కలలు కనడం కాదు వాడిక్కావలసింది
గంజినీళ్ల నూలుని గుంజి
బతుకు రథాన్ని లాగడం మొదలు పెడతాడు
హాయి హాయి సాయంత్రాలు వాడికి తెలీదు
దినం దినం నడుంలోతు గుంటలో కూరుకుపోతుంటాడు
మజూరీ పెరుగుతుందనే ఆశ బతికిస్తుంటుంది
ఊరందరి మానాన్ని మొదట కాపాడిందీ,
లోకానికి నాగరికత నేర్పిందీ వాడు
బట్ట అతడి పనితనంలోంచి జన్మని పొందుతుంది
తెగని పోగుల్ని కాపలా కాయడంలో
కళ్లని శుక్లాలకి నెలవు చేసుకుంటాడు
పావుకోళ్లని తొక్కీ తొక్కీ మోకాళ్ల కీళ్లు అరుగుతాయి
వాడి చెమట చుక్కల పునాదుల మీద
షావుకారు రెండంతస్తుల మిద్దె లేపుతాడు
మగ్గం నేతగాడి గుండెకాయ
పవర్ మగ్గం గుడ్డతో
వాడిప్పుడు చావుని ఖాయం చేసుకున్నాడు
-ఆంధ్రభూమి డైలీ, 30 జూన్ 1997
No comments:
Post a Comment