Wednesday, November 10, 2010

ఇంటర్వ్యూ: అనుష్క

నాగార్జునకి జోడీగా 'రగడ'లో నటిస్తూ, వెంకటేశ్ ప్రధాన పాత్ర చేస్తోన్న 'నాగవల్లి'లో టైటిల్ రోల్ చేస్తోన్న బెంగళూరు భామ అనుష్క చెప్పిన సంగతులు..
'రగడ'లో మూడోసారి నాగ్‌తో కలిసి నటిస్తున్నందుకు హ్యాపీ. ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ని డైరెక్టర్ వీరు పోట్ల బాగా మలిచాడు. నాగ్, నేనూ ప్రేక్షకుల్ని అలరిస్తామనే గట్టి నమ్మకం నాకుంది. నాది గ్లామర్‌తో పాటు నటనకు కూడా అవకాశం వున్న పాత్ర. 'నాగవల్లి'లో టైటిల్ రోల్ చేయడం ఇంకా హ్యాపీ. ఇప్పటికే నా మాతృభాష కన్నడలో పెద్ద హిట్టయిన సినిమా ఇది. 'అరుంధతి', 'వేదం' సినిమాల తర్వాత అంత పేరు తెచ్చే సినిమా.
దేవుణ్ని నమ్ముతా
నేను దేవుణ్ని నమ్ముతా. దేవత పాత్రల్లో రమ్యకృష్ణలో కనిపించే తేజస్సు నాకు చాలా ఇష్టం. ఆమె ఆ పాత్రలు చేసినప్పుడు డైనమిజం కనిపిస్తుంది. నాకు మాత్రం ఎప్పుడో ఒక రోజు దేవుణ్ని నిజంగా చూడాలని వుంది. 'పంచాక్షరి' షూటింగ్ జరుగుతున్నప్పుడు చూడ్డానికి వచ్చిన ఓ మహిళని అమ్మవారు పూనింది. ఇలాంటివన్నీ చూసినప్పుడు నమ్మకం కలుగుతుంది. ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పాలని ప్రయత్నించా. కానీ అన్నీ బాగా ఉన్న సినిమా నేను డబ్బింగ్ చెప్పడంవల్ల ఇబ్బందుల్లో పడటం నాకిష్టం లేదు. 'వేదం'లో సరోజ పాత్రకి కూడా రెండు రోజులు డబ్బింగ్ చెప్పా. కానీ రాజమండ్రి యాస నాకు రాలేదు. అందుకే మానుకున్నా. భవిష్యత్తులో మాత్రం తప్పకుండా ప్రయత్నిస్తా.
జనాలు నవ్వుతారు
సాంకేతికపరంగా ప్రజల్లో అవగాహన పెరిగింది. మనం పాత్ర గురించి మాత్రం మాట్లాడుతుంటాం. కానీ ప్రేక్షకులు గ్రాఫిక్స్ బాగాలేవనీ, కెమెరా యాంగిల్ కరెక్ట్ కాదనీ అంటున్నారు. అంత ముందంజలో వున్నారు వాళ్లు. మంచి స్క్రిప్టు లేకుండా నేను పైట్లు, యాక్షన్ చేస్తే చూసి నవ్వుతారు. మంచి కథ కుదిరితే నేను విజయశాంతిలా ఫైట్లు చేయడానికి సిద్దమే. కాకపోతే ప్రతిదానికీ శిక్షణ అవసరం. ప్రతి చిత్రంలోనూ నేను చేసే తప్పుల్ని గుర్తుంచుకుంటా. తదుపరి చిత్రంలో ఆ తప్పును సవరించుకుంటా.
ఎత్తుపల్లాలు తప్పవు 
'విక్రమార్కుడు' విజయం సాధించేవరకు నన్ను ఏదో అభద్రతాభావం వెంటాడేది. కానీ ఇప్పుడు దాన్నుంచి బయటపడ్డా. నా సినీ ప్రయాణాన్ని ఇప్పుడే ప్రారంభించినట్లు భావిస్తున్నా. ఈ పరిశ్రమలో ఎత్తుపల్లాలు తప్పవు. ఆ విషయాన్ని గుర్తుంచుకొని జాగ్రత్తగా అడుగులు వేస్తున్నా. బాలీవుడ్ నుంచి ఒకరిద్దరు కథలు వినిపించారు. అవి లేడీ ఓరిఎంటెడ్ స్టోరీలు. ఓపిగ్గా విన్నా కానీ నాకు పెద్దగా నచ్చలేదు. నచ్చిన కథ దొరికే వరకు హిందీకి వెళ్లను. నాకు తెలుగులో బాగానే ఉంది.
ప్రణాళిక తెలీదు
ఫలానా విధంగా వుండాలని నేనెప్పుడూ ప్రణాళిక వేసుకోలేదు. వచ్చినదాన్ని వచ్చినట్లు స్వీకరిస్తున్నా. గత ఐదేళ్లలో ఎప్పుడూ ఖాళీగా లేను. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నా. ఏది జరిగినా మన మంచికే అనుకుంటా. కారణం లేకుండా ఏదీ జరగదన్నది నేను నమ్మిన సిద్ధాంతం.

No comments: