Showing posts with label varudu. Show all posts
Showing posts with label varudu. Show all posts

Thursday, October 13, 2011

ప్రివ్యూ: మొగుడు

కృష్ణవంశీ, గోపీచంద్ తొలి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'మొగుడు'. ఈ సినిమా ప్రోమోస్ అన్నీ ఆమధ్య గుణశేఖర్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చి ఫ్లాపైన 'వరుడు'ను గుర్తు చేస్తున్నాయి. 'వరుడు' ఫ్లాపవడం వల్లే పెళ్లి అనే కాన్సెప్టుతో హిట్ సినిమా చేయాలనే పట్టుదలతో 'మొగుడు'ని కృష్ణవంశీ తీసినట్లు అనిపిస్తుంది. 'మొగుళ్లందరూ మగాళ్లే కానీ, మగాళ్లందరూ మొగుళ్లు కారు. చాలామంది మొగుళ్లు మొగుళ్లలా కాకుండా మగాళ్లలా మిగిలిపోతున్నారు. అలా ఉండొద్దు' అనే కథాంశంతో ఈ సినిమాని కృష్ణవంశీ రూపొందించాడు. 'శశిరేఖా పరిణయం', 'మహాత్మ' వంటి ప్రేక్షకులు సరిగా ఆదరించని రెండు సినిమాల తర్వాత కృష్ణవంశీ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తే, 'వాంటెడ్' వంటి డిజాస్టర్ తర్వాత గోపీచంద్ ఈ సినిమా చేశాడు. అందాల తార తాప్సీ ఇందులో పర్ఫార్మెన్స్‌కి ప్రాధాన్యం ఉన్న పాత్ర చేసింది. తన పాత్రకు ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. కాలం కలిసొస్తే ఈ పాత్రకి ఆమె అవార్డులు సాధించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరో నాయికగా శ్రద్ధాదాస్ నటించింది. గోపీచంద్ తండ్రిగా రాజేంద్రప్రసాద్ నటించడంతో ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ వచ్చింది. తాప్సీ తల్లిదండ్రులుగా రోజా, నరేశ్ కనిపిస్తారు.
లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బేనర్‌పై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్‌గా బాబూశంకర్, సినిమాటోగ్రాఫర్‌గా శ్రీకాంత్ నర్రోజు, డైలాగ్ రైటర్‌గా భీం శ్రీను పరిచయమవుతున్నారు. మలయాళీ అయిన బాబూశంకర్ ఇప్పటివరకు 400 వరకు యాడ్ ఫిలింస్ తీయడం గమనార్హం. సీతారామశాస్త్రి నాలుగు పాటలు, సుద్దాల అశోక్‌తేజ, రామజోగయ్యశాస్త్రి తలో పాట రాసిన ఈ సినిమా దీపావళికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Thursday, July 28, 2011

న్యూస్: 'నిప్పు'తో వైవీఎస్ చౌదరి చెలగాటం

'సొగసు చూడతరమా', 'రామాయణం', 'చూడాలని వుంది', 'మనోహరం', 'ఒక్కడు'... ఇవన్నీ ఒకే దర్శకుడు రూపొందించిన సినిమాలు. 'మృగరాజు', 'సైనికుడు', 'వరుడు'... ఇవి కూడా అదే దర్శకుడు తీసిన సినిమాలు. అతను గుణశేఖర్. తన కెరీర్‌లో అబ్బురమనిపించే చిత్రాలతో పాటు 'ఇంత ఘోరంగా తీశాడేంటి?' అనిపించే చిత్రాలూ తీసిన గుణశేఖర్‌పై ప్రధానంగా ఒక విమర్శ ఉంది. అది ఔట్‌డోర్‌లో తీయాల్సిన సన్నివేశాల్ని కూడా భారీ సెట్స్ వేసి తీస్తాడనీ, తద్వారా బడ్జెట్‌ని విపరీతంగా పెంచేస్తాడనీ. అందుకే 'బడ్జెట్ పెంచాలంటే గుణశేఖర్‌లా సెట్స్ వేస్తే సరి' అనే నానుడి టాలీవుడ్‌లో ఏర్పడింది. 'ఒక్కడు'లోని చార్మినార్ సెట్, 'అర్జున్'లోని మధుర మీనాక్షి దేవాలయ సెట్, 'సైనికుడు'లోని సముద్రం సెట్ వంటివి అందుకు ఉదాహరణలు. మునుపటి డిజాస్టర్ మూవీ 'వరుడు'లోనూ పెళ్లి మండపం సెట్‌ని అతి లావిష్‌గా ఏర్పాటు చేయించాడు. ఇలా నిర్మాతల పాలిట విలన్‌లాగా తయారైన ఆయన్ని తన 'ఇదీ నా కథ'లో ప్రఖ్యాత కవి, నిర్మాత మల్లెమాల సుందరరామిరెడ్డి (ఎమ్మెస్ రెడ్డి) తూర్పారబట్టిన సంగతి ఇటీవలే మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.
ప్రస్తుతానికి వస్తే అలాంటి గుణశేఖర్ డైరెక్షన్‌లో మరో డైరెక్టర్ వైవీఎస్ చౌదరి 'నిప్పు' అనే సినిమాని నిర్మిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. ఇందులో రవితేజ హీరో. దీక్షా సేథ్ హీరోయిన్. 'దేవదాసు' తర్వాత డైరెక్టర్‌గా మరో హిట్‌లేని చౌదరి ఇప్పుడు గుణశేఖర్‌తో ఎందుకు సినిమా నిర్మిస్తున్నాడో అర్థంకాక సినీ వర్గాల వారు తలబద్దలు కొట్టుకుంటున్నారు. ఒకప్పుడు సినిమా అవకాశాల కోసం తిరిగే రోజుల్లో మద్రాసులో ఒకే చోట ఉన్నామనీ, ఆ స్నేహంతో ఈ సినిమా చేస్తున్నాననీ చౌదరి చెబుతున్నాడు. కానీ గుణశేఖర్ గురించి తెలిసి తెలిసీ ఎందుకు 'నిప్పుతో చెలగాటమాడుతున్నాడు? ఇది తెలియాలంటే కొంత కాలం ఆగక తప్పదు.

