Saturday, December 24, 2011

నివాళి: మహారథి కన్నుమూత

'అల్లూరి సీతారామరాజు' మాటల్లో అగ్గి రగిల్చిన కలం ఆగిపోయింది. కట్టుదిట్టమైన పదాలతో 'కంచుకోట' కట్టిన మాటల మేస్త్రీ శ్వాస నిలిచిపోయింది. తన రచనా పటిమతోటే అనేక చిత్రాలకు ప్రాణంపోసిన మాటల సవ్యసాచి త్రిపురనేని మహారథి (81) జీవన యానం ఆగిపోయింది. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లోని తమ నివాసంలో కాలుజారి పడి తుంటి ఎముక విరగడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. గురువారం (23వ తేదీ) శస్త్ర చికిత్స చేసిన అనంతరం ఆయన ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించింది. శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటలకు మహారథి తుదిశ్వాస వదిలారు. ఆయనకు భార్య కమల, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆదివారం ఉదయం ఈఎస్ఐ శ్మశాన వాటికలో మహారథి అంత్యక్రియలు జరుగనున్నాయి.
అవతలి వారు ఎంత పెద్ద నటుడైనా, ఎంత గొప్ప దర్శకుడయినా తను రాసిన మాటను తనకు తెలీకుండా మార్చడానికి ఎంతమాత్రమూ అంగీకరించని 'మాట' వెరువని కలం యోధుడు మహారథి. ఆ మాటల సవ్యసాచి మహారథి కన్నుమూసారు. ఎన్టీఆర్ 'బందిపోటు'తో మొదలైన ఆయన ప్రస్థానం కృష్ణ 'శాంతి సందేశం'తో ముగిసింది. కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా పసుమర్రు గ్రామంలో 1930 ఏప్రిల్ 20న ఆయన జన్మించారు. తల్లిదండ్రులు పుణ్యవతి, సత్యనారాయణ. ఆయన అసలు పేరు బాలగంగాధర్. పన్నెండేళ్ల వయసులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఇంటర్మీడియేట్ చదివే రోజుల్లో పువ్వాడ శేషగిరిరావు శుశ్రూషలో తొలి పద్యం రాశారు. అదే ఊపుతో శతకాలు, విప్లవ కవిత్వం రాసేశారు. పాత్రికేయుడిగా మొదలై సినిమా రంగానికి విస్తరించి.. డబ్బింగ్‌తో సహా వంద సినిమాలకు రచయితగా వ్యవహరించారు.
కృష్ణకు చెందిన పద్మాలయా పిక్చర్స్ సంస్థ నిర్మించిన 'దేవుడు చేసిన మనుషులు' (1973) అఖండ విజయం సాధించడంతో మహారథి రచయితగా నిలదొక్కుకున్నారు. 'అల్లూరి సీతారామరాజు' కోసం నిజంగానే తపస్సు చేశారు. డిసెంబర్ చలిలో తెల్లవారుజామున చింతపల్లి అడవుల్లో చెట్టు కింద ఒంటిమీద ఆచ్ఛాదన లేకుండా కూచుని... ధ్యానయోగంలో ఉండి ఈ సినిమాను మనసులోనే దృశ్యమానం చేసుకున్నారు. ఆయన అకుంఠిత శ్రమ ఫలించి 'అల్లూరి సీతారామరాజు' అఖండ విజయం సాధించింది.
ఎన్నో అడుగులు
మహారథి సొంత ఊరు నుంచి హైదరాబాద్‌కు వచ్చి దక్కన్ రేడియోలో పనిచేశారు. 1957లో మద్రాసు రైలెక్కారు. తిలక్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 1959లో డబ్బింగ్ రచయితగా రూపాంతరం చెందారు. ఆయన సంభాషణలు రాసిన తొలి స్ట్రయిట్ సినిమా 'బందిపోటు' (1963). మంచిని పెంచాలి, దేశమంటే మనుషులోయ్, రైతు భారతం అనే మూడు సినిమాలను నిర్మించి ఆర్థికంగా దెబ్బతిన్నారు. 'రైతు భారతం'తో సౌందర్యను పరిచయం చేశారు. టెలివిజన్ రంగంలోనూ రాణించి 'చాణక్య', 'పంచతంత్రం' మెగా సీరియళ్లకు సంభాషణలు రాశారు. ఆది నుంచీ రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న ఆయన... బలహీన వర్గాలకు రాజ్యాధికారం అనేలక్ష్యంతో 'త్రిలింగ ప్రజాప్రగతి పార్టీ'ని స్థాపించారు.
కేవలం సినిమా రచయితగానే కాకుండా కవిగా, పుస్తక రచయితగానూ మహారథి రాణించారు. విప్లవ వీరులకు అంకితమిస్తూ 'మహాప్రళయం' వెలువరించారు. ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో చీకటి కోణాల్ని ఆవిష్కరించిన 'మరోసారి మరణిస్తున్న ఎన్టీఆర్'(2004), 'ఎన్టీఆర్ పునరుత్థానం' (2005), 'మాడు పగిలే మూడు శతకాలు' (2007) 'మహారథి ముచ్చట్లు' (2008) పాఠకాదరణ పొందాయి. కొంతకాలంగా భౌతిక వాదం, ఆధ్యాత్మిక వాదం మేళవింపుతో ఓ పరిశోధన్మాతక గ్రంథాన్ని రాసే పనిలో ఉన్నారు. భగవద్గీతకు భాష్యం రాసే పని మొదలుపెట్టారు. మహారథి రెండో కుమారుడు చిట్టి (వరప్రసాద్) చిత్ర రంగంలో కొనసాగుతున్నారు.
-ఆంధ్రజ్యోతి డైలీ, డిసెంబర్ 24, 2011

No comments: