బెంగాల్ విభజన ఆ రాష్ట్రవాసుల్లో ఉద్విగ్నతను రేపింది. ఆంగ్లేయులు ఉద్దేశపూర్వకంగా దేశీయులని చీల్చి సమైక్యతను నాశనం చేయడం చూసిన బిపిన్ చంద్రపాల్ దేశపర్యటనకు బయల్దేరాడు. జాతి జనుల్లో సంఘటిత శక్తీ, పోరాట పటిమా పెంచడం, విదేశీయుల దురన్యాయాల్ని ప్రజల దృష్టికి తేవడం ఆయన పర్యటనలో ఉద్దేశం. ఈ పూర్వరంగంలో ఆంధ్రప్రజల్లో భాషా రాష్ట్రాల యెడ సుహృద్భావం అంకురించింది. అప్పటికే తెలుగునాట ఆంధ్రకేసరి, కృష్ణా పత్రిక వంటి కొన్ని పత్రికలు స్వరాష్ట్ర వాంఛను వ్యాసాల రూపంలో వెల్లడించనారంభించాయి. న్యాపతి నారాయణరావు భాసా ప్రాతిపదికపై ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచాలని మేల్ పత్రికలో ఒక లేఖ రాశాడు. కొండా వెంకటప్పయ్య ఆధ్వర్యంలో కొమర్రాజు లక్ష్మణరావు, మాడపాటి హనుమంతరావు కలిసి హైదరాబాద్‌లో విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి స్థాపించారు. భాషాపరమైన రాష్ట్రాల గురించీ, జాతీయోద్యమాన్ని గురించీ సభలూ, సమావేశాలూ, చర్చలూ సాగిస్తుండేవారు. వారి కార్యక్రమంలో భాగంగా 1910లో 'ఆంధ్రుల చరిత్ర'ను ప్రకటించారు. తర్వాత గుంటూరు ఆంధ్ర యువజన సాహిత్య సంఘం వారు ఆంధ్ర రాష్ట్ర నిర్మాణావశ్యకతను నొక్కి చెబుతూ ఓ తీర్మానం చేశారు.
1911 - ఆ మధ్యకాలంలో గుంటూరు, నెల్లూరు మెట్టభూములు వర్షాలు లేక పండలేదు. క్షామబాధ అధికమైంది. గుంటూరు జిల్లాలో తేలుకుట్ల దగ్గర కృష్ణకు ఆనకట్ట కట్టి, అక్కడనుండి కాలువలు తవ్వి పినాకినితో కలిపితే ఈ రెండు జిల్లాల మధ్య భాగం ఎప్పటికీ క్షామానికి గురికాదని ప్రజలు భావించారు. దీన్ని 'కృష్ణా రిజర్వాయర్ ప్రాజెక్ట్' అని పేరుపెట్టి ప్రభుత్వంతో చర్చలు జరిపారు. అనేక చర్యలు, విమర్శల తర్వాత ప్రభుత్వం దీనికి 7 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్లానులు, అంచనాలు సిద్ధమై పనులు ఆరంభానికి రంగమతా ఏర్పడింది. ఆ సమయంలో మెట్టూరు దగ్గర ఓ ఆనకట్ట 4 కోట్లతో కట్టడం అవసరమని చెబుతూ దాన్ని కొనసాగించాలని మద్రాసు శాసనసభ తీర్మానించింది. తెలుగు శాసన సభ్యులు కూడా తలవంచారు. దీంతో ప్రజల్లో క్రోధావేశాలు పెల్లుబికాయి.
ఆ సమయంలోనే నిడదవోలులో కొన్ని ఆంధ్ర మహాసభలు జరిగాయి. అప్పటికి గుంటూరు, కృష్ణా గోదావరి మండలాలన్నిటికీ కలిపి ఒకే కాంగ్రెస్ సంఘం ఉండేది. ఆ కాంగ్రెస్ సభ, సంఘ సంస్కరణ సభ, ఆంధ్ర ఆస్తిక సభలు జరపడానికి నిడదవోలు తయారైంది. ఆ కాంగ్రెస్ సభలకెళ్లినవాళ్లు గుంటూరు జిల్లాకొక ప్రత్యేక సంఘం ఉండాలని పట్టుబట్టారు. సభ అంగీకరించింది. అప్పుడే ఆంధ్ర రాష్ట్ర నిర్మాణావశ్యకతను గూర్చి ఒక తీర్మానం వచ్చింది. అధ్యక్షులుగా ఉన్న వేమవరపు రామదాసు పంతులు ఇది విషయ నిర్ణయ సభ ద్వారా రాలేదు గనుక చర్చించరాదని తోసేశారు.
No comments:
Post a Comment