Friday, September 10, 2010
ఇంటర్వ్యూ: రోజా
నిన్నటి తరం అగ్రశ్రేణి తారల్లో ఒకరిగా రాణించిన అచ్చ తెలుగు తార రోజా. తమిళ సినీ దర్శకుడు సెల్వమణితో వివాహానంతరం నటనకు స్వస్తి చెప్పి రాజకీయాల్లో కాలుమోపిన ఆమె తెలుగు మహిళ అధ్యక్షురాలిగా తనదైన ముద్రని వేసిన సంగతి మనకు తెలుసు. కొద్ది నెలల క్రితం తెలుగుదేశం పార్టీలోంచి బయటకొచ్చిన ఆమె తిరిగి నటిగా మారారు. 'శంభో శివ శంభో', 'గోలీమార్' సినిమాల్లో నటించారు. ఈ నేపథ్యంలో ఆమెతో జరిపిన మాటామంతీ..
మొదటి రోజు టెన్షన్
చాలాకాలం తర్వాత సినిమాల్లోకి రావడం హ్యాపీగా, రిలాక్సింగుగా వుంది. ఇక్కడ ఆలోచించడానికేమీ ఉండదు. డైరెక్టర్ చెప్పింది చెయ్యడమే. రాజకీయాల్లో అయితే చురుగ్గా ఉండాలి. అప్పటి పరిస్థితుల్ని అవగాహన చేసుకుంటూ స్పందిస్తుండాలి. ఇక్కడ ఆ బాధ ఉండదు. అయితే మొదటిరోజు సెట్స్ మీద కొంత టెన్షన్ పడ్డ మాట వాస్తవం. చిత్రసీమలో అడుగుపెట్టిన మొదటిరోజు ఎలా టెన్షన్ పడ్డానో, ఇప్పుడూ అలా ఫీలయ్యా. అయితే ఈసారి కాస్తంత త్వరగా దాన్నుంచి బయటపడ్డా.
ఆర్థిక కోణం లేదు
నేను మళ్లీ ముఖానికి రంగేసుకోవడానికి కారణం ఆర్థికపరమైన కారణల వల్లే అనే ప్రచారం వచ్చిందని తెలుసు. అయితే అది కరెక్ట్ కాదు. ఆర్థికంగా ఇప్పుడు నేను బాగానే వున్నా. రాజకీయాల్లో చురుగ్గా ఉన్నప్పుడే సినిమాల్లో చెయ్యాలని ఉండేది. అయితే తెలుగు మహిళ అధ్యక్షురాలిగా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండటం వల్ల 'నాయకురాలంటే ఇలా ఉండాలి' అనిపించుకోవాలనే తపనతో రాజకీయాలకి పూర్తి సమయం కేటాయించా. ఒక పదవిలో ఉన్నప్పుడు ఆ పదవికి మనవల్ల గొప్పతనం తీసుకురావాలనేది నా ఉద్దేశం. అలా ఒక రోల్ మోడల్ గా ఉండాలని కృషి చేశా. అందులో విజయం సాధించాననే అనుకుంటున్నా. ఇప్పుడు తెలుగుదేశం నుంచి బయటికొచ్చా. ఇంకా ఏ పార్టీలోనూ చేరలేదు. సినిమాల్లో చెయ్యడానికి టైమ్ దొరికింది. అందుకే చేస్తున్నా.
అదే గౌరవం
నావరకు నాకు నేను హీరోయినుగా చేసినప్పటి రోజులకీ, ఇప్పటికీ తేడా కనిపించడం లేదు. అప్పటి మాదిరే నాకు గౌరవం లభిస్తోంది. కాకపోతే అప్పుడు సెట్లో హార్డ్ లైటింగ్ ఉండేది. దాంతో చర్మం మంటలెక్కేది. ఇప్పుడు సాఫ్ట్ లైటింగ్ ఉపయోగిస్తున్నారు. అందువల్ల ఎలాంటి ఇబ్బందీ లేకుండా హాయిగా పని చేయగలుగుతున్నా. ఇంకా చెప్పాలంటే అప్పట్లో పెద్ద ఆర్టిస్టులతో చేసేప్పుడు స్వతంత్రంగా ఉండాలంటే కాస్త ఇబ్బందనిపించేది. ఇప్పుడు అంతా దాదాపు ఒకే వయసు వాళ్లవడం వల్ల సెట్స్ మీద స్నేహపూర్వక వాతావరణం కనిపిస్తోంది.
మళ్లీ సినిమాలు తియ్యను
మళ్లీ సినిమాలు తీసే ఆలోచన ఏమాత్రం లేదు. ఇదివరలో 'సమరం', 'లాఠీచార్జి', 'దుర్గ' సినిమాలు నిర్మించాం. ఎంతో పోగొట్టుకున్నాం. లయ, ఆకాశ్, నాగేంద్రప్రసాద్ (ప్రభుదేవా తమ్ముడు)లతో నిర్మించిన 'ఆకాశం'ని ఇప్పటిదాకా రిలీజ్ చెయ్యలేకపోయాం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment