భోపాల్ విషవాయువు దుర్ఘటన విషాదం ఆ నగరానిదే కాదు, దేశమంతటిదీ. మృతులను లెక్కించకుండానే గుట్టలుగా పోసి తగులబెట్టారు. విషవాయువు భోపాల్ సరస్సును దాటి ఆవల వున్న శ్యామలా హిల్స్ కాలనీలోని సంపన్న వర్గాల ఇళ్లవైపు వెళ్లలేదు. యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ చుట్టుపక్కల నివసించే పేదలపైనే ప్రతాపం చూపింది. పేవ్‌మెంట్ల మీద నిద్రపోతున్న నిరాశ్రయులను కాటేసింది. పేదల మరణాలు అంత ప్రాముఖ్యత లేనివి. కాబట్టి శవాల లెక్కలు మెల్లగా మొదలయ్యాయి. లెక్కించకుండా తగులబెడితే మాత్రం పట్టించుకునే నాథుడెవరు?
యూనియన్ కార్బైడ్‌ను రక్షించే యత్నాలు ముమ్మరంగా నడిచాయి. రాజకీయ నాయకులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. బాధితుల తరపున తనే ఏకైక వకాల్తాదారునని ప్రభుత్వం చెప్పింది. అందుకోసం ఏకంగా ఒక శాసనాన్ని తెచ్చింది. నష్టపరిహారం గురించి బాధితుల తరపున మాట్లాడి ఒప్పందం కుదుర్చుకునే అధికారం ప్రభుత్వానికి దఖలు పడింది. వేరెవరూ మాట్లాడేందుకు వీలులేదు. బాధిత ప్రజలకు తల్లీ తండ్రీ తనే అని చెప్పింది. కానీ పాలక ప్రభువులు తల్లితండ్రులు లాగ వ్యవహరించలేదు. ఏ తల్లీ తండ్రీ తమ బిడ్డలతో వ్యవహరించనంత నిర్దయగా, దుర్మార్గంగా కుట్రపూరితంగా వ్యవహరించారు. యూనియన్ కార్బైడ్‌ను మాత్రం సొంత బిడ్డగా భావించారు. రక్షించారు. భోపాల్ దుర్ఘటనలో నిందితులైన భారతీయులకు భారత శిక్షాస్మృతిలోని 304-ఎ సెక్షన్ కింద రెండేళ్లు మాత్రం శిక్ష వేశారు. కారో, బస్సో నిర్లక్ష్యంగా నదిపి చేసే ప్రమాదంతో భోపాల్ దుర్ఘటనను సమానం చేశారు. సుప్రీంకోర్టే ఈ పని చేసింది. సిబిఐ 304 అనే పెద్ద సెక్షన్ పెడితే దాన్ని అత్యున్నత న్యాయస్థానం చిన్నదిగా చేసింది. న్యాయవ్యవస్థకు ఎప్పుడూ ఉన్న వాళ్ల పట్లే సానుభూతి. దీనికి ఆనాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అహ్మది మినహాయింపు కాదు. భోపాల్ బాధితులు నిష్ట దరిద్రులు. సుప్రీంకోర్టు సమీపంలోని రిజర్వు బ్యాంకులో అప్పటి సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఖాతాలో పదిన వందలాది కోట్ల డాలర్ల వాసననెరుగని అమాయకులు. వారికి న్యాయం జరిగేదెక్కడ? భోపాల్ పాపంలో అప్పటినుంచీ ఇప్పటివరకూ పాలించిన పాలకులందరికీ భాగస్వామ్యం ఉంది. అప్పటి దుర్ఘటనకు ప్రధాన బాధ్యుడు ఆందర్సన్‌ను దేశం దాటించడంలో, తిరిగి భారత్‌కు రప్పించలేకపోవడంలో అన్ని పార్లమెంటరీ పార్టీలకూ పాత్ర ఉంది.
No comments:
Post a Comment