"అన్ని రకాల పాటల్లో నాకు శృంగారమంటే ఎక్కువ ఇష్టం. భక్తి పాటని ఎంతగా ఆస్వాదిస్తానో ఎరోటిక్ సాంగ్ రాసేప్పుడు అంతగా ఆస్వాదిస్తా'' అని చెప్పారు యువ గేయ రచయిత అనంత శ్రీరామ్. అతి చిన్న వయసులోనే పాటల రచయితగా చిత్రరంగ ప్రవేశం చేసిన ఆయన అతి తక్కువ కాలంలో అగ్రశ్రేణి గేయ రచయితల్లో ఒకరిగా ఎదిగారు. అన్ని రకాల పాటల్లోనూ ప్రతిభ చూపిస్తున్న ఆయన 'తెలుగమ్మాయి' కోసం రాసిన 'కత్తిలాంటి కుర్రవాడు కళ్లుతిరిగి పడ్డాడు' పాట శ్రోతల నాలుకల మీద నర్తిస్తోంది. చిత్రసీమలో తన ప్రస్థానంతో పాటు గేయ రచనా రంగం గురించి తన అభిప్రాయాల్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేశారు అనంత శ్రీరామ్. అవేమిటో ఆయన మాటల్లోనే...
నా అనుభవం, అవగాహన మేరకు చిత్రసీమలో గౌరవం, ప్రోత్సాహం, తక్కువ వత్తిడి ఉన్నది గీత రచనా రంగంలోనే. పాట హిట్టయితే సాహిత్యాన్ని చూస్తున్నారు. తద్వారా రచయితకి పేరు వస్తోంది. పాట ఫ్లాపయితే పట్టించుకోరు కాబట్టి వచ్చే నష్టమేమీ ఉండదు. నెల నెలా ఎంతో కొంత ఆదాయం వస్తుంది. మామీద పుకార్లు ఉండవు. క్రేజ్ లేకపోయినా గౌరవం, ఆప్యాయత ఉంటుంది. సౌకర్యవంతమైన రంగం. మిగతా వాటితో పోలిస్తే పోటీ తక్కువ ఉన్న రంగం ఇదే.
ఈ రంగంలో నిరుద్యోగం లేదు
తెలుగు సినిమా రంగంలో ఏడాదికి కనీసం 200 సినిమాలు నిర్మాణమవుతున్నాయి. ఒక్కో సినిమాలో సగటున ఐదు పాటలుంటాయనుకుంటే ఆ అన్ని సినిమాల్లో కలిపి వెయ్యి పాటలుంటాయి. బాగా డిమాండ్ ఉన్న రచయిత నెలకి పది పాటలు, అంటే సంవత్సరానికి 120 పాటలు రాస్తాడు. అలాంటి వాళ్లు నలుగురు ఉన్నారనుకుంటే వాళ్లు రాసేది 480 పాటలు. ఇంకా 520 పాటలు రాసే అవకాశం మిగతా వాళ్లకి ఉంది. సంవత్సరానికి 20 చొప్పున వేసుకున్నా ఇంకో 25 మందికి ఇక్కడ అవకాశం ఉంది. నాకు తెలిసి ఈ రంగంలో నిరుద్యోగం అయితే ఉండదు. ఇక్కడ క్రేజ్‌ని బట్టి, హిట్టుని బట్టి రెమ్యూనరేషన్ ఉంటుంది. పాట రాయడం రాకుండా ఛాన్స్ ఇవ్వమంటే ఇవ్వరు కదా. సామాన్య ప్రజ్ఞాపాటవాలుంటే ఈ రంగంలో ఉపాధి దొరుకుతుంది.
ఊరికే కష్టపెట్టరు
దేవిశ్రీకి పాట నచ్చితే మొదటి వెర్షన్‌కే ఓకే చేసేస్తారు. తనకి కావాలనుకున్నది రాకపోతే 20వ వెర్షన్ అయినా రాయిస్తారు. రచయితని ఊరికే కష్టపెట్టరు. ఆ విషయం అర్థం చేసుకోలేకపోతేనే రచయితకి ఇబ్బంది వస్తుంది తప్పితే కావాలని చెయ్యరు. రాజమౌళి 'యమదొంగ'లో 'నూనూగు మీసాలోడు' పాటని వెంటనే ఓకే చేశారు. అదే 'మర్యాద రామన్న' విషయానికొస్తే 'తెలుగమ్మాయీ..' పాటని ఓకే చెయడానికి 40 రోజులు పట్టింది.
ఓటమిగా భావించేవాణ్ణి
'100% లవ్' సినిమాలో రెండు సన్నివేశాలకి కష్టపడి రాసినా ఓకే అవ్వలేదు. కానీ కష్టపడినందుకు గీతా ఆర్ట్స్ నుంచి డబ్బులు వచ్చేశాయి. ఇట్లాంటివి కెరీర్ మొదట్లో జరిగినప్పుడు బాధపడేవాణ్ణి. దాన్ని ఓటమిగా భావించేవాణ్ణి. అప్పుడు అంత అనుభవం ఉండకపోవడం, మనసు సున్నితంగా ఉండటం కారణం. ఎప్పుడైనా ఏదైనా పాట ఓకే చెయ్యకపోయినా, ఆ తర్వాత అదే దర్శకుడు, అదే సంగీత దర్శకుడు తర్వాత నా చేత రాయించుకున్న సందర్భాలున్నాయి. అందువల్ల ఇప్పుడు ఇలాంటివాటికి మనస్తాపం చెందడం లేదు.
కీరవాణితో ఎక్కువ సౌకర్యం
సంగీత దర్శకుల్లో కీరవాణి గారితో ఎక్కువ సౌకర్యంగా ఫీలవుతా. రచయితకి ఆయన బాగా స్వేచ్ఛనిస్తారు. నాచేత ముందు పాట రాయించి, ఆ తర్వాత ఆయన బాణీలు కట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 'యమదొంగ'లో 'రబ్బరు గాజులు..' పాటని నేను రాస్తే, దానికి ఆయన ట్యూన్ కట్టారు. నాకైతే మొదట పాట రాయడమే హాయనిపిస్తుంది. ట్యూన్‌కి పాట రాయడంలోనే కొంచెం వత్తిడి అనిపిస్తుంది. అన్ని రకాల పాటల్లో నాకు శృంగారమంటే ఎక్కువ ఇష్టం. భక్తి పాటని ఎంతగా ఆస్వాదిస్తానో ఎరోటిక్ సాంగ్ రాసేప్పుడు అంతగా ఆస్వాదిస్తా. నా తొలి చిత్రం 'కాదంటే ఔననిలే'లో 'కర్రా బిళ్లా..' పాట నచ్చి చిరంజీవి గారు 'స్టాలిన్' కోసం 'పరారే పరారే..' పాట రాయించుకున్నారు.
ఆయన ఆరాధ్య రచయిత
ఎప్పటికీ నా ఆరాధ్య రచయిత సీతారామశాస్త్రి గారే. నన్ను పాటలు రాయడానికి ఉసిగొల్పింది ఆయన సాహిత్యమే. 'సిరివెన్నెల', 'స్వాతికిరణం', 'స్వర్ణ కమలం' పాటలు నన్ను బాగా ప్రభావితం చేశాయి.
అది పేరు తెస్తుంది
ఈ సంవత్సరం 'మిస్టర్ పర్‌ఫెక్ట్' మంచి హిట్టయింది. రానున్న 'తెలుగమ్మాయి'లో 'కత్తిలాంటి కుర్రవాడు కళ్లుతిరిగి పడ్డాడు' పాట పేరు తెస్తుందని అనుకుంటున్నా. నాగచైతన్య చిత్రం 'దడ' రిలీజవుతోంది. నాగార్జునగారి సినిమా 'రాజన్న', రాజమౌళి సినిమా 'ఈగ', ఎన్టీఆర్ - సురేందర్‌రెడ్డి సినిమా 'ఊసరవెల్లి', వెంకటేశ్ - గోపీచంద్ మలినేని సినిమా, శేఖర్ కమ్ముల సినిమా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్', దేవా కట్టా చిత్రం 'ఆటోనగర్ సూర్య'కి పాటలు రాస్తున్నా.
No comments:
Post a Comment