Tuesday, August 2, 2011
న్యూస్: 'హీరో అజయ్' అనిపించుకుంటాడా?
విలన్ పాత్రలతో పాపులరై తర్వాత హీరోలుగా మారి, పేరు తెచ్చుకున్నవాళ్లు టాలీవుడ్‌లో చాలామందే ఉన్నారు. కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్‌బాబు, గోపీచంద్ వంటివాళ్లు అందుకు మంచి ఉదాహరణ. ఆ కోవలోనే హీరో కావాలని తపిస్తున్న నటుడు అజయ్. 'హీరో అజయ్' అనే పేరును ఖాయం చేసుకోవాలనేది అతడి చిరకాల వాంఛ. అయితే ఇప్పటివరకు అతడి కల నెరవేరలేదు. విలన్ పాత్రలతో 'విక్రమార్కుడు' నుంచే ప్రేక్షకుల మెప్పు పొందిన అతడు హీరోగా 'ఆ ఒక్కడు', 'సారాయి వీర్రాజు', 'వైకుంఠపాళి' వంటి సినిమాలు రూపొందాయి. కానీ హీరోగా అతడికి బ్రేక్ రాలేదు. ఆ మూడు సినిమాలూ ప్రేక్షకుల్ని మెప్పించలేక పోవడమే దీనికి కారణం. 'ఆ ఒక్కడు'లో అతడికంటే హీరోయిన్ మధురిమ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం. 'సారాయి వీర్రాజు' పూర్తిగా అతడి పాత్రమీదే ఆధారపడిన సినిమా అయినా ఆ కథ మనవాళ్లకి నచ్చలేదు. ఇక 'వైకుంఠపాళి'లో ముగ్గురు హీరోల్లో అతను ఒకడు. మిగతా ఇద్దరు కృష్ణుడు, రణధీర్. ఆ ఇద్దరితో పోల్చితే అజయ్ పాత్రకే ప్రాధాన్యత ఎక్కువైనా ఈ థ్రిల్లర్ ఆడియన్స్‌ని థ్రిల్ చేయలేక పోయింది. అయితే అతడు హీరో కాకపోయినా హీరో కంటే ఎక్కువ ప్రశంసల్ని తెచ్చిన సినిమా 'విరోధి'. నీలకంఠ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ కంటే ఎక్కువగా మావోయిస్ట్ రోల్‌లో గొప్పగా రాణించాదు అజయ్. కానీ ఏం లాభం. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తాకొట్టింది. అతడి సినిమాలు ఇలా ఒక్కొక్కటే ఫ్లాపవతూ రావడంతో అతడితో సినిమాలు తియ్యాలని ప్లాన్ చేసుకున్న డైరెక్టర్లు, నిర్మాతలు ఇప్పుడు వెనుకంజ వేస్తున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా కొంత కాలం తర్వాతైనా అజయ్ హీరోగా నిలదొక్కుకుంటాడని అతని శ్రేయోభిలాషులు నమ్ముతున్నారు. వారి నమ్మకం నిజమవుతుందా?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment