భయపెట్టనున్న 'చంద్రముఖి-2'
డిసెంబరులో రాబోతోన్న మరో సీనియర్ టాప్ హీరో సినిమా 'నాగవల్లి'. వెంకటేశ్ కథానాయకుడు. 'చంద్రముఖి-2'గా ప్రచారం పొందుతోన్న ఈ సినిమా కన్నడ హిట్ ఫిల్మ్ 'ఆప్త రక్షక'కి రీమేక్. ఆ సినిమాని డైరెక్ట్ చేసిన సీనియర్ తమిళ డైరెక్టర్ పి. వాసు తెలుగు చిత్రాన్నీ రూపొందిస్తున్నారు. బెల్లంకొండ సురేశ్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో అనుష్క, రిచా గంగోపాధ్యాయ్, కమలినీ ముఖర్జీ, శ్రద్ధాదాస్ వంటి తారలు కనిపించనుండటం విశేషం. వెంకటేశ్ మునుపటి చిత్రాలు 'నమో వెంకటేశ', 'ఈనాడు' ప్రేక్షకుల్ని అలరించడంలో విఫలమైన నేపథ్యంలో 'నాగవల్లి' సినిమా ఫలితంపై ఆసక్తి నెలకొంది. సస్పెన్స్, మిస్టరీకి వినోదాన్ని జోడించిన ఈ చిత్రం డిసెంబర్ తొలివారంలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
'రక్త చరిత్ర-2' వస్తోంది
'రక్త చరిత్ర' ఘన విజయం సాధించడంతో ఇప్పుడు అందరి దృష్టీ దాని సీక్వెల్ 'రక్త చరిత్ర-2' మీదపడుతోంది. తొలి సినిమా విడుదలైన నెలరోజుల్లోపలే నవంబర్ 26న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు వర్మ ప్రకటించడం క్యూరియాసిటీని మరింత పెంచింది. తొలి భాగంలో కనిపించని మద్దెలచెరువు సూరి పాత్ర రెండో భాగంలో కనిపించనుండటం, ఆ పాత్రని తమిళ స్టార్ నటుడు సూర్య చేయడం ఆ సినిమా విలువని అమాంతం పెంచేసింది. సూర్య భార్య పాత్రలో ప్రియమణి నటించిన ఈ సినిమాలో పరిటాల రవి, మద్దెలచెరువు సూరి మధ్య ఘర్షణ ప్రధానం. రవి పాత్రలో ఇప్పటికే వివేక్ ఓబరాయ్ అందరి ప్రశంసలూ పొందిన సంగతి తెలిసిందే. తొలి భాగంకంటే ఈ రెండో భాగం మరింత విజయాన్ని సాధించే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే సీక్వెల్స్ నిర్మాణం వేగం పుంజుకోవడం ఖాయం.
వివాదాల 'కత్తి'
ఇటీవల 'కత్తి' టైటిల్ పై వివాదం చెలరేగడం గుర్తుండే వుంటుంది. 'కత్తి' అనే టైటిల్ని ఫిలింఛాంబర్ వద్ద డైరెక్టర్ గుణశేఖర్ రిజిస్టర్ చేయించాడు. రవితేజ హీరోగా ఆ పేరుతో సినిమా రూపొందించేందుకు ఆయన సంకల్పించాడు. ఈ టైటిల్ రిజిస్టర్ అయ్యింది మాత్రం వైవీఎస్ చౌదరికి చెందిన బొమ్మరిల్లు బ్యానరులో. అంటే ఈ సినిమాకి నిర్మాత చౌదరే. కానీ 'కత్తి' పేరుతో మరో రెండు సినిమాలు ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయి. వాటిలో ఒకటి అల్లరి నరేశ్ హీరోగా ఈవీవీ సత్యనారాయణ రూపొందిస్తోన్న 'కత్తి కాంతారావు' కాగా, మరొకటి 'కల్యాణ్ రామ్ కత్తి'. వీటిలో రెండో సినిమా టైటిల్ పైనే గుణశేఖర్ అభ్యంతరం వ్యక్తంచేశారు. కారణం టైటిలులో 'కల్యాణ్ రామ్' అన్న పేరుని ఇంగ్లీషులో చిన్న అక్షరాలతో ఉంచి, 'కత్తి'ని పెద్దక్షరాలతో డిజైన్ చేయించడం. గుణశేఖర్ అభ్యంతరాల్ని ఏమాత్రం ఖాతరుచేయని కల్యాణ్ రామ్ ఆ టైటిలునే ఖాయం చేసుకున్నాడు. సొంత బేనర్ యన్.టి.ఆర్. ఆర్ట్స్ పై మల్లికార్జున్ డైరెక్షనులో హీరోగా నటిస్తూ ఈ చిత్రాన్ని ఆయన నిర్మించాడు. సనాఖాన్ నాయికగా నటించిన ఈ చిత్రం నవంబర్ ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 'కత్తి' వివాదాన్ని ఇంకా జనం మరచిపోకముందే వస్తున్నందున ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఎలాంటి ఫలితాన్ని నమోదు చేస్తుందనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. పైగా 'అతనొక్కడే' తర్వాత కల్యాణ్ రామ్ కి చెప్పుకోదగ్గ సినిమా ఇంతదాకా రాలేదు. అందుకే ఎంతో కసితో అతను ఈ సినిమా చేశాడు.
'బ్రోకర్'పైనా ఆసక్తి
స్టార్ హీరోలు లేకపోయినా, స్టార్ డైరెక్టర్ తీయకపోయినా కుతూహలాన్ని రేపుతున్న మరో సినిమా 'బ్రోకర్'. నవంబర్ లేదా డిసెంబరులో రిలీజ్ కానున్న ఈ చిత్రంలో టైటిల్ పాత్రని సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పోషించాడు. అంతే కాదు, ఈ చిత్రానికి దర్శకుడు కూడా అతనే. నేటి సమాజంలో 'బ్రోకర్' అనేవాడు లేకుండా ఏ పనీ జరగడం లేదనే సంగతిని వ్యంగ్యంగా చిత్రిస్తూ రూపొందిస్తోన్న ఈ చిత్రంలో అర్పీ నెగటివ్ రోలులో కనిపించబోతున్నాడు. శ్రీహరి సైతం ఓ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్స్ సినిమా పతాకంపై స్వయంగా డైరెక్టర్ అయిన మద్దినేని రమేశ్ నిర్మిస్తున్నారు.
వీటితో పాటు మరికొన్ని సినిమాలు కూడా ఈ రెండు నెలల్లో రాబోతున్నాయి. వీటిలో మూడు నాలుగు సినిమాలైనా సక్సెసయితే 2010ని చిత్రసీమ హ్యాపీగా ముగించినట్లవుతుంది. అలా జరుగుతుందా? చూద్దాం.
No comments:
Post a Comment