Thursday, August 11, 2011
న్యూస్: 'బ్లాక్ మనీ' ఆగినట్లేనా?
జగపతిబాబు సినిమాల పరిస్థితి ఏమిటి? ఇప్పుడు చాలామందిని తొలుస్తున్న ప్రశ్న ఇది. 'చట్టం'తో నిర్మాత నట్టి కుమార్, 'నగరం నిద్రపోతున్న వేళ'తో నిర్మాత నంది శ్రీహరి, 'కీ'తో నిర్మాత సుకుమార్‌రెడ్డి నష్టపోయారు. 'కీ' లో బడ్జెట్ సినిమా కాబట్టి ఫర్వాలేదు. కానీ 'నగరం నిద్రపోతున్న వేళ' విషయంలో నిర్మాత కోట్లలో నష్టపోయారు. శాటిలైట్ హక్కులకు డిమాండ్ రాకపోవడంతో అతి తక్కువ రేటుకే దాన్ని అమ్ముకున్నారు. ఇక థియేటర్లలో విడుదల చేసిన ప్రింట్ల మీద ఆయనకు నయా పైస కూడా రాలేదు. అదేవిధంగా 'చట్టం'తో నట్టి కుమార్ ఒకటిన్నర కోట్ల రూపాయల మేర నష్టపోయినట్లు సమాచారం. బ్యాంకులకి తన ఆస్తుల్ని తనఖా పెట్టి ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుంటూ సినిమాలు లాక్కొస్తున్న ఆయన ఫైట్ మాస్టర్ విజయన్ కుమారుడు శబరీశ్ హీరోగా పరిచయమైన 'మార్క్' సినిమాని సరైన పబ్లిసిటీ లేకుండానే రిలీజ్ చేశారు. ఆర్థికంగా పీకల్లోతు మునిగి ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జగపతిబాబు హీరోగా ఆయన నిర్మిస్తున్న 'బ్లాక్ మనీ' సినిమాపై నీలినీడలు ముసురుకున్నాయి. ఆ సినిమా నిర్మాణం కొనసాగించడం తన వల్ల కాదని కుమార్ చేతులెత్తేశాడని ప్రచారమవుతోంది. వాస్తవానికి జగపతిబాబు 100వ చిత్రాన్ని తనే నిర్మిస్తానని కుమార్ ప్రకటించాడు. 'బ్లాక్ మనీ' చేయడమే కష్టమవుతున్న స్థితిలో ఆ వందో సినిమా చేయడం దుర్లభంగా కనిపిస్తోంది. కొంత కాలం క్రితం వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తూ వచ్చిన కుమార్‌ని అంత స్పీడు పనికిరాదని అతని శ్రేయోభిలాషులు హెచ్చరిస్తూ వచ్చారు. అయితే తను పక్కా ప్లాన్‌తో దిగుతుండటం వల్ల నష్టపోవడం ఉండదని చెబుతూ వచ్చాడు కుమార్. కానీ ఆయన ప్లానులు ఫలించలేదు. తీసిన ఏ సినిమా కూడా లాభాలు తేలేకపోయింది. పైగా ఆయన అప్పుల పాలయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. అందువల్లే షూటింగ్ మధ్యలో ఉన్న 'బ్లాక్ మనీ'ని కూడా ఆపేయాలని ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంగతి తెలిసి ఆయనపై జగపతిబాబు కినుక వహించారనీ, కుమార్ పేరు చెబితే చాలు మండిపడుతున్నారనీ ఫిలింనగర్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment