ఇది నిజంగా బాధాకరమైన సంగతి. ఒకే కాంపౌండుకు చెందిన ముగ్గురు హీరోల సినిమాలు వరుసగా బాక్సాఫీసు వద్ద ఒక దాన్ని మించి ఒకటి బోల్తాపడ్డాయి. ఆ మూడు సినిమాలు.. మొన్నటి అల్లు అర్జున్ సినిమా 'వరుడు', నిన్నటి పవన్ కల్యాణ్ సినిమా 'కొమరం పులి', నేటి రాంచరణ్ సినిమా 'ఆరెంజ్'. అవును.. నిన్ననే (నవంబర్ 26) విడుదలైన 'ఆరెంజ్' అట్టర్‌ఫ్లాప్ అని ట్రేడ్ విశ్లేషకులు తేల్చేశారు. చిరంజీవి మీద ఈగ వాలినా సహించలేని వాళ్లు నడిపే పాపులర్ వెబ్‌సైట్ 'నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు' అన్నట్లు ఆ సినిమాకి 3.25/5 రేటింగ్ ఇవ్వొచ్చుగాక.. బాక్సాఫీసు వద్ద 'ఆరెంజ్' తోక ముడిచిందన్నది తొలిరోజు మార్నింగ్ షోకే తేలిపోయింది. థియేటర్ల వద్ద ఈగలు తోలుకుంటున్న బయ్యర్లే దీనికి సాక్ష్యం. వాళ్ల కాంపౌండుకే చెందిన గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాని రిలీజ్ చేయకుండా తమకెందుకు ఇచ్చారో నైజాంకి ఆ సినిమాని తీసుకున్న ఏషియన్ ఫిలింస్ వాళ్లు ఎందుకు ఆలోచించలేదో తెలియదు. మొత్తానికి అల్లు అరవింద్ సేఫ్. ఏషియన్ సునీల్ నారంగ్ బలి.
పాపం. చిరంజీవి సొంత బేనర్ అంజనా ప్రొడక్షన్స్ మరోసారి 'ఆరెంజ్'తో తమ పూర్ పర్ఫార్మెన్స్‌ని ప్రదర్శించింది. ఆ సంస్థ ఇంతవరకు తీసిన సినిమాల్లో కమర్షియల్‌గా ఆడింది ఒక్కటే. అది 'బావగారూ బాగున్నారా'. మరో సినిమా 'రుద్రవీణ' అవార్డులు తెచ్చింది. అంతే. అంతకుమించి ఆ బేనర్‌లో వచ్చిన సినిమాలేవీ జనాన్ని అలరించలేకపోయాయి. 'మగధీర'తో సూపర్‌స్టార్ రేంజిని పొందిన రాంచరణ్ 'ఆరెంజ్'తో టాలీవుడ్ నెంబర్‌వన్ హీరో అయిపోయినట్లేనని కలలు కన్నవాళ్ల ఆశలు ఆవిరయ్యాయి. అయినా స్వయంగా నాగబాబే 'మగధీర' మ్యాజిక్.. 'ఆరెంజ్' ఎక్స్‌పీరియెన్స్ అన్నాక వాళ్లు మాత్రమైనా ఆ సినిమా గురించి ఎందుకు ఆశలు పెట్టుకున్నట్లు! 'మగధీర' వంటి గొప్ప సినిమా తర్వాత ఆ హీరో ఎలాంటి సినిమా చేయాలి? కచ్చితంగా 'ఆరెంజ్' లాంటి సినిమా మాత్రం కాదు.
No comments:
Post a Comment