రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ప్రపంచంలో, అందులోనూ సామ్రాజ్యవాద దేశాల్లో ఆర్థికంగా చాలా వత్తిడులూ, కుదుపులూ కలిగాయి. వాటి దుష్పరిణామాలు, ప్రభావాలు సాహిత్య కళారంగాల మీద కూడా ప్రసరించాయి. పలాయన వాదం, ఫాసిజాలు, శుద్ధకళావాదాలు, నైరూప్య సిద్ధాంతాలూ ప్రచారంలో ఉండేవి. ఇవి ప్రజల మానసిక ఆరోగ్యానికి చాలా ప్రమాదకరాలుగా గుర్తించిన రచయితలు, కళాకారులు వీటినుండి విముక్తి కావడానికి ప్రయత్నించారు. అందుకు ఓ ఉద్యమం అవసరమన్న అంశాన్ని గుర్తించారు.
సరిగ్గా ఇదే కాలంలో, అంటే 1935లో 'సంస్కృతీ రంగంలో కమ్యూనిస్టుల పోరాటం' అనే వ్యాసం బయటకు వచ్చింది. దీని రచయిత జార్జ్ డిమిట్రోవ్. బ్రిటీషు కార్మిక వర్గం ఆర్థిక సంక్షోభ వ్యతిరేక పోరాటాల్లో పాల్గొంటూనే దాన్ని ఫాసిస్టు వ్యతిరేక ఉద్యమంగా మార్చి ఐక్య సంఘటనగా ముందుకెళ్లాలని భావించింది. ఇవే భావాలు ప్రపంచంలో వలస రాజ్యాల్లోని, సామ్రాజ్యవాద దేశాల్లోని అభ్యుదయ కాముకుల్లో ఉండేవి. అలాంటి సాహితీవేత్తల సమావేశం 1935లో లండన్‌లోని ఓ చైనా వారి హోటల్లో జరిగింది. ఆ సమావేశంలో రాల్ఫ్ ఫాక్స్ లాంటి ప్రముఖ రచయితలతో పాటు భారతీయ రచయితలు సజ్జాద్ జహీర్, ముల్క్‌రాజ్ ఆనంద్, ఫైజ్ అహ్మద్ ఫైజ్ కూడా హాజరయ్యారు. వీళ్లంతా ఆ సంవత్సరం ఓ చిన్న ప్రణాళికను తయారు చేశారు. ఇంగ్లీషులో దాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.
సమాజ పరిస్థుతుల్ని నిరాకరించే పలాయనవాద సాహిత్యానికీ, సామ్రాజ్యవాదానికీ, ఫాసిజానికీ వ్యతిరేకంగా నిల్చునే సాహిత్య సృష్టి చేయడం, భారతదేశంలో సామ్రాజ్యవాద పాలనకు వ్యతిరేకంగా రచయితల్ని సమీకరించడం, సాహిత్యంలో వాస్తవికతకు పునాదులు వెయ్యడం ఈ ప్రణాళిక లక్ష్యాలు.
ఈ లక్ష్యాల్ని చర్చించి ఓ సంఘానికి నిర్మాణ రూపం ఇచ్చేందుకు 1936లో ఫ్రాన్సులో సమావేశమవుతున్న రచయితల సభలకు వెళ్లాలనుకున్న ముల్క్‌రాజ్ ఆనంద్, సజ్జాద్ జహీర్‌లకు ప్రభుత్వం అనుమతి నిరాకరించి పి.ఇ.ఎన్. (పొయెట్స్, ఎస్సేయిస్ట్స్ అండ్ నావలిస్ట్స్) సభ్యులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ సంఘంలో సభ్యులు ఓరకంగా మితవాదులు.
ఈ పరిస్థితుల్లో లక్నోలో 1936లో మున్షీ ప్రేంచంద్ అధ్యక్షతన అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడింది. సామ్రాజ్యవాద వ్యతిరేక వైఖరీ, నాజీ-ఫాసిస్టు వ్యతిరేక వైఖరీ ఉంటూ దేశ స్వాతంత్ర్య పోరాట భావాలతో జనాన్ని కదిలించాలి అనే భావాలున్న అనేకమంది రచయితలు ఆ సభలకెళ్లారు. ఆంధ్ర ప్రాంతం నుండి అబ్బూరి రామకృష్ణారావు, సోమంచి యజ్ఞన్నశాస్త్రి ఆ సభల్లో పాల్గొని వచ్చారు.
రిఫరెన్స్: ఏ.బి.కె. ప్రసాద్ వ్యాసం, శ్రీశ్రీ షష్ఠిపూర్తి సన్మాన సంచిక - విశాఖపట్నం, 1970.
No comments:
Post a Comment