రచన, గానం: నాజర్
ఎన్నాళ్లీ కాపురాలు ఏ చెరో గిరో పడి చేద్దామన్నా
ఎట్లాగీ కాపురాలు
ఎన్నాళ్లీ కాపురాలు..
కాపురమంతా కరువుల సంత - జీవితమంతా అతుకుల బొంత
గాలి కొంపలు ఖాళీ కుండలు - సాలీసాలని కూలిగింజలు
ఎన్నాళ్లీ కాపురాలు..
చేలన్నీ మా చెమటతో తడిపి - నేలా బురదల నాటులు నాటి
కళ్ల ప్రాణముతో ఇల్లు జేరితే - పిల్లలు తింటే తల్లులు పస్తు
ఎన్నాళ్లీ కాపురాలు..
ఉప్పుంటే పప్పుండదు ఇంటా - ఎప్పుడు అప్పెవరిస్తారంట
పూట పూటకు చేట పట్టుకుని గడప గడప గాలించేదెట్ల
ఎన్నాళ్లీ కాపురాలు..
పార పనులతో తారకలాడి - సత్తువకొద్దీ కత్తువ తొక్కి
సతమతమై మేం మెతుకుల కొస్తే - కుండడుగున కూడుండదురన్నా
ఎన్నాళ్లీ కాపురాలు..
కోతలు కోసి కల్లాలేసి - నిద్రల కోర్చి కుప్పలు నూర్చి
వీపున మోసి పాతర వేస్తే - కూలిమ్మంటే తాలిస్తారు
ఎన్నాళ్లీ కాపురాలు..
పేదల కష్టం ప్రభువుల పాలు - బాధలన్నీ మా బీదల పాలు
రాజనాలు పండించేవానికి - భోజనానికే బొత్తిగలేదు
ఎన్నాళ్లీ కాపురాలు..
కార్మికులారా కర్షకులారా - సాగిరండిక సాగిపోదము
బతుకుల కోసం పయనం జేస్తే - కొండలనయినా పిండిగజేస్తాం
కొండలనయినా పిండిగజేస్తాం
No comments:
Post a Comment