నమ్మండీ నమ్మకపోండీ నేను సినిమాల్లోకి అడుగుపెట్టినప్పుడు నేను మూడు నెలల పసికందుని. సావిత్రి, మా అమ్మ స్నేహితులు. 'భార్య' సినిమాలో రాజబాబు మీద చిత్రీకరించిన ఓ పాటలో ఓ పాప కావాలని సావిత్రి కోరడంతో అమ్మ నన్ను అప్పగించింది. అలా తొలిగా మూడు నెలల వయసులో ఓ పాటలో నటించా. ఆ తర్వాత ఒకటిన్నర సంవత్సరం వయసులో 'జీవన తరంగాలు'లో మరో పాటలో నటించా. నాన్న చనిపోవడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితుల రీత్యా కేవలం మూడేళ్ల వయసులో పూర్తిస్థాయి బాలనటిగా మారా. నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడతానని జనం అంటుంటారు. చిత్రమేమంటే నేను స్కూలుకెళ్లి చదువుకోలేదు. దూరదర్శన్‌లో న్యూస్ బులెటిన్లను చూస్తూ ఇంగ్లీష్ నేర్చుకున్నా. మా సిస్టర్స్ స్కూలు నుంచి వచ్చి హోంవర్క్ చేసుకుంటూ ఉంటే నేనేమో చాకొలేట్లు తింటూ షూటింగ్‌ని ఎంజాయ్ చేస్తూ వచ్చా.
అమ్మ ఉన్నత కుటుంబం నుంచి వచ్చినా నాన్న తన తాగుడు వ్యసనంతో అమ్మని బాధపెట్టిపోయాడు. నాన్నని అమ్మ ఎంతగానో ప్రేమించేది. నేనంటే అమ్మకి ఎంతో ముద్దు. ఈజీ చైర్‌లో కూర్చున్న అమ్మ గుండెలమీద పడుకునే నాకు ఆమె ఏడుపు వినిపించేది. 'గోరింటాకు', 'సీతామాలక్ష్మి', 'మంత్రిగారి వియ్యంకుడు', 'శుభలేఖ', 'శంకరాభరణం' సినిమాలు బాలనటిగా నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇప్పుడు కూడా అమ్మ నా వద్దే ఉంది. ఆమె ఆశీస్సులే నాకు మంచి స్థితిని కల్పించాయనకుంటా. మంచి భర్త, కొడుకు, బెంగళూరు, చెన్నైలలో ఇళ్లు.. జీవితం హాయిగా నడిచిపోతోంది.
No comments:
Post a Comment