బాలీవుడ్ అవకాశాలు
బాలీవుడ్‌లో నటించేందుకు నేను సిద్ధం. 'సింఘం' సినిమాలో చేయక పోవడానికి డేట్స్ కుదరక పోవడమే కారణం. బిజీ వల్లనే దాన్ని చేయలేకపోయా. అన్నీ కుదిరితే హిందీలోనే కాదు ఏ భాషలోనైనా నటిస్తా. స్క్రిప్టు నచ్చితే చాలు.
అవార్డులపై అభిప్రాయం
సినిమా ఫీల్డులోకి వచ్చి ఐదున్నరేళ్లే అయ్యింది. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఓ పదేళ్లు అయిన తర్వాత మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఫలానా సినిమాలో నా నటన బాగుందని గుర్తుంచుకునేలా ఉండాలి. మనం చేసిన కష్టానికి ఇచ్చే ప్రతిఫలం అవార్డు. అది రావడం వల్ల మన బాధ్యత మరింత పెరుగుతుంది.
నచ్చిన నటులు
నటనాపరంగా జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. హి ఈజ్ వెరీ గుడ్ పర్ఫార్మర్. పర్సనల్‌గా అయితే నాగార్జున ఇష్టం. నన్ను సినీ రంగానికి పరిచయం చేసింది నాగ్, పూరి జగన్నాథ్. అందుకే నా ఆల్‌టైం ఫేవరేట్స్ నాగ్ అండ్ జగన్.
నచ్చిన హీరోయిన్లు
తమన్నా, కాజల్ అంటే ఇష్టం. అయితే తమన్నా బాగా హార్డ్ వర్కర్. అందుకే తనంటే బాగా ఇష్టం. బాగా కష్టపడే వాళ్లని నేనెప్పుడూ అభిమానిస్తా. తను నాకంటే బాగా నటిస్తోంది అంటే నాకంటే సంతోషించేవాళ్లు మరొకరు ఉండరు.
డబ్బింగ్ సంగతి
తెరముందు నా పాత్రకి నేనే వాయిస్ ఇవ్వాలని నాకూ ఉంది. కానీ నాలుగైదు సినిమాలు చేతిలో ఉండటం వల్ల డబ్బింగ్‌కి సమయం కేటాయించలేకున్నా. 'వేదం'కు చెపాలనుకున్నా కానీ అది వెస్ట్ గోదావరి యాసలో మాట్లాడాలి. ఆ యాసను చెడగొట్టరాదనే ఉద్దేశంతోనే అందులో నేను డబ్బింగ్ చెప్పలేదు. ఈసారి తప్పకుండా ట్రై చేస్తా.
బెంగళూరులో ఎక్కువ సమయం
అమ్మా నాన్నలు బెంగళూరులో ఉంటారు. అందుకే వీలున్నప్పుడల్లా వారి దగ్గర ఉంటున్నా. ఐటీ అధికారులు దాడులు చేశారని నేనేదో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి బెంగళూరుకు షిఫ్ట్ అయ్యాననీ రూమర్స్ వచ్చాయి. అలాంటిదేమీ లేదు. నేను ఇంటున్నా. 'డమరుకం', 'రెబెల్' షూటింగుల్లో పాల్గొంటున్నా.
గ్లామర్ రహస్యం
యోగా చెయ్యడం వల్ల మనలో ఉన్న అన్ని చెడు అలవాట్లు పోతాయి. మీరూ ప్రయత్నించి చూడండి. మీరు క్రమం తప్పకుండా యోగా చేస్తే చాలు.. మీకు తెలియకుండానే మీలో ఉన్న చెడు అలవాట్లు తొలగిపోతాయి. ఉదాహరణకి ఓ హాబీలా మాంసాహారం తింటున్నారనుకోండి. యోగా చేస్తే అది మీకు తెలియకుండానే మరచిపోతారు.
No comments:
Post a Comment