Showing posts with label saikumar. Show all posts
Showing posts with label saikumar. Show all posts

Sunday, May 31, 2015

Pandaga Chesko (2015) Movie Review

తెలుగు సినిమా ఎదగడం లేదని ఎంత మొత్తుకుంటే ఏం లాభం? జాతీయ సినిమా యవనికపై తెలుగు సినిమా స్థాయి ఇంతగా దిగజారిపోతోందనే ఆవేదన పట్టేదెవరకి? అవే మూస కథలు, అవే మూస పాత్రలు, అవే మూస సన్నివేశాలు తెరపై దాడిచేస్తుంటే తట్టుకోలేక తలలు పట్టుకొని, తిట్టుకుంటూ హాలు బయటకు వచ్చే సగటు ప్రేక్షకుణ్ణడిగినా చెబుతున్నాడు - ‘ఎన్ని సినిమాలని చూస్తామండీ. అవే సీన్లు, అవే డైలాగులు. కొత్తగా ఒక్క సీనన్నా లేదండీ’ అని. అందుకు అసలు సిసలు ఉదాహరణగా వచ్చింది ‘పండగ చేస్కో’. ఈ సినిమా చూసినవాళ్లలో ఎవరు పండగ చేసుకున్నారో తెలీదు కానీ, దీనికి పెట్టిన ప్రతి పైసా ‘దండగ’ అనేవాళ్లే ఎక్కువ. సెన్సార్‌ వాళ్లు ఈ సినిమాకి ‘యు/ఎ’ సర్టిఫికెట్‌ ఎలా ఇచ్చారబ్బా! అనే ఆశ్చర్యం కలిగితే తప్పేమీ లేదు. ఎందుకంటే ఇది ఫక్తు ‘ఎ’ టైపు సినిమా. తెరమీద 70 శాతం సన్నివేశాలకు మించి ‘కామ’ రసం ప్రవహిస్తూనే ఉంటుంది మరి! చాలా పాత్రలు ‘కామం’తో దహించుకుపోతూ కనిపిస్తుంటాయి. హీరో సహా చాలామంది డబుల్‌ మీనింగ్‌ డైలాగులు, బూతు డైలాగులతో ‘రచ్చ రచ్చ’ చేసేస్తుంటారు. ఒకట్రెండు డైలాగులని సెన్సార్‌ వాళ్లు ‘మ్యూట్‌’ చేసినా, ఎక్కువ శాతం బూతుల్ని అలాగే ఉంచేశారు.
పాచి కథ
ఈ దండగమారి సినిమా చూస్తున్నంత సేపూ అనేక తెలుగు సినిమాల సన్నివేశాలు, పాత్రలు మన మనసులో మెదులుతుంటాయి. ఒకట్రెండు సినిమాల పేర్లయితే ప్రస్తావించవచ్చు. తెలుగులో విడుదలయ్యే ప్రతి నాలుగు ‘కమర్షియల్‌ ఎంటర్‌టైనర్స్‌’లో మూడు సినిమాలు ఇదే తరహాలో ఉంటున్నవే. ఈ సినిమా ఇతివృత్తం చెబితే నిజమేనని ఎవరైనా తలాడిస్తారు. పోర్చుగల్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి యజమాని అయిన కార్తీక్‌ పోతినేని (రామ్‌)ది పూర్తిగా బిజినెస్‌ మైండ్‌. అలాంటి మైండ్‌సెట్టే ఉన్న అనుష్క (సోనాల్‌ చౌహాన్‌) అనే ఇంకో వ్యాపారవేత్తని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. తల్లిదండ్రుల అభీష్టానికి వ్యతిరేకంగా నిశ్చితార్థం కూడా చేసుకుంటాడు. కానీ పాతికేళ్ల క్రితం పుట్టింటితో వేరుపడిన తల్లి (పవిత్రా లోకేశ్‌) ఫ్లాష్‌బ్యాక్‌ తెలిసి హైదరాబాద్‌కు వస్తాడు. తనెవరో చెప్పకుండా మేనమామ (సంపత్‌) ఇంట్లోనే ఉండి, ఆయన కూతురైన దివ్య (రకుల్‌ప్రీత్‌ సింగ్‌)తో పెళ్లికి ఆమోదం పొందుతాడు. చివరకు విడిపోయిన అన్నా చెల్లెళ్లను కలుపుతాడు. ఇది చదివాక వెంటనే గుర్తొచ్చే సినిమా ‘అత్తారింటికి దారేది’. అందులో హీరో పవన్‌కల్యాణ్‌ తనెవరో చెప్పకుండా మేనత్త ఇంటికి వస్తాడు. ఇందులో హీరో రామ్‌ మేనమామ ఇంటికి వస్తాడు. అంతే తేడా. అంటే ఈ సినిమాకు ‘పండగ చేస్కో’ అని కాకుండా ‘మామగారింటికి దారేది’ అని పెట్టినా సరిపోతుంది. ఇక ఎప్పట్లాగే హీరోకీ, హీరోయిన్‌ ఫ్యామిలీకీ మధ్య ‘దాగుడుమూతలాట’ షురూ. ఈ మధ్య కాలంలో ఈ తరహా దాగుడుమూతలు లేని సినిమాలేవో వేళ్లమీద లెక్కించవచ్చు. అదనంగా ఇందులో ఇంకో పాత్రని ప్రవేశపెట్టారు. అది సాయిరెడ్డి (సాయికుమార్‌) పాత్ర. ఈ పాత్ర క్లైమాక్స్‌లో సెంటిమెంట్‌కు బాగా పనికొచ్చింది. చివరలో సెంటిమెంట్‌ రసం పావుగంట సేపు ప్రవహించేసరికి కళ్లలో నీళ్ల బదులు రక్తం కారుతుందంతే! ఈ సినిమాకి సంబంధించి ‘గట్టి’గా చెప్పుకోవాల్సింది నాలుగు డోసులెక్కువగా ఉండే ‘కామ’ రసం గురించే. అనుష్క అనే కేరక్టర్‌ని చూసినప్పుడల్లా ‘వీకెండ్‌ వెంకట్రావు’ (బ్రహ్మానందం) ఒళ్లు చిమచిమలాడిపోతూ ఉంటుంది. ఓసారి అతణ్ణి చూసి కార్తీక్‌ అననే అంటాడు - ‘ఏంటండీ కళ్లల్లో కామరసం అలా కారిపోతోంది’ అని. అంటే అనుష్క కనిపించిందంటే చాలు, వెంకట్రావు కళ్లతోటే ఆమె అందాన్ని ‘జుర్రేసుకుంటూ’ (ఈ పదం వాడినందుకు క్షమించాలి) ఉంటాడు. ప్రతిసారీ అతడి కళ్లు కామరసాన్ని కార్చేస్తుంటే కుటుంబ ప్రేక్షకులు ఆ జుగుప్సను భరించలేక ఎంత ఇబ్బందిగా కుర్చీల్లో కదులుతుంటారో ఊహించుకోవాల్సిందే. వెంకట్రావు ఒక్కడే అలా ప్రవర్తిస్తున్నాడనుకునేరు. హీరోయిన్‌ ముగ్గురు బాబాయిలు (రఘుబాబు, బ్రహ్మాజీ, శ్రవణ్‌) ఇరవై ఏళ్ల నుంచీ భార్యలకు దూరంగా ఉండాల్సి వచ్చి, ఆ తర్వాత ఒకసారి వాళ్లు తమ వచ్చేసరికి ‘తట్టుకోలేక’, కామ (‘శృంగారం’ కాదు) పీడితులైన పురుషుల్లాగా, వాళ్లమీద పడిపోతూ ఉంటారు. వాళ్ల హావభావాలు, మాటలు ఎంత ‘పచ్చి’గా ఉంటాయో చెప్పలేం, ‘ఇంగితం’ అనేది ఒకటి మనలో ఇంకా ఉంది కాబట్టి.  
స్త్రీ పాత్రలపై చిన్నచూపు 
దర్శకుడికి స్త్రీల పట్ల సదవగాహన లేదోమో అనిపిస్తుంటుంది, సినిమా చూస్తున్నంత సేపూ. సోనాల్‌ చౌహాన్‌ చేసిన అనుష్క పాత్రను డబ్బు యావ తప్ప మానవత్వం ఏమిటో తెలీని ఓ మృగం తరహాలో చిత్రీకరించాడు. హీరో కార్తీక్‌ను పెళ్లాడాలనుకున్న ఆమె చివరకు రూ. 3 వేల కోట్ల కోసం పక్కా రౌడీ అయిన అభిమన్యుసింగ్‌ను పెళ్లాడటం ఎంత ఫూలిష్‌గా ఉంటుందో! బద్ధ శత్రువుల్లాగా ఉండే తండ్రినీ, మావయ్యనీ కలపాలనే ఉద్దేశంతో వాళ్లకు కనిపించకుండా అజ్ఞాతంలో ఓ ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ అయిన స్వాతి (తేజస్విని) ఇంట్లో ఉండే హీరోయిన్‌ దివ్య ‘గ్రీన్‌ ఆర్మీ’ పేరుతో ఉద్యమాన్నే నడపడం చూసి ముక్కుమీదే కాదు, ‘ఇంకెక్కడైనా’ వేలు పెట్టేసుకోవచ్చు. ఛ.. ఈ దండగ సినిమా చూశాక మనక్కూడా డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌ వస్తున్నాయ్‌ బాబోయ్‌. మొక్కల కోసం, పచ్చదనం కోసం దివ్య చేసే ఉద్యమాన్ని టీవీలు ప్రసారం చేస్తున్నా, ఆమె ఎక్కడుందో పాపం.. వాళ్ల నాన్నకూ, మావయ్యకూ తెలీదు. చిత్రమేమంటే స్వాతి ఇంట్లో ఉన్నంత సేపే ‘గ్రీన్‌ ఆర్మీ’ ఉద్యమాన్ని నడుపుతుంది దివ్య. తమ ఇంటికి వచ్చేస్తే ఆ ‘గ్రీన్‌’ సంగతి మచ్చుకి కూడా ఆమెకు జ్ఞాపకముండదు. ఇక ఆమె చేసే ఉద్యమమంటే మన హీరోకు ఎంత చులకనో! మొక్కలనూ, పిచుకలనూ ఎంత తక్కువచేసి మాట్లాడుతుంటాడో! ఇక దివ్య ఫ్రెండ్‌ స్వాతి పాత్రను దర్శకులు మలిచిన తీరు మరీ ఘోరం. ఎవరికి పడితే వాళ్లకు పడిపోతుందని ఆమెని ప్రేమించిన కొండయ్య (వెన్నెల కిశోర్‌) మాత్రమే కాదు, ఆమెను కన్న తండ్రి ఎమ్మెస్‌ నారాయణా తెగ బాధపడితుంటారు. ఆమెను ఒంటరిగా వదిలేస్తే కష్టమని డైరెక్టుగానే చెప్పేస్తుంటారు. సినిమా మొదట్లో హీరోకు ఓ చెల్లెల్ని చూపించారు. మధ్యలో ఆమె పాత్ర ఉన్నదనే విషయం మర్చిపోయారు.
ఓవరాక్టర్‌
కార్తీక్‌ కేరక్టర్‌లో రామ్‌ ‘ఓవరాక్షన్‌’ చేసేశాడు. ‘అండరాక్టింగ్‌’ చేయాల్సిన చోట కూడా ‘నేను వెనక్కి తగ్గేది లేదు’ అన్నట్లుగా అతి నాటకీయత ప్రదర్శించాడు. చాలా సన్నివేశాల్లో.. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఐదు నిమిషాల పైగా డైలాగులు, హావభావాల విషయంలో పవన్‌కల్యాణ్‌ను మక్కీకి మక్కీ అనుకరించేశాడు (‘అత్తారింటికి దారేది’లో రైల్వే స్టేషన్‌లో మేనత్త నదియా వద్ద పవన్‌కల్యాణ్‌ చెప్పే డైలాగులు గుర్తున్నాయి కదూ). రామ్‌ దెబ్బకు ఓవరాక్టింగ్‌కు పెట్టింది పేరైన సాయికుమార్‌ సైతం డౌనైపోయాడు. దివ్యగా హీరోయిన్‌ పాత్రలో రకుల్‌ప్రీత్‌ క్యూట్‌గా ఉంది. సినిమాలో కాస్త చూడబుద్ధేసిన ముఖం ఆమెదే. తన పరిధిలో ఆ పాత్రను బాగానే చేసింది. హీరోయిన్‌ తండ్రిగా సంపత్‌, మేనమామగా సాయికుమార్‌, హీరో తల్లిదండ్రులుగా పవిత్రా లోకేశ్‌, రావు రమేశ్‌ తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. సోనాల్‌ చౌహాన్‌ పాత్రనూ, ఆ పాత్రలో ఆమె అభినయాన్నీ భరించలేం. ఎమ్మెస్‌ నారాయణ వంటి హాస్యనటుణ్ణి డబుల్‌మీనింగ్‌ డైలాగుల కోసం ఉపయోగించుకోవడం బాధని కలిగిస్తుంది. ‘వీకెండ్‌ వెంకట్రావు’ పాత్రలో కామరసాన్ని బీభత్సంగా కురిపించేసి, ఆ పాత్రను పూర్తిగా ‘పెద్దలకు మాత్రమే’గా మార్చేశాడు బ్రహ్మానందం. కొండయ్య పాత్రలో అమాయకత్వాన్ని పండించేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు వెన్నెల కిశోర్‌.
 
సాంకేతిక వర్గంలో ఎక్కువ మార్కులు పడేది సమీర్‌రెడ్డి ఛాయాగ్రహణానికే. సినిమా ఎలా ఉన్నా ఫ్రేమ్‌ కలర్‌ఫుల్‌గా ఉందంటే అది కెమెరా పనితనం వల్లే. తమన్‌ డప్పు సంగీతంలో కొత్తగా వినిపించిన బాణీలేమీ లేవు. పాటలు ఎంత రిచ్‌గా తీసినా, వినసొంపుగా లేవు. టైటిల్‌ సాంగ్‌ వచ్చేసరికి ప్రేక్షకులు రిలీఫ్‌ కోసం కుర్చీల్లోంచి లేస్తున్నారు. వెలిగొండ శ్రీనివాస్‌ రాసిన పాచిపోయిన కథకు, కోన వెంకట్‌ డబుల్‌ మీనింగ్‌, ‘అడల్ట్‌’ డైలాగులు తోడై, ఈ సినిమాను కుటుంబ ప్రేక్షకులు దూరంగా ఉండాల్సిన సినిమాగా చేశాయ్‌.
 
ట్యాగ్‌లైన్ : డబ్బు ‘దండగ’ చేస్కో..

- ఆంధ్రజ్యోతి డైలీ, 30 మే 2015

Saturday, December 10, 2011

రాంచరణ్ 'ఎవడు'

రాంచరణ్ కథానాయకుడిగా 'ఎవడు' అనే చిత్రం షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. సమంత ఓ హీరోయిన్ కాగా, మరో హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. అల్లు అర్జున్ అతిథి పాత్ర చేయబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రసాద్ ల్యాబ్స్‌లో డిసెంబర్ 9న జరిగిన కార్యక్రమంలో రాంచరణ్‌పై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి చిరంజీవి క్లాప్‌నివ్వగా, సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దీనికి మరో నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ "దర్శకుడు వంశీ చెప్పిన పాయింట్ ఎగ్జయిట్ చేసింది. ఆ కథవిని చిరంజీవి గారు, రాంచరణ్ కూడా అంతే ఎగ్జయిట్ అయ్యారు. కమర్షియల్ సినిమాల్లో కొత్త యాంగిల్ ఉన్న చిత్రం. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతాం. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. ఇది అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న యాక్షన్ ఎంటర్‌టైనర్'' అన్నారు.
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ "చరణ్‌తో, వంశీ పైడిపల్లితో ఇది నాకు తొలి చిత్రం. స్క్రిప్టు చాలా బాగా వచ్చింది. మంచి ఆడియో ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా'' అని చెప్పారు. దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ "కథ విన్న రోజే చిరంజీవిగారు, చరణ్ ఓకే చేశారు. ఇది నాకు మూడో చిత్రం. అన్నీ దిల్ రాజు బేనర్‌లో చేసినవే. దేవిశ్రీ మంచి బాణీలిచ్చాడు. మంచి టీమ్ కుదిరింది'' అన్నారు. ఇది కమర్షియల్ యాంగిల్‌లో కచ్చితంగా కొత్త సినిమా అని కథా రచయిత వక్కంతం వంశీ చెప్పారు.
రాంచరణ్ మాట్లాడుతూ "దిల్ రాజు ఏమిటనేది ఆయన సినిమాలే మాట్లాడతాయి. ముఖ్యమైన అతిథి పాత్ర చేయడానికి బన్నీ చేయడానికి ఒప్పుకోవడం వల్లే ఈ సినిమా త్వరగా మొదలైంది. 'ప్రస్థానం' చూసి సాయికుమార్ అభిమానినైపోయా. ఆయనతో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది'' అన్నారు. సాయికుమార్ మాట్లాడుతూ "ఈ సినిమా విషయంలో ఎంతో ఉత్సుకతతో ఉన్నా. 2012లో నాకు ఈ సినిమా పెద్ద బ్రేక్‌నిస్తుంది'' అని చెప్పారు.
అబ్బూరి రవి మాటలు రాస్తున్న ఈ చిత్రానికి కథా సహకారం: హరి, ఛాయాగ్రహణం: చోటా కె. నాయుడు, కళ: ఆనంద్‌సాయి, సహ నిర్మాతలు: శిరీశ్, లక్ష్మణ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.

Sunday, September 4, 2011

న్యూస్: నాలుగేళ్ల తర్వాత తెలుగులో ఉపేంద్ర

నాలుగేళ్ల విరామం తర్వాత కన్నడ స్టార్ యాక్టర్ ఉపేంద్ర ఓ తెలుగు సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. కౌశిక్‌బాబు టైటిల్ పాత్రధారిగా జె.కె. భారవి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆదిశంకర'లో నటించేందుకు అతను అంగీకరించాడు. "భారవి తయారుచేసుకున్న 'ఆదిశంకర' సినేరియో అద్భుతంగా ఉంది. ఈ కథలో అమరుక మహారాజు పాత్ర నన్నెంతో ఆకట్టుకుంది. నా ఇమేజ్‌కి, బాడీ లాంగ్వేజ్‌కి అతికినట్టుగా ఉంది. ఇలాంటి చారిత్రాత్మక చిత్రంలో నటించాలనే కోరిక దీనితో తీరుతోంది" అని చెప్పాడు ఉపేంద్ర. 'కన్యాదానం'తో నేరుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అతను 'ఒకే మాట', 'రా', 'నీతోనే ఉంటాను'. చిత్రాల్లో హీరోగా నటించాడు. తెలుగులో అతని చివరి సినిమా 2007లో వచ్చిన 'టాస్'. తెలుగు స్ట్రెయిట్ సినిమాల్లో మంచి అవకాశాలొస్తే తప్పకుండా చేస్తానని చెబుతూ వచ్చిన ఉపేంద్ర ఇప్పుడు హీరోగా కాకపోయినా ఓ చారిత్రక చిత్రంలో కీలక పాత్ర చేయడానికి సిద్ధమయ్యాడు. 'ఆదిశంకర'లో శ్రీహరి, సాయికుమార్, సుమన్, ప్రకాశ్‌రాజ్, ఆనంద్, జయప్రద, రోజా, రోహిణి, తులసి, సంగీత వంటి సీనియర్ తారలు నటిస్తుండటం విశేషం. మరో ఇద్దరు పేరుపొందిన హీరోల్ని కూడా ఈ సినిమాలో నటింపజేసేందుకు భారవి కృషి చేస్తున్నారు. నాగ్ శ్రీవత్స సంగీతం అదిస్తున్న ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండటమే కాక కథ, మాటలు, స్క్రీన్‌ప్లేని కూడా భారవి స్వయంగా సమకూరుస్తున్నారు.

Friday, July 29, 2011

న్యూస్: కమలాకర్ 'సంచలనం' సృష్టిసాడా?

మాజీ ఎమ్మెల్యే (దర్శి) బూచేపల్లి సుబ్బారెడ్డి కుమారుడైన కమలాకర్‌రెడ్డి సినిమా రంగంలో ఎలాగైనా తన ముద్ర వేయాలనే పట్టుదలతో అవిశ్రాంత పోరాటం చేస్తున్నాడు. ఏడేళ్ల క్రితమే 'అభి' అనే సినిమాతో హీరోగా తెరగేంట్రం చేసిన అతను ప్రేక్షకాదరణ పొందలేక పోయాడు. నిజానికి 'అభి' బాక్సాఫీసుని గెలవక పోయినా మ్యూజికల్‌గా మంచి పేరు తెచ్చుకుంది. కారణం దానికి బాణీలు కూర్చింది దేవిశ్రీ ప్రసాద్!. అందులోని 'వంగతోట మలుపుకాడ..' పాట ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంది. దాని తర్వాత కమలాకర్ 'సన్నీ', 'హాసిని' వంటి సినిమాలు చేశాడు. 'హాసిని'లో 'ప్రేమిస్తే' సంధ్య హీరోయిన్. అది కూడా బాక్సాఫీసుని గెలవలేకపోయింది. అయినా కానా ఈ సినిమా డైరెక్టర్ బి.వి. రమణారెడ్డి మీద పూర్తి నమ్మకం ఉంచిన కమలాకర్ ఇప్పుడు అతని డైరెక్షన్‌లోనే 'సంచలనం' చిత్రాన్ని నిర్మించాడు. కమలాకర్, సాయికుమార్, ఆశిశ్ విద్యార్థి ప్రధాన పాత్రధారులు. రెగ్యులర్ సాంగ్ అండ్ ఫైట్, రొమాన్స్‌లకు భిన్నంగా కాన్సెప్ట్ ఓరిఎంటెడ్ సినిమాగా దీన్ని రమణారెడ్డి రూపొందించాడు. ఓ అమాయక యువకుణ్ణి కొంతమంది ఎందుకు టార్గెట్ చేశారు, తనకెదురైన ప్రమాదం నుంచి అతను ఎలా తప్పించుకునాడనేది ఇందులోని ప్రధానాంశం. "ఇది యధార్థ సంఘటన ప్రేరణతో అల్లిన కల్పిత కథతో తయారైన సినిమా. ఎవర్నీ ఉద్దేసించి ఈ సినిమా తీయలేదు. ఎవరినైనా ఉద్దేశించినట్లు అనిపిస్తే అది కేవలం కాకతాళీయమే కానీ ఉద్దేశ పూర్వకంగా చేసింది కాదని గ్రహించాల్సిందిగా కోరుతున్నా" అని కమలాకర్ చెప్పడాన్ని బట్టి ఇందులో పోలీస్ వ్యవస్థ మీదా, రాజకీయ వ్యవస్థ మీదా వివాదాస్పద అంశాలు ఇమిడి ఉన్నాయని అర్థమవుతోంది. అయితే 'సంచలనం' టైటిల్‌కి తగ్గట్లు బాక్సాఫీసు వద్ద అది చేసే సందడి పైనే అది సృష్టించే వివాద తీవ్రత కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకూ ప్రేక్షకాదరణ పొందలేక పోయిన కమలాకర్ నిజంగా 'సంచలనం' సృష్టిస్తాడా? ఈ రోజే ఈ సినిమా విడుదలైంది. ఇనిషియల్ టాక్ బావుంది. అది కలెక్షన్ల రూపంలో మారడమే కావలసింది.

Wednesday, July 27, 2011

న్యూస్: తండ్రి లాగే రామునిగా బాలయ్య అలరిస్తాడా?

వరుసగా ఏడు ఫ్లాపుల తర్వాత వచ్చిన సూపర్ హిట్ మూవీ 'సింహా'తో జూలు విదిల్చాడు నందమూరి బాలకృష్ణ. తన పని అయిపోయిందని జరుగుతున్న ప్రచారానికి ఆ సినిమాతో జవాబిచ్చాడు. అయితే ఆ వెంటనే వెటరన్ డైరెక్టర్ దాసరి నారాయణరావు 150వ సినిమా 'పరమవీరచక్ర' చేసి పొరబాటు చేశాడు. ప్రేక్షకులు ఆ సినిమాని నిర్ద్వంద్వంగా తిరస్కరించినా ఇప్పటికీ అది తన దృష్టిలో గొప్ప సినిమానే అని గొప్పలు చెబుతూనే ఉన్నారు దాసరి. దాని సంగతి పక్కన పెడితే ఇప్పుడు బాలకృష్ణ మూడు సినిమాలు చేస్తున్నాడు. వాటిలో బాపు దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న పౌరాణిక చిత్రం 'శ్రీరామరాజ్యం' ప్రధానమైంది. ఎన్టీఆర్ ఒకప్పటి చిత్రరాజం 'లవకుశ' ఆధారంగా కొద్దిపాటి మార్పులు చేర్పులతో ఈ సినిమా తీస్తున్నారు. దివంగత ముళ్లపూడి వెంకటరమణ సంభాషణలు రాసిన ఈ చిత్రంలో రామునిగా బాలకృష్ణ నటిస్తుంటే, ఆయన సరసన సీతగా అందాల తార నయనతార నటించడం విశేషం. సూపర్‌హిట్ మూవీ 'సింహా' తర్వాత వారు కలిసి పనిచేసిన సినిమా కావడంతో ఈ జోడీ తప్పకుండా మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు. తన చివరి కాల్షీట్ రోజు నయనతార ఈ సినిమా సెట్స్ మీద భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడం చర్చనీయాంశమైంది. ఇందులో వాల్మీకిగా అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మణునిగా శ్రీకాంత్, భరతునిగా సాయికుమార్ నటిస్తుండటంతో సినిమాకి స్టార్ వాల్యూ కూడా ఏర్పడింది. ఇది కాక పరుచూరి మురళి డైరెక్షన్‌లో తయారవుతున్న సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్నాడు బాలకృష్ణ. ఇటీవలే సీనియర్ డైరెక్టర్ బి. గోపాల్ నిర్దేశకత్వంలో 'హర హర మహదేవ' సినిమా మొదలైంది. ఈ సినిమాలతో, ముఖ్యంగా 'శ్రీరామరాజ్యం'తో బాలయ్య తెలుగు ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేస్తాడని ఆయన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలు నెరవేరుతాయా?