Showing posts with label ileana. Show all posts
Showing posts with label ileana. Show all posts

Monday, June 25, 2012

'దేవుడు చేసిన మనుషులు' పాటల విడుదల


రవితేజ, ఇలియానా జంటతో దర్శకుడు పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న 'దేవుడు చేసిన మనుషులు' సినిమా ఆడియో సీడీలు సోనీ మ్యూజిక్ ద్వారా మార్కెట్‌లో విడుదలయ్యాయి. రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియాపై. లిమిటెడ్ పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రఘు కుంచె స్వరాలకు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. శిల్పకళావేదికలో శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో సీనియర్ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఆడియో సీడీలతో పాటు థియేటర్ ట్రైలర్‌నూ ఆవిష్కరించారు.
ఈ సినిమాకు రఘు కుంచె సంగీతం అందించిన పాటలన్నీ అలరిస్తాయని నమ్ముతున్నానీ, సినిమా విడుదలయ్యాక బాక్సాఫీస్ కలెక్షన్లతో నిండిపోవాలనీ ఆకాంక్షించారు.
గేయ రచయిత భాస్కరభట్ల మాట్లాడుతూ "ఇది చాలా మంచి ఆడియో. సింగిల్ కార్డ్ రాశా. 'ఏమి సేతుర సామీ' అనేది నా మనసుకు బాగా నచ్చిన పాట. 'బంపర్ ఆఫర్' తర్వాత రఘు కుంచెతో పనిచేయడం సంతోషంగా ఉంది'' అన్నారు.
దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ "ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలతో పోలిస్తే ఇది వేరే సెటప్‌తో తీసిన సినిమా. కథలేకుండా సినిమా తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో తీసిన సినిమా. మొదట ఈ కథని ఇలియానాకి చెప్పా. తను టాక్సీ డ్రైవర్‌గా బాగా చేసింది. రవితేజతో ఇది నాకు ఐదో సినిమా. రవి అంటే నాకు మోజు. హైదరాబాద్‌లో నాకు తగిలిన మొదటి ఫ్రెండు రఘు. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. బ్రెజిల్ మోడల్ గాబ్రియేలా బర్తాంతే ఇందులో ఓ ఐటమ్ సాంగ్ చేసింది'' అని చెప్పారు. ఈ పాటలు అందరికీ నచ్చుతాయని ఆశిస్తున్నాయనీ, జగన్‌తో, రవితో పనిచేయడం తనకెంతో సంతోషాన్నిస్తుందనీ హీరోయిన్ ఇలియానా చెప్పింది.
రఘు కుంచె మాట్లాడుతూ " అందరూ దేవుడు చేసిన మనుషులే. నేను మాత్రం పూరి చేసిన మనిషిని. నాకు నారుపోసి, నీరు పెట్టింది పూరీనే. అతనికి ఫ్రెండ్‌గా పుట్టడం నేను చేసుకున్న అదృష్టం. ఇందులోని పాటలు రాయడానికి భాస్కరభట్ల ఎంత వేదనపడ్డాడో ప్రత్యక్షంగా చూశా. తప్పకుండా ఈ పాటలు అందర్నీ అలరిస్తాయి'' అని తెలిపారు.
రవితేజ మాట్లాడుతూ "ఈ సినిమాతో రఘు కుమ్మేయబోతున్నాడు. జగన్ నమ్మకమే నన్ను ఈ రోజున ఈ స్థాయిలో నిలబెట్టింది'' అని చెప్పారు. జూలై 27న 'దేవుడు చేసిన మనుషులు'ను విడుదల చేస్తామని నిర్మాత భోగవల్లి ప్రసాద్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో దర్శకులు గుణ్ణం గంగరాజు, బోయపాటి శ్రీను, బొమ్మరిల్లు భాస్కర్, గోపీచంద్ మలినేని, వీరభద్రం, రిలయెన్స్ ప్రతినిధి మహేశ్ రామనాథన్, నిర్మాతలు డి.వి.వి.దానయ్య, బండ్ల గణేష్, లవ్‌లీ రాజు, సహ నిర్మాత భోగవల్లి బాపినీడు, నటులు ఆలీ, సుబ్బరాజు, తారలు జ్యోతిరాణా, గాబ్రియేలా, రచయితలు కోన వెంకట్, బీవీఎస్ రవి, కల్యాణ్, కళా దర్శకుడు చిన్నా, ఎడిటర్ ఎస్.ఆర్.శేఖర్, సోనీ మ్యూజిక్ ప్రతినిధులు అశోక్, అశ్విన్, బ్యాంకాక్ బాబీ తదితరులు పాల్గొన్నారు.

Wednesday, December 14, 2011

త్రివిక్రం ఎదుట సవాలు

దర్శకుడిగా హ్యాట్రిక్ హిట్స్ కొట్టి నాలుగో సినిమాతో బోల్తాపడ్డ త్రివిక్రం ఐదో సినిమాతో సవాలును ఎదుర్కొంటున్నాడు. అతను డైరెక్ట్ చేసిన 'నువ్వే నువ్వే', 'అతడు', 'జల్సా' సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి హిట్టయిన సంగతి తెలిసిందే. అదివరకు రచయితగా టాప్ రేంజ్ పొందిన త్రివిక్రం ఈ మూడు సినిమాలతో డైరెక్టర్‌గానూ టాలీవుడ్ టాప్‌లీగ్‌లో చేరిపోయాడు. అయితే అతడి నాలుగో సినిమా తొలి ఫ్లాప్‌ని అతడి జాబితాలో చేర్చింది. ఆ సినిమా 'ఖలేజా'. మహేశ్ హీరోగా అతడు డైరెక్ట్ చేసిన రెండో సినిమా ఇది. 'మగధీర' స్ఫూర్తితో తీయడం వల్ల ఈ సినిమాలో ఒరిజినాలిటీ మిస్సయ్యిందనే అపవాదుతో పాటు మహేశ్, అనుష్క మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ కాలేదనే విమర్శా వచ్చింది. కథలోనే దమ్ములేదనే మాట ఎలాగూ ఉంది. 
ఈ సినిమాతో దెబ్బతిన్న త్రివిక్రం ఇప్పుడు అల్లు అర్జున్‌ని డైరెక్ట్ చేయడంలో నిమగ్నమయ్యాడు. నవంబర్ 2న ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. అర్జున్ సరసన ఇలియానా తొలిసారి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాతో బంపర్‌హిట్ కొట్టి తన సత్తా చాటాలని ఆశిస్తున్నాడు త్రివిక్రం. తొలి మూడు సినిమాలతో దర్శకుడిగా త్రివిక్రంలోని ప్రతిభ ఆవిరైందనీ, అందువల్లే 'ఖలేజా' లాంటి సబ్జెక్ట్ చేశాడనీ వచ్చిన విమర్శల్ని తాజా సినిమాతో తిప్పికొట్టాలని అతను భావిస్తున్నాడు. ఈ సవాలుని అతడు ఎలా అధిగమిస్తాడో చూడాల్సిందే.

Wednesday, September 14, 2011

న్యూస్: 'మొగుడు' మీద ఆశలెన్నో!

కె. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన 'ఝుమ్మంది నాదం' రిలీజయినప్పుడు తాప్సీ రూపంలో టాలీవుడ్‌కి మరో ఇలియానా పరిచయమయ్యిందనే టాక్ వచ్చింది. 'దేవదాసు', 'పోకిరి' సినిమాలతో ఇలియానా హాటెస్ట్ హీరోయిన్ అయిన విధంగానే తాప్సీ కూడా అమిత క్రేజ్ సంపాదించుకుంటుందని అనుకున్నారు. చిత్రంగా నాలుగు సినిమాలు రిలీజైనా ఆమెకి తెలుగులో అనుకున్నంత క్రేజ్ రాలేదు. 'పోకిరి' తరహా హిట్ ఆమెకి రాకపోవడమే దీనికి కారణమని చెప్పాలి. అందచందాల విషయంలో ఏమాత్రం వంకపెట్టలేని రీతిలో ఉండే ఈ పంజాబీ ముద్దుగుమ్మ 'ఝుమ్మంది నాదం' తర్వాత 'వస్తాడు నా రాజు', 'మిస్టర్ పర్ఫెక్ట్', 'వీర' సినిమాల్లో చేసింది. వీటిలో 'మిస్టర్ పర్ఫెక్ట్' ఒక్కటే హిట్టు. అందులోనూ ఆమె చేసింది సెకండ్ హీరోయిన్ కేరక్టరే. ఫలితంగా అనుకున్నంతగా ఆమె కెరీర్ ఊపందుకోలేదు. టాప్ హీరోల సరసన ఆఫర్లు రావడం లేదు. ప్రస్తుతం ఆమె తెలుగులో ఒకే సినిమా చేస్తోంది. ఆ సినిమా 'మొగుడు'. కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో ఆమె గోపీచంద్ సరసన నటిస్తోంది. నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న ఈ సినిమాపై తాప్సీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో గోపీచంద్, తాప్సీ మధ్య రొమాంటిక్ సీన్లు ఆడియెన్స్ మతులు పోగొడతాయని ఆ సినిమా యూనిట్ మెంబర్స్ అంటున్నారు. రొమాంటిక్ సీన్లు తీయడంలో కృష్ణవంశీది అందె వేసిన చెయ్యి కావడంతో తాప్సీ అందాలు ఈ సినిమాలో కనువిందు చేస్తాయని ఊహించవచ్చు. బాలీవుడ్‌లో 'చష్మే బద్దూర్' అనే సినిమాని సిద్ధార్థ్‌తో చేయబోతున్న తాప్సీకి 'మొగుడు' ఎలాంటి కానుకనిస్తాడో చూడాల్సిందే.

Thursday, September 8, 2011

న్యూస్: రెండు ఛాన్సులు కొట్టేసిన ఇలియానా

ప్రస్తుతం తమిళంలో శంకర్ డైరెక్షన్‌లో 'నంబన్' ('3 ఇడియట్స్' రీమేక్)లో నటిస్తోన్న గోవా బ్యూటీ ఇలియానా ఎట్టకేలకు రెండు తెలుగు సినిమాల్లో బుక్కయ్యింది. తెలుగులో పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో 'నేను నా రాక్షసి' చేశాక మళ్లీ మరో సినిమాలో ఆమె దర్శనమివ్వలేదు. సాధారణంగా ఇలియానా స్టార్ హీరోయిన్ ఇమేజ్‌కి ఎలాంటి గ్యాప్ లేకుండా కనీసం రెండు మూడు సినిమాలు చేతిలో ఉండాలి. కానీ ఆ సినిమా పూర్తి చేసిన ఆర్నెల్ల వరకూ ఆమె మరో తెలుగు సినిమా సెట్స్ మీద కాలుపెట్టలేదు. కోటి దాటిన ఆమె రెమ్యూనరేషనే దీనికి కారణమని ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఆమెకి ఇద్దరు డైరెక్టర్ ఫ్రెండ్స్ మళ్లీ అవకాశాలిచ్చారు. ఒకరు 'పోకిరి'తో ఆమెని స్టార్ హీరోయిన్‌ని చేసిన పూరి జగన్నాథ్ అయితే, మరొకరు ఆమెతో 'జల్సా' చేసిన త్రివిక్రం. రవితేజ హీరోగా జగన్ సంకల్పించిన 'ఇడియట్ 2'లో ఇలియానా హీరోయిన్‌గా ఎంపికైంది. ఇటు జగన్‌తో, అటు రవితేజతో ఆమెకి ఇది మూడో సినిమా కావడం విశేషం. అలాగే అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రం డైరెక్ట్ చేసే సినిమాలోనూ హీరోయిన్‌గా ఇలియానా కన్‌ఫామయ్యింది. నిజానికి ఇందులో తనకి జోడీగా మిస్ బ్యూటిఫుల్ స్కిన్ సమంతా కావాలని అర్జున్ పట్టుబట్టగా, త్రివిక్రం ఇలియానాకి ఓటేసి, అర్జున్‌ని కన్విన్స్ చేశాడనీ ఫిలింనగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఏదేమైనా ఏవో అల్లాటప్పా చాన్సులు కాకుండా రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు దొరకడంతో ఇలియానా ఆనందంతో తబ్బిబ్బవుతోంది.

Wednesday, July 27, 2011

న్యూస్: ఆ ఇద్దరి కసి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

తెలుగులో, ఆ మాటకొస్తే దేశంలోనే హీరోలందరిలో నెంబర్‌వన్ డాన్సర్ అతను. సినిమా సినిమాకీ స్టైల్ మార్చే 'స్టైలిష్ స్టార్' అతను. అయినా అతనికి ఇటీవలి కాలంలో ఆశించిన హిట్లు దక్కడం లేదు. అతను అల్లు అర్జున్. రికార్డులు సృష్టిస్తుందనే నమ్మకంతో 40 కోట్ల రూపాయలు పైగా ఖర్చుపెట్టి అతని తండ్రి అల్లు అరవింద్ నిర్మించిన 'బద్రినాథ్' సినిమా ఓపెనింగ్స్‌ని బాగానే రాబట్టినా చివరికి ఫ్లాప్‌గా లెక్కతేలింది. తన పరిచయ చిత్రం 'గంగోత్రి'కి కథనందించిన చిన్నికృష్ణ, 'బన్నీ' వంటి హిట్‌ని డైరెక్ట్ చేసిన వి.వి. వినాయక్ కాంబినేషన్ కూడా అర్జున్‌కి కలిసిరాలేదు. ఆఖరుకి మిల్కీ బ్యూటీ తమన్నా అందచందాల ప్రదర్శనా వర్కవుట్ కాలేదు. తొలిసారిగా టాలీవుడ్‌లో బద్రినాథ్ దేవాలయాన్ని నేపథ్యంగా తీసుకున్నా ప్రయోజనం కలిగించలేదు. సరైన కథా కథనాలు లోపిస్తే ఎన్ని హంగులున్నా నిష్ప్రయోజనమేనని 'బద్రినాథ్' ఉదంతం మరోసారి తేటతెల్లం చేసింది. ఇక బన్నీ ఆశలన్నీ త్రివిక్రం మీదే ఉన్నాయి. ఇప్పుడు బన్నీ నటించబోతోంది అతని దర్శకత్వంలోనే. యూనివర్సల్ మీడియా బేనర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమా తీయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం 'హనీ' అనే టైటిల్‌ని ఆయన రిజిస్టర్ చేశారు. హీరోయిన్ ఎంపికే సస్పెన్స్‌గా మారింది. ఒకసారి కాజల్ పేరు, ఇంకోసారి ఇలియానా పేరు వినిపించగా, లేటెస్ట్‌గా సమంతా పేరు తెరపైకి వచ్చింది. మొత్తానికి ఇలియానా, సమంతా.. వీరిలో ఒకరు ఖాయమయ్యే అవకాశముంది. సెప్టెంబరులో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లబోతోంది. 'మహేశ్ ఖలేజా' వంటి ఫ్లాప్‌తో త్రివిక్రం, 'బద్రినాథ్' వంటి ఫ్లాప్‌తో బన్నీ ఇప్పుడు మంచి కసి మీదున్నారు. ఆ కసి సెన్సేషనల్ మూవీని క్రియేట్ చేస్తుందా?

Tuesday, July 26, 2011

న్యూస్: తాప్సీ ఆ సినిమా చేస్తుందా?

ఇలియానా తరహాలోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చాలామంది భావించిన పంజాబీ బ్యూటీ తాప్సీ పన్ను నాలుగు సినిమాల తర్వాత కూడా అలాంటి క్రేజ్‌ని సృష్టించలేక పోయింది. తొలి సినిమా 'ఝుమ్మంది నాదం'లో ఆమెని రాఘవేంద్రరావు చూపించిన తీరు చూసి మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ టాలీవుడ్ అంటూ తీర్మానించేసింది చిత్రసీమ. అయితే 'మిస్టర్ పర్ఫెక్ట్' మినహా ఆమె ఖాతాలో ఇంతదాకా మరో హిట్టు లేదు. ఆ సినిమాలోనూ ఆమెది సెకండ్ హీరోయిన్ రోలే. 'ఝుమ్మంది నాదం'తో పాటు 'వస్తాడు నా రాజు', 'వీర' ఫ్లాపయ్యాయి. ఇలియానా మాదిరిగా తొలి రెండు సినిమాలు 'దేవదాసు', 'పోకిరి' వంటివి తాప్సీకి తగిలుంటే ఆమె కూడా ఈపాటికే యువతరం కలల రాణిగా ఆవిర్భవించి ఉండేదని విశ్లేషకుల అభిప్రాయం. ప్రస్తుతం కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తున్న 'మొగుడు'లో గోపీచంద్ సరసన నటిస్తున్న ఆమె తాజాగా సునీల్ సరసన నటించేందుకు అంగీకరించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. మాధవన్, కంగనా రనౌత్ జంటగా బాలీవుడ్‌లో వచ్చి సూపర్‌హిట్టయిన 'తను వెడ్స్ మను'కి ఇది రీమేక్. మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీప్రసాద్ డైరెక్టర్. అయితే ఈ సినిమాలో తాప్సీ నటించడం లేదనే ప్రచారం కూడా జరుగుతోంది. కమెడియన్ అయిన సునీల్ సరసన నటిస్తే టాప్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావని, ఇందుకు 'మర్యాద రామన్న'లో నటించిన సలోని మంచి ఉదాహరణంటూ ఆమె హితులు హెచ్చరించారనీ, అందుకే ఆమె ఆ సినిమా చెయ్యట్లేదనీ వినిపిస్తోంది. తాప్సీ నుంచి మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. నిజానికి తాప్సీ కంటే ముందు ఇద్దరు ముగ్గురు నేటి క్రేజీ హీరోయిన్లని నిర్మాతలు సంప్రదించారు కానీ వారు సునీల్‌తో చేయడానికి విముఖత చూపించారు. ఈ పరిస్థితుల్లో సునీల్ జోడీ తాప్సీనా లేక మరొకరు ఆ స్థానంలోకి వస్తారా?

Tuesday, July 19, 2011

న్యూస్: నితిన్ ప్రేక్షకుల 'ఇష్క్' పొందుతాడా?

నితిన్‌కి హిట్టొచ్చి ఎంత కాలమైందో జ్ఞాపకముందా? ఏడేళ్లు! అవును. అతని చివరి హిట్ మూవీ 'సై'. అది కూడా నిర్మాతకి డబ్బులు తీసుకు రాలేదు. కొన్నవాళ్లే లాభపడ్డారు. అంతకు ముందు 'జయం', 'దిల్' సినిమాలతో రెండు వరుస హిట్లిచ్చిన అతను నాలుగో సినిమా 'సై'తో మరో సక్సెస్ సాధించాననుకున్నాడు. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వ ప్రతిభతో రగ్బీ నేపథ్యంలో నడిచే ఆ సినిమా చాలామందిని ఆకట్టుకుంది. దాని తర్వాత నితిన్ 13 సినిమాల్లో నటించాడు. వాటిలో ఏ ఒక్కటీ అతనికి సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. ఆ సినిమాల్లో రాంగోపాల్‌వర్మ డైరెక్షన్‌లో చేసిన హిందీ సినిమా 'అగ్యాత్' కూడా ఉంది. అంటే నితిన్ బాలీవుడ్ ఎంట్రీ సైతం నిరాశనే కలిగించింది. కృష్ణవంశీ (శ్రీ ఆంజనేయం), కె. రాఘవేంద్రరావు (అల్లరి బుల్లోడు), తేజ (ధైర్యం), ఎన్. శంకర్ (రాం) వంటి దర్శకులు కూడా తర్వాతి కాలంలో అతనికి సక్సెస్సులు ఇవ్వలేకపోయారు. ప్రియమణి అందాల కనువిందు చేసిన 'ద్రోణ' కానీ, మోస్ట్ గ్లామరస్ గర్ల్ ఇలియానాతో చేసిన 'రెచ్చిపో' కానీ, క్యూట్ గర్ల హన్సికతో నటించిన 'సీతారాముల కల్యాణం.. లంకలో' కానీ అతడికి విజయాన్ని చేకూర్చలేక పోయాయి. అతని కెరీర్ కోసం తండ్రి ఎన్. సుధాకర్‌రెడ్డి చేయని ప్రయత్నమంటూ లేదు. అయినా కూడా నితిన్ ఎందుకనో ప్రేక్షకుల్ని అలరించలేక పోతున్నాడు. ప్రస్తుతం అతను 'ఇష్క్' అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో 'అలా మొదలైంది'తో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్న నిత్య మీనన్ హీరోయిన్. విక్రం కుమార్ అనే కొత్త డైరెక్టర్ రూపొందిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ఓ విశేషం ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ పి.సి. శ్రీరాం దీనికి పని చేస్తుండటం. ఈ సినిమాతోనైనా నితిన్ తన పరాజయ పరంపరకి అడ్డుకట్ట కట్టుకోగలడా? వెయిట్ అండ్ సీ.

Monday, July 18, 2011

న్యూస్: రానాని ప్రేక్షకులు ఇష్టపడతారా?

తొలి రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో మూడో సినిమా మీద ప్రాణమే పెడుతున్నాడు రానా దగ్గుబాటి. శేఖర్ కమ్ముల రూపొందించిన 'లీడర్'లో ముఖ్యమంత్రిగా నటించి బాగానే చేశాడనిపించుకున్న ఈ రామానాయుడి మనవడు, సురేశ్‌బాబు కుమారుడు పూరి జగన్నాథ్ సినిమా 'నేను నా రాక్షసి' కచ్చితంగా తనకి కమర్షియల్ బ్రేక్ ఇస్తుందని ఆశించాడు. కానైతే ఆ సినిమా ఫ్లాప్ అనిపించుకుంది. పైగా ఆ సినిమా వల్ల అతని కంటే ఎక్కువగా ఇలియానాకే పేరు వచ్చింది. ఈ నేపథ్యంలో 'నా ఇష్టం' అనే సినిమా చేస్తున్నాడు రానా. ఇందులో అతని జోడీగా 'బొమ్మరిల్లు' బ్యూటీ జెనీలియా నటిస్తుండటం విశేషం. 'సింహా'తో హిట్టు కొట్టిన పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా ప్రకాశ్ తోలేటి డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. పర్సనాలిటీ పరంగా సీరియస్ కేరక్టర్స్‌కి పనికి వస్తాడనిపించే రానా 'నా ఇష్టం'లో రఫ్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమాతోనైనా ప్రేక్షకులు తనని ఇష్టపడేలా చేసుకోవాలని తపిస్తున్నాడు. అతని ఆశ నెరవేరుతుందా?

Wednesday, July 13, 2011

న్యూస్: నెంబర్‌వన్ రేసులో తమన్నా!

మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా తెలుగులో ఇప్పుడు నెంబర్ వన్ రేసులో దూసుకుపోతోంది. ఈ విషయంలో ఆమె కాజల్ అగర్వాల్‌కి ప్రధాన పోటీదారుగా మారింది. రేసులో నిన్నటి వరకు ముందున్న గోవా సుందరి ఇలియానా వెనకడుగు వేయడం, త్రిష ఇమేజ్ క్రమేపీ తగ్గుతుండటం, తాప్సీ, సమంతా ఇంకా టాప్ స్లాట్‌లోకి రాకపోవడంతో తమన్నాకి అవకాశాలు మెరుగయ్యాయి. ఆరేళ్ల క్రితమే మంచు మనోజ్ సరసన చేసిన 'శ్రీ'తో తెలుగులో అడుగుపెట్టినప్పటికీ ఆమెకి బాగా గుర్తింపు తెచ్చింది శేఖర్ కమ్ముల రూపొందించిన 'హ్యాపీడేస్' సినిమానే. అయితే దాని తర్వాత కూడా ఆమె సరైన సినిమాల్ని ఎంచుకోలేకపోయింది. రెండేళ్ల క్రితం 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' సినిమాలో ఆకట్టుకున్న ఆమె మళ్లీ రెండేళ్ల గ్యాప్‌తో '100% లవ్'తో ప్రేక్షకుల్నీ, విమర్శకుల్నీ సమానంగా సమ్మోహనపరిచింది. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హీరో నాగచైతన్య కంటే తమన్నాకే ఎక్కువ పేరు రావడం గమనార్హం. ఈ సంగతిని నాగచైతన్య తండ్రి, సీనియర్ టాప్ హీరో నాగార్జున సైతం పబ్లిగ్గా చెప్పారు కూడా. ఈ సినిమాతో ఆమెకి వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. '100% లవ్' నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మించిన భారీ చిత్రం 'బద్రీనాథ్'లో రెగ్యులర్ హీరోయిన్‌గా కనిపించినా తనదైన ముద్రని వేసింది తమన్నా. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్టులున్నాయి.
వాటిలో ఒకటి రాంచరణ్‌కి జోడీగా నటిస్తున్న 'రచ్చ' కాగా రెండోది ఎన్‌టీఆర్‌తో చేస్తున్న 'ఊసరవెల్లి'. ఇక మూడోది రాం సరసన నటిస్తున్న 'ఎందుకంటే.. ప్రేమంట'. ఈ మూడు సినిమాలతో తమన్నా తెలుగులో నెంబర్ వన్ తార అవడం ఖాయమని చాలామంది నమ్ముతున్నారు. వారి నమ్మకం నిజమవుతుందో, లేదో వెయిట్ అండ్ సీ.

Tuesday, May 17, 2011

ఫోకస్: రజనీకాంత్ 'రాణా' వెలుగు చూస్తుందా?

ఇప్పుడు అందరి చూపూ రజనీకాంత్ సినిమా 'రాణా' మీదే. ఆ సినిమా అసలు షూటింగ్ జరుపుకుంటుందా? లేక ఆగిపోతుందా? అనే ప్రశ్నలు అందరి మనసుల్నీ తొలుస్తున్నాయి. ఏప్రిల్లో ఈ మెగా బడ్జెట్ సినిమా సెట్స్ మీదకెళ్లింది. హీరోయిన్లుగా దీపికా పదుకోనే, ఇలియానా ఎంపికయ్యారు. నెల రోజుల వ్యవధిలో రజనీకాంత్ మూడు సార్లు హాస్పిటల్ పాలవడంతో సినిమా షెడ్యూలంతా డిస్టర్బయ్యింది. వాంతుల కారణంగా ఏప్రిల్ 29న ఆయన చెన్నైలోని సెయింట్ ఇసాబెల్ హాస్పిటల్లో చేరి, అదే రోజు సాయంత్రం డిశ్చార్జయ్యారు.
తిరిగి మే 4న జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులతో అదే హాస్పిటల్లోని ఐసీయూలో చేరారు. నెల రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సిందిగా డాక్టర్లు ఆయనకు సూచించారు. దీంతో నిర్మాణ సంస్థ ఈరోస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇబ్బందుల్లో చిక్కుకుంది.
మరోవైపు హీరోయిన్లు దీపిక, ఇలియానా కాల్షీట్లు ఇరకాటంలో పడ్డాయి. ఈ నెలలో కొన్ని కాల్షీట్లు ఇచ్చిన దీపిక జూన్-జూలైలోనూ మరికొన్ని కాల్షీట్లు ఇచ్చింది. ఈలోగా రజనీకాంత్ కోలుకుని మళ్లీ షూటింగ్‌కి హాజరైతే ఓకే. లేదంటే ఏంచేయాలోనని అంతా తలల పట్టుకుంటున్నారు. మరోవైపు 'రాణా' షూటింగ్ యధాతథంగా జరుగుతుందని డైరెక్టర్ కేయస్ రవికుమార్ చెబుతున్నాడు. 'రాణా' టైటిల్ మార్పు కోసం ఆయన న్యూమరాలజిస్టుల్ని సంప్రదించాడు. థాయిలాండ్, లండన్‌లలో షూటింగ్ కోసం ఆయన షెడ్యూల్స్ వేయడంలో మునిగిపోయాడు.
ఈ సినిమా కోసం ఈరోజ్ సంస్థ 150 కోట్లని కేటాయించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా ఆగితే ఏంచెయ్యాలనేది దాని ముందున్న సవాలు. మరి 'రాణా' ముందుకు కదులుతాడా? రజనీకాంత్ కోలుకుని ఎప్పడు షూటింగులో పాల్గొంటాడో...

Saturday, November 20, 2010

ఫోకస్: నిలిచే తార ఎవరు? (తొలి భాగం)

కొత్త తారల్లో నిలిచే తార ఎవరు? అసలు ఎవరైనా ఉన్నారా? చాలామందిని తొలుస్తున్న ప్రశ్నలివి. ఇప్పుడు ఏ తారని చూసినా ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవాళ్లే. కేవలం గ్లామర్‌ని నమ్ముకొని వస్తున్నందునే వాళ్లు ఎక్కువ కాలం వెండితెర మీద వెలగలేక పోతున్నారు. అందం ఏ కాస్త చెదిరినా వాళ్లకి మరో అవకాశమే ఉండటం లేదు. అంటే 'ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్' అనే మాట ఇక తెలుగు సినిసీమలో వినిపించే అవకాశాలు కూడా తక్కువే. తెలుగు సినిమాకి సంబంధించినంత వరకు చివరి ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్ ఎవరంటే ఠక్కున స్ఫురించే పేరు సౌందర్య. అవును. సౌందర్యతోటే తెలుగు సినిమా అసలు సిసలైన నాయిక కూడా మాయమైపోయింది.  
అన్ని రంగాల్లో మాదిరిగానే సినిమా పరిశ్రమలోనూ మేల్ డామినేషన్ చాలా చాలా ఎక్కువ. నిర్మాతలు, సాంకేతిక నిపుణుల్లో ఆడవాళ్లని వేళ్లమీద లెక్కించవచ్చు. సినిమా అన్నాక హీరోయిన్‌తో పాటు అక్క, చెల్లి, వదిన, అమ్మ, అత్త, బామ్మ వంటి పాత్రలు వుంటాయి కాబట్టి, వాటిని మగాళ్లతో చేయించడం బాగోదు కాబట్టి, ఆ పాత్రల్లో ఆడవాళ్లని చూస్తున్నాం. ఇతర పాత్రల సంగతలా వుంచితే హీరోయిన్ పాత్రల్లో చాలా కాలం నుంచి రాణిస్తున్న నటి ఎవరు? అని భూతద్దం పెట్టి వెతికినా ఒక్కరూ అగుపించరు. దానికితోడు పేరుపొందిన హీరోలంతా ఎప్పటికప్పుడు కొత్త రుచులు కావాలన్నట్లు కొత్త తారల్నే కోరుకుంటున్నారు. ఫలితం.. రెండు మూడేళ్లలో ఆరేడు సినిమాల్లో కనిపించిన తారలంతా 'ఫేడవుట్' అయిపోతున్నారు.
ప్రస్తుత హీరోయిన్ల సంగతే చూసుకుంటే శ్రియ, త్రిష, జెనీలియా, ఛార్మి, ప్రియమణి, నయనతార, అనుష్క, కాజల్ అగర్వాల్, ఇలియానా వంటి తారల్లో ఏ ఒక్కర్నీ ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్ అనలేం. ఛార్మి, అనుష్క లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో రాణించినా అది ఒకట్రెండు సినిమాలకే పరిమితమయ్యింది. 'అనుకోకుండా ఒకరోజు', 'మంత్ర' సినిమాల్లో రాణించిన ఛార్మికి ఆ తర్వాత అన్నీ పరాజయాలే ఎదురవుతూ వస్తున్నాయి. అందుకు 'సై ఆట' పెద్ద ఉదాహరణ. 'అరుంధతి'తో సూపర్ హీరోయిన్ అయ్యిందనుకున్న అనుష్క సైతం ఆ తర్వాత చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేకపోతోంది. 'పంచాక్షరి' ఫ్లాపవడం దీనికి నిదర్శనం. 'ఖలేజా'లో అయితే మహేశ్‌కి ఆమె సరైన జోడీ కాలేకపోయిందనే విమర్శలే ఎక్కువ. 'బొమ్మరిల్లు' సినిమాని తన భుజాలమీద లాక్కెళ్లిన జెనీలియా అంతకుముందు, ఆ తర్వాత కూడా అలాంటి ఫీట్ ప్రదర్శించలేకపోయింది. (ఇంకావుంది)

Saturday, September 4, 2010

Movies: Should Rana n Ileana be a good pair?


రానా పక్కన ఇలియానా హీరోయినా! అందరికీ ఇప్పుడిదే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పూరి జగన్నాథ్ డైరెక్షనులో రానా హీరోగా నటించే సినిమాలో హీరోయినుగా ఎవరిని తీసుకోవాలో అర్థంగాక మల్లగుల్లాలు పడ్డాడు పూరి. రానా సరసన అనేప్పటికి అతని ఎత్తుకు తగ్గ అమ్మాయిని సెలెక్ట్ చేయడం తలకు మించిన భారంగా మారుతోంది నిర్మాతలకి. అయితే తన 'పోకిరి' గర్ల్ గుర్తుకొచ్చిన పూరి ఆమెని అడగగానే సరేనంది. ఈరోజే ఫోటోషూట్ కూడా చేసి ఆమెని హీరోయినుగా ఓకే చేశాడు పూరి. ఈ సినిమాలో చేయడం కోసం పవన్ కల్యాణ్ తో చేయడానికి ఒప్పుకున్న 'కల్ ఆజ్ కల్' రీమేక్ 'ఖుషీగా'ని కూడా ఇలియానా పక్కన పెట్టేసిందని వినిపిస్తోండి. ఏదేమైనా రానా, ఇలియానా పెయిర్ చూపులకి ఆడ్ గా వుంటుందని అప్పుడే ఫిలింనగరులో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయినా ముందుగానే అనుకోవడం ఎందుకు, సినిమా వచ్చాక తెలుస్తుంది కదా!

Tuesday, July 6, 2010

Tapsi.. The Golden Girl


తెలుగు చిత్రసీమలో ఇప్పుడు ఎక్కువమంది జపం చేస్తున్న పేరు తాప్సీ. జూలై 1న విడుదలైన 'ఝుమ్మంది నాదం' సినిమా ద్వారా ఆమె తెలుగు తెరకు పరిచయమైంది. సినిమాలో ఆమె అందచందాలు.. ముఖ్యంగా ఆమె ముఖారవిందం.. అందర్నీ ఆకట్టుకున్నాయి. మంచు మనోజ్ హీరోగా శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై మంచు లక్ష్మిప్రసన్న నిర్మించిన ఈ సినిమాకి డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు. హీరోయిన్లని ఆయన ఎంత అందంగా చూపిస్తారో అందరికీ తెలిసిందే. అయితే స్వతహాగా అందాలరాశి అయిన తాప్సీ సోయగాలు ఈ సినిమాలో మరింత సుందరంగా దర్శనమిచ్చాయి. పాటల్లో తాప్సీని చూసేందుకు రెండు కళ్లు చాల్లేదని కుర్రకారు చెబుతున్నారు. ఒకప్పుడు దివ్యభారతి, టాబు, సిమ్రాన్, నిన్న ఇలియానా తర్వాత ఒకే ఒక సినిమాతో సూపర్‌హాట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నది తాప్సీనే. వరుసపెట్టి ఆమెకి వస్తున్న ఆఫర్లే అందుకు నిదర్శనం. హీరోలు ఆమె పట్ల తెగ ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. 'ఝుమ్మంది నాదం' రిలీజ్‌కి ముందుగానే ఆమె నాలుగు సినిమాలకి సంతకం చేసిందనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ద టాలీవుడ్. వాటిలో రెండు సినిమాల సంగతులు తెలిశాయి. మరో రెండు సినిమాలేవో తెలియాల్సి ఉంది. తెలిసిన వాటిలో ఒకటి ప్రభాస్ సినిమా, రెండొది విష్ణు సినిమా. ప్రభాస్‌తో తాప్సీ నటించే సినిమాని దిల్ రాజు నిర్మిస్తుంటే, 'సంతోషం', 'సంబరం', 'స్వాగతం' చిత్రాల దర్శకుడు దశరథ్ రూపొందిస్తున్నాడు. ఇక మంచు విష్ణుతో ఆమె నటిస్తున్న సినిమాని 24 ఫ్రేంస్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా హేమంత్ మధుకర్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు.
ఇంతకీ ఎవరీ తాప్సీ? ఆమె పంజాబీ. అసలు పేరు తపసీ పన్ను. అందరూ తాప్సీ అని పిలుస్తుండటంతో అదే తెరపేరుగా మారిపోయింది. న్యూఢిల్లీలోని జి.టి.బి.ఐ.టి.లో ఇంజనీరింగ్ చదివిన తాప్సీ కాలేజీ రోజుల్లోనే తన డాన్స్ పర్ఫార్మెన్స్‌తో ఢిల్లీవాసుల్ని అలరించేసింది. యుఎస్ఐ, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్, వర్ధమాన్, కోకాకోలా వంటి సంస్థలకు మోడల్‌గా పనిచేసే అవకాశాలు దక్కించుకుంది. అంతేనా.. 2008 మిస్ ఇండియా పోటీల్లో 'మిస్ ఫ్రెష్ ఫేస్', 'మిస్ బ్యూటిఫుల్ స్కిన్' అవార్డుల్ని గెలుచుకుంది. కమర్షియల్ యాడ్స్‌లో ఆమె రూపలావణ్యాల వల్లే తెలుగులో 'ఝుమ్మంది నాదం'లోనూ, తమిళంలో 'అదుకాలం'లోనూ అవకాశాలు సంపాదించేసింది. నిజానికి ధనుష్ హీరోగా నటిస్తున్న 'అదుకాలం'లో మొదట నాయికగా త్రిషని ఎంపిక చేశారు. అయితే చివరి నిమిషంలో ఆ అవకాశాన్ని తాప్సీ సంపాదించేసింది. ఈ సినిమా ఈ ఏడాది నవంబర్‌లో వచ్చే అవకాశాలున్నాయి. తెలుగులో 'ఝుమ్మంది నాదం'లో నటించేప్పుడే నిర్మాత లక్ష్మిప్రసన్నతో ఆమెకి గట్టి అనుబంధమే ఏర్పడింది. అందుకే ఆమెని తన 'ట్రూ మెంటర్'గా చెబుతోంది తాప్సీ. అందుకు తగ్గట్లే ఆమె సూచనల్ని పాటిస్తూ తెలుగులో మంచి కెరీర్ కోసం చేతులు చాస్తోంది. ఆమెకు వస్తున్న అవకాశాలు చూస్తుంటే నేటి టాప్ హీరోయిన్లకు అసూయపుట్టక తప్పదు.