రాంచరణ్ కథానాయకుడిగా 'ఎవడు' అనే చిత్రం షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. సమంత ఓ హీరోయిన్ కాగా, మరో హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. అల్లు అర్జున్ అతిథి పాత్ర చేయబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రసాద్ ల్యాబ్స్‌లో డిసెంబర్ 9న జరిగిన కార్యక్రమంలో రాంచరణ్‌పై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి చిరంజీవి క్లాప్‌నివ్వగా, సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దీనికి మరో నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ "దర్శకుడు వంశీ చెప్పిన పాయింట్ ఎగ్జయిట్ చేసింది. ఆ కథవిని చిరంజీవి గారు, రాంచరణ్ కూడా అంతే ఎగ్జయిట్ అయ్యారు. కమర్షియల్ సినిమాల్లో కొత్త యాంగిల్ ఉన్న చిత్రం. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతాం. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. ఇది అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న యాక్షన్ ఎంటర్‌టైనర్'' అన్నారు.
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ "చరణ్‌తో, వంశీ పైడిపల్లితో ఇది నాకు తొలి చిత్రం. స్క్రిప్టు చాలా బాగా వచ్చింది. మంచి ఆడియో ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా'' అని చెప్పారు. దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ "కథ విన్న రోజే చిరంజీవిగారు, చరణ్ ఓకే చేశారు. ఇది నాకు మూడో చిత్రం. అన్నీ దిల్ రాజు బేనర్‌లో చేసినవే. దేవిశ్రీ మంచి బాణీలిచ్చాడు. మంచి టీమ్ కుదిరింది'' అన్నారు. ఇది కమర్షియల్ యాంగిల్‌లో కచ్చితంగా కొత్త సినిమా అని కథా రచయిత వక్కంతం వంశీ చెప్పారు.
రాంచరణ్ మాట్లాడుతూ "దిల్ రాజు ఏమిటనేది ఆయన సినిమాలే మాట్లాడతాయి. ముఖ్యమైన అతిథి పాత్ర చేయడానికి బన్నీ చేయడానికి ఒప్పుకోవడం వల్లే ఈ సినిమా త్వరగా మొదలైంది. 'ప్రస్థానం' చూసి సాయికుమార్ అభిమానినైపోయా. ఆయనతో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది'' అన్నారు. సాయికుమార్ మాట్లాడుతూ "ఈ సినిమా విషయంలో ఎంతో ఉత్సుకతతో ఉన్నా. 2012లో నాకు ఈ సినిమా పెద్ద బ్రేక్‌నిస్తుంది'' అని చెప్పారు.
అబ్బూరి రవి మాటలు రాస్తున్న ఈ చిత్రానికి కథా సహకారం: హరి, ఛాయాగ్రహణం: చోటా కె. నాయుడు, కళ: ఆనంద్‌సాయి, సహ నిర్మాతలు: శిరీశ్, లక్ష్మణ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.
No comments:
Post a Comment