Friday, August 19, 2011
న్యూస్: 'దూకుడు'తో తేలనున్న శ్రీను వైట్ల సత్తా!
మహేశ్ హీరోగా నటిస్తున్న 'దూకుడు'తో శ్రీను వైట్ల అసలు సత్తా ఏమిటో తేలిపోతుందని ఫిలింనగర్ వాసులు వ్యాఖ్యానిస్తున్నారు. డైరెక్ట్ చేసిన 11 సినిమాల్లో ('దూకుడు' 12వ సినిమా) 6 హిట్లున్న శ్రీనుకి మునుపటి సినిమా 'నమో వెంకటేశ' నిరాశని కలిగించింది. వెంకటేశ్, త్రిష జంటగా నటించిన ఈ సినిమాలో వెంకటేశ్ పాత్రని శ్రీను తీర్చిదిద్దిన విధానం విమర్శలకి తావిచ్చింది. వెంకటేశ్ ఈ సినిమాలో బ్రహ్మానందం కేరక్టెర్‌ని మించి జోకర్‌గా కనిపించిందని చాలామంది విమర్శించారు. అయితే ఈ విమర్శలేవీ అతనితో మహేశ్ పనిచేయడాన్ని ఆపలేకపోయాయి. ఎందుకంటే 'ఢీ' నుంచి 'కింగ్' దాకా వరుసగా శ్రీను డైరెక్ట్ చేసిన నాలుగు సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం. యాక్షన్‌కి అతను జోడించే వినోదం ఇప్పటివరకూ సత్ఫలితాల్నే ఎక్కువగా ఇస్తూ వచ్చింది. అందుకే అతని డైరెక్షన్‌లో చేయాలని మహేశ్ భావించాడు. అలా 'దూకుడు' సినిమా రూపుదాల్చింది. శ్రీనుతో 'నమో వెంకటేశ'ని తీసిన 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థే ఈ సినిమానీ నిర్మిస్తోంది. విడుదలైన పాటలకి రెస్పాన్స్ మాత్రం అదిరింది. కొట్టిన ట్యూన్లే కొట్టే తమన్ ఈసారి కొన్ని డిఫరెంట్ ట్యూన్స్ ఇచ్చాడు. రామజోగయ్యశాస్త్రి, విశ్వా రాసిన పాటలు బాగున్నాయి. ఎక్కువగా దేవిశ్రీ ప్రసాద్‌నే సంగీత దర్శకుడిగా తీసుకుంటూ వస్తున్న శ్రీను 'దూకుడు'తో తొలిసారి తమన్‌తో పనిచేశాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో మహా 'దూకుడు' మీదున్న తమన్ టైటిల్‌కి న్యాయం చేశాడు. కాగా 'దూకుడు' ప్రోమోస్‌లో మహేశ్ చాలా బాగున్నాడనే పేరు వచ్చింది. ఇక సినిమాలో అతణ్ణి శ్రీను ఎలా చూపించాడు, దానికంటే కూడా సబ్జెక్ట్ ఎలా చేశాడు, స్క్రీన్‌ప్లేని ఎలా అల్లాడు.. అనే అంశాల మీదే ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సాధిస్తుందనేది ఆధారపడి ఉంది. 'నమో వెంకటేశ' రిజల్ట్‌తో 'దూకుడు'ని అతడు కసిగా తీశాడని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి 'దూకుడు' తర్వాత శ్రీను టాప్ డైరెక్టర్‌గా మరింత డిమాండ్ పొందుతాడో, లేదో చూడాల్సిందే.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment