"నిజానికి ఇతర భాషల్లో సినిమాలు తీసి ఆర్థికంగా పోగొట్టుకున్నానే కానీ లాభపడలేదు. ఈ విషయంలో నా ఇద్దరు కొడుకులూ నన్నెప్పుడూ తప్పు పట్టలేదు. ఆ విషయంలో నేను అదృష్టవంతుణ్ణి'' అని ఒకింత ఉద్వేగంగా చెప్పారు సీనియర్ ప్రొడ్యూసర్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు. నవదీప్, అవసరాల శ్రీనివాస్, రాహుల్ హీరోలుగా; రీమాసేన్, శ్రద్ధాదాస్, సంజన, సౌమ్య హీరోయిన్లుగా సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై తాజాగా ఆయన నిర్మించిన చిత్రం 'ముగ్గురు'. వి.ఎన్. ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం చిత్రం ఈ నెల 19న విడుదలవుతున్న సందర్భంగా ప్రత్యేకంగా సంభాషించారు రామానాయుడు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
వైవిధ్యమైన కథతో రూపొందించిన వినోదాత్మక చిత్రం 'ముగ్గురు'. 2 గంటల 7 నిమిషాల సేపు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సినిమా నడుస్తుంది. ఈమధ్య విడుదలైన ఆడియోకు వెరీగుడ్ రిపోర్ట్ వచ్చింది. ముఖ్యంగా టైటిల్ సాంగ్ చాలా బాగుందంటున్నారు. మొత్తం ఆరు పాటలు. ఇప్పటికే మా బేనర్‌లో చాలా సినిమాలు చేసిన కోటి ఈ సినిమాకీ మంచి మ్యూజిక్‌నిచ్చాడు. రచయితలు సాహిత్యం బాగా రాశారు. థియేటర్ ట్రైలర్స్‌కూ స్పందన బాగుంది. తమ పాత్రలకి ఆర్టిస్టులందరూ న్యాయం చేశారు. ముగ్గురు హీరోలు, హీరోయిన్లు హుషారుగా నటించారు. ఈ సినిమాని 37 రోజుల్లోనే పూర్తి చేశాం. అందులో 23 రోజులు మలేషియాలో షూటింగ్ చేశాం. నాలుగు రోజులు కారంచేడులో చిత్రీకరించాం.
ఆదిత్య బాగా తీశాడు
డైరెక్టర్ ఆదిత్య సినిమాని బాగా తెరకెక్కించాడు. అతను 'ప్రేమించుకుందాం రా'తో మరో రెండు మూడు సినిమాలకి మా బేనర్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అతను సబ్జెక్ట్ చెప్పగానే బాగా నచ్చింది. చెప్పినదానికంటే బాగా తీశాడు. సాధారణంగా నా సినిమాని సెట్స్‌లో ఉండి గమనించడం అలవాటు కాబట్టి, ఆదిత్య ప్రతిభ ని సెట్స్ మీద చూశాను. వెరీగుడ్ డైరెక్టర్. నేను కథ బాగుంటేనే సినిమా తీస్తాను. ఇదివరకు కొన్ని సినిమాలు ఆడకపోవడానికి రకరకాల కారణాలున్నాయి. మునుపటి సినిమా 'ఆలస్యం అమృతం' కచ్చితంగా వంద రోజులు ఆడుతుందని తొలి కాపీ చూసినవాళ్లంతా అభిప్రాయపడ్డారు. చంద్రమహేశ్‌కి కచ్చితంగా హిట్ వస్తుందని ఆశించా. అయితే రాంగ్ టైమ్‌లో రిలీజ్ చెయ్యడం వల్లే అది ఆడలేదు.
అది విత్తనం, ఇది చెట్టు
ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలనీ, సక్సెస్ వచ్చినప్పుడు ఒదిగి ఉండాలనీ నేర్చుకున్నా కాబట్టి నేనెప్పుడూ ఫెయిల్యూర్స్‌కి భయపడలేదు. గతంలో 'ద్రోహి' ఫ్లాపయినప్పుడు ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొన్నా. కె. బాపయ్యకి డైరెక్టర్‌గా అది తొలి చిత్రం. దానికి పెట్టిన పది లక్షలూ పోయాయి. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీతో 'ప్రేమనగర్' ప్లాన్ చేశా. దానికి పదిహేను లక్షలు ఖర్చుపెట్టాం. ఆ సినిమా జీవన్మరణ సమస్య. అది ఆడితే మద్రాసులోనే ఉంటాననీ, లేదంటే కేళంబాక్కం వెళ్లిపోతాననీ చెప్పా. ఎందుకంటే కేళంబాక్కంలో అప్పట్లో పొలాలు కొన్నా. అక్కడే వ్యవసాయం చేసుకోవాలనేది ఆలోచన. కారంచేడుకు మాత్రం పోకూడదనుకున్నా. ఎందుకంటే 'రామానాయుడు సినిమాల్లో అంతా పోగొట్టుకుని వచ్చేశాడురా' అనే మాటలు సొంతూరు వాళ్లనుంచి వినకూడదని. అయితే 'ప్రేమనగర్' పెద్ద హిట్టవడంతో కేళంబాక్కంకి వెళ్లాల్సిన పనిలేకపోయింది. అందుకే అంటుంటాను - మా సురేశ్ ప్రొడక్షన్స్‌కి 'రాముడు-భీముడు' విత్తనమైతే, 'ప్రేమగనర్' చెట్టు అని. ఈ రెండో సినిమాతో సినీ ఫీల్డ్‌లో నిలబడిపోయా. దాని హిందీ రీమేక్ 'ప్రేమనగర్'తో బాలీవుడ్‌లో అడుగుపెట్టి, అక్కడా సక్సెసయ్యా. అదే సినిమాని తమిళంలో 'వసంత మాళిగై'గా తీసి అక్కడా హిట్టుకొట్టా. ఆ తర్వాత కెరీర్‌లో కొన్ని ఆటుపోట్లు ఎదురైనా నేను చలించలేదు. ముందుకు సాగుతూ వచ్చా.
ఈ ఏడాదే పంజాబీ సినిమా
ఇప్పటికి పన్నెండు భారతీయ భాషల్లో సినిమాలు తీశా. పంజాబీలో కూడా సినిమా తీస్తే, అన్ని భారతీయ భాషా సినిమాల్ని తీసిన నిర్మాతగా పేరు సంపాదించుకుంటా. ఈ ఏడాదే పంజాబీలో సినిమా తీయబోతున్నా. నిజానికి ఇతర భాషల్లో సినిమాలు తీసి ఆర్థికంగా పోగొట్టుకున్నానే కానీ లాభపడలేదు. సినిమా మీద తపనతోటే ఆ భాషల్లోనూ మంచి సినిమాలు తీయాలనుకుని తీశా. ఈ విషయంలో నా ఇద్దరు కొడుకులూ నన్నెప్పుడూ తప్పు పట్టలేదు. ఆ విషయంలో నేను అదృష్టవంతుణ్ణి. పైగా వైజాగ్ స్టూడియోని చూసుకోవడానికి అక్కడకి వెళ్తానన్నా వాళ్లు ఒప్పుకోవడం లేదు. అందరం కలిసి ఇక్కడే ఉండాలని పట్టుబడుతున్నారు.
అన్ని రకాలుగా హ్యాపీ
తదుపరి సినిమాని భూపతిరాజా కథతో చెయ్యాలని అనుకుంటున్నా. అన్నీ కుదిరితే వెంకటేశ్ హీరోగా, ఆదిత్య దర్శకత్వంలో దాన్ని తీస్తా. ఆ తర్వాత నా మనవడు నాగచైతన్య హీరోగా వచ్చే ఏడాది జనవరి నుంచి మరో సినిమా ఉంటుంది. రానా హిందీలో బిజీ అయ్యేటట్లున్నాడు. ఇప్పుడక్కడ రాంగోపాల్‌వర్మ తీస్తున్న 'డిపార్ట్‌మెంట్'లో నటిస్తున్నాడు. సురేశ్‌బాబు మరో కొడుకు అభిరామ్ కూడా నటించేందుకు రెడీ అంటున్నాడు. రెండేళ్ల తర్వాత అతనూ హీరో అవుతాడు. 'మొదట మన బేనర్‌లోనే చేస్తా తాతా' అంటున్నాడు. నేను, నా తర్వాత నా కొడుకులు, ఇప్పుడు నా మనవళ్లు ఈ రంగంలోనే సక్సెస్ సాధించి, ముందుకెళుతుండటం ఎంతో సంతోషంగా అనిపిస్తుంటుంది. సినిమా రంగానికి సంబంధించి అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అందుకున్నా. ఇక ప్రత్యేకంగా నేను సాధించాల్సిందంటూ ఏమీ లేదు.
No comments:
Post a Comment