినిమాలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలు లేవని తేలింది. ఇప్పుడు గొడవ వల్ల కొద్దో గొప్పో దానికి ప్రేక్షకులు పెరుగుతారు. ఆ పుణ్యం కట్టుకుంటోంది గొడవలు చేసేవాళ్లే.
ఈ వివాదం వల్ల టైటిల్లో 'కొమరం'ని తొలగిస్తున్నామనీ, ఇక ఈ సినిమా ఒట్టి 'పులి' మాత్రమేననీ నిర్మాతలు ప్రకటించారు. దీనితో గొడవలు చేసేవాళ్ల వాళ్ల మనోభావాలకు తృప్తి కలిగినట్లేనా?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment