ప్రేక్షకుల్ని ఆకట్టుకోడానికి టైటిల్ బాగా దోహదం చేస్తుందని సినిమా రంగంలోని చాలామంది నమ్ముతారు. టైటిల్ అనేది సినిమా విడుదలయ్యాక ప్రేక్షకుల్ని థియేటర్ వరకు రప్పిస్తుంది కానీ, విజయానికి మొత్తంగా అదే దోహదం చేయదనీ, సినిమా కథలో పస లేకపోతే టైటిల్ ఎంత బాగున్నా, వింతగా వున్నా ఆ సినిమా నడవదనీ విశ్లేషకులు అనే దాంట్లో తప్పు కొంచెం కూడా లేదు. అయినప్పటికీ మన దర్శకులు తమ సినిమా టైటిళ్లను విభిన్నంగా పెట్టడానికే ప్రయత్నిస్తుంటారు.
ఎవరన్నా కాస్త డబ్బులు ఖర్చు పెడుతూ సరదా చేసుకునే వాణ్ణి చూసి మనం 'వాడికేంటిరా జల్సా పురుషుడు' అంటుంటాం. అందులోని 'జల్సా'ని టైటిల్‌గా పెట్టి సక్సెస్ సాధించారు పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లు. రెండక్షరాలతో చాలా సినిమాలే వచ్చాయి కానీ అన్నీ విజయం సాధించలేక పోయాయి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే యోగి, టాస్, ఆట, లక్ష్యం, మున్నా, మంత్ర, డాన్, కృష్ణ, వాన, గమ్యం, జల్సా, కంత్రి, రెడీ, శౌర్యం, కింగ్, మస్కా, ద్రోణ, మేస్త్రి, బిల్లా, కిక్, డైరీ, రైడ్, బోణి, ఓయ్!, జోష్, శంఖం, బాణం, కథ, కేడి, సింహా, వేదం, శక్తి వచ్చాయి. లక్ష్యం, మంత్ర, కృష్ణ, గమ్యం, జల్సా, రెడీ, శౌర్యం, కింగ్, కిక్, రైడ్, సింహా, వేదం విజయం సాధించగా; ఆట, డాన్, మస్కా, మేస్త్రి, బిల్లా, వేదం బాక్సాఫీసు వద్ద యావరేజ్ ముద్రను వేసుకున్నాయి. యోగి, టాస్, మున్నా, వాన, కంత్రి, ద్రోణ, డైరీ, బోణి, ఓయ్!, జోష్, శంఖం, బాణం, కథ, కేడి, శక్తి సినిమాలు విఫలమయ్యాయి. ఆగస్ట్ 11న 'దడ' రిలీజ్ కాబోతోంది. తేజ తొలి చిత్రం 'చిత్రం' హిట్టవడంతో రెండక్షరాల టైటిల్‌కి గిరాకీ ఏర్పడింది. 'ఖుషి', 'ఆది' చిత్రాలు ఆ బాటలో మంచి హిట్టవగా తేజ స్వయంగా రూపొందించిన మరో రెండక్షరాల సినిమా 'జయం', చిరంజీవి కథానాయకుడిగా వచ్చిన 'ఇంద్ర' బ్లాక్ బస్టర్ సినిమాలుగా నిలిచాయి.
టాప్ డైరెక్టర్లలో ఒకడైన పూరీ జగన్నాథ్ టైటిల్‌ని విభిన్నంగా పెట్టడానికి ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఇట్లు.. శ్రావణీ సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి, శివమణి 9848022338 అంటూ అతడు వెరైటీగా పెట్టిన టైటిళ్లతో వచ్చిన సినిమాలు మంచి విజయం సాధించాయి. తిట్టుపదాలు ఇడియట్, పోకిరి, దేశముదురు టైటిళ్లతో బంపర్‌హిట్ సినిమాలు తీయడం అతడికే చెల్లింది. ఆ కోవలోనే ఎన్టీఆర్ హీరోగా పూరీ శిష్యుడు మెహర్ రమేష్ రూపొందించిన 'కంత్రి', నాగార్జున నటించిన 'కేడి' బాక్సాఫీసుని గెలవలేకపోయాయి. ప్రభాస్ హీరోగా తను రూపొందించిన సినిమాకు 'బుజ్జిగాడు.. మేడిన్ చెన్నై' అనే వెరైటీ టైటిల్ పెట్టాడు పూరీ. కానీ అది వర్కవుట్ కాలేదు.
తెలుగు సినిమాలకీ, యముడికీ మంచి అవినాభావ సంబంధం వుంది. 'యమజాతకుడు' వంటి ఒకట్రెండు సినిమాలు మినహాయిస్తే 'యమ' శబ్దంతో వచ్చిన సినిమాల్లో ఎక్కువగా విజయం సాధించినవే. 'యమగోల', 'యముడికి మొగుడు', 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు', 'యమలీల' వంటివి అందుకు ఉదాహరణలు. ఈ మధ్య వచ్చిన ఎన్టీఆర్ సినిమా 'యమదొంగ', శ్రీకాంత్, వేణుల సినిమా 'యమగోల.. మళ్లీ మొదలైంది' సినిమాలు రెండూ విజయాన్ని చవిచూశాయి. ఆఖరికి రాజేంద్రప్రసాద్, శివాజీ, జయప్రకాశ్‌రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన 'బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం' సైతం బాగానే ఆడింది. అంటే యముడు బాక్సాఫీసు మంత్రమన్నమాట.
ఆహ్లాదకరమైన పేర్లు పెడితే ఫ్యామిలీ ప్రేక్షకులు థియేటర్లకు పొలోమని వస్తారనేది చాలామంది భావన. కానీ ఆ తరహా టైటిల్స్‌తో వచ్చిన సినిమాల్లో అత్యధికం ప్రేక్షకుల తిరస్కారానికి గురవడం విచారకరం. టైటిల్‌లో వున్న ఆహ్లాదం సినిమాలో లేకపోవడమే దానికి కారణం. ఆర్పీ పట్నాయక్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'అందమైన మనసులో', పదిహేనేళ్ల తర్వాత గిరిబాబు రూపొందించిన 'నే సుఖమే నే కోరుతున్నా', అపురూప చిత్రాల దర్శకుడు బాపు గీచిన 'సుందరకాండ', తరుణ్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన 'నవ వసంతం', స్వాతి హీరోయిన్‌గా నటించిన 'కలవరమాయె మదిలో', నితిన్, హన్సిక జంటగా నటించిన 'సీతారాముల కల్యాణం.. లంకలో', శివాజీ సినిమా 'తాజ్‌మహల్', మనోజ్ హీరోగా కె. రాఘవేంద్రరావు రూపొందించిన 'ఝుమ్మంది నాదం', వంశీ సినిమా 'సరదాగా కాసేపు', రవిబాబు డైరెక్ట్ చేసిన 'మనసారా', వరుణ్ సందేశ్ సినిమా 'కుదిరితే కప్పు కాఫీ' వంటివి తుస్సుమన్నాయి.
కొన్ని సినిమాలు టైటిళ్లకు విరుద్ధమైన ఫలితాల్ని పొంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు కంటి మీద కునుకు లేకుండా చేయడం గమనించదగ్గ అంశం. 'వాన' ఎమ్మెస్ రాజుకు బాక్సాఫీసు వానను కురిపించలేక పోయింది. రాజా నటించిన 'వేడుక' నిర్మాత పాలిట పీడకల అయ్యింది. శ్రీహరి 'శ్రీ మహాలక్ష్మి' సిరులు కురిపించలేక పోయింది. 'లక్షీపుత్రుడు', 'లక్ష్మీ కల్యాణం'లదీ అదే దారి. ఎస్వీ కృష్ణారెడ్డి 'బహుమతి' నిర్మాత జేబుల్ని ఖాళీ చేయించింది. నాగబాబు హీరోగా నటించిన 'ఆపద మొక్కులవాడు' నిర్మాతల్ని పుట్టిముంచాడు. నాగచైతన్య హీరోగా పరిచయమైన 'జోష్', నారా రోహిత్ హీరోగా పరిచయమైన 'బాణం' బాక్సాఫీసు వద్ద వ్యతిరేక ఫలితాన్నిచ్చాయి. కల్యాణ్‌రాం 'జయీభవ'కి ప్రేక్షకులు అపజయాన్ని కలిగించారు. పవన్ కల్యాణ్ సినిమా 'పులి' బాక్సాఫీసు వద్ద పిల్లి అయ్యింది. మహేశ్ 'ఖలేజా' చూపించలేక పోయాడు.ఎన్టీఆర్ 'శక్తి' నిర్మాత అశ్వనీదత్‌కి శక్తికోల్పోయేలా చేసింది. పవన్ కల్యాణ్ 'తీన్ మార్' అనలేకపోయాడు. 'హ్యాపీ డేస్' మాత్రం శేఖర్ కమ్ములకూ, ఆ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజుకూ నిజంగానే హ్యాపీ డేస్‌ను తెచ్చింది.
హిట్టయిన పాత సినిమాల టైటిల్స్‌తో వచ్చిన సినిమాలేవీ ఇటీవలి కాలంలో ప్రేక్షకుల్ని మెప్పించలేక పోయాయి. ఉదయ్‌కిరణ్, శ్రీహరిల 'వియ్యాలవారి కయ్యాలు', వేణుమాధవ్ నటించగా దాసరి కథను అందించిన 'ప్రేమాభిషేకం', తరుణ్, ఇలియానాల 'భలే దొంగలు', తరుణ్ మరో సినిమా 'నవ వసంతం', శ్రీకాంత్, ప్రభుదేవా, సునీల్ ప్రధాన పాత్రలు పోషించిన 'మైఖేల్ మదన కామరాజు', ముమైత్‌ఖాన్ 'పున్నమి నాగు', కమల్‌హాసన్, వెంకటేశ్ సినిమా 'ఈనాడు', శివాజీ 'తాజ్‌మహల్', ఎన్టీఆర్ 'శక్తి' వంటివి అందుకు ఉదాహరణలు.
అంటే చిత్ర విజయానికి టైటిల్ అనేది ఒక ప్లస్ పాయింట్‌గా మాత్రమే వుంటుందనీ, కేవలం టైటిల్ వల్లే సినిమా హిట్టు కాదనీ స్పష్టమవుతుంది. మంచి కథతో సినిమాని రూపొందించి, దానికి జస్టిఫై అయ్యే టైటిల్‌ని పెడితే ఆ సినిమా తప్పనిసరిగా ఆడుతందనడంలో సందేహ లేదు. అందుచేత కథకులూ, దర్శకులూ టైటిల్ కంటే ముందు కథకీ, స్క్రీన్‌ప్లేకీ ప్రాధాన్యతనిచ్చి వాటిమీద శ్రద్ధ చూపి, ఆ తర్వాత టైటిల్ గురించి ఆలోచించడం బెటరు.
No comments:
Post a Comment