'కవికి గర్వము ముంజేతి కంకణమని/ఉర్వి నెవరికి తలవంచకుండ బ్రతికి'న సహజకవి మల్లెమాల సుందరరామిరెడ్డి మరి లేరు. తెలుగు చిత్రసీమకు రాశిలో తక్కువైనా ఆణిముత్యాల్లాంటి సినిమాల్నీ, పాటల్నీ అందించిన ఎమ్మెస్ రెడ్డి మరలిరాని లోకాలకు తరలిపోయారు. తెలుగు సినిమా మరో కురువృద్ధుణ్ణి కోల్పోయింది. పోయిన ఆదివారం భారతీయ సినిమా ఎవర్‌గ్రీన్ రొమాంటిక్ స్టార్ దేవానంద్‌ని కోల్పోతే, ఈ ఆదివారం కవి, రచయిత, నిర్మాత ఎమ్మెస్ రెడ్డిని తెలుగు సినిమా కోల్పోయింది. నెల్లూరు జిల్లా వెంకటగిరి తాలూకాలోని అలిమిలి అనే మారుమూల గ్రామంలో 1924 ఆగస్టు 15న జన్మించారు మల్లెమాల సుందరరామిరెడ్డి. తల్లిదండ్రులు రంగమ్మ, రామస్వామిరెడ్డి. ఎంతగా చదువుకోవాలన్నా ఏదో ఓ అవాంతరంతో ఆయన చదువు సాగలేదు. తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు చేశారు. 30 లక్షల మంది బలయిన బెంగాల్ కరువుపై సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు రాసిన బుర్రకథకి ప్రభావితులై తంబుర చేతబట్టి ఆ బుర్రకథ చెప్పి పది వేల రూపాయలు సేకరించి కలకత్తాకు పంపారు. నెల్లూరు జమీన్ రైతు వారపత్రిక ప్రభావంతో జమీందారీ వ్యతిరేక భావాలను అలవర్చుకొని 'మాకొద్దీ జమీందారి పెత్తనం. అది/రద్దు కావాలి తప్పకుండ తక్షణం' అన్న గేయాన్ని రాశారు. దాన్ని విన్న ప్రకాశం పంతులు 'సహజకవి'గా మల్లెమాలను సంబోధించారు. అది ఆయనకు సార్థక నాయధేయంగా మారింది.
సినీ రంగంలో ఎగ్జిబిటర్‌గా అడుగుపెట్టి గూడూరులో సుందరమహల్ అనే థియేటర్‌ను నిర్మించి, 1963 డిసెంబర్‌లో ప్రారంభించారు. ఆ థియేటర్ ద్వారా గూడూరులో తొలిసారిగా కొత్త చిత్రాల్ని విడుదల చేశారు ఎమ్మెస్ రెడ్డి. 1964లో చిత్ర నిర్మాణ సంస్థ కౌముది ఆర్ట్ పిక్చర్స్‌ను స్థాపించి, దానిపై తొలిగా తమిళ చిత్రం 'కుమరిప్పెణ్'ను 'కన్నెపిల్ల'గా డబ్‌చేసి, 1966 డిసెంబర్ 26న విడుదల చేశారు. అదే రోజు విడుదలైన ఎన్టీ రామారావు సినిమా 'కంచుకోట' పోటీని తట్టుకొని ఆ సినిమా వంద రోజులు ఆడి, లాభాలు తెచ్చింది. ఆ తర్వాత 'కొంటెపిల్ల', 'కాలచక్రం' అనే డబ్బింగ్ చిత్రాలు విడుదల చేసిన ఆయన 1968లో శోభన్‌బాబు, వాణిశ్రీ జంటగా 'భార్య' చిత్రాన్ని నిర్మించి, స్ట్రయిట్ సినిమాల నిర్మాతగా మారారు. అది బాగా ఆడింది. ఆ తర్వాత లాభనష్టాలకు అతీతంగా అనేక చిత్రాల్ని నిర్మించారు. తను నిర్మించిన పలు చిత్రాల్లో ఆయన గేయ రచయితగానూ గొప్పగా రాణించారు. 'అంకుశం'లో ముఖ్యమంత్రిగా నటించి, నటుడిగానూ సమర్ధత చూపారు.
1964 నుంచీ చిత్రసీమలో ఉన్నప్పటికీ ఆయన ఎక్కువ సినిమాలు నిర్మించలేక పోవడానికి కారణం వివిధ సంఘాల్లో బాధ్యుడిగా ఉండటమే. సౌత్ ఇండియన్ ఫిల్మ్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడిగా, దక్షిణ భారత చలనచిత్ర రచయితల సంఘాధ్యక్షుడిగా, తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షునిగా, ఫిల్మ్‌నగర్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షునిగా, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్.డి.సి.) ఛైర్మన్‌గా ఆయన చిత్రసీమకు ఇతోధిక సేవలందించారు. ఎఫ్‌డిసికి పనిచేస్తున్న కాలంలోనే దానికి సొంత భవన నిర్మాణాన్ని పూర్తిచేసి, సెన్సార్ బోర్డు ఆఫీసును అందులోనే ఏర్పాటు చేయించారు. సెన్సార్ చిత్రాల పరిశీలనకు ఓ మినీ థియేటర్‌ను సైతం అందులో నిర్మించారు. బంజారాహిల్స్‌లో ప్రభుత్వమిచ్చిన స్థలంలో రెండేళ్లు శ్రమించి 'శబ్దాలయ' పేరుతో రికార్డింగ్ థియేటర్, డబ్బింగ్ థియేటర్, ఎడిటింగ్ రూములు కట్టారు. సినిమా ప్రాసెసింగ్‌లో అది తనవంతు సేవ చేస్తూ ఉంది.
ఇక రచయితగా తెలుగు భాషకు ఆయన చేసిన సేవ చిన్నదేమీ కాదు. 'మల్లెమాల రామాయణం', 'వృషభ పురాణం', 'నిత్య సత్యాలు', 'తేనెటీగలు', 'మంచు ముత్యాలు', 'అక్షర శిల్పాలు', 'ఎందరో మహానుభావులు', 'వాడని మల్లెలు' వంటి పద్య, గద్య పుస్తకాలు వెలువరించారు. అయితే ఇటీవల ఆయన రాసిన స్వీయ చరిత్ర 'ఇదీ నా కథ' సినీ రంగంలో కలకలం సృష్టించింది. తను పనిచేసిన నటీనటులు, దర్శకులతో తన అనుభవాలను ఉన్నదున్నట్లు ఆయన రాయడం చాలామందిని నొప్పించింది. వివాదాలకు దారితీసింది. జమున, శోభన్‌బాబు, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, గుణశేఖర్ వంటి లబ్ద ప్రతిష్టుల వల్ల తను ఎదుర్కొన్న చేదు అనుభవాల్ని అందులో ఆయన ఉటంకించారు. ఏదేమైనా నిక్కచ్చిగా, ముక్కుసూటిగా, నిర్భీతిగా వ్యవహరించే ఆయన స్వభావానికి 'ఇదీ నా కథ' ఓ బలమైన నిదర్శనం.
-ఆంధ్రజ్యోతి డైలీ (చిత్రజ్యోతి), డిసెంబర్ 12, 2011
No comments:
Post a Comment