టాలీవుడ్‌లో అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఒకతను డైరెక్టర్ అవుదామనుకున్నాడు. కానీ తనతో సినిమా తీయడానికి డబ్బులు ఎవరు పెడతారు? అనే ఆలోచన అతని మదిలో మెదిలింది. అప్పుడే ఓ చిన్న పరిష్కారం తోచింది. అంతే! సినిమా తీయడానికి ఓ నలుగురు వ్యక్తుల్ని చూసుకుని మనిషికి ఇన్ని లక్షలు అంటూ లెక్కలు వేసుకున్నాడు. తన వద్ద ఉన్న 10 లక్షల రూపాయల్ని లెక్కలోకి తీసుకున్నాడు. ఫైనాన్స్ కోసం వేట మొదలుపెట్టాడు. చివరికి ఫైనాన్సర్‌ను పట్టుకుని అతని కోరికి మేరకు అందంగా ఉన్న హీరో హీరోయిన్లతో సినిమా ప్రారంభించాడు. సినిమా విడుదల సమయంలో డబ్బులు తిరిగి ఇస్తానని అగ్రిమెంట్ రాసుకున్నాడు. తన వద్ద ఉన్న 10 లక్షల రూపాయల్లోంచి నయాపైస కూడా ఖర్చు చేయకుండా ఫైనాన్సర్ ఇచ్చిన డబ్బుతో సినిమా చుట్టేశాడు. మొత్తానికి షూటింగ్ పూర్తయింది. కాని ఫైనాన్సర్ చేతికి డబ్బులు రావాలంటే సినిమా విడుదల కావాలి. దానికంటే ముందు బిజినెస్ కావాలి. అప్పుడే ఫైనాన్సర్ చేతికి డబ్బులు వస్తాయి. అయితే ఎంతకీ సినిమా బిజినెస్ కావడం లేదు. ఫైనాన్సర్‌కు డబ్బు రావడం లేదు. తన వద్ద ఉన్న డబ్బులు అయిపోవచ్చాయి. రోజురోజుకు ఫైనాన్సర్ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతోంది. చివరికి ఆ నిర్మాత నుంచి డబ్బులు ఎలా రాబట్టుకోవాలో తెలీక కృష్ణానగర్ రోడ్లపై పిచ్చోడిలా తిరిగుతూ వచ్చాడు.
సినిమాలకు ఫైనాన్స్ చేసి చితికిపోయిన ఇలాంటి ఫైనాన్సర్లు ఇప్పుడు టాలీవుడ్‌లో అనేకమంది కనిపిస్తారు. సినిమా విడుదల సమయంలో డబ్బులు ఇస్తామని సదరు నిర్మాత చేసిన అగ్రిమెంట్ ప్రకారం ఆ సినిమా రిలీజయ్యేంతవరకు ఫైనాన్సర్ నోరు కట్టేసుకోవాల్సిందే. అయితే ఆ సినిమా రిలీజ్ కాదు. ఫైనాన్సర్ చేతికి డబ్బులు రావు. ఇలాంటి స్థితిలో ఏం చేయాలో అర్థంకాక అనేకమంది ఫైనాన్సర్లు తమ దుకాణాల్ని మూసుకునే పరిస్థితి వస్తోంది. చేసిన అగ్రిమెంట్ ప్రకారంగా చెప్పిన సమయానికి చేతికి డబ్బులు రాకపోతుండటంతో అనేకమంది ఫైనాన్సర్లు విలవిల్లాడుతున్నారు.
అగ్రిమెంట్లు ఎలా జరుగుతాయంటే...
సినిమా నిర్మాణం కోసం ఫైనాన్సర్లు, నిర్మాతలు ముందుగా అగ్రిమెంట్ చేసుకుంటారు. అయితే ఈ అగ్రిమెంట్‌లో ఎంత టైంలో డబ్బు చెల్లిస్తారనే సంగతి మాత్రం ఉండదు. ఏదో ఓ ల్యాబ్‌లో నిర్మాత, ఫైనాన్సర్‌కు మధ్య ఓ ఏరియా అమ్ముకునే హక్కులు కల్పిస్తూ అగ్రిమెంట్ జరుగుతుంది. అగ్రిమెంట్ కాపీ ల్యాబ్ వద్ద ఉంటుంది. సినిమా బిజినెస్ అయినా ఫైనాన్సర్ క్లియరెన్స్ లేకపోతే సినిమా విడుదలను ఆపేసే అవకాశం ఉంటుంది. క్లియరెన్స్ లెటర్ ఫైనాన్సర్ ఇస్తేనే సినిమా రిలీజ్‌కు నోచుకుంటుంది. ప్రధానంగా సినిమా బిజినెస్ అయ్యాక డబ్బులు ఇస్తామనో, లేక ఓ ఏరియా రాసి ఇస్తామనో అగ్రిమెంట్ చేసుకుంటారు. ఏ ఏరియా అయితే నిర్మాత రాసి ఇస్తారో ఆ ఏరియాలో సినిమా విడుదల చేసుకునే హక్కులు కేవలం ఫైనాన్సర్లకు మాత్రమే ఉంటాయి. ఈ విధంగా జరిగే ఒప్పందాల ప్రకారం అనుకున్న సమయంలో బిజినెస్ కాకపోవడం, ఫైనాన్సర్ చేతికి డబ్బులు రాకపోవడంతో నిర్మాత, ఫైనాన్సర్ల మధ్య గొడవలు జరిగిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది ఫైనాన్సర్లు 5 నుంచి 10 శాతం వడ్డీకి ఇచ్చి మునిగిపోయి ఉన్నారని పలువురు ఫైనాన్సర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినిమా బిజినెస్ జరిగితే ఫర్వాలేదు. కానీ బిజినెస్ జరగలేదంటే ఇక ఫైనాన్సర్ సంగతి అంతే!
నిర్మాత కావడమే బెటర్
తెలుగులో సినిమాకు ఫైనాన్స్ చేయడం కంటే ఏకంగా నిర్మాతగా మారడమే బెటరని అనేకమంది ఫైనాన్సర్లు అభిప్రాయపడుతున్నారు. సినిమా నిర్మాణానికి సుమారు 50 నుంచి 60 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు కాల్చుకునే బదులు స్వయంగా తామే సినిమా నిర్మించడం మంచిదని వారు భావిస్తున్నారు. ఒకవేళ సినిమా బిజినెస్ కాకపోయినా సొంతంగా తామే విడుదల చేసుకునే వీలుంటుంది. నష్టం వచ్చినా తాము చేసిన బిజినెస్ వల్లనేనని సరిపెట్టుకోవచ్చు. అంతే కాని లక్షలాది రూపాయలు వేరొకరి చేతికిచ్చి చేతులు కాల్చుకోవడం ఎందుకని ఫైనాన్సర్లు అంటున్నారు. సినిమాలకే ఫైనాన్స్‌లు ఇవ్వాలనుకుంటే అవే డబ్బులతో చిన్న సినిమాని నిర్మించి విడుదల చేయడమే మంచిదని భావిస్తున్నారు. ఫైనాన్స్ తీసుకున్న నిర్మాతలు తిరిగి డబ్బులు కట్టక, ల్యాబ్ నుంచి బయటకిరాక అనేక సినిమాలు ఆగిపోయి ఉన్నాయని ఫైనాన్సర్లు చెబుతున్నారు.
మారిన ఫైనాన్స్ విధానం
లక్షలాది లేదంటే కోట్లాది రూపాయలు నిర్మాతలకు ధారాదత్తం చేసి మునిగిపోవడం ఇష్టంలేక పలువురు ఫైనాన్సర్లు కొత్త విధానాన్ని పాటిస్తున్నారు. ఇంతకుముందు జరిగే ఒప్పందాల ప్రకారం అనేకమంది ఫైనాన్సర్లు ఆర్థికంగా చితికిపోయిన నేపథ్యంలో కొత్తగా ఫైనాన్స్ ఇచ్చే వాళ్లంతా నిర్మాతలు ఏదైనా ప్రాపర్టీ చూపిస్తేనే సినిమాకు ఫైనాన్స్ చేస్తున్నారని నిర్మాతలు అంటున్నారు. చిన్న సినిమాలకు సరైన ఫైనాన్స్ దొరక్క, బడ్జెట్ సమస్య వల్ల అనేక సినిమాల షూటింగులు మధ్యలోనే ఆగిపోయాయని నిర్మాతలు చెబుతున్నారు. ఇదీ మన తెలుగు చిత్రసీమలో ఫైనాన్సర్లు ఎదుర్కొంటున్న జఠిల సమస్య. ఇలాంటి సమస్యల నుంచి తమని బయటపడేసేలా ఫిల్మ్ చాంబర్ తగిన చర్యలు చేపట్టాలని పలువురు ఫైనాన్సర్లు కోరుతున్నారు.
No comments:
Post a Comment