Thursday, September 30, 2010

సినిమా: 'రోబో'కి థియేటర్లు దొరుకుతాయా?


దక్షిణ భారతంలోనే - ఆ మాటకొస్తే దేశంలోనే అత్యధిక పారితోషికాలు తీసుకుంటున్న నటుడు రజనీకాంత్, దర్శకుడు శంకర్, నటి ఐశ్వర్యారాయ్ కాంబినేషనులో తయారైన 'రోబో' అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. భారత దేశంలో ఒక సినిమా 180 కోట్ల రూపాయల (అనధికార సమాచారం ప్రకారం 225 కోట్లు) వ్యయంతో రూపొందటమనేది ఊహకి అందని సంగతి. కానీ ఊహాతీతంగా సినిమాలు చెయ్యడమే డైరెక్టర్ శంకర్ పంథా. మునుపటి సినిమా 'శివాజి'తో వంద కోట్ల రూపాయల బిజినెస్ మార్కుని అధిగమించిన శంకర్ ఇప్పుడు దానికి రెట్టింపు వ్యయంతో 'రోబో'ని తీసి వార్తల్లో వ్యక్తిగా మారాడు. 
అసాధారణ రిస్కుతో కూడిన ఈ వ్యయాన్ని భరించేందుకు చెన్నైకి చెందిన నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ముందుకు రావడం వల్లే 'రోబో' ప్రాజెక్టు సాధ్యపడింది. సుమారు రెండేళ్లపాటు నిర్మాణం సాగిన ఈ సినిమాకి కథ కంటే గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ ప్రాణంగా నిలవనున్నాయి. స్పెషల్ ఎఫెక్ట్స్ పరంగా హాలీవుడ్ లో అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో రూపొందిన సినిమాలకు దీటుగా 'రోబో' నిలవనున్నదని ఈ సినిమా గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. టీవీల్లో, థియేటర్లలో కనిపిస్తున్న ట్రైలర్లు ఆ సంగతే నిరూపిస్తున్నాయి.
ఇంతటి భారీ ఖర్చుతో తీసినందునే తెలుగు హక్కులు సైతం కనీవినీ ఎరుగని రీతిలో 27 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మొక్కజొన్న వ్యాపారి తోట కన్నారావు ఈ హక్కులు సొంతం చేసుకున్నారు. రజనీ ద్విపాత్రాభినయం 'రోబో'లోని విశేషం. ఒక పాత్ర సైంటిస్ట్ అయితే, ఆ సైంటిస్ట్ చేతిలో రూపొందిన మరో పాత్రే 'రోబో'. మనుషుల్లాగా స్పందనలు కూడా కలిగిన ఆ రోబోతో అందాల ఐశ్వర్యారాయ్ ఆడే ఆటలు, పాడే పాటలు ప్రేక్షకుల్ని అలరిస్తాయని నిర్మాతలు అంటున్నారు. అలాగే 'రోబో' చేసే యాక్షన్ సన్నివేశాలు గగుర్పాటు కలిగించనున్నాయి.
'రోబో' తెలుగు వెర్షన్ 500 ప్రింట్లతో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే అన్ని ప్రింట్లు విడుదల చేయడానికి థియేటర్లు లభ్యమవుతాయా - అనే సందేహం కలుగుతోంది. అక్టోబర్ 7న విడుదలవుతున్న 'మహేశ్ ఖలేజా'ని అల్లు అరవింద్ పంపిణీ చేస్తుండటం, 8న వస్తున్న ఎన్టీఆర్ 'బృందావనం' నిర్మాత దిల్ రాజు స్వయంగా డిస్ట్రిబ్యూటర్ కావడంతో వాటికి లభ్యమైనన్ని ప్రధాన థియేటర్లు 'రోబో'కి లభించే విషయం అనుమానాస్పదమే.
నైజాం ఏరియాకి సంబంధించి రెండు రోజుల క్రితమే 'రోబో' బిజినెస్ పూర్తయింది. ఇదివరకు నైజాంలో 'సింహా'ని పంపిణీ చేసిన మల్టీడైమెన్షన్ ఎంటర్టయిన్మెంట్ సంస్థ 8 కోట్ల రూపాయలకి పంపిణీ హక్కులు సొంతం చేసుకుంది. 12 కోట్ల రూపాయలకు ఈ హక్కులు అమ్మాలని ఆశించిన కన్నారావు ప్రయత్నాలు ఫలించలేదు.                           

No comments: