ప్రజల్లో పెల్లుబుకుతున్న స్వాతంత్ర్య కాంక్ష తన గద్దెను కదిలిస్తుందేమోనన్న భయం నిజామును పట్టుకుంది. దాంతో 1942లో కొన్ని రాజకీయ సంస్కరణలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ అదే సంవత్సరం ధర్మవరంలో మాదిరాజు రామకోటేశ్వర్రావు అధ్యక్షత కింద జరిగిన తొమ్మిదో ఆంధ్ర మహాసభల్లో ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తూ ప్రజాసామాన్యం ఎన్నుకున్న సభ్యులతో శాసనసభ ఏర్పడాలని మహాసభ నిర్ణయించింది. ఈ ఆంధ్రోద్యమ సభలు "ముఖ్యంగా భాష, విద్య, విజ్ఞానము, నీతి, సంస్కృతి అభివృద్ధికి పాటుపడగలవని" మాడపాటి హనుమంతరావు గారు అనేక వ్యాసాల్లో, ఉపన్యాసాల్లో ప్రకటించారు.
"నాయకులే ఉద్యమానికి రాజకీయాలతో సంబంధం లేదని ఎంత ప్రకటించినప్పటికీ, ఉద్యమాన్ని చట్టబద్ధంగా నడవడానికి ఎంత కృషి చేసినప్పటికీ, ఆంధ్రోద్యమానికి ఉండే రాజకీయ ప్రాముఖ్యతను ఎవరూ విస్మరింపజాలరు. నలుదిశల అంధకారం వ్యాపించి ఉన్న ఆ రోజుల్లో ఎంత చిన్నదైనప్పటికి ఆంధ్రోద్యమం ఒక జ్యోతిగా వెలిగి ఇక్కడి ప్రజానీకానికి మార్గం చూపించిందనే విషయంలో సందేహం ఏమాత్రం లేదు. అటు పిమ్మట అభివృద్ధిచెందిన విశాల ప్రజా ఉద్యమానికి ఈ దశాబ్దంలో జరిగిన కృషి పునాదిగా నిలిచింది" అన్నారు రావి నారాయణరెడ్డి.
1939 నుండీ తెలంగాణా ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ పనిచేయడం ఆరంభించింది. ఇది కూడా గ్రంథాలయ ఉద్యమం, నిజాం వ్యతిరేక పోరాటం, తెలుగు సంస్కృతీ పరిరక్షణ పోరాటాల రూపంలో పనిచేసింది. గ్రామాల్లో జనాన్ని చైతన్యవంతుల్ని చేయడం, నిజాం వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక పోరాట దిశగా వాళ్లను మళ్లించడంలో కమ్యూనిస్టు పార్టీ బాగా కృషి చేస్తుండేది. విశాలాంధ్ర వాంఛనూ వాళ్లలో రగుల్కొల్పడంలో కూడా శాయశక్తులా శ్రమించింది. మునగాల రాజా ప్రజలపై చేసే నిర్బంధాలను వ్యతిరేకిస్తూ పెద్ద ప్రజా ప్రతిఘటనను నిర్మించింది. జాగీర్దార్లు తమ ప్రాంతాల్లో విధించిన అధిక పన్నులకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సమీకరణ సాగించింది.
No comments:
Post a Comment