Showing posts with label yama donga. Show all posts
Showing posts with label yama donga. Show all posts

Monday, October 10, 2011

స్పెషల్ స్టోరీ: రాజమౌళి విజయ దరహాసం!

దర్శకత్వం వహించిన ఎనిమిది సినిమాల్లో ఏడు విజయాలు సాధించిన దర్శకుడిగా యస్.యస్. రాజమౌళి తెలుగు చలనచిత్ర చరిత్రలో తనకంటూ ఓ శాశ్వత పేజీని సంపాదించుకున్నారు. ఇదివరలో దాసరి నారాయణరావు తొలి సినిమా 'తాత మనవడు' నుంచి పదకొండో సినిమా 'మనుషులంతా ఒక్కటే' వరకు వరుసగా పదకొండు విజయవంతమైన చిత్రాలకు (ఈ మధ్యలో వచ్చిన 'రాధమ్మ పెళ్లి' బాక్సాఫీసు ఫలితం విషయంలో భిన్నాభిప్రాయాలున్నా) దర్శకత్వం వహించడం ఒక చరిత్ర అయితే, ఉండకూడనన్ని ప్రతికూల పరిస్థితులున్న నేటి కాలంలో ఎనిమిదింటిలో ఒకటి మినహా ఏడు హిట్లను అందించిన రాజమౌళిది ఇంకో చరిత్ర.
'స్టూడెంట్ నెం.1' (2002) నుంచి మొదలైన ఆయన విజయ విహారం మూడో సినిమా 'సై' మినహా 'మర్యాదరామన్న' (2010) దాకా అప్రతిహతంగా కొనసాగుతూ వచ్చింది. 'సై' సైతం ప్రేక్షకుల్ని అలరించినా, పెట్టుబడి ఎక్కువ కావడంతో లాభాలు సాధించలేకపోయింది. ప్రస్తుతం 'ఈగ' పేరుతో ఆయన తన తొమ్మిదో చిత్రాన్ని తెరకెక్కించే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్టీఆర్‌ని 'స్టూడెంట్ నెం.1'తో మాస్‌కి చేరువ చేసిన ఆయన 'సింహాద్రి'తో టాప్ స్టార్‌ని చేశారు. ఆ సినిమా ప్రభావం ప్రేక్షకుల మీద ఎంతగా పడిందంటే, తర్వాత వచ్చిన ఎన్టీఆర్ సినిమాల్ని వారు 'సింహాద్రి'తో పోల్చుకుంటూ అసంతృప్తి చెందుతూ వచ్చారు. అలాంటి నేపథ్యంలో మరోసారి 'యమదొంగ'తో ఎన్టీఆర్‌కి విజయానందాన్ని చేకూర్చారు రాజమౌళి. అలా రాజమౌళి-ఎన్టీఆర్ కాంబినేషన్‌కు తిరుగనేదే లేకుండా పోయింది. ఒక్క ఎన్టీఆర్‌తోనే కాకుండా మిగతా హీరోలకూ వాళ్ల కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రాల్ని అందించారు రాజమౌళి. ప్రభాస్‌కు 'ఛత్రపతి', రవితేజకు 'విక్రమార్కుడు', రాంచరణ్‌కు 'మగధీర', సునీల్‌కు 'మర్యాదరామన్న' వంటి హిట్లనిచ్చారు. వీటిలో 'మగధీర' చిత్రం మునుపటి తెలుగు చలనచిత్ర వసూళ్ల రికార్డుల్ని తిరగరాసిన సంగతి ప్రస్తావనార్హం. మిగతా హీరోలతో ఆయన తీసిన చిత్రాలన్నీ అప్పటివరకు వాళ్ల కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లని సాధించిన చిత్రాలు కావడం విశేషం.
ఇప్పుడు ఆయన తీస్తున్న 'ఈగ' పట్ల కూడా చిత్రసీమ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఎక్కువగా గ్రాఫిక్స్ మీద ఆధారపడ్డ ఈ చిత్రం టైటిల్‌కు తగ్గట్లే ఓ 'ఈగ' ప్రధాన పాత్రధారిగా రూపొందుతోంది. విలన్ చేతిలో చనిపోయిన హీరో మరుజన్మలో ఈగగా పుట్టి ఆ విలన్ మీద ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేది ఇందులోని ప్రధానాంశం. హీరోగా నాని, విలన్‌గా కన్నడ నటుడు సుదీప్ నటిస్తున్న ఈ చిత్రంలో సమంత నాయిక. ఇటీవలే (సెప్టెంబర్ 27తో) పదేళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్న అగ్ర దర్శకుడు రాజమౌళి మునుముందు తెలుగు సినిమా స్థాయి పెరగడంలో ప్రధాన పాత్ర పోషిస్తారని ఆశించవచ్చు.
(అక్టోబర్ 10 రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా)

Thursday, August 11, 2011

ఇంటర్వ్యూ: గేయ రచయిత అనంత శ్రీరాం

"అన్ని రకాల పాటల్లో నాకు శృంగారమంటే ఎక్కువ ఇష్టం. భక్తి పాటని ఎంతగా ఆస్వాదిస్తానో ఎరోటిక్ సాంగ్ రాసేప్పుడు అంతగా ఆస్వాదిస్తా'' అని చెప్పారు యువ గేయ రచయిత అనంత శ్రీరామ్. అతి చిన్న వయసులోనే పాటల రచయితగా చిత్రరంగ ప్రవేశం చేసిన ఆయన అతి తక్కువ కాలంలో అగ్రశ్రేణి గేయ రచయితల్లో ఒకరిగా ఎదిగారు. అన్ని రకాల పాటల్లోనూ ప్రతిభ చూపిస్తున్న ఆయన 'తెలుగమ్మాయి' కోసం రాసిన 'కత్తిలాంటి కుర్రవాడు కళ్లుతిరిగి పడ్డాడు' పాట శ్రోతల నాలుకల మీద నర్తిస్తోంది. చిత్రసీమలో తన ప్రస్థానంతో పాటు గేయ రచనా రంగం గురించి తన అభిప్రాయాల్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేశారు అనంత శ్రీరామ్. అవేమిటో ఆయన మాటల్లోనే...

నా అనుభవం, అవగాహన మేరకు చిత్రసీమలో గౌరవం, ప్రోత్సాహం, తక్కువ వత్తిడి ఉన్నది గీత రచనా రంగంలోనే. పాట హిట్టయితే సాహిత్యాన్ని చూస్తున్నారు. తద్వారా రచయితకి పేరు వస్తోంది. పాట ఫ్లాపయితే పట్టించుకోరు కాబట్టి వచ్చే నష్టమేమీ ఉండదు. నెల నెలా ఎంతో కొంత ఆదాయం వస్తుంది. మామీద పుకార్లు ఉండవు. క్రేజ్ లేకపోయినా గౌరవం, ఆప్యాయత ఉంటుంది. సౌకర్యవంతమైన రంగం. మిగతా వాటితో పోలిస్తే పోటీ తక్కువ ఉన్న రంగం ఇదే.
ఈ రంగంలో నిరుద్యోగం లేదు
తెలుగు సినిమా రంగంలో ఏడాదికి కనీసం 200 సినిమాలు నిర్మాణమవుతున్నాయి. ఒక్కో సినిమాలో సగటున ఐదు పాటలుంటాయనుకుంటే ఆ అన్ని సినిమాల్లో కలిపి వెయ్యి పాటలుంటాయి. బాగా డిమాండ్ ఉన్న రచయిత నెలకి పది పాటలు, అంటే సంవత్సరానికి 120 పాటలు రాస్తాడు. అలాంటి వాళ్లు నలుగురు ఉన్నారనుకుంటే వాళ్లు రాసేది 480 పాటలు. ఇంకా 520 పాటలు రాసే అవకాశం మిగతా వాళ్లకి ఉంది. సంవత్సరానికి 20 చొప్పున వేసుకున్నా ఇంకో 25 మందికి ఇక్కడ అవకాశం ఉంది. నాకు తెలిసి ఈ రంగంలో నిరుద్యోగం అయితే ఉండదు. ఇక్కడ క్రేజ్‌ని బట్టి, హిట్టుని బట్టి రెమ్యూనరేషన్ ఉంటుంది. పాట రాయడం రాకుండా ఛాన్స్ ఇవ్వమంటే ఇవ్వరు కదా. సామాన్య ప్రజ్ఞాపాటవాలుంటే ఈ రంగంలో ఉపాధి దొరుకుతుంది.
ఊరికే కష్టపెట్టరు
దేవిశ్రీకి పాట నచ్చితే మొదటి వెర్షన్‌కే ఓకే చేసేస్తారు. తనకి కావాలనుకున్నది రాకపోతే 20వ వెర్షన్ అయినా రాయిస్తారు. రచయితని ఊరికే కష్టపెట్టరు. ఆ విషయం అర్థం చేసుకోలేకపోతేనే రచయితకి ఇబ్బంది వస్తుంది తప్పితే కావాలని చెయ్యరు. రాజమౌళి 'యమదొంగ'లో 'నూనూగు మీసాలోడు' పాటని వెంటనే ఓకే చేశారు. అదే 'మర్యాద రామన్న' విషయానికొస్తే 'తెలుగమ్మాయీ..' పాటని ఓకే చెయడానికి 40 రోజులు పట్టింది.
ఓటమిగా భావించేవాణ్ణి
'100% లవ్' సినిమాలో రెండు సన్నివేశాలకి కష్టపడి రాసినా ఓకే అవ్వలేదు. కానీ కష్టపడినందుకు గీతా ఆర్ట్స్ నుంచి డబ్బులు వచ్చేశాయి. ఇట్లాంటివి కెరీర్ మొదట్లో జరిగినప్పుడు బాధపడేవాణ్ణి. దాన్ని ఓటమిగా భావించేవాణ్ణి. అప్పుడు అంత అనుభవం ఉండకపోవడం, మనసు సున్నితంగా ఉండటం కారణం. ఎప్పుడైనా ఏదైనా పాట ఓకే చెయ్యకపోయినా, ఆ తర్వాత అదే దర్శకుడు, అదే సంగీత దర్శకుడు తర్వాత నా చేత రాయించుకున్న సందర్భాలున్నాయి. అందువల్ల ఇప్పుడు ఇలాంటివాటికి మనస్తాపం చెందడం లేదు.
కీరవాణితో ఎక్కువ సౌకర్యం
సంగీత దర్శకుల్లో కీరవాణి గారితో ఎక్కువ సౌకర్యంగా ఫీలవుతా. రచయితకి ఆయన బాగా స్వేచ్ఛనిస్తారు. నాచేత ముందు పాట రాయించి, ఆ తర్వాత ఆయన బాణీలు కట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 'యమదొంగ'లో 'రబ్బరు గాజులు..' పాటని నేను రాస్తే, దానికి ఆయన ట్యూన్ కట్టారు. నాకైతే మొదట పాట రాయడమే హాయనిపిస్తుంది. ట్యూన్‌కి పాట రాయడంలోనే కొంచెం వత్తిడి అనిపిస్తుంది. అన్ని రకాల పాటల్లో నాకు శృంగారమంటే ఎక్కువ ఇష్టం. భక్తి పాటని ఎంతగా ఆస్వాదిస్తానో ఎరోటిక్ సాంగ్ రాసేప్పుడు అంతగా ఆస్వాదిస్తా. నా తొలి చిత్రం 'కాదంటే ఔననిలే'లో 'కర్రా బిళ్లా..' పాట నచ్చి చిరంజీవి గారు 'స్టాలిన్' కోసం 'పరారే పరారే..' పాట రాయించుకున్నారు.
ఆయన ఆరాధ్య రచయిత
ఎప్పటికీ నా ఆరాధ్య రచయిత సీతారామశాస్త్రి గారే. నన్ను పాటలు రాయడానికి ఉసిగొల్పింది ఆయన సాహిత్యమే. 'సిరివెన్నెల', 'స్వాతికిరణం', 'స్వర్ణ కమలం' పాటలు నన్ను బాగా ప్రభావితం చేశాయి.
అది పేరు తెస్తుంది
ఈ సంవత్సరం 'మిస్టర్ పర్‌ఫెక్ట్' మంచి హిట్టయింది. రానున్న 'తెలుగమ్మాయి'లో 'కత్తిలాంటి కుర్రవాడు కళ్లుతిరిగి పడ్డాడు' పాట పేరు తెస్తుందని అనుకుంటున్నా. నాగచైతన్య చిత్రం 'దడ' రిలీజవుతోంది. నాగార్జునగారి సినిమా 'రాజన్న', రాజమౌళి సినిమా 'ఈగ', ఎన్టీఆర్ - సురేందర్‌రెడ్డి సినిమా 'ఊసరవెల్లి', వెంకటేశ్ - గోపీచంద్ మలినేని సినిమా, శేఖర్ కమ్ముల సినిమా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్', దేవా కట్టా చిత్రం 'ఆటోనగర్ సూర్య'కి పాటలు రాస్తున్నా.

Thursday, August 4, 2011

న్యూస్: ఆరేళ్ల తర్వాత హీరోగా మోహన్‌బాబు

ఆరేళ్ల గ్యాప్‌తో సీనియర్ నటుడు మోహన్‌బాబు సోలో హీరోగా తెర మీద కనిపించబోతున్నారు. చివరిసారి 2005లో 'పొలిటికల్ రౌడీ'గా ఆయన కనిపించారు. ఈ మధ్యలో 'గేం', 'యమదొంగ', 'బుజ్జిగాడు', 'పాండురంగడు', 'మేస్త్రి', 'రాజు మహరాజు', 'సలీం', 'ఝుమ్మంది నాదం' వంటి సినిమాల్లో ఆయన నటించారు. వీటిలో 'గేం', 'రాజు మహరాజు'లో ప్రధాన పాత్రలు చేయగా, మిగతావి కేరక్టర్ రోల్స్ కింద లెక్క. ఇన్నాళ్లకి సోలో హీరోగా మరోసారి నటించబోతున్నారు. ఆయన సొంత బేనర్ శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌పై నిర్మాణమయ్యే ఈ సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తారో ప్రకటించలేదు కానీ కథని సమకూర్చిన ముగ్గురు రచయితల పేర్లను వెల్లడించారు. వారు.. కోన వెంకట్, గోపీమోహన్, బీవీఎస్ రవి. "ఈ ముగ్గుర్నీ కలిపి నేను 'కేజీబీ' అని పిలుస్తుంటా. ఫారిన్‌లో ఈ గ్రూప్‌కి ప్రత్యేకమైన పేరుంది. ఆ ముగ్గురు రచయితలు దాదాపు యేడాదిగా పనిచేసి అద్భుతమైన స్క్రిప్తును అందించారు" అని చెప్పారు మోహన్‌బాబు. విశేషమేమంటే ఇందులో ఆయన సరసన అయిదుగురు అమ్మాయిలు నటించబోతున్నారు. వాళ్లెవరనేది తర్వాత తెలియజేస్తారు. మొదట ఇందులో ఐదుగురు హీరోలు, ఐదుగురు హీరోయిన్లు ఉంటారని ప్రకటించి, తర్వాత హీరో మోహన్‌బాబు ఒక్కరేననీ, హీరోయిన్లు ఐదుగురనీ ప్రకటించడం గమనార్హం. ఈ సినిమాలో మోహన్‌బాబు పాత్రని ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ పాత్ర బాగా నచ్చినందునే ఇంత కాలం తర్వాత హీరోగా నటించేందుకు ఆయన నిర్ణయించుకున్నారు. ఈ సినిమా ఫలితం హీరోగా ఆయన భవితవ్యాన్ని నిర్దేశించనున్నది.

Wednesday, October 13, 2010

ఇంటర్వ్యూ: ఎన్టీఆర్

"ఇందులో నా పాత్ర పేరు కృష్ణ. ఒక యాక్టర్‌కి విందుభోజనం లాంటి పాత్ర. అన్ని రకాల ఎమోషన్స్, షేడ్స్ కలగలిపి ఉన్న పాత్ర. 'బృందావనం'లో మెయిన్ హైలైట్ ఎన్టీఆర్ కొత్తగా కనిపించడం'' అని చెప్పారు ఎన్టీఆర్. ఆయన హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాజు నిర్మించిన 'బృందావనం' ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకుడు. 'శక్తి' షూటింగ్‌లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆ సినిమా సెట్స్‌పై మంగళవారం ప్రత్యేక ఇంటర్వ్యూలో 'బృందావనం' గురించీ, అనేక ఇతర అంశాల గురించీ విపులంగా మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..


నా కెరీర్‌లో తిరిగి చూసుకుంటే మిగిలిపోయే సినిమా 'బృందావనం'. ఇంతదాకా రెగ్యులర్ ఫార్ములా సినిమాలు, మాస్ మసాలా సినిమాలు చేస్తూ వస్తున్నా. 'బృందావనం' కమర్షియల్ అంశాలు ఉంటూనే ప్రేమ, ఫ్యామిలీ అనుబంధాల మీద ఎక్కువ దృష్టి పెట్టి చేసిన సినిమా. 'బృందావనం' అనేది ఓ ఇంటిపేరు. బృందావనంలో కృష్ణుడు ఉంటే ఎంత కళకళలాడిపోతుంటుందో, ఇదీ అలా కళకళలాడే సినిమా. ఎలాంటి బృందావనంని ఎలాంటి బృందావనంగా నేను మార్చాననేదే ఈ సినిమాలోని ప్రధానాంశం.
విందుభోజనం లాంటి పాత్ర 
ఇందులో నా పాత్ర పేరు కృష్ణ. నాకు బాగా నచ్చిన క్యారెక్టర్. ఒక యాక్టర్‌కి విందుభోజనం లాంటి పాత్ర. అన్ని రకాల ఎమోషన్స్, షేడ్స్ కలగలిపి ఉన్న పాత్ర. బాగా కష్టపడి చేశాను. ఒక మంచి ప్రయత్నమైతే మేం చేశాం. ఎన్టీఆర్‌ని కొత్త కోణంలో చూపించిన సినిమా. అంతేకానీ సూపర్‌హిట్ సినిమా చెయ్యాలనే ఉద్దేశంతో చేసిన సినిమా కాదు. సక్సెస్‌లో టీమ్ వర్క్ ఎంత ఉంటుందో, ఫ్లాపులోనూ టీమ్ వర్క్ అంతే ఉంటుంది. అది ఏ ఒక్కరి క్రెడిటో కాదు. 'బృందావనం'లో మెయిన్ హైలైట్ ఎన్టీఆర్ కొత్తగా కనిపించడం. కొరటాల శివ డైలాగ్స్, తమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ సినిమాని అందంగా మలిచాయి. పాటల్లో 'నిజమేనా నిజమేనా' బాగా ఇష్టం.
పోటాపోటీ నటన 
కాజల్, సమంతా - ఇద్దరూ ప్రొఫెషనల్స్. భూమి, ఇందు పాత్రల్లో ఇద్దరూ బాగా కష్టపడ్డారు. పోటాపోటీగా చేశారు. ఇద్దరికీ మంచి భవిష్యత్ ఉంది. వాళ్లని కేవలం గ్లామర్ కోసం పెట్టుకోలేదు. పర్ఫార్మెన్స్‌కి కూడా స్కోప్ ఉన్న పాత్రలు వాళ్లవి. వాళ్లే కాదు, శ్రీహరి, ప్రకాశ్‌రాజ్ కూడా తాము తప్ప ఆ పాత్రల్ని ఇంకెవ్వరూ చేయ్యలేరనే అభిప్రాయం కలిగించే విధంగా చేశారు. కోట శ్రీనివాసరావుగారు అద్భుతంగా నటించారు. చాలా రోజులకి ఆయనలోని నటుణ్ణి పీక్ స్టేజ్‌లో చూశా. ఒక మంచి ఆర్టిస్టుకి మంచి పాత్ర ఇస్తే ఎలా చేస్తారో ఆయన నటన చూస్తే తెలుస్తుంది.
పెయింటింగ్‌లా తీశాడు 
సినిమాని వంశీ చాలా బాగా తీశాడు. ఒక అద్భుతమైన దర్శకుడిగా తయారయ్యే లక్షణాలు అతనిలో కనిపిస్తు న్నాయి. చెప్పిన కథ కన్నా బాగా తీశాడు. ప్రతి ఫ్రేమ్‌ని ఒక పెయింటిం గ్‌లా, చాలా అందంగా తీశాడు. 'బ్యూటిఫుల్ పిక్చరెస్క్' అంటారే - అది 'బృందావనం'లో అడుగడుగునా కనిపిస్తుంది. నా వరకు అయితే వందకి వంద మార్కులు కొట్టేశాడు. 'మున్నా' రూపంలో అతని తొలి ప్రయత్నం ఫలించలేదంతే. అతను ఫ్లాప్ కాదు. 'మున్నా' స్క్రిప్టు ఫ్లాపయ్యిందేమో కానీ డైరెక్టర్‌గా పాసయ్యాడు. చాలా స్టైలిష్‌గా ఆ సినిమాని తీశాడు. అలాంటి డైరెక్టర్ మంచి కథ చేస్తే ఎలా ఉంటుందనేదానికి 'బృందావనం' ఒక నిదర్శనం. అంత బలమైన కథ ఇది.
రాజుకు సినిమా పిచ్చి 
దిల్ రాజు సినిమా మీద తపన ఉన్న నిర్మాత. ఆయనకు సినిమా అంటే పిచ్చి, వ్యామోహం, వ్యాధి. ఎవరితో చేసినా ఒకే విధమైన తపనతో తీస్తారు. బ్యానర్ విలువ పెరగాలనే కించిత్ స్వార్థం కూడా అందులో ఉంటుంది. నాకు దర్శకుడే పనిచేయాలని ఉంటుంది. దర్శకుడికి మనం సలహాలు ఇవ్వాలే కానీ మన అభిప్రాయాల్ని అతని మీద రుద్దకూడదు. ఆ విషయంలో దర్శకుడికి రాజు చాలా స్వేచ్ఛనిచ్చారు. అమోఘంగా ఈ సినిమాని నిర్మించారు. అందుకే అద్భుతమైన టీమ్‌తో పనిచేసిన ఫీలింగ్ నాది.
గ్రాఫిక్స్ వల్లే ఆలస్యం 
8న రిలీజ్ చెయ్యాలనుకున్నారు కానీ సెన్సార్ అయ్యింది 7నే. అంటే 8న విడుదల చెయ్యడం అసాధ్యం. 14 విడుదల అనేది కావాలని చేసిన పోస్ట్‌పోన్ కాదు. అన్నీ మనకు అనుకూలంగా జరగవు. ఈ సినిమాకి సెట్స్‌మీద 130 రోజులు కష్టపడ్డాం. కొన్ని అనుకున్న టైమ్‌కి అవుతాయి. కొన్ని అవవు. గ్రాఫిక్స్ వల్లే పోస్ట్ ప్రొడక్షన్ కాస్త లేటయ్యింది. అందుకే రిలీజ్ డేట్ 14కి జరిగింది.
ప్రేక్షకుల కోసమే సినిమా 
నా కెరీర్‌లో హిట్లు, ఫ్లాపులు చూశా. ఇప్పుడు వాటికి అతీతమై పోయా. మనం హిట్టవుతాయనుకున్నవి హిట్లవ్వవు. ఫ్లాపవుతాయనకున్నవి కావు. మనం చేసేది ప్రేక్షకుల కోసమే. ఒకే ఫార్ములాకి పరిమితమవుతున్నామా అనే భావన మొదలైంది. నాకు ఎన్టీ రామారావుగారు ఇన్‌స్పిరేషన్. ఆయన ఒకదానికొకటి పొంతనలేని ఎన్నెన్నో భిన్నమైన ప్రాతలు చేసుకుంటూ పోయారు. పౌరాణికాలు, జానపదాలు, సోషియో ఫాంటసీలు, సాంఘిక సినిమాల్లో సందేశాత్మకాలు, సెంటిమెంట్ సినిమాలు, వినోదాత్మక చిత్రాలు, మాస్ సినిమాలు, క్లాస్ సినిమాలు.. ఇలా ఎన్నో చేశారు. అందుకే ఆయన ఆల్‌రౌండర్ అయ్యారు. నాకు 'బొమ్మరిల్లు', 'కొత్త బంగారులోకం' సినిమాలు బాగా ఇష్టం. కానీ అలాంటివి చేయాలనుకున్నా చేయలేను. మాస్‌ని వొదులుకోకుండానే కొత్తకోణంలో, కొత్తరకంగా చెయ్యాలని చేసిన సినిమా 'బృందావనం'.
ఎవడి పని వాడిదే 
నాకు కథ చెప్పిన తర్వాత ఫైనల్ నెరేషన్ అడుగుతా. అది నచ్చితే ఇక వదిలేస్తా. నాకు తెలిసింది యాక్టింగ్ ఒక్కటే. ఎవడి పని వాడు చెయ్యాలి. ఒక్కొక్కరిది ఒక్కో టాలెంట్. కథ పూర్తిగా వినేవరికే నా జోక్యం కానీ, ఇన్‌వాల్వ్‌మెంట్ కానీ ఉంటుంది. అప్పుడైనా సజెషన్స్ ఇస్తానే కానీ ఇలాగే ఉండాలని శాసించను.
ఆ రోజులు వేరు 
థియేటర్లు మూత పడుతుండటానికీ, జనం థియేటర్లకు రాకపోతుండటానికి పది రకాల కోణాలుంటాయి. వాటిలో స్టార్ల సినిమాలు ఎక్కువగా లేకపోవడం కూడా ఒకటనేది నిజమే. ఎన్టీ రామారావు గారు ఓ ఏడాది పదిహేను సినిమాలు, కృష్ణగారు పద్దెనిమిది-ఇరవై సినిమాలు చేసిన సందర్భాలున్నాయి. ఆ రోజులు వేరు. ఈ రోజులు వేరు. మనది ప్రపంచ మార్కెట్ ఉన్న సినిమా కాదు. హాలీవుడ్‌లో 'అవతార్', '2012' సినిమాలకు వందల కోట్ల డాలర్లు వెచ్చించి అత్యున్నత ప్రమాణాలతో తీశారు. బ్రహ్మాండంగా ఆడాయి. అంత బడ్జెట్‌తో మనం సినిమాలు తియ్యలేం. అప్పట్లో 'యమగోల'ని రెండు మూడు నెలల్లో తీస్తే, ఇవాళ 'యమదొంగ' తియ్యడానికి ఏడాది పట్టింది. నా వరకు నేను ఏడాది మూడు సినిమాలు చెయ్యాలని అనుకుంటున్నా. అది జరుగుతుందో, లేదో తెలీదు. దర్శకులు, నిర్మాతల కృషి కూడా కావాలి. ఇది కేవలం ఆర్టిస్టులతో అయ్యే పనికాదు.
పబ్బులకు దూరం 
'బృందావనం' నుంచి ఇప్పుడు చేసున్న 'శక్తి'కి వరుసగా 135 రోజులు షూటింగ్ చేశా. మధ్యలో అమ్మమ్మ చనిపోయినప్పుడు ఓ రెండు రోజులు మాత్రమే సెలవు తీసుకున్నా. నేనెంతగా పనిచేస్తున్నాననే దానికి ఇదో నిదర్శనం. ఎప్పుడైనా తీరిక దొరికితే ఇంట్లోనే ఉండి అమ్మతో ఎక్కువగా గడుపుతుంటా. నన్ను నన్నుగా చూసే అద్భుతమైన స్నేహితులు నాకు దొరికారు. వాళ్లలో ఇండస్ట్రీ లోపలి, బయటి వాళ్లిద్దరూ ఉన్నారు. నేను పబ్బులు, డిస్కోథెక్కులకు వెళ్లను. ఆ వాతావరణం నాకు నచ్చదు.
నేనింకా ఎదగాలి 
'దానవీరశూరకర్ణ' వంటి పౌరాణికం చెయ్యాలంటే నేనింకా ఎదగాలి. రామారావుగారంత కాకపోయినా ఆయనలో కొంతైనా చెయ్యగలగాలి కదా. దుర్యోధనుడి పాత్ర చెయ్యడమంటే ఒక యుద్ధం చెయ్యడం లాంటిది. దానికి నేనింకా రెడీ కాలేదు. 'యమదొంగ'లో యముడిగా ఒక ప్రయత్నం లాంటిది చేశా. సక్సెస్ అయ్యా. అయితే నేనేం చేసినా రామారావుగారితో పోలిక వస్తుంది. చేస్తే ఆయనలో 80 శాతమన్నా సక్సెస్ చేయగలగాలి. నాలో ఆ పరిణతి ఇంకా రావాలి. పైగా అలాంటి సినిమా చెయ్యగల దర్శకుడు ఉండాలి, అలాంటి స్క్రిప్టు రావాలి. నిర్మాత కావాలి. చెయ్యగలననే ధైర్యం నాలో ఉండాలి.
వచ్చే మార్చిలో 'శక్తి' 
ప్రస్తుతం 'శక్తి' షూటింగ్ జరుగుతోంది. తెలుగు చిత్రసీమలోని అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా అది తయారవుతోంది. 'శక్తి' శక్తిగానే ఉంటుంది. ఇందులో చాలా చాలా గ్రాఫిక్స్ ఉన్నాయి. ఇంకా చాలా వర్క్ ఉంది. వచ్చే ఏడాది మార్చిలో వస్తుందనుకుంటున్నా. మరికొన్ని చర్చల స్థాయిలో ఉన్నాయి. ఫైనలైజ్ అయ్యాక వాటి వివరాలు చెబుతా.
పెళ్లి వచ్చే ఏడాది 
నా పెళ్లి నవంబర్‌లో అనే ప్రచారం జరుగుతోంది. కానీ నవంబర్‌లో నా పెళ్లి లేదు. వచ్చే ఏడాది ఉంటుంది. ఎప్పుడనేది నేనే చెబుతా. నేను సాంప్రదాయక పెళ్లి చేసుకుంటున్నా. మా అమ్మా నాన్న వెతికి చూసిన సంబంధం. అలాగే పెళ్లి బట్టల కోసం బ్యాంకాక్ వెళ్లాననే ప్రచారంలో కూడా ఏమాత్రం నిజంలేదు. పెళ్లిలో నేను వేసుకునేవి కూడా సాంప్రదాయకమైనవే. సూటూ బూటూ వేసుకుని చేసుకోను. అభిమానుల మధ్య పెళ్లి చేసుకోవాలనేది నా కోరిక. ఎంతవరకు వీలవుతుందో చూడాలి. లక్ష్మీ ప్రణతితో మాట్లాడుతుంటా కానీ కలవడం బాగా తక్కువ.