Saturday, November 27, 2010

సినిమా: ఒక కాంపౌండు.. మూడు డిజాస్టర్లు!

ఇది నిజంగా బాధాకరమైన సంగతి. ఒకే కాంపౌండుకు చెందిన ముగ్గురు హీరోల సినిమాలు వరుసగా బాక్సాఫీసు వద్ద ఒక దాన్ని మించి ఒకటి బోల్తాపడ్డాయి. ఆ మూడు సినిమాలు.. మొన్నటి అల్లు అర్జున్ సినిమా 'వరుడు', నిన్నటి పవన్ కల్యాణ్ సినిమా 'కొమరం పులి', నేటి రాంచరణ్ సినిమా 'ఆరెంజ్'. అవును.. నిన్ననే (నవంబర్ 26) విడుదలైన 'ఆరెంజ్' అట్టర్‌ఫ్లాప్ అని ట్రేడ్ విశ్లేషకులు తేల్చేశారు. చిరంజీవి మీద ఈగ వాలినా సహించలేని వాళ్లు నడిపే పాపులర్ వెబ్‌సైట్ 'నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు' అన్నట్లు ఆ సినిమాకి 3.25/5 రేటింగ్ ఇవ్వొచ్చుగాక.. బాక్సాఫీసు వద్ద 'ఆరెంజ్' తోక ముడిచిందన్నది తొలిరోజు మార్నింగ్ షోకే తేలిపోయింది. థియేటర్ల వద్ద ఈగలు తోలుకుంటున్న బయ్యర్లే దీనికి సాక్ష్యం. వాళ్ల కాంపౌండుకే చెందిన గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాని రిలీజ్ చేయకుండా తమకెందుకు ఇచ్చారో నైజాంకి ఆ సినిమాని తీసుకున్న ఏషియన్ ఫిలింస్ వాళ్లు ఎందుకు ఆలోచించలేదో తెలియదు. మొత్తానికి అల్లు అరవింద్ సేఫ్. ఏషియన్ సునీల్ నారంగ్ బలి.
పాపం. చిరంజీవి సొంత బేనర్ అంజనా ప్రొడక్షన్స్ మరోసారి 'ఆరెంజ్'తో తమ పూర్ పర్ఫార్మెన్స్‌ని ప్రదర్శించింది. ఆ సంస్థ ఇంతవరకు తీసిన సినిమాల్లో కమర్షియల్‌గా ఆడింది ఒక్కటే. అది 'బావగారూ బాగున్నారా'. మరో సినిమా 'రుద్రవీణ' అవార్డులు తెచ్చింది. అంతే. అంతకుమించి ఆ బేనర్‌లో వచ్చిన సినిమాలేవీ జనాన్ని అలరించలేకపోయాయి. 'మగధీర'తో సూపర్‌స్టార్ రేంజిని పొందిన రాంచరణ్ 'ఆరెంజ్'తో టాలీవుడ్ నెంబర్‌వన్ హీరో అయిపోయినట్లేనని కలలు కన్నవాళ్ల ఆశలు ఆవిరయ్యాయి. అయినా స్వయంగా నాగబాబే 'మగధీర' మ్యాజిక్.. 'ఆరెంజ్' ఎక్స్‌పీరియెన్స్ అన్నాక వాళ్లు మాత్రమైనా ఆ సినిమా గురించి ఎందుకు ఆశలు పెట్టుకున్నట్లు! 'మగధీర' వంటి గొప్ప సినిమా తర్వాత ఆ హీరో ఎలాంటి సినిమా చేయాలి? కచ్చితంగా 'ఆరెంజ్' లాంటి సినిమా మాత్రం కాదు.