Showing posts with label rb chowdary. Show all posts
Showing posts with label rb chowdary. Show all posts

Monday, August 29, 2011

న్యూస్: జీవా సినిమాలొస్తున్నాయ్!

కొత్తగా ఓ నటుడి సినిమా హిట్టయితే అతను అంతకు ముందు నటించిన సినిమాలూ, ఆ తర్వాత నటించే సినిమాలూ వరుసపెట్టి రావడం తెలుగు చిత్రసీమలో జరిగే ఓ విశేషం. నిన్నటికి నిన్న 'వైశాలి' బాగా ఆడటంతో ఆది పినిశెట్టి తమిళంలో నటించిన సినిమాలన్నీ తెలుగులో దిగుమతి అయిపోతున్నాయ్. ఇప్పుడు ఆ వంతు జీవాది. ఆర్.బి. చౌదరి కుమారుడైన జీవా నటించిన 'ఈ' సినిమా కొంత కాలం క్రితం తెలుగులో వచ్చినా తెలుగు ప్రేక్షకులు ఏమంత పట్టించుకోలేదు. ఇప్పుడు అతడి 'రంగం' సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విజయకేతనం ఎగురవేయడంతో అతడి తమిళ సినిమాలన్నిట్నీ తెలుగులో తీసుకు రావడానికి డబ్బింగ్ సినిమాల నిర్మాతలు పోటీపడుతున్నారు. ఇప్పటికే అతని 'రౌతిరం' సినిమాని ఆర్.బి. చౌదరి స్వయంగా 'రౌద్రం' పేరుతో తెలుగులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా జీవా మరో రెండు సినిమాలు తెలుగులో డబ్బవుతున్నాయి. వాటిలో 'సింగం పులి' సినిమా 'సింహం పులి' పేరుతోనూ, పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్న 'వందాన్ వెండ్రాన్' సినిమా 'వచ్చాడు గెలిచాడు' పేరుతోనూ రాబోతున్నాయి. జీవా డ్యూయల్ రోల్ పోషించిన 'సింగం పులి' తమిళంలో 2011 మార్చిలో విడుదలై ఓ మోస్తరుగా ఆడింది. ఇందులో అతని సరసన రమ్య, హనీరాజ్ హీరోయిన్లుగా నటించారు. ఇక 'వచ్చాడు గెలిచాడు' సినిమాని ఆర్. కణ్ణన్ డైరెక్ట్ చేయగా తాప్సీ హీరోయిన్‌గా నటించింది. అటు తమిళం, ఇటు తెలుగులో ఒకేసారి సెప్టెంబరులో ఈ సినిమా విడుదల కానున్నది. ఈ సినిమాలతో జీవా మరింతగా తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందుతాడేమో చూడాలి.

Tuesday, August 16, 2011

న్యూస్: కృష్ణ అల్లుడు ఆకట్టుకుంటాడా?

వారసులుగా కొడుకులు రావడం చాలా కాలం నుంచి తెలుగు సినీరంగంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అల్లుళ్లు కూడా ఆ బాట పడుతున్నట్లు కనిపిస్తోంది. సూపర్‌స్టార్ కృష్ణ అల్లుడు సుధీర్‌బాబు హీరోగా మారారు. అతను కృష్ణ చిన్న కుమార్తె ప్రియదర్శిని భర్త. నాగచైతన్య సినిమా 'ఏమాయ చేసావె'లో హీరోయిన్ సమంతా అన్నగా ఆకట్టుకుంది సుధీర్‌బాబే. అతను హీరోగా ఇప్పుడు 'శివ మనసులో శ్రుతి' అనే సినిమా తయారవుతోంది. 'భీమిలి కబడ్డిజట్టు' ఫేం తాతినేని సత్య ఈ సినిమాకి డైరెక్టర్. సత్య తండ్రి టి.ఎల్.వి. ప్రసాద్ ఒకే హీరోతో 35 సినిమాలు డైరెక్ట్ చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. ఆ హీరో మిథున్ చక్రవర్తి. ఇక సత్య తాత తాతినేని ప్రకాశరావు కూడా గొప్ప డైరెక్టర్. 'పల్లెటూరు', 'ఇల్లరికం' వంటి సినిమాల్ని ఆయన రూపొందించారు. ఇప్పుడు 'శివ మనసులో శ్రుతి' సినిమాని ఆర్.బి. చౌదరి సమర్పిస్తుండగా, హనీబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పై కృష్ణ కుమార్తె ఘట్టమనేని ప్రియ నిర్మిస్తున్నారు. ఇందులో సుధీర్ సరసన నాయికగా రెజీనా పరిచయమవుతోంది. సెల్వ గణేశ్ మ్యూజిక్ డైరెక్టర్. మంచి స్ఫురద్రూపి అయిన సుధీర్ ఇప్పటికే 'ఏమాయ చేసావె'తో నటుడిగా ఓకే అనిపించుకోవడంతో హీరోగానూ రాణిస్తాననే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు. మరి ప్రేక్షకులు అతణ్ణి ఆదరిస్తారా